Revised Common Lectionary (Semicontinuous)
మోషే మరణించటం
34 మోషే మోయాబు పల్లపు ప్రాంతాల నుండి యెరికో లోయలోని నెబో కొండ మీద పిస్గా శిఖరం మీదికి వెళ్లాడు. గిలాదునుండి దానువరకు దేశం మొత్తం యెహోవా మోషేకు చూపించాడు. 2 ఎఫ్రాయిము, మనష్షేల దేశం అంతా, నఫ్తాలీ అంతా యెహోవా అతనికి చూపించాడు. యూదా దేశం మధ్యదరా సముద్రం వరకు ఆయన అతనికి చూపించాడు. 3 నెగెవు ప్రాంతాన్ని, సోయెరు నుండి ఈతచెట్ల పట్టణం యెరికోకు పోయే లోయ అంతా మోషేకు యెహోవా చూపించాడు. 4 “అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానంచేసిన దేశం యిదే. ‘మీ సంతతివారికి ఈ దేశం నేను యిస్తాను’ అని వారితో నేను చెప్పాను. నిన్ను ఆ దేశం చూడనిచ్చాను, నీవు అక్కడికి వెళ్లలేవు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
5 అప్పుడు యెహోవా సేవకుడు మోషే అక్కడ మోయాబు దేశములో చనిపోయాడు. ఇలా జరుగుతుందని యెహోవా మోషేతో ముందే చెప్పాడు. 6 బెత్పెయోరు అవతల మోయాబు దేశంలోని లోయలో యెహోవా మోషేను పాతి పెట్టాడు. అయితే మోషే సమాధి ఎక్కడ ఉందో ఈ రోజువరకు ఎవరికీ తెలియదు. 7 మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు 120 సంవత్సరాలు. అతని కళ్లు మసక కాలేదు. అతడు ఇంకా బలంగానే ఉన్నాడు. 8 ఇశ్రాయేలు ప్రజలు మోయాబు పల్లపు ప్రాంతాల్లో 30 రోజుల పాటు మోషే కోసం ఏడ్చారు. ఇది పూర్తి సంతాప దినాల సమయము.
యెహోషువ క్రొత్త నాయకుడవటం
9 అప్పుడు నూను కుమారుడైన యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన కారణంగా యెహోషువ జ్ఞానాత్మతో పూర్తిగా నిండిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాట విన్నారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేసారు.
10 కాని ఆ సమయమునుండి మళ్లీ మోషేవంటి ప్రవక్త జన్మించలేదు. యెహోవా దేవునికి మోషే ముఖాముఖిగా తెలుసు. 11 ఈజిప్టు దేశంలో యెహోవా చేత పంపబడి మోషే చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు, ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు. ఆ అద్భుతాలు, మహాత్కార్యాలు ఈజిప్టులో ఫరోకు, అతని సేవకులందరికీ, ప్రజలందరికి చూపించబడ్డాయి. 12 మోషే చేయగా ఇశ్రాయేలు ప్రజలంతా చూసిన ఆ శక్తివంతమైన ఆశ్చర్యకార్యాలు ఏ ప్రవక్తా ఎన్నడూ చేయలేదు.
నాలుగవ భాగం
(కీర్తనలు 90–106)
దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.
90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
2 పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
3 మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
తిరిగి రండని నీవు చెప్పుతావు.
4 నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
గత రాత్రిలా అవి ఉన్నాయి.
5 నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
6 ఉదయం గడ్డి పెరుగుతుంది.
సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
థెస్సలొనీకలో పౌలు సేవ
2 సోదరులారా! మేము మీ దగ్గరకు రావటంవల్ల లాభం కలుగకపోలేదు. ఇది మీకు తెలుసు. 2 మేము యిదివరలో కష్టాలు అనుభవించిన విషయము, ఫిలిప్పీలో అవమానాలు భరించిన విషయము మీకు తెలుసు. మాకు అనేక ఆటంకాలు కలిగినా మేము మా దేవుని సహాయంతో యేసు సువార్తను మీకు బోధించటానికి ధైర్యం చేసాము. 3 మేము తప్పుగా బోధించలేదు. లేక దురుద్దేశ్యాలతో బోధించలేదు. మేము మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయటంలేదు. 4 దేవుడు మా యోగ్యతను గమనించి మాకు సువార్తను అప్పగించాడు. మా హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నాము కాని, మానవుల్ని కాదు.
5 మేము పొగడ్తలు ఉపయోగించలేదని మీకు తెలుసు. స్వార్థానికోసం మేము దొంగవేషాలు వేయలేదు. దీనికి దేవుడే సాక్షి. 6 మీ పొగడ్తలు కాని, లేక ఇతర్ల పొగడ్తలు కాని మాకు అవసరం లేదు.
7 క్రీస్తు అపొస్తలులముగా మేము మా భారం మీపై మోపగల్గినా అలా చేయలేదు. తల్లి తన పిల్లల్ని చూసుకొన్నట్టు మిమ్మల్ని చూసుకొని మీ పట్ల దయతో ఉండినాము.[a] 8 మేము మిమ్మల్ని మనసారా ప్రేమించాము. తద్వారా మీరు మాకు సన్నిహితులయ్యారు. దానితో సువార్తే కాకుండా, మా జీవితాలను కూడా మీతో పంచుకొన్నాము.
అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?
(మార్కు 12:28-34; లూకా 10:25-28)
34 యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. 35-36 వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు.
37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి.(A) 38 ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది. 39 రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’(B) 40 ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.”
క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?
(మార్కు 12:35-37; లూకా 20:41-44)
41 పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను 42 “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని అడిగాడు.
“దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
43 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి దావీదు దేవుని ఆత్మద్వారా మాట్లాడుతూ క్రీస్తును ‘ప్రభూ!’ అని ఎందుకు పిలిచాడు? దావీదు,
44 ‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా,
నా కుడి వైపు కూర్చో’(C)
అని అనలేదా? 45 దావీదు క్రీస్తును ‘ప్రభూ’ అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?”
46 ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.
© 1997 Bible League International