Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 90:1-6

నాలుగవ భాగం

(కీర్తనలు 90–106)

దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.

90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
    దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.

మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
    తిరిగి రండని నీవు చెప్పుతావు.
నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
    గత రాత్రిలా అవి ఉన్నాయి.
నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
    ఉదయం గడ్డి పెరుగుతుంది.
    సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.

కీర్తనలు. 90:13-17

13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
    నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
    మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
    ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
    వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
    మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.

ద్వితీయోపదేశకాండము 32:1-14

32 “ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను.
    భూమి నానోటి మాటలు వినునుగాక!
నా ప్రబోధం వర్షంలా పడుతుంది,
    నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది,
    మెత్తటి గడ్డిమీద పడే జల్లులా ఉంటుంది.
    కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది.
యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి!

“ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు
    ఆయన పని పరిపూర్ణం!
    ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవిగనుక.
ఆయన సత్యవంతుడు
    నమ్ముకోదగ్గ దేవుడు.
ఆయన చేసేది మంచిది, సరియైనది కూడా.
    మీరు నిజంగా ఆయన పిల్లలు కారు.
మీతప్పుల మూలంగా మీరు ఆయనను సమీపించలేని అపవిత్రులయ్యారు.
    మీరు వంకర మనుష్యులు, అబద్ధీకులు.
యెహోవాకు మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఇదేనా?
    మీరు బుద్ధిహీనులు, అజ్ఞానులు,
యెహోవా మీ తండ్రి, ఆయన మిమ్మల్ని చేసాడు.
    ఆయనే మీ సృష్టికర్త. ఆయన మిమ్మల్ని బల పరచేవాడు.

“పాత రోజులు జ్ఞాపకం చేసుకోండి,
    అనేక తరాల సంవత్సరాలను గూర్చి ఆలోచించండి.
మీ తండ్రిని అడగండి, ఆయన చెబుతాడు;
    మీ నాయకుల్ని అడగండి, వాళ్లు మీకు చెబుతారు.
రాజ్యాలకు వారి దేశాన్ని సర్వోన్నతుడైన దేవుడు యిచ్చాడు.
    ప్రజలు ఎక్కడ నివసించాల్సిందీ ఆయనే నిర్ణయించాడు.
తర్వాత ఆయన ఇతరుల దేశాన్ని
    ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చాడు.
ఆయన ప్రజలే యెహోవా వంతు;
    యాకోబు (ఇశ్రాయేలు) యెహోవాకు స్వంతం.

10 “అరణ్య భూమిలో యాకోబును (ఇశ్రాయేలు) యెహోవా కనుగొన్నాడు,
    వేడి గాడ్పుల్లో కేకలు పెట్టే పనికిమాలిన అరణ్యంలో యెహోవా యాకోబు దగ్గరకు వచ్చి,
ఆతణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకున్నాడు.
    యెహోవా తన కంటి పాపలా ఆతడ్ని కాపాడాడు.
11 యెహోవా ఇశ్రాయేలీయులకు పక్షి రాజులా ఉన్నాడు.
    పక్షిరాజు తన పిల్లలకు ఎగరటం నేర్పించేందుకోసం అది వాటిని బయటకు తోస్తుంది.
అది తన పిల్లలను కాపాడేందుకు వాటితో కలిసి ఎగురుతుంది.
    అవి పడిపోతున్నప్పుడు వాటిని పట్టుకొనేందుకు తన రెక్కలు చాపుతుంది.
మరియు అది తన రెక్కల మీద వాటిని క్షేమ స్థలానికి మోసుకొని వెళ్తుంది.
    యెహోవా అలాగే ఉన్నాడు.
12 యెహోవా మాత్రమే యాకోబును (ఇశ్రాయేలు) నడిపించాడు.
    యాకోబు దగ్గర ఇతర దేవతలు లేవు.
13 భూమియొక్క ఉన్నత స్థలాల్లో యాకోబును యెహోవా నడిపించాడు,
    పొలంలోని పంటను యాకోబు భుజించాడు
యాకోబు బండలోనుండి తేనెను చెకుముకి
    రాతినుండి నూనెను తాగేటట్టు యెహోవా చేసాడు.
14 మందలోనుండి వెన్న, గొర్రెలనుండి పాలు
    గొర్రెపిల్లలు, పొట్టేళ్లు, బాషాను జాతి మగ మేకలు,
అతి శ్రేష్ఠమైన గోధుమలు ఆయన నీకు యిచ్చాడు.
    ద్రాక్షల ఎర్రటిరసం నుండి ద్రాక్షారసం నీవు త్రాగావు.

ద్వితీయోపదేశకాండము 32:18

18 మిమ్మల్ని సృష్టించిన ఆశ్రయ దుర్గమును (దేవుణ్ణి) మీరు విడిచిపెట్టేసారు.
    మీకు జీవం ప్రసాదించిన దేవుణ్ణి మీరు మరచిపోయారు.

తీతుకు 2:7-8

నీవు స్వయంగా ఉత్తమ కార్యాలు చేస్తూ వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీవు బోధించేటప్పుడు మనస్పూర్తిగా, గంభీరంగా బోధించు. విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా బోధించు. అప్పుడు నీ శత్రువు విమర్శించటానికి ఆస్కారం దొరకక సిగ్గుపడతాడు.

తీతుకు 2:11-15

11 ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. 12 అది నాస్తికత్వాన్ని, ఐహిక దురాశల్ని మానివేయమని బోధిస్తుంది. మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ఈ ప్రపంచంలో జీవించమని బోధిస్తుంది, 13 మనం ఆశిస్తున్న ఆ గొప్ప రోజు వస్తుందని, ఆ రోజున మన దేవుడునూ మన రక్షకుడునూ అయినటువంటి యేసు క్రీస్తు కనిపిస్తాడని నిరీక్షిస్తూ ఉన్నాము. 14 అన్ని పాపాలనుండి మనకు విముక్తి కలగాలని యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొన్నాడు. సత్కార్యాలు చెయ్యాలని ఉత్సాహపడుతున్న ఈ ప్రజలు ఈ యేసు క్రీస్తుకు చెందినవాళ్ళు. ఆయన వాళ్ళను తనకోసం పవిత్రంగా చేసాడు.

15 నీవు ఈ విషయాలను బోధించాలి. సంపూర్ణమైన అధికారంతో ప్రజలను ఉత్సాహపరుస్తూ, ఖండిస్తూ, నిన్ను ఎవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్త పడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International