Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
మిర్యాము, అహరోను మోషేను విమర్శించటం
12 మిర్యాము, అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అతని భార్య ఇథియోపియా స్త్రీ గనుక వారు అతణ్ణి విమర్శించారు. మోషే ఇథియోపియా ప్రజల్లోని స్త్రీని వివాహం చేసుకోవటం మంచిది కాదని వారు తలంచారు. 2 “ప్రజలతో మాట్లాడటానికి యెహోవా మోషేను వాడుకొన్నాడు. కానీ మోషే ఒక్కడే ఉన్నాడా? మన ద్వారా కూడ యెహోవా మాట్లాడాడు కదా” అని వారు తమలో తాము అనుకొన్నారు.
యెహోవా ఇది విన్నాడు. 3 (మోషే చాలా దీనుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు, భూమి మీద అందరికంటె అతడు దీనుడు.) 4 కనుక యెహోవా అకస్మాత్తుగా మోషే, అహరోను, మిర్యాములతో మాట్లాడాడు. “మీరు ముగ్గురూ ఇప్పుడే సన్నిధి గుడారానికి రండి” అని చెప్పాడు.
కనుక మోషే, అహరోను, మిర్యాము గుడారానికి వెళ్లారు. 5 అప్పుడు యెహోవా ఒక మేఘంలో దిగివచ్చాడు. గుడార ప్రవేశం దగ్గర యెహోవా నిలబడ్డాడు. “అహరోను, మిర్యామును” తన దగ్గరకు రమ్మని పిల్చాడు యెహోవా. వాళ్లిద్దరూ ఆయనకు దగ్గరగా రాగానే 6 దేవుడు అన్నాడు: “నా మాటలు వినండి, మీ మధ్యకు నేను ప్రవక్తలను పంపినప్పుడు, యెహోవానగు నేను వారికి దర్శనంలో కనబడతాను. కలలో నేనే వారితో మాట్లాడతాను. 7 కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు. 8 నేను అతనితో మాట్లాడినప్పుడు ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. అతనితో నేను చెప్పాలనుకొనే విషయాలు వివరంగా నేను చెబుతాను. గూఢార్థపు పొడుపు కథలు నేను ప్రయోగించను. మోషే సాక్షాత్తు యెహోవా రూపాన్ని చూడవచ్చు. కనుక నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరెందుకు అంత ధైర్యంగా మాట్లాడారు?”
9 అంతట యెహోవా వారిని విడిచి వెళ్లి పోయాడు. కానీ ఆయనకు వారిమీద చాలా కోపం వచ్చింది.
21 అప్పుడు ఒక శక్తివంతుడైన దూత తిరుగటిరాయి వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ విధంగా అన్నాడు:
“గొప్ప శక్తితో బాబిలోను మహానగరం క్రిందికి పారవేయబడుతుంది.
అది మళ్ళీ కనిపించదు.
22 వీణను వాయించేవాళ్ళ సంగీతం, యితర వాయిద్యాలు వాయించేవాళ్ళ సంగీతం, పిల్లనగ్రోవి ఊదేవాళ్ళ సంగీతం, బూర ఊదేవాళ్ళ సంగీతం, నీలో మళ్ళీ వినిపించదు.
పని చేయగలవాడు నీలో మళ్ళీ కనిపించడు.
తిరుగటి రాయి శబ్దం మళ్ళీ నీలో వినిపించదు.
23 దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు.
కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ వినిపించవు.
నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు.
నీ గారడీలతో దేశాలు తప్పుదారి పట్టాయి.
24 ఆ పట్టణంలో ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం కనిపించింది.
ప్రపంచంలో వధింపబడిన వాళ్ళందరి రక్తం, ఆ పట్టణంలో కనిపించింది.”
© 1997 Bible League International