Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 19

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
    యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
    ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
    మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
    వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.

అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
    తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
    ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
    మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
    దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.

యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
    అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
    జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
యెహోవా చట్టాలు సరియైనవి.
    అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
    ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.

యెహోవాను ఆరాధించుట మంచిది.
    అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
    అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
    సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
    నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.

12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
    కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
    ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.

నిర్గమకాండము 23:10-13

ప్రత్యేకమైన పండుగలు

10 “విత్తనాలు చల్లి పంటకోసి, ఆరు సంవత్సరాల పాటు భూమిని సాగుచేయండి. 11 అయితే ఏడో సంవత్సరం భూమిని ఉపయోగించకండి. (ఏడో సంవత్సరం భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి) మీ పొలాల్లో ఏమీ నాటవద్దు. ఒకవేళ అక్కడ ఏవైనా పంటలు పెరిగితే, వాటిని పేద ప్రజలను తీసుకోనివ్వాలి. మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని తిననివ్వాలి మీ ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు, తోటల విషయంలో కూడ మీరు అలాగే చేయాలి.

12 “ఆరు రోజులు పని చేయండి. ఏడోరోజున విశ్రాంతి! మీ బానిసలు, ఇతర పని వాళ్లకు దీనివల్ల విశ్రాంతి, మరియు విరామం లభిస్తుంది. మీ ఎడ్లు, మీ గాడిదలకు కూడ విశ్రాంతి దొరుకుతుంది.

13 “ఈ ఆజ్ఞలన్నింటికీ విధేయులు కావాలని మాత్రం ఖచ్చితంగా తెల్సుకోండి. వేరే దేవుళ్లను పూజించకండి. చివరకి వాళ్ల పేర్లు కూడా మీరు పలుకగూడదు.

యోహాను 7:40-52

ప్రజలు యేసును గురించి వాదించటం

40 ఆయన మాటలు విన్నాక కొందరు, “ఈయన తప్పక ప్రవక్త అయివుండాలి” అని అన్నారు.

41 మరికొందరు, “ఈయన క్రీస్తు అయ్యి ఉండాలి” అని అన్నారు.

కాని యితర్లు, “క్రీస్తు గలిలయనుండి ఎట్లావస్తాడు? 42 ఆయన దావీడు వంశంనుండి, దావీదు నివసించిన బేత్లెహేమునుండి వస్తాడని లెఖానాల్లో వ్రాసారు కదా!” అని అన్నారు. 43 యేసును బట్టి అక్కడున్న ప్రజలలో భేధాభిప్రాయం కలిగింది. 44 కనుక ఆయన్ని బంధించాలనుకున్నారు. కాని ఎవ్వరూ ఆయన పై చెయ్యి వెయ్యలేదు.

యూదుల నాయకులు విశ్వసించకపోవటం

45 చివరకు భటులు ప్రధానయాజకుల దగ్గరకు, పరిసయ్యుల దగ్గరకు తిరిగి వెళ్ళిపొయ్యారు. వాళ్ళు ఆ భటుల్ని, “అతణ్ణెందుకు పిలుచుకొని రాలేదు?” అని అడిగారు.

46 వాళ్ళు, “అతడు మాట్లాడినట్లు ఇంత వరకు ఎవ్వరూ మాట్లాడలేదు!” అని అన్నారు.

47 పరిసయ్యులు, “అంటే! మిమ్మల్ని కూడా అతడు మోసం చేసాడా? 48 పాలకుల్లో కాని, పరిసయ్యుల్లో కాని అతణ్ణి నమ్మిన వాళ్ళెవ్వరూ లేరు. 49 ధర్మశాస్త్రాన్ని గురించి ఏమీ తెలియని ఆ ప్రజల మీద దేవుని శాపం ఉందన్నట్లే!” అని అన్నారు.

50 నీకొదేము వాళ్ళలో ఒకడు. ఇతడు ఇదివరలో యేసు దగ్గరకు వెళ్ళి వచ్చాడు. 51 అతడు, “మన ధర్మశాస్త్రం విచారణ చేయకుండా, అతని వాదన వినకుండా, అతడు చేసింది తేలుసుకోకుండా శిక్షవిధిస్తుందా?” అని అడిగాడు.

52 వాళ్ళు, “నీవు కూడా గలిలయవాడవా? ధర్మశాస్త్రాన్ని చదువు. ప్రవక్త గలిలయనుండి రాడని నీకే తెలుస్తుంది” అని సమాధానం చెప్పారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International