Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 42

రెండవ భాగం

(కీర్తనలు 42–72)

సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం

42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
    అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
    ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
    నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.

కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
    నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
    అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.

నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
    ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
    ఆయన నన్ను కాపాడుతాడు.
నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
    కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
    నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.

ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
    అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
    “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
    నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
    “నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.

11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
    నా సహాయమా! నా దేవా!

నిర్గమకాండము 18:13-27

13 మర్నాడు ప్రజలకు న్యాయం తీర్చాల్సిన ప్రత్యేక పని మోషేకు ఉంది. (అక్కడ చాలామంది ప్రజలున్నారు) అందుచేత ప్రజలు రోజంతా మోషే ఎదుట నిలబడాల్సి వచ్చింది.

14 ప్రజలకు మోషే న్యాయం తీర్చడం యిత్రో చూసాడు, “నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుచేత నీవు ఒక్కడివే న్యాయమూర్తిగా ఉన్నావు? ప్రజలు రోజంతా నీ దగ్గరకు రావడం ఏమిటి?” అన్నాడు అతను.

15 అప్పుడు మోషే తన మామతో ఇలా చెప్పాడు: “ప్రజలు వారి సమస్యల విషయంలో దేవుని నిర్ణయం ఏమిటో నేను అడిగి తెలుసుకోవాలని నన్ను అడిగేందుకు నా దగ్గరకు వస్తారు. 16 ఎవరిది సరిగ్గా ఉందో నేను నిర్ణయిస్తాను. ఈ విధంగా దేవుడి చట్టాన్ని, ఆయన ప్రబోధాల్ని నేను ప్రజలకు ప్రబోధిస్తాను.”

17 అయితే మోషే మామ అతనితో ఇలా అన్నాడు: “నీవు చేస్తున్న ఈ పని బాగుండలేదు. 18 నీవు ఒక్కడివే చెయ్యాలంటే, ఇది చాలా పెద్ద పని. దీనివల్ల నీవు అలసిపోతావు. ఇది ప్రజలు కూడ అలసిపొయ్యేటట్టు చేస్తుంది. ఈ పని నీవు ఒక్కడివీ చేయలేవు. 19 నీకు నేను సలహా ఇస్తాను, ఏమి చేయాలో నీకు చెబుతాను, దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. (నీవు చేయాల్సింది ఇది) ప్రజల సమస్యలను గూర్చి నీవు వింటూ ఉండాల్సిందే. ఈ విషయాలను గూర్చి నీవు దేవునితో చెబుతూ ఉండాల్సిందే. 20 దేవుడి కట్టడలను, విధులను నీవు ప్రజలకు బోధించాలి. కట్టడలను ఉల్లంఘించొద్దని ప్రజలను హెచ్చరించు. సరైన జీవిత విధానం ఏమిటో ప్రజలకు చెప్పు. వాళ్లేమి చేయాలో వాళ్లకు చెప్పు.” 21 అయితే, “ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి. డబ్బుకోసం నిర్ణయాలు మార్చుకోనటువంటి మనుష్యుల్ని ఏర్పాటు చేసుకో.”

“వీళ్లను ప్రజల మీద పరిపాలకులుగా చేయి. 1,000 మంది 100 మందికి, 50 మందికి, చివరికి 10 మందికి పైన పరిపాలకులు ఉండాలి. 22 ఈ పరిపాలకుల్ని ప్రజలకు న్యాయం తీర్చనివ్వు. ముఖ్యమైన వ్యాజ్యము ఏదైనా వుంటే అప్పుడు నిర్ణయంకోసం వాళ్లు నీ దగ్గరకు రావచ్చు. అయితే మిగతా వ్యాజ్యాలను వాళ్లే నిర్ణయించవచ్చు. ఈ విధంగా నీకు తేలిక అవుతుంది. పైగా ఈ మనుష్యులు నీ పనిని నీతోబాటు పంచుకొంటారు. 23 నీవు ఈ నీ పనులు చేస్తే, యెహోవాకు ఇష్టమైతే, నీ పని నీవు కొనసాగించటానికి నీకు చేతనవుతుంది. అదే సమయంలో ప్రజలంతా వారి సమస్యలు పరిష్కారమై ఇంటికి వెళ్లగల్గుతారు.”

24 యిత్రో తనకు చెప్పినట్టు మోషే చేసాడు. 25 ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని మోషే ఏర్పాటు చేశాడు. మోషే వాళ్లను ప్రజలమీద నాయకులుగా చేసాడు. 1,000 మంది ప్రజల మీద 100 మంది ప్రజలమీద 50 మంది ప్రజలమీద 10 మంది ప్రజలమీద పరిపాలకులు ఉన్నారు. 26 ఈ పరిపాలకులే ప్రజలకు న్యాయమూర్తులు. ఎప్పుడైనా సరే ప్రజలు తమ వాదాలను ఈ పరిపాలకుల దగ్గరకు తీసుకురావచ్చు. ప్రాముఖ్యమైన వ్యాజ్యాలను మాత్రమే మోషే పరిష్కారం చేయాల్సి ఉంటుంది.

27 కొద్దికాలం తర్వాత మోషే తన మామ యిత్రోకు వీడ్కోలు చెప్పాడు. యిత్రో తన స్వగృహానికి వెళ్లిపోయాడు.

ఫిలిప్పీయులకు 1:15-21

15 కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. 16 వీళ్ళు, దైవసందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు. 17 మొదట పేర్కొనబడ్డవాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది.

ఔను, నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను. 19 ఎందుకంటే మీ ప్రార్థనవల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ చేసిన సహాయం వల్ల నేను అనుభవిస్తున్న ఈ కష్టాలే నా విడుదలకు దారితీస్తాయని నాకు తెలుసు. 20 నాకు ఎలాంటి అవమానం కలుగరాదని, నాకు ధైర్యం కలగాలని మనసారా కోరుకొంటున్నాను. ఎప్పటిలాగే యిప్పుడు కూడా క్రీస్తు, నా దేహంలో మహిమ పొందాలని ఆశిస్తున్నాను. ఇది నేను జీవించటంవల్ల సంభవించినా, లేక మరణంవల్ల సంభవించినా నాకు చింత లేదు. 21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International