Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 32:1-14

బంగారు దూడ

32 చాలాకాలం గడిచిపోయినా, మోషే పర్వతం దిగి రాకపోవడం ప్రజలు గమనించారు. కనుక ప్రజలు అహరోను చుట్టూ చేరారు, “చూడు, ఈజిప్టు దేశం నుండి మోషే మమ్మల్ని బయటకు నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. అందుచేత మా ముందర నడవడానికి ఒక దేవతను చేసి మమ్మల్ని నడిపించు” అని వారతనితో చెప్పారు.

“మీ భార్యలు, కుమారులు, కుమార్తెలకు చెందిన బంగారు వస్తువులను తీసుకురండి” అని అహరోను ప్రజలతో అన్నాడు.

కాబట్టి ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు. ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. అప్పుడు వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. విగ్రహం చెక్కడానికి అహరోను ఉలి ఉపయోగించాడు. (తర్వాత దానికి బంగారం పొదిగించాడు.)

అప్పుడు ప్రజలు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే” అన్నారు.

అహరోను వీటన్నింటినీ చూసాడు. కనుక ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం నిర్మించాడు. అప్పుడు అహరోను ఒక ప్రకటన చేసాడు. “రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ” అని చెప్పాడు.

మర్నాడు ఉదయం పెందలాడే ప్రజలు మేల్కొన్నారు. వాళ్లు జంతువులను చంపి దహన బలులుగాను, సమాధాన బలులుగాను అర్పించారు. తిని, తాగేందుకు ప్రజలు కూర్చున్నారు. అప్పుడు వాళ్లు విచ్చలవిడిగా సంబరం చేసుకున్నారు.

అదే సమయంలో మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఈ పర్వతం దిగి వెళ్లు. నీ ప్రజలు, ఈజిప్టు దేశం నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన ప్రజలు భయంకర పాపం చేసారు. వాళ్లు చేయాలని నేను ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్లు చాల త్వరగా తప్పి పోయారు. కరిగించిన బంగారంతో వాళ్లు ఒక దూడను చేసుకొన్నారు. వాళ్లు ఆ దూడను పూజిస్తూ దానికి బలులు చెల్లిస్తున్నారు. ‘ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి నిన్ను బయటకు రప్పించిన దేవుడు ఇదే, అని ప్రజలు చెప్పుకొనుచున్నారు.’”

“ఈ ప్రజలను నేను చూశాను. వీళ్లు ఎప్పుడూ నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు. 10 కనుక కోపంతో వాళ్లను నాశనం చేయనివ్వు, అప్పుడు నీలోనుండి ఒక జనాన్ని నేను తయారు చేస్తాను” అని మోషేతో యెహోవా అన్నాడు.

11 అయితే, మోషే తన దేవుడైన యెహవాను బ్రతిమాలుకొని: “ప్రభూ! నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు. 12 అయితే, నీవే నీ ప్రజలను నాశనం చేస్తే, ‘యెహోవా తన ప్రజలకు చెడ్డకార్యాలను చేయాలని తలపెట్టాడు. అందుకే ఆయన వాళ్లను ఈజిప్టు నుండి బయటకు రప్పించాడు. పర్వతాల్లోనే వాళ్లను చంపాలని ఆయన అనుకున్నాడు. భూమి మీద తన ప్రజల్ని నాశనం చేయాలని ఆయన అనుకొంటున్నాడు’ అని ఈజిప్టు ప్రజలు చెప్పవచ్చు. కనుక నీ ప్రజల మీద కోపగించవద్దు. నీ కోపం విడిచిపెట్టేయి. నీ ప్రజల్ని నాశనం చేయకు. 13 నిన్ను సేవించిన మనుష్యులు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును (యాకోబు) జ్ఞాపకం చేసుకో. నీవు నీ పేరు ప్రయోగించి ఆ మనుష్యులకు వాగ్దానం చేసావు. ‘నీ ప్రజలను ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతగా చేస్తాను. నేను వారికి వాగ్దానం చేసిన ఈ దేశం అంతా నీ ప్రజలకు ఇస్తాను. ఈ దేశం శాశ్వతంగా వారిదే అవుతుంది’ అని నీవు చెప్పావు.”

14 కనుక యెహోవా తన ప్రజలను గూర్చి సంతాపపడ్డాడు. ఆయన చేస్తానన్న కీడును వారికి చేయలేదు. అంటే, ప్రజలను ఆయన నాశనం చేయలేదు.

కీర్తనలు. 106:1-6

106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
    దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
    ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.

యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
    నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
    నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.

మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
    మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.

కీర్తనలు. 106:19-23

19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు.
    వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు.
20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని
    వారి మహిమ గల దేవునిగా మార్చేశారు.
21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు.
    ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.
22 హాము దేశంలొ[a] దేవుడు అద్భుత కార్యాలు చేశాడు.
    దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు.

23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు.
    కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు.
దేవునికి చాలా కోపం వచ్చింది.
    కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు.

ఫిలిప్పీయులకు 4:1-9

చివరి సలహా

నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి.

యువొదియ, సుంటుకే అనేవాళ్ళు ప్రభువు విశ్వాసులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావాలని అర్థిస్తున్నాను. నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతావాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతావాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.

అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.

మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి. దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.

కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్నవాటిని గురించి, ప్రశాంతమైనవాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి. మీరు నా ద్వారా నేర్చుకొన్నవాటిని, నా నుండి పొందినవాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసినవాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు.

మత్తయి 22:1-14

పెళ్ళి విందు ఉపమానం

(లూకా 14:15-24)

22 యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు. ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు.

“ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ ఆహ్వానింపబడిన వాళ్ళతో ‘భోజనం సిద్దంగా ఉందని చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మనండి’ అని అన్నాడు.

“కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపొయ్యారు. మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకొని అవమానించి చంపేశారు. ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు.

“ఆ తర్వాత తన సేవకులతో, ‘పెళ్ళి విందు సిద్దంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులుకారు. వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు. 10 ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందర్ని అంటే మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందర్ని పిలుచుకు వచ్చారు. అతిథులతో పెళ్ళి యిల్లంతా నిండిపోయింది.

11 “రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వెసుకోలేదని గమనించాడు. 12 ‘మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు?’ అని రాజు అత న్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు. 13 వెంటనే ఆ రాజు తన సేవకులతో, ‘అతని కాళ్ళు, చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు’ అని అన్నాడు.

14 “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International