Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
గూఢచారులు కనాను వెళ్లటం
13 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “కనాను దేశాన్ని తరచి చూడ్డానికి కొందరు మనుష్యుల్ని పంపించు. ఇదే నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చే దేశం. పన్నెండు వంశాల్లో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్కరిని పంపించు.”
17 కనాను దేశాన్ని కనుక్కొనేందుకు మోషే వారిని పంపించినప్పుడు అతడు ఇలా చెప్పాడు: “నెగెవు ఎడారిలోనుండి వెళ్లండి, తర్వాత ఆ కొండల దేశంలోకి వెళ్లండి. 18 ఆ దేశం ఎలా ఉందో చూడండి. అక్కడ నివసిస్తున్న ప్రజలనుగూర్చి తెలుసుకోండి. వారు బలవంతులా? బలహీనులా? వారు కొద్ది మందేనా? చాలమంది ఉన్నారా? 19 వారు నివసిస్తున్న దేశాన్ని గూర్చి తెలుసుకోండి. ఆ భూమి మంచిదా కాదా? వారు నివసించే పట్టణాలు ఎలాంటివి? ఆ పట్టణాలకు గోడలు ఉన్నాయా? ఆ పట్టణాలకు బలీయమైన కాపుదల ఉందా? 20 ఆ దేశాన్ని గూర్చి ఇతర విషయాలు కూడ తెలుసుకోండి. ఆ భూమి, సారమైనదా కాదా? ఆ భూమి మీద చెట్లు ఉన్నాయా? అక్కడనుండి కొన్ని పండ్లు తీసుకుని రావటానికి ప్రయత్నించండి.” (ద్రాక్ష ప్రథమ ఫలాల కాలం ఇది).
21 అప్పుడు వారు ఆ దేశాన్ని పరిశీలించి చూసారు. వారు సీను అరణ్యం నుండి రెహోబు, లెబ్రోహమాతు వరకు వెళ్లారు. 22 నెగెవు ద్వారా ప్రయాణించి హెబ్రోను పట్టణం చేరుకొన్నారు. (ఈజిప్టులోని సోయను పట్టణం కంటె హెబ్రోను ఏడేండ్లు ముందు నిర్మించబడింది.) అక్కడ అహీమాను, షేషయి, తల్మయి నివసించారు. వీరు అనాకీ ప్రజలు. 23 వాళ్లు ఎష్కోలు లోయలో ఒక ద్రాక్ష కొమ్మ కోసారు. ఆ కొమ్మకు ఒక ద్రాక్ష గెల ఉంది. ఇద్దరు మనుష్యులు ఆ గెలను ఒక కర్రకు కట్టి మోసుకొచ్చారు. కొన్ని దానిమ్మ, అంజూరపు పండ్లు కూడ వారు తెచ్చారు. 24 అక్కడ ఇశ్రాయేలు మనుష్యులు ద్రాక్ష గుత్తిని కోసినందుచేత ఆ చోటు ఎష్కోలు[a] అని పిలువబడింది.
25 40 రోజుల పాటు వారు ఆ దేశాన్ని పరిశీలించారు. అప్పుడు వారు తిరిగి వారి నివాసమునకు వచ్చారు. 26 ఆ మనుష్యులు కాదేషు దగ్గర మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరకు తిరిగి వచ్చారు. ఇది పారాను అరణ్యంలో ఉంది. అప్పుడు వారు చూచిన విషయాలన్నింటినీ మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలు అందరితో చెప్పారు. వారు ఆ దేశపు పండ్లను వారికి చూపించారు. 27 ఆ మనుష్యులు మోషేతో ఇలా చెప్పారు: “నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి మేము వెళ్లాము. ఆ దేశం చాలా బాగుంది. అక్కడ పాలు, తేనెలు ప్రవహిస్తున్నాయి! అక్కడ మేము చూచిన పండ్లు ఇవిగో. 28 కానీ అక్కడ నివసిస్తున్న మనుష్యులు చాలా బలము, శక్తి ఉన్న వాళ్లు. వారి పట్టణాలు బలంగా కాపుదలలో ఉన్నాయి. ఆ పట్టణాలు చాల పెద్దవి. అనాకు కుటుంబానికి చెందిన కొందరు మనుష్యుల్ని కూడ మేము అక్కడ చూశాము. 29 అమాలేకీ ప్రజలు నెగెవు లోయలో నివసిస్తున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండల ప్రాంతంలో నివసిస్తున్నారు. కనానీ ప్రజలు సముద్రతీర ప్రాంతంలోను, యొర్దాను నదీతీరంలోను నివసిస్తున్నారు.”
30 అప్పుడు మోషే దగ్గర ఉన్న వాళ్లను నిశ్శబ్దంగా ఉండమన్నాడు కాలేబు. అప్పుడు కాలేబు, “మనం వెళ్లి ఆ దేశాన్ని మనకోసం స్వాధీనం చేసుకోవాలి. తేలికగా మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు” అని చెప్పాడు.
31 కానీ అతనితోకూడ వెళ్లినవారు, “ఆ మనుష్యులతో మనం పోరాడలేం. వాళ్లు మనకంటె చాల బలంగలవాళ్లు అన్నారు. 32 మనం ఆ దేశ ప్రజలను జయించేందుకు తగిన బలవంతులం కాదు” అని ఇశ్రాయేలు ప్రజలందరితో వారు చెప్పారు. వారు ఇలా చెప్పారు: “మేము చూచిన దేశంనిండా బలాఢ్యులు ఉన్నారు. అక్కడికి వెళ్లిన ఎవరినైనాసరే తేలికగా జయించ గలిగినంత బలంగలవాళ్లు వారు. 33 అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూసాం (నెఫీలీ ప్రజలవాడగు అనాకు సంతానం.) వాళ్ల ముందు నిలబడితే మేము మిడుతల్లా ఉన్నట్టు అనిపించింది. మేమేదో మిడుతలంత చిన్నవాళ్లంగా మమ్మల్ని చూసారు.”
మళ్లీ ప్రజల ఫిర్యాదు
14 ఆ రాత్రి గుడారాలలో ఉన్న ప్రజలంతా గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టారు. 2 ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. ప్రజలంతా కూడి వచ్చి మోషే, అహరోనులతో ఇలా చెప్పారు, “ఈజిప్టులోనో లేక అరణ్యంలోనో మేము చావాల్సింది. మన కొత్త దేశంలో కత్తిచేత చావటంకంటె అదే బాగుండేది. 3 మమ్మల్ని ఈ కొత్త దేశానికి చావటానికి తీసుకొచ్చాడా? మా భార్యల్ని, మా పిల్లల్ని మా దగ్గరనుండి తీసుకుపోయి మమ్మల్ని కత్తులతో చంపేస్తారు. మేము మళ్లీ ఈజిప్టు వెళ్లి పోవటమే మాకు క్షేమం.”
4 అప్పుడు వాళ్లు, “మనం ఇంకో నాయకుడ్ని ఏర్పాటు చేసుకొని, తిరిగి ఈజిప్టు వెళ్లిపోదాము” అని ఒకళ్లతో ఒకరు చెప్పుకొన్నారు.
5 అప్పుడు అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరి ముందు మోషే, అహరోను సాష్టాంగపడ్డారు. 6 ఆ దేశాన్ని కనుక్కొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు నూను కుమారుడైన యెహోషువ యెపున్నె కుమారుడైన కాలేబు బట్టలు చించుకున్నారు. 7 ఈ ఇద్దరు మనుష్యులూ అక్కడ సమావేశమైన ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పారు: “మేము చూచిన దేశం చాలబాగుంది. 8 మనమీద దేవునికి ఇష్టం ఉంటే, ఆయనే మనల్ని ఆ దేశంలోనికి నడిపిస్తాడు. ఆ దేశం పాలు తేనెలు ప్రవహిస్తున్నంత సౌభాగ్యమయినది. ఆ దేశాన్ని మనకు ఇచ్చేందుకు యెహోవా తన శక్తి ప్రయోగిస్తాడు. 9 అంతేగాని మనం యెహోవాకు ఎదురు తిరుగకూడదు. ఆ దేశంలో ప్రజలకు కూడ మనం భయపడకూడదు. మనం వాళ్లను తేలికగా జయించేస్తాం. వాళ్లకు ఎలాంటి భద్రతా లేదు, వాళ్లను క్షేమంగా ఉంచగలిగింది ఏమి లేదు. కానీ మనకు యెహోవా ఉన్నాడు. అందుచేత ఆ మనుష్యుల్ని గూర్చి భయపడకండి!”
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
(మార్కు 9:30-32; లూకా 9:43-45)
22 వాళ్ళంతా గలిలయలో మళ్ళీ కలుసుకొన్నప్పుడు యేసు వాళ్ళతో, “మనుష్య కుమారుడు దుర్మార్గులకు అప్పగించబడుతాడు. 23 వాళ్ళాయన్ని చంపుతారు. కాని మూడవ రోజు ఆయన తిరిగి బ్రతికి వస్తాడు” అని అన్నాడు. ఇది విని శిష్యులు చాలా దుఃఖించారు.
పన్ను చెల్లించుట గురించి యేసు బోధించటం
24 యేసు, ఆయన శిష్యులు కపెర్నహూము చేరుకొన్నారు. అక్కడ అరషెకెలు పన్నులు సేకరించే అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు గుడి పన్ను చెల్లించడా?” అని ప్రశ్నించారు.
25 “చెల్లిస్తాడు” అని పేతురు సమాధానం చెప్పి యింట్లోకి వెళ్ళాడు.
అతడేం మాట్లాడక ముందే యేసు, “సీమోనూ! నీవేమంటావు? రాజులు సుంకాలు, పన్నులు ఎవర్నుండి సేకరిస్తారు? తమ స్వంత కుమారుల నుండా? లేక యితర్లనుండా?” అని అడిగాడు.
26 “ఇతర్లనుండి” అని పేతురు సమాధానం చెప్పాడు.
యేసు, “అలాగయితే కుమారులు చెల్లించవలసిన అవసరం లేదన్న మాటేగా! 27 కాని వాళ్ళకాటంకం కలిగించటం నాకిష్టం లేదు. సరస్సు దగ్గరకు వెళ్ళి గాలం వెయ్యి! మొదట పట్టుకొన్న చేప నోటిని తెరిచి చూస్తే నీకు నాలుగు ద్రాక్మాల[a] నాణెం కనబడుతుంది. దాన్ని తీసుకువెళ్ళి నా పక్షాన, నీ పక్షాన వాళ్ళకు చెల్లించు!” అని అన్నాడు.
© 1997 Bible League International