Revised Common Lectionary (Semicontinuous)
97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
2 దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
3 యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
4 ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
5 యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
6 ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!
7 మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
8 సీయోనూ, విని సంతోషించుము!
యూదా పట్టణములారా, సంతోషించండి!
ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
9 సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.
15 అప్పుడు మోషే పర్వతం దిగి వెళ్లాడు. ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలు మోషే దగ్గర ఉన్నాయి. రాతికి వెనుక, ముందు రెండు వైపుల ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. 16 దేవుడు తానే ఆ రాళ్లను చేసాడు. మరియు దేవుడే ఆ రాళ్ల మీద ఆజ్ఞలు రాసాడు.
17 వారు పర్వతం దిగి వెళ్తున్నప్పుడు ప్రజలు బస చేసిన చోటు నుండి వచ్చిన శబ్ధం యెహోషువా విన్నాడు, “కింద బసలో యుద్ధధ్వని వినిపిస్తున్నట్టుంది” అని మోషేతో యెహోషువా అన్నాడు.
18 “అందుకు మోషే, అది జయధ్వనులు చేస్తున్న సైన్యం శబ్దం కాదు. ఓటమివల్ల ఒక సైన్యం ఏడుస్తున్న శబ్దమూ కాదు అది, నాకు వినబడుతోన్నది సంగీత శబ్దం” అని జవాబిచ్చాడు.
19 మోషే బసను సమీపించినప్పుడు, అతడు బంగారు దూడను, ప్రజలు నాట్యమాడటమూ చూసాడు. మోషేకు చాలా కోపం వచ్చి, ఆ ప్రత్యేక రాతి పలకలను నేలకేసి కొట్టాడు. పర్వతం కింది భాగంలో ఆ రాతి పలకలు ముక్కలు ముక్కలయ్యాయి. 20 అప్పుడు ప్రజలు చేసిన దూడను మోషే నాశనం చేసాడు. దాన్ని మంటల్లో వేసి కరిగించేసాడు. అప్పుడు ఆ బంగారం దుమ్ము అయ్యేంత వరకు నూరేసాడు. ఆ దుమ్మును నీళ్లలో పడేసి ఇశ్రాయేలు ప్రజల చేత బలవంతంగా ఆ నీళ్లు తాగించాడు.
21 “ఈ ప్రజలు నీకేమి చేసారు? ఇలాంటి చెడ్డ పాపం చేయడానికి నీవెందుకు వాళ్లను నడిపించావు?” అని అహరోనును మోషే అడిగాడు.
22 “అయ్యా, కోపగించకు. ఈ ప్రజలు తప్పు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని నీకు తెలుసు. 23 ‘ఈజిప్టు నుండి మోషే మమ్మల్ని నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. కనుక మమ్మల్ని నడిపించేందుకు మా కోసం ఒక దేవతను తయారు చేయి’ అని ప్రజలు నాతో అన్నారు. 24 కనుక ‘మీవద్ద ఉన్న బంగారు నగలను నాకు ఇవ్వండి’ అని ప్రజలతో చెప్పాను. ప్రజలు వారి బంగారం నాకు ఇచ్చారు. నేను ఆ బంగారాన్ని అగ్నిలో వేసాను. అగ్నిలో నుండి ఆ దూడ బయటకు వచ్చింది” అని అహరోను జవాబిచ్చాడు.
25 అహరోను అక్కడ గలభాకు కారణమని మోషే తెలుసుకున్నాడు. శత్రువులంతా చూడగలిగేటట్టు ప్రజలు వెర్రివాళ్లలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 26 కనుక నివాసాల ప్రవేశం దగ్గర మోషే నిలబడ్డాడు. “యెహోవాను వెంబడించాలని కోరేవారు ఎవరో వారు నా దగ్గరకు రావాలి.” అన్నాడు. లేవీ కుటుంబానికి చెందిన ప్రజలంతా మోషే దగ్గరకు పరుగెత్తారు.
27 అప్పుడు మోషే అన్నాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడో నేను మీకు చెబుతాను. ‘ప్రతి మనిషి తన కత్తి తీసుకొని మన బసలో ఒక చివర నుండి మరో చివరకు వెళ్లాలి. ప్రతి మనిషి తన సోదరుణ్ణి, స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని చంపాల్సి వచ్చినా మీరు వారిని చంపాలి.’”
28 లేవీ కుటుంబానికి చెందిన ప్రజలు మోషే మాటకులోబడ్డారు. ఆ రోజు ఇశ్రాయేలీయులలో సుమారు 3,000 మంది చనిపోయారు. 29 అప్పుడు, “మీ కుమారులను, మీ సోదరులను దీవించే వారినిగా యెహోవా నేడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు” అని మోషే చెప్పాడు.
30 మర్నాటి ఉదయం ప్రజలందరికి మోషే, “మీరు భయంకర పాపం చేసారు. అయితే ఇప్పుడు నేను యెహోవా దగ్గరకు పైకి వెళ్తాను. ఆయన మీ పాపం విషయం మిమ్మల్ని క్షమించేందుకు నేనేమైనా చేయగలనేమో” అని చెప్పాడు. 31 కనుక మోషే యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లి, “దయచేసి ఆలకించు! ఈ ప్రజలు చాలా చెడ్డ పాపం చేసి, బంగారంతో దేవుణ్ణి చేసారు. 32 ఇప్పుడు ఈ పాపం విషయం వారిని క్షమించు. నీవు గనుక వారిని క్షమించకపోతే, నీవు వ్రాసిన గ్రంథంలో[a] నా పేరు తుడిచేయి” అన్నాడు.
33 అయితే మోషేతో యెహోవా అన్నాడు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేస్తారో ఆ ప్రజల పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తుడిచి వేస్తాను. 34 కనుక కిందకు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటుకు ప్రజలను నడిపించు. నీకు ముందు నా దేవదూత నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. పాపం చేసిన వాళ్లను శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్లు శిక్షించబడుతారు.” 35 కనుక ఆ ప్రజలకు భయంకర వ్యాధి వచ్చేటట్టు యెహోవా చేసాడు. వారు బంగారు దూడను చేయమని అహరోనుతో చెప్పినందువల్ల అతను అలా చేసాడు.
హెచ్చరికలు, ఉపదేశాలు.
17 కాని ప్రియ మిత్రులారా! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. 18 “చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించేవాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ వస్తారు” అని అపొస్తలులు చెప్పారు. 19 వాళ్ళు ప్రస్తావించిన ఈ దుర్బోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్బోధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఉండదు.
20 కాని ప్రియ మిత్రులారా! మీలో ఉన్న విశ్వాసం అతి పవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి. పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి. 21 దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచుకొని ఉండండి.
22 సంశయాలున్నవాళ్ళ పట్ల కనికరం చూపండి. 23 మంటల్లో పడబోయేవాళ్ళను బయటకు లాగి కాపాడండి. దుర్నీతిలో మలినమైన దుస్తుల్ని వేసుకొన్నవాళ్ళ పట్ల మీకు అసహ్యము, భయము కలిగినా, వాళ్ళ పట్ల కనికరం చూపండి.
24 క్రిందపడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడగలడు. మీలో ఏ లోపం లేకుండా చేసి తేజోవంతమైన తన సమక్షంలో నిలుపుకొని ఆనందాన్ని కలిగించగలడు. అలాంటి ఆయనకు, 25 మన రక్షకుడైనటువంటి ఏకైక దేవునికి, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా గొప్పతనము, తేజస్సు, శక్తి, అధికారము భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లభించుగాక! ఆమేన్.
© 1997 Bible League International