Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు ధ్యాన గీతం.
78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
నేను చెప్పే విషయాలు వినండి.
2 ఈ కథ మీతో చెబుతాను.
ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
4 ఈ కథను మనము మరచిపోము.
మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.
12 ఈజిప్టులోను, సోయను వద్దను
దేవుడు తన మహాశక్తిని వారి తండ్రులకు చూపెట్టాడు.
13 దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు.
వారికి రెండు వైపులా నీళ్లు బలమైన గోడల్లా నిలబడ్డాయి.
14 ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
ప్రతిరాత్రి అగ్నిస్తంభం నుండి వచ్చే వెలుగు చేత దేవుడు వారిని నడిపించాడు.
15 అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు.
భూమి అగాధం నుండి ఆ ప్రజలకు ఆయన నీళ్లు ఇచ్చాడు.
16 బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు.
అది ఒక నదిలా ఉంది.
మిర్యాము మరణము
20 మొదటి నెల ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేషులో నివాసం చేసారు. మిర్యాము చనిపోయి, అక్కడే పాతి పెట్టబడింది.
మోషే పొరబాటు
2 ఆ స్థలంలో ప్రజలకు చాలినంతగా నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే, అహరోనులతో ఫిర్యాదు చేయటానికి సమావేశమయ్యారు. 3 ప్రజలు మోషేతో వాదించారు. వారు ఇలా అన్నారు: “ఒక వేళ మా సోదరుల్లా మేము కూడా యెహోవా ఎదుట మరణించి ఉంటేబాగుండేది. 4 యెహోవా ప్రజలను నీవు ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు? మేమూ, మా పశువులూ ఇక్కడే చావాలని కోరుతున్నావా? 5 ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ పనికిమాలిన చోటుకు మమ్మల్ని నీవెందుకు తీసుకువచ్చావు? ఇక్కడ ధాన్యం లేదు. అంజూరపు పండ్లు, ద్రాక్షాపండ్లు, దానిమ్మ పండ్లు ఏమీ లేవు. కనీసం తాగటానికి నీళ్లు కూడ లేవు.”
6 కనుక మోషే, అహరోను ఆ జనాన్ని విడిచి, సన్నిధి గుడార ద్వారం దగ్గరకు వెళ్లారు. వారు సాష్టాంగపడగా యెహోవా మహిమ ప్రత్యక్షమయింది.
7 యెహోవా మోషేతో మాట్లాడాడు: 8 “నీ సోదరుడు అహరోనును, ఈ జనాన్ని తీసుకుని ఆ బండ దగ్గరకు వెళ్లు నీ కర్ర కూడా తీసుకుని వెళ్లు. ఆ బండ ఎదుట ప్రజలతో మాట్లాడు. అప్పుడు ఆ బండనుండి నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు ప్రజలకు, పశువులకు నీవు ఆ నీళ్లు ఇవ్వవచ్చును” అన్నాడు ఆయన.
9 కనుక యెహోవా చెప్పిన ప్రకారం మోషే ఆయన ఎదుటనుండి కర్ర తీసుకున్నాడు. 10 అప్పుడు ప్రజలంతా ఆ బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే, “మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. ఈ బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము” అన్నాడు. 11 మోషే తన చేయి పై కెత్తి రెండుసార్లు ఆ బండను కొట్టాడు. బండనుండి నీళ్లు ప్రవహించటం మొదలయ్యింది. ప్రజలు, పశువులు ఆ నీళ్లు త్రాగారు.
12 అయితే మోషే, అహరోనులతో యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా చుట్టూచేరారు. కానీ మీరు నాకు ఘనత చూపలేదు. నీళ్లను ప్రవహింప జేసిన శక్తి నా దగ్గరనుండి వచ్చిందని ఇశ్రాయేలు ప్రజలకు మీరు చూపించలేదు. మీరు నన్ను నమ్ముకొన్నట్లుగా మీరు ప్రజలకు చూపించలేదు. ఆ ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇస్తాను. అయితే వాళ్లను ఆ దేశంలోనికి నడిపించేవాళ్లు మాత్రం మీరు కారు.”
13 ఈ స్థలం మెరీబా[a] జలాలు అని పిలువబడింది. ఇక్కడనే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో వాదించారు. ఆయన పవిత్రుడని యెహోవా ఇక్కడనే వారికి చూపించాడు.!
32 “వాళ్ళు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. 33 దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానాన్ని యిప్పుడు వాళ్ళ సంతతియైన మన కోసం పూర్తి చేసాడు. యేసును బ్రతికించటంతో ఈ వాగ్దానం పూర్తి అయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని గురించి కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడివుంది:
‘నీవు నా కుమారుడవు!
నేడు నేను నీకు తండ్రినయ్యాను.’(A)
34 దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట,
‘నేను దావీదుకు తప్పక యిస్తానన్న పవిత్రమైన ఆశీస్సులను నీకిస్తాను’(B) అని అన్నాడు.
35 మరొక చోట యిలా చెప్పబడింది:
‘నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనియ్యవు!’(C)
36 “దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచుకొన్నాడు. అతడు చనిపోగానే అతణ్ణి అతని పూర్వికులతో సమాధి చేసారు. అతని దేహం మట్టిలో కలిసిపోయింది. 37 కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు. 38 మీరీ విషయం తెలుసుకోవాలి. యేసు ద్వారా మీ పాపాలు క్షమించబడుతాయని మేము ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని పాపాలనుండి, 39 యేసు తనను నమ్ముకొన్న ప్రతి ఒక్కణ్ణీ క్షమిస్తాడు. 40 ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్తపడండి:
41 ‘పరిహాసం చేసే ప్రజలారా!
ఆశ్చర్యం పొందండి! నశించకండి!
ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది
నేనొకటి చేయబోతున్నాను!
మరొకరు చెప్పినా మీరు నమ్మరు.’”(D)
© 1997 Bible League International