Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 114

114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
    యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
    ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
    యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
    కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.

ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
    యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
    కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?

యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
    ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.

నిర్గమకాండము 14:1-18

14 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ప్రజలు వెనక్కు తిరిగి పీహ హీరోతుకు ప్రయాణం కట్టమని చెప్పు. మిగ్దోలుకు, సముద్రానికి మధ్య ప్రదేశంలో రాత్రికి బసచేయాలని వారితో చెప్పు. ఇది బయల్సెఫోను దగ్గర్లో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తప్పిపోయి ఉంటారని ఫరో తలుస్తాడు. పైగా ప్రజలు వెళ్ల గలిగినచోటు ఇంకేమీ ఉండదు అనుకొంటాడు. ఫరోను నేను ధైర్యశాలిగా చేస్తాను. అతడేమో మిమ్మల్ని తరుముతాడు. అయితే ఫరోను, అతని సైన్యాన్ని నేను ఓడిస్తాను. ఇది నాకు కీర్తి తెచ్చి పెడుతుంది. నేనే యెహోవానని ఈజిప్టు వాళ్లు అప్పుడు తెల్సుకొంటారు.” ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయులై ఆయన చెప్పినట్టు చేసారు.

ఇశ్రాయేలీయుల్ని ఫరో తరమటం

ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారని ఫరోకు ఒక సమాచారం అందింది. ఎప్పుడైతే ఈ సంగతి విన్నారో అప్పుడు వెంటనే ఫరో, అతని అధికారులు తాము చేసిన దాన్ని గూర్చి తమ మనసు మార్చుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల్ని అసలు మనం ఎందుకు వెళ్లనిచ్చాం? వాళ్లను మనం ఎందుకు పారిపోనిచ్చాం? ఇప్పుడు మనం మన బానిసల్ని పోగొట్టుకొన్నాం” అన్నాడు ఫరో.

కనుక ఫరో తన యుద్ధరథాన్ని సిద్ధం చేసుకొని, తన మనుష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్లాడు. తన మనుష్యుల్లో బలవంతులయిన వాళ్లు 600 మందిని, రథాలు అన్నింటిని తనతో తీసుకొని వెళ్లాడు. ఒక్కోరథానికి ఒక్కో అధికారి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు విజయ సంకేతంగా చేతులు పైకెత్తి వెళ్లి పోతున్నారు. కానీ ఈజిప్టురాజైన ఫరో ఇంకా ధైర్యశాలి అయ్యేటట్టు యెహోవా చేసాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా తరిమాడు.

ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాల ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి, వారు బయల్సెఫోనుకు తూర్పున పీహహీరోతు వద్ద ఎర్ర సముద్రానికి దగ్గర్లో బస చేస్తూ ఉండగానే వారిని సమీపించారు.

10 ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు. 11 మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి. 12 ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.”

13 కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు! 14 మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.”

15 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఇంకా నీవెందుకు నాకు మొర పెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు 16 నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు. 17 ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్లుగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరోకంటె, అతని అశ్వదళాలు, రథాలు, అన్నిటికంటె నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు తెలియజేస్తాను. 18 నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను గౌరవిస్తారు.”

అపొస్తలుల కార్యములు 7:9-16

“వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి, 10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. 11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వికులకు తినటానికి తిండి కూడా లేకుండింది.

12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. 13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. 14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు. 15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు. 16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉంచాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International