Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు స్తుతి గీతం.
83 దేవా, మౌనంగా ఉండవద్దు!
నీ చెవులు మూసికోవద్దు!
దేవా, దయచేసి ఊరుకోవద్దు.
2 దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
3 నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
4 “ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.
13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె[a] ఆ ప్రజలను చేయుము.
గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు
కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము.
సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము.
అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
అని వారు తెలుసుకొంటారు.
ఫరో ముందు మోషే, అహరోనులు
5 మోషే, అహరోను ప్రజలతో మాట్లాడిన తరువాత ఫరో దగ్గరికి వెళ్లారు, “‘నా కోసం పండుగ జరుపుకొనేందుకు నా ప్రజల్ని అరణ్యంలోకి వెళ్లనివ్వు’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు,” అని చెప్పారు.
2 అయితే ఫరో, “ఆ యెహోవా ఎవరు? అతనికి నేనెందుకు లోబడాలి? ఇశ్రాయేలీయులను నేనెందుకు వెళ్లనివ్వాలి? యెహోవా అని మీరు చెబుతున్నవాడు నాకు తెలియదు. అందుచేత ఇశ్రాయేలీయులను నేను వెళ్లనీయను” అన్నాడు.
3 దానికి మోషే, అహరోనులు, “హీబ్రూ ప్రజల దేవుడు మాతో మాట్లాడాడు. కనుక మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోనికి వెళ్లనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. అక్కడ మా యెహోవా దేవునికి ఒక బలి అర్పిస్తాము. ఇది మేము చేయకపోతే ఆయనకు కోపం వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడేమో. ఒక రోగం ద్వారానో, కత్తి చేతనో మమ్మల్ని చంపేస్తాడేమో” అని అన్నారు.
4 కానీ ఫరో, “మోషే, అహరోనూ, ప్రజలను పని చేయనీయకుండా మీరు చేస్తున్నారు. మళ్లీ పోయి పనిచేసుకోమని ఆ బానిసలకు చెప్పండి. 5 పనివాళ్లు చాలా విస్తారంగా ఉన్నారు, మీరేమో వాళ్లను పని చెయ్యనివ్వడం లేదు” అని వాళ్లతో చెప్పాడు.
ప్రజలను ఫరో శిక్షించడం
6 అదేరోజు ఇశ్రాయేలీయుల పని మరింత కష్టతరం చేయమని ఫరో ఆజ్ఞాపించాడు. బానిసలపైనున్న యజమానులతో 7 “ఈ ప్రజలు ఇటుకలు చేసేందుకు గడ్డి ఎప్పుడూ మీరే ఇచ్చారు. కాని ఇప్పుడు ఇటుకలు చేసేందుకు అవసరమైన గడ్డిని వాళ్లే పోయి తెచ్చుకోవాలని వారికి చెప్పండి. 8 అయితే వాళ్లు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే. వాళ్లు బద్ధకస్తులయి పోయారు. అందుకే వాళ్లను పోనివ్వుమని నన్ను అడుగుతున్నారు. వాళ్లు చేసేందుకు సరిపడినంత పనిలేదు. అందుకే తమ దేవునికి బలి ఇవ్వడానికి వెళ్లనిమ్మని నన్ను అడుగుతున్నారు. 9 కనుక వీళ్ల పని మరింత కష్టం అయేటట్టు చేయండి. వాళ్లకు బాగా పని చెప్పండి. అప్పుడు మోషే చెప్పే అబద్ధాలు వినేందుకు వాళ్లకు సమయం ఉండదు” అని చెప్పాడు ఫరో.
10 అందుచేత బానిసల పైనున్న ఈజిప్టు యజమానులు, హీబ్రూ ప్రజల నాయకుల దగ్గరకు వెళ్లి, “మీ ఇటుకల కోసం గడ్డి ఇవ్వకూడదని ఫరో నిర్ణయించాడు. 11 మీకు మీరే పోయి గడ్డి తెచ్చుకోవాలి. కనుక వెళ్లి గడ్డి వెదుక్కోండి. అయితే మీరు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవారో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే” అని వాళ్లతో చెప్పారు.
12 కనుక గడ్డికోసం వెదుక్కొంటూ ఆ ప్రజలు ఈజిప్టు దేశ వ్యాప్తంగా వెళ్లిపోయారు. 13 ఆ ప్రజలు మరింత కష్టపడి పనిచేసేటట్టు బానిస యజమానులు వాళ్లని బలవంతం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రజలు అంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో అన్ని చేసేటట్టు వారు వాళ్లను బలవంతపెట్టారు. 14 బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను ఏర్పరచుకొని ప్రజలు చేసే పనికి వీళ్లను బాధ్యులుగా చేసారు, “మీరు ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసారో ఇప్పుడు కూడ అన్ని ఎందుకు చెయ్యడం లేదు? ఇది వరకు చేయగలిగారు అంటే, ఇప్పుడూ చేయగల్గుతారు!” అంటూ బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను కొట్టారు.
15 అప్పుడు హీబ్రూ నాయకులు ఫరో దగ్గరకు వెళ్లారు, “మేము నీ సేవకులము నీవు మమ్మల్ని ఎందుకు ఇలా చూస్తున్నావు? 16 నీవేమో మాకు గడ్డి ఇవ్వవు. కాని మేము మాత్రం ఇదివరకు ఎన్ని ఇటుకలు చేసామో అన్ని చేస్తూనే ఉండాలని ఆజ్ఞాపించావు. పైగా ఇప్పుడు ఈ యజమానులు మమ్మల్ని కొడుతున్నారు. ఇలా చేయడం నీ మనుష్యులదే తప్పు” అంటూ వారు ఫిర్యాదు చేసి చెప్పారు.
17 ఫరో జవాబిస్తూ, “మీరు సోమరులు, మీకు పని చేయడం ఇష్టంలేదు. అందుకే మిమ్మల్ని పోనివ్వమని నన్ను అడుగుతున్నారు. అందుకే మీరు ఇక్కడ్నుండి వెళ్లిపోయి యెహోవాకు బలులు అర్పించాలని అంటున్నారు. 18 ఇక వెళ్లి పనిచెయ్యండి. మేము మీకు గడ్డి ఇవ్వము కాని మీరు మాత్రం ఇది వరకు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడ అన్ని చేయాలి” అన్నాడు.
19 చిక్కుల్లో పడ్డట్టు ఇశ్రాయేలు పెద్దలకు అర్థమయింది. వారు ఇంతకు ముందు చేసినన్ని ఇటుకలు ఇప్పుడు చేయలేరని ఆ నాయకులకు తెలుసు.
20 వారు ఫరో సమావేశం నుండి వెళ్తూ మోషే, అహరోను ఉన్నచోట ఆగారు. వారికోసం మోషే అహరోనూ వేచియున్నారు. 21 వారు మోషే అహరోనులతో, “మమ్మల్ని వెళ్లనిమ్మని మీరు ఫరోతో చెప్పడం చాల తప్పు. ఫరో, అతని అధికారులు మమ్మల్ని ద్వేషించేటట్టు మీరు చేసారు కనుక యెహోవా మిమ్మల్ని శిక్షించాలి. మమ్మల్ని చంపే అవకాశం మీరే వారికి ఇచ్చారు” అని చెప్పారు.
మోషే దేవునితో చెప్పటం
22 అప్పుడు మోషే యెహోవాను ప్రార్థించి, “ప్రభువా, ఎందుకు ఇలా నీ ప్రజలకు నీవు కీడు చేసావు? నీవు ఇక్కడికి నన్నెందుకు పంపించావు? 23 నన్ను చెప్పమని నీవు చెప్పిన సంగుతులన్నీ నేను ఫరో దగ్గరకు వెళ్లి చెప్పాను. కాని అప్పట్నుంచి నీ ప్రజల విషయంలో అతడు చాల నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నీవు వాళ్లు సహాయం కోసం ఏమీ చేయలేదు!” అని చెప్పాడు.
6 అందుకు యెహోవా, “ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. అతని మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. దానితో అతడు నా ప్రజలను వెళ్లనిస్తాడు. వారు వెళ్లిపోవడానికి అతడు ఎంత ఇష్టపడతాడంటే, అతడే వారిని వెళ్లిపొమ్మని బలవంతం చేస్తాడు” అని మోషేతో చెప్పాడు.
2 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు, 3 “యెహోవాను నేనే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమయ్యాను. వాళ్లు, (ఎల్‌షడ్డయి) సర్వశక్తిగల దేవుడు అని నన్ను పిలిచారు. నా పేరు యెహోవా అని వారికి తెలియలేదు. 4 వారితో నేను ఒక ఒడంబడిక చేసాను. కనాను దేశం వారికి ఇస్తానని వాగ్దానం చేసాను. వారు ఆ దేశంలో నివసించారు గాని అది వారి స్వంత దేశం కాదు. 5 ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్లకు ఉన్న కష్టాలు నాకు తెలుసు. వారు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారని నాకు తెలుసు. నా ఒడంబడిక కూడా నాకు జ్ఞాపకం ఉంది. 6 కనుక నేను వాళ్లతో నీవు ఇలా చెప్పమన్నట్టు ప్రజలతో చెప్పు. ‘నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని స్వతంత్రుల్నిగా చేస్తాను. ఈజిప్టు వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు. నేను నా మహాశక్తిని ప్రయోగించి మహా భయంకర శిక్షను ఈజిప్టు వారి మీదికి రప్పిస్తాను. అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను. 7 మీరు నా ప్రజలుగా ఉంటారు. నేనే మీ దేవుడిగా ఉంటాను. నేనే యెహోవాను, మీ దేవుడనని, ఈజిప్టునుండి నేనే మిమ్మల్ని విడిపించానని మీరు తెలుసుకొంటారు. 8 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను.’”
9 అందుచేత మోషే ఇదంతా ఇశ్రాయేలు వాళ్లతో చెప్పాడు. అయితే, ప్రజలు పనిలో చాలా కష్టపడుచున్నందుచేత మోషేను వారు సహించలేదు. అతని మాట వారు వినలేదు.
10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 11 “ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశంనుండి తప్పక వెళ్లిపోనివ్వాలని ఫరో దగ్గరకు వెళ్లి చెప్పు.”
12 అయితే మోషే, “ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినరు. అలాంటప్పుడు ఫరో అంతకంటె వినడు. అసలే నాకు మాట్లాడటం చేతకాదు” అని అన్నాడు.
13 కాని మోషే, అహరోనులతో యెహోవా మాట్లాడాడు. వారు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. ఫరో దగ్గరికి వెళ్లి అతనితో కూడ మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటకు నడిపించుమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు.
ఫిలదెల్ఫియలోని సంఘానికి
7 “ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“పవిత్రమైనవాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన తెరిచినదాన్ని ఎవ్వరూ మూయలేరు.(A) ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు.
8 “నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు! ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలంలేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు. 9 సాతాను మందిరానికి చెందినవాళ్ళను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకొనేవాళ్ళను, అబద్ధాలాడేవాళ్ళను, నీ కాళ్ళ ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకొనేటట్లు చేస్తాను. 10 సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్నవాళ్ళందరిపై విచారణ జరిగే సమయం రాబోతోంది.
11 “నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్నదాన్ని అంటిపెట్టుకొని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. 12 అలా విజయం సాధించిన వాణ్ణి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను. 13 సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతివాడు వినాలి.
© 1997 Bible League International