Revised Common Lectionary (Semicontinuous)
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
31 ఆ ప్రత్యేక ఆహారాన్ని “మన్నా”[a] అని పిలవడం మొదలుబెట్టారు ప్రజలు. మన్నా కొత్తిమెర గింజల్లా చిన్నగా తెల్లగా ఉండి, తేనెపూసిన పూతరేకుల్లా ఉంది. 32 అప్పుడు మోషే అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటికి రప్పించినప్పుడు ఎడారిలో నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ సంతానం వాళ్లు చూడ గలిగేటట్టు ఈ ఆహారం 2 పావులు దాచి ఉంచమని యెహోవా చెప్పాడు.”
33 కనుక మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “ఒక పాత్ర తీసుకొని దానిలో 8 పావులు మన్నా నింపు. ఈ మన్నాను మన సంతానం వారి కోసం దాచిపెట్టు” 34 మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. మన్నా పాత్రను ఒడంబడిక పెట్టె[b] ముందర పెట్టాడు అహరోను. 35 40 సంవత్సరాల పాటు ప్రజలు మన్నా తిన్నారు. కనాను దేశ సరిహద్దుల వచ్చేంతవరకు వారు దాన్ని తిన్నారు
కుశలములు
16 కేంక్రేయ పట్టణంలో ఉన్న సంఘానికి సేవ చేస్తున్న మన సోదరి ఫీబే చాలా మంచిది. 2 దేవుని ప్రజలకు తగిన విధంగా ప్రభువు పేరట ఆమెకు స్వాగతం చెప్పండి. ఆమె అనేకులకు చాలా సహాయం చేసింది. నాకు కూడా చాలా సహాయం చేసింది. కనుక ఆమె మీ నుండి సహాయం కోరితే ఆ సహాయం చెయ్యండి.
3 నాతో కలిసి యేసు క్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కిల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి. 4 వాళ్ళు నా కోసం తమ ప్రాణాలనే తెగించారు. నేనే కాక, యూదులు కానివాళ్ళ సంఘాలన్నీ వాళ్ళకు కృతజ్ఞతతో ఉంటాయి.
5 వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యే వాళ్ళందరికీ నా వందనాలు చెప్పండి.
ఆసియ ప్రాంతంలో క్రీస్తును నమ్మినవాళ్ళలో నా ప్రియమిత్రుడు ఎపైనెటు మొదటివాడు. అతనికి నా శుభములు అందించండి.
6 మీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్న మరియకు నా వందనములు చెప్పండి.
7 నాతో సహా కారాగారంలో గడిపిన నా బంధువులు ఆంద్రొనీకుకు, యూనీయకు నా వందనాలు చెప్పండి. వాళ్ళు అపొస్తలులలో గొప్పవారు. అంతేకాక వాళ్ళు నాకన్నా ముందే క్రీస్తును అంగీకరించారు.
8 ప్రభువు వల్ల నేను, అంప్లీయతు స్నేహితులమయ్యాము. అతనికి నా వందనాలు చెప్పండి. 9 మాతో కలిసి క్రీస్తు సేవచేస్తున్న ఊర్బానుకు,
నా ప్రియ మిత్రుడైనటువంటి స్టాకుకు నా వందనాలు చెప్పండి. 10 అపెల్లెకు క్రీస్తు పట్ల నిజమైన భక్తి ఉన్నట్లు నిరూపించబడింది. అతనికి నా వందనాలు చెప్పండి.
అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వాళ్ళకు వందనాలు చెప్పండి. 11 హెరోదియోను నా బంధువు. అతనికి వందనాలు చెప్పండి.
ప్రభువుకు చెందిన నార్కిస్సు కుటుంబాన్ని అడిగానని చెప్పండి. 12 ప్రభువు కోసం కష్టించి పని చేస్తున్న త్రుపైనా, త్రుఫోసా అనే స్త్రీలకు నా వందనాలు చెప్పండి.
మరొక స్త్రీ పెర్సిసు చాలా కష్టించి పని చేసింది. ఆమెకు నా వందనాలు చెప్పండి.
13 ప్రభువు ఎన్నుకొన్న రూపునకు, అతని తల్లికి నా వందనాలు చెప్పండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిది.
14 అసుంక్రితుకు, ప్లెగోనుకు, హెర్మేకు, పత్రొబకు, హెర్మాకు, వాళ్ళతో ఉన్న ఇతర సోదరులకు వందనాలు చెప్పండి.
15 పిలొలొగుకు, యూలియా అనే సోదరికి, నేరియకు, అతని సోదరికి, ఒలుంపాకు, వాళ్ళతో ఉన్న దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి.
16 మీరు ఒకరినొకరు కలిసినప్పుడు పవిత్రమైన ముద్దులతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోండి.
క్రీస్తు సంఘాలన్నీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.
© 1997 Bible League International