Revised Common Lectionary (Semicontinuous)
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
18 “ప్రజలతో ఇలా చెప్పు: రేపటికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. రేపు మీరు మాంసం తింటారు. మీ ఏడ్పు యెహోవా విన్నాడు. ‘తినటానికి మాకు మాంసం కావాలి. ఈజిప్టులోనే బాగుంది మాకు’ అని మీరు చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. కనుక యెహోవా ఇప్పుడు మీకు మాంసం ఇస్తాడు. మీరు అది తింటారు. 19 ఒకటి, రెండు, అయిదు, పది, ఇరవై రోజులకంటె ఎక్కువగానే మీరు అది తింటారు. 20 ఒక నెల అంతా మీరు ఆ మాంసం తింటారు. మొఖం మొత్తేటంతవరకు మీరు ఆ మాంసం తింటారు. యెహోవాకు వ్యతిరేకంగా మీరు ఫిర్యాదు చేసారు కనుక మీకు ఇలా జరుగుతుంది. యెహోవా మీ మధ్య సంచరిస్తూ, మీ అవసరాలను గ్రహిస్తాడు. కానీ మీరు ఆయన ఎదుట ఏడ్చి, ఫిర్యాదు చేసారు! అసలు ‘మేము ఈజిప్టు ఎందుకు విడిచిపెట్టాము’ అన్నారు మీరు.”
21 మోషే ఇలా అన్నాడు: “యెహోవా, ఇక్కడ 6,00,000 మంది పురుషులు సంచరిస్తున్నారు. ‘నీవేమో వారు ఒక నెలంతా తినటానికి సరిపోయే మాంసం ఇస్తాను అంటున్నావు!’ 22 మొత్తం గొర్రెలు, పశువులు అన్నింటినీ వధించినా, ఇంత మంది ప్రజలకు ఒక నెల అంతా భోజనంగా పెట్టాలంటే అది చాలదు. అలానే సముద్రంలో ఉన్న మొత్తం చేపలన్నీ మేము పట్టినా, అవీ వారికి చాలవు.”
23 అయితే, “యెహోవా శక్తిని పరిమితం చేయకు. నేను చేస్తానని చెప్పినవాటిని చేస్తానో లేదో నీవు చూస్తావు” అని మోషేతో యెహోవా చెప్పాడు.
పూరేళ్లు వచ్చాయి
31 అప్పుడు యెహోవా సముద్రం నుండి గొప్పగాలి వీచేటట్టుగా చేసాడు. ఆ గాలి పూరేళ్లను ఆ ప్రాంతంలోకి విసిరాయి. వారి నివాసాల చుట్టూరా పూరేళ్లు ఎగిరాయి. నేల అంతా పూరేళ్లతో నిండి పోయేటన్ని ఉన్నాయి అవి. నేలమీద మూడు అడుగుల ఎత్తుగా పూరేళ్లు నిండిపోయాయి. ఒక మనిషి ఒక రోజున నడువగలిగినంత దూరం అన్ని దిశల్లో పూరేళ్లు ఉన్నాయి. 32 ప్రజలు బయటకు వెళ్లి ఆ రాత్రి పగలు అంతా పూరేళ్లను ఏరుకొన్నారు. ఆ మర్నాడు అంతా వారు పూరేళ్లు పోగుచేసుకొన్నారు. తక్కువ కూర్చుకొన్నవాడు నూరు తూములుకన్నా ఎక్కువ పూరేళ్లను పోగుచేసుకున్నాడు. తర్వాత ప్రజలు ఆ పూరేళ్లను వారి గుడారాల చుట్టూ ఎండటానికి ఎండలో పరిచారు.
దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?
(మార్కు 9:33-37; లూకా 9:46-48)
18 ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు.
2 యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు: 3 “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 4 అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు.
5 “అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను.
© 1997 Bible League International