Revised Common Lectionary (Semicontinuous)
మండుతున్న పొద
3 మోషే మామ పేరు యిత్రో (ఈయన మిద్యాను వారికి యాజకుడు). యిత్రో గొర్రెలకు మోషే కాపరి అయ్యాడు. ఒకనాడు మోషే అరణ్యానికి పశ్చిమంగా ఆ గొర్రెల్ని తోలుకుపోయాడు. అక్కడ హోరేబు అనే ఒక కొండ ఉంది. అది దేవుని కొండ. 2 ఆ కొండమీద మండుతున్న ఒక పొదలో యెహోవా దూతను మోషే చూసాడు.
ఆ పొద మండిపోతూ కాలిపోకుండా ఉండటం మోషే చూశాడు. 3 అందుచేత మోషే, “ఈ పొద మండుతూ ఉండి కాలిపోకుండా ఎలా వుందో దగ్గరకు వెళ్లి చూడాలి” అనుకొన్నాడు.
4 ఆ పొదను చూచేందుకు మోషే వస్తూ ఉండటం యెహోవా చూశాడు. అందుచేత ఆ పొదలోంచే దేవుడు, “మోషే, మోషే” అని మోషేను పిల్చాడు.
“చిత్తం ప్రభూ” అన్నాడు మోషే.
5 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “ఇక దగ్గరకు రాకు. నీ చెప్పులు విడువు. నీవు నిలబడింది పవిత్ర స్థలం 6 నేను నీ పూర్వీకుల దేవుణ్ణి. నేను అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి.”
దేవుణ్ణి చూడాలంటే, భయం వేసింది కనుక మోషే తన ముఖం కప్పుకొన్నాడు.
7 యెహోవా “ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు 8 ఈజిప్టు వాళ్ల బారినుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ కష్టాలూ లేకుండా స్వేచ్ఛగా ఉంటారు.[a] అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం.[b] కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు. 9 ఇశ్రాయేలీయుల మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు ఎంత కష్టతరం చేసారో నేను చూశాను. 10 అందుచేత నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకువెళ్లు” అని చెప్పాడు.
11 అయితే మోషే, “నేనేమీ అంతగొప్ప వాణ్ణి కాదే. ఫరో దగ్గరకు వెళ్లేందుకుగాని, ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించేందుకుగాని నేను ఎంతటివాణ్ణి?” అంటూ దేవుణ్ణి అడిగాడు.
12 “నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయగలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు ఏమిటంటే, నీవు ఈ ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండమీదనే నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు.
13 దానికి మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని చెబితే, ‘ఆ దేవుడి పేరేమిటి’ అని వాళ్లు నన్ను అడుగుతారు గదా! మరి నేనేమని చెప్పాలి,” అని దేవుణ్ణి అడిగాడు.
14 “‘నేను ఉన్నవాడను’[c] (అని వారితో చెప్పు) అన్నాడు దేవుడు మోషేతో. ఇశ్రాయేలీయుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, ‘ఉన్నవాడను,’ అనువాడు నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్పు” అన్నాడు దేవుడు మోషేతో. 15 దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఎల్లప్పుడూ నా పేరు యెహోవాగానే[d] ఉంటుంది. తరతరాల ప్రజలు ఆ పేరుతోనే నన్ను తెలుసుకొంటారు. ‘యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని వాళ్లతో చెప్పు.
105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
2 యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
3 యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
4 బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
5 యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
6 దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు.
యాకోబు హాము దేశంలో[a] నివసించాడు.
24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది.
వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
25 కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు.
ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను,
తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.
యెహోవాను స్తుతించండి.
9 ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి. 10 సోదర ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి. 11 ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి. 12 పరలోకం లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమయాల్లో సహనం వహించి, అన్ని వేళలా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి. 13 మీ సహాయం అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతిథ్యాన్ని మరువకండి.
14 మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి కాని, దూషించకూడదు. 15 ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. 16 అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగలవాళ్ళతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి.
17 కీడు చేసినవాళ్ళకు కీడు చెయ్యకండి. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచిదనిపించేదాన్ని చెయ్యటానికి జాగ్రత్త పడండి. 18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. 19 మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో,
“పగ తీర్చుకోవటం నా వంతు.
నేను ప్రతీకారం తీసుకొంటాను”(A)
అని వ్రాయబడి ఉంది. 20 దానికి మారుగా,
“మీ శత్రువు ఆకలితో ఉంటే
అతనికి ఆహారం ఇవ్వండి.
అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి.
ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని
తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది”(B)
అని వ్రాయబడి ఉంది. 21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి.
యేసు పొందనున్న మరణం
(మార్కు 8:31–9:1; లూకా 9:22-27)
21 అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళవలసిన విషయాన్ని గురించి, అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్త్రులు తనను హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన మరణాన్ని గురించి, మూడవ రోజు బ్రతికి రావటాన్ని గురించి చెప్పటం మొదలు పెట్టాడు.
22 పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడవద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు.
23 యేసు పేతురు వైపు తిరిగి, “నా ముందు నుండి వెళ్ళిపో సాతాను! నీవు నాకు ఆటంకం కలిగిస్తున్నావు! నీవు మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కాని, దేవుని సంగతులు గురించి కాదు” అని అన్నాడు.
24 యేసు తన శిష్యులతో, “నా వెంట రాదలచిన వాడు అన్నీ విడచి పెట్టి, తన సిలువను మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 25 తన ప్రాణాన్ని కాపాడాలనుకొన్నవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని ఒదులు కొన్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. 26 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని[a] పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వగలుగుతాడు? 27 మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడాయన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. 28 ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు మనుష్యకుమారుడు రావటం చూసేవరకు జీవించే వుంటారు” అని గట్టిగా చెప్పాడు.
© 1997 Bible League International