Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 83:1-4

ఆసాపు స్తుతి గీతం.

83 దేవా, మౌనంగా ఉండవద్దు!
    నీ చెవులు మూసికోవద్దు!
    దేవా, దయచేసి ఊరుకోవద్దు.
దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
    నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
    నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
“ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
    అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.

కీర్తనలు. 83:13-18

13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె[a] ఆ ప్రజలను చేయుము.
    గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు
    కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము.
    సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము.
    అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
    వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
    అని వారు తెలుసుకొంటారు.

నిర్గమకాండము 7:14-25

నీళ్లు రక్తంగా మారటం

14 అప్పుడు మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఫరో మొండికెత్తాడు. ప్రజల్ని పోనిచ్చేందుకు ఫరో నిరాకరిస్తున్నాడు. 15 ఉదయాన్నే ఫరో నైలు నదికి వెళ్తాడు. నది ఒడ్డున అతని దగ్గరకు వెళ్లు. పాముగా మారిన ఆ కర్రను నీ వెంట తీసుకొనివెళ్లు. 16 అతనికి ఇలా చెప్పు: ‘హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపించాడు. అరణ్యంలో నన్ను ఆరాధించటానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని నీతో చెప్పమని యెహోవా నాతో చెప్పాడు. ఇప్పటివరకు నీవేమో యెహోవా మాట వినలేదు. 17 కనుక యెహోవా చెబుతున్నాడు, నేనే యెహోవానని చెప్పి నీవు ఇలా తెల్సుకొంటావు నా చేతిలో ఉన్న ఈ కర్రతో నైలు నది నీళ్లను నేను కొడతాను. నైలునది రక్తంగా మారిపోతుంది. 18 దానితో నదిలో చేపలన్నీ చస్తాయి, నది కుళ్లు కంపు కొడుతుంది. అంతటితో ఈజిప్టు వాళ్లు నదిలోని నీళ్లు తాగలేక పోతారు.’”

19 యెహోవా మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “వారి నదులు, కాలువలు, చెరువుల మీద, వారు నీరు నిల్వ చేసే ప్రతి స్థలం మీద తన చేతి కర్ర చాపాలని అహరోనుకు చెప్పు. అతను ఇలా చెయ్యగానే నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. చెక్క పాత్రలు, రాతి పాత్రల్లో ఉన్న నీళ్లతో సహా మొత్తం నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి.”

20 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే, అహరోనులు చేసారు. అతను కర్ర పైకెత్తి నైలునది నీళ్లమీద కొట్టాడు. ఫరో, అతని అధికారులు అందరి ముందు అతడు ఇలా చేసాడు. నదిలో నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి. 21 నదిలో చేపలు చచ్చాయి. నది కుళ్లు కంపు కొట్టడం మొదలయింది. అందుచేత ఈజిప్టు వాళ్లు ఆ నదిలో నీళ్లు తాగలేక పోయారు. ఈజిప్టు అంతా రక్తమయం అయిపోయింది.

22 మాంత్రికులు కూడ మాయలు చేసి అలాగే చేసారు. కనుక మోషే, అహరోనుల మాటను ఫరో లెక్కచేయలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది. 23 ఫరో ముఖం తిప్పుకొని తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. మోషే, అహరోనులు చేసిన దాన్ని ఫరో అలక్ష్యం చేసాడు.

24 ఈజిప్టు వాళ్లు నదిలో నీళ్లు త్రాగలేక పోయారు. అందుచేత తాగే నీళ్ల కోసం వాళ్లు ఆ నది చుట్టూ బావులు తవ్వారు.

కప్పలు

25 నైలు నది నీళ్లను యెహోవా మార్చేసిన తర్వాత ఏడు రోజులు గడిచాయి.

మత్తయి 12:22-32

యేసుని శక్తి దేవునినుండి వచ్చినది

(మార్కు 3:20-30; లూకా 11:14-23; 12:10)

22 ఆ తర్వాత కొందరు, దయ్యంపట్టి గ్రుడ్డివానిగా, మూగవానిగా అయిపోయిన ఒకతణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. యేసు అతనికి నయం చేసాడు. దానితో ఆ మూగ వానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి. 23 ప్రజలందరికి ఆశ్చర్యమేసి, “ఈయన బహుశా దావీదు కుమారుడేమో!” అని అన్నారు.

24 పరిసయ్యులు ఇది విని, “దయ్యాల రాజైన బయెల్జెబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలిస్తున్నాడు. అంతే!” అని అన్నారు.

25 వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. వాళ్ళతో, “విభాగాలైన ప్రతి రాజ్యం నశించి పోతుంది. విభాగాలైన ప్రతి పట్టణమూ, ప్రతి యిల్లు కూలిపోతుంది. 26 సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏవిధంగా నిలుస్తుంది? 27 నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లైతే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్ళే ఋజువు చేస్తున్నారు. 28 ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లైతే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లేగదా! 29 అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయకుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేసాక అతని యింటిని దోచుకోగలరు. 30 నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు.

31 “అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన పాపాలన్నిటిని దేవదూషణను దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు. 32 మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈయుగంలో కాని, లేక రానున్న యుగంలో కాని క్షమించడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International