Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.
77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
2 నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
3 నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
4 నీవు నన్ను నిద్రపోనియ్యవు.
నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను.
5 గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
6 రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
7 “మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
8 దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
9 కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది.
10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.
11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.
16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.
యొర్దాను నదిలో అద్భుత కార్యం
3 మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ లేచి, షిత్తీము విడిచి పెట్టారు. యొర్దాను నదికి వారు ప్రయాణం చేసారు. నది దాటి అవతలికి వెళ్లకముందు వారు యొర్దాను నది దగ్గర గుడారాలు వేసారు. 2 మూడు రోజుల తర్వాత నాయకులు పాళెమునంతా తిరిగి చూసారు. 3 నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను[a] యాజకులు, లేవీయులు[b] మోయటం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడించాలి. 4 కాని, మరీ సమీపంగా వెంబడి పోకూడదు. ఒక 1,000 గజాలు[c] వారికి వెనుకగా ఉండండి. ఈ మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. అందుచేత వారిని వెంబడిస్తే, ఎక్కడికి వెళ్లాల్సిందీ మీకు తెలుస్తుంది” అని వారు చెప్పారు.
5 అప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని ప్రజలతో చెప్పాడు.
6 తర్వాత యెహోషువ, “ఒడంబడిక పెట్టెను తీసుకొని ప్రజలకు ముందుగా నదిని దాటండి” అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకొని, ప్రజలకు ముందు మోసుకొనిపోయారు.
7 అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసుకొంటారు. 8 యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు, ‘యొర్దాను నదీ తీరానికి నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు ఆగండి.’”
9 అంతట ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు: “రండి, మీ యెహోవా దేవుని మాటలు వినండి. 10 జీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు అనేందుకు ఇదే ఋజువు. నిజంగా ఆయన మీ శత్రువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే ఋజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ ప్రజలు అందరినీ ఆయన ఈ దేశంనుండి వెళ్ల గొట్టేస్తాడు. 11 ఇదే ఋజువు. మీరు యొర్దాను దాటేటప్పుడు, సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది. 12 ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో ఒక్కోదాని నుండి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసుకొనండి. 13 సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టెను మీకు ముందు యొర్దాను నదిలోనికి మోసుకొని వెళ్తారు. వారు నీళ్లలో ప్రవేశించగానే యొర్దాను నదీ ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి, ఆ స్థలానికి వెనుక ఆనకట్ట వేసినట్టు నిలిచిపోతాయి.”
14 యాజకులు ఒడంబడిక పెట్టె మోయగా, ప్రజలుతాము గుడారాలు వేసిన చోటునుండి బయల్దేరారు. ప్రజలు యొర్దాను నది దాటడం ప్రారంభించారు. 15 (కోతకాలంలో యొర్దాను నది దాని గట్లు మీద పొర్లి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది.) పెట్టెను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. నీళ్లలో వారు నిలిచిపోయారు. 16 సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది దాటారు. 17 ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను ఆ నది మధ్యవరకు మోసుకొని వెళ్లి, అక్కడ నిలిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ యొర్దాను నదిలో ఆరిన నేలమీద నడచి, ఆవలికి దాటేవరకు యాజకులు అక్కడ వేచి ఉన్నారు.
23 మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు.
24 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. 25 పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు. 26 అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు.
27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది. 28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.
29 దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎఱ్ఱ సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగిపొయ్యారు.
© 1997 Bible League International