Revised Common Lectionary (Semicontinuous)
99 యెహోవాయే రాజు.
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
దేవా, నీతిని నీవు చేశావు.
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
6 మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
54 ఈ విధంగా సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బలిపీఠం ముందు అతను మోకాళ్ల మీద ఉన్నాడు. తన చేతులను ఆకాశం వైవు చాచి అతడు ప్రార్థించాడు. సొలొమోను ప్రార్థన ముగించిన పిమ్మట లేచి నిలబడ్డాడు. 55 పిమ్మట, పెద్ద గొంతుతో ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించమని దేవుని అర్థించాడు. సొలొమోను ఇలా అన్నాడు:
56 “యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే ఆయన మనకు విశ్రాంతి ఇచ్చాడు! తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనేక శుభప్రదమైన వాగ్దానాలను చేశాడు. యెహోవా ఈ వాగ్ధానాలన్నిటినీ నెరవేర్చాడు. 57 మనదేవుడైన యెహోవాను మనతో ఉండమని అడుగుతున్నాను. ఆయన మన పూర్వీకులతో ఎలావున్నాడో అలాగే మనతో కూడ ఉండమని అడుగుతున్నాను. మనలను ఎన్నడూ వదిలి వుండవద్దని వేడు కుంటున్నాను. 58 ఈ రకంగా మనం ఆయనను ఆశ్రయించి, ఆయనను అనుసరించుదాం. ఆయన మనపూర్వీకులకు ఇచ్చిన న్యాయసూత్రాలను, ఆజ్ఞలను మనము ఆచరిద్దాము. 59 నా ఈ ప్రార్థన, నేనడిగిన అన్ని విషయాలు సదా గుర్తుచుకోమని మన దేవుడైన యెహోవాను అడుగుతున్నాను. తన సేవకుడైన రాజు కొరకు, ఇశ్రాయేలు ప్రజలకొరకు ఇవన్నీ జరిపించమని వేడుకుంటున్నాను. ఇలా ప్రతి రోజూ జరిపించమని కూడా వేడుకుంటున్నాను. 60 యెహోవా ఇవన్నీ జరిగేలా చేస్తే ప్రపంచ ప్రజలంతా మన దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకుంటారు. 61 మన దేవుడైన యెహోవాకు మీరంతా చెందియున్నారు. కావున మన దేవుడైన యెహోవాకు విధేయులై యుండాలి. ఆయన న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను మీరంతా తప్పక అనుసరించాలి. మీరిప్పుడు చేస్తున్నట్లు భవిష్యత్తులో కూడ ఆయన మార్గాన్ని మీరనుసరించాలి.”
62 తరువాత రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులందరు యెహోవాకు బలులు అర్పించారు. 63 సొలొమోను ఇరువది రెండు వేల పశువులను, ఒక లక్షాఇరువది వేల గొర్రెలను బలి ఇచ్చాడు. ఇవి సమాధాన బలులుగా అర్పించారు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులు దేవాలయాన్ని దేవునికి అంకితము చేశారు.
64 రాజైన సొలొమోను ఇంకా ఆ రోజు దేవుని ఆలయము ముందున్న ఆవరణను దేవుని కార్యము కొరకు పవిత్రం చేశాడు. అతనక్కడ దహన బలులు, ధాన్యార్పణలు, జంతువుల కొవ్వును సమాధాన సూచకంగా అర్పించాడు. అతి పరిశుద్ధ స్థలము ముందున్న కంచు బలిపీఠం ఇవన్నీ అర్పించటానికి బహు చిన్నది అగుటచే, రాజైన సొలొమోను ఆవరణలో అర్పించాడు.
65 రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు దేవాలయంలో ఆ విధంగా పండుగ జరుపుకున్నారు. ఉత్తర భాగాన బహుదూరంలో ఉన్న హమాతు కనుమ నుండి దక్షిణాన ఈజిప్టు సరిహద్దు వరకుగల ఇశ్రాయేలీయులంతా పండుగలో పాల్గొన్నారు. లెక్కకు మించిన జనాభా అక్కడ చేరింది. ఏడు రోజులపాటు వారంతా అక్కడ ఆహారపానీయాలు స్వీకరిస్తూ వేడుక చేసుకున్నారు.
పరలోకమునుండి వచ్చువాడు
31 “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. 32 ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు. 33 దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు. 34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు. 36 ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.
© 1997 Bible League International