Revised Common Lectionary (Semicontinuous)
8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
నేను నీకు పొట్టేళ్లతో ధూపం[a] ఇస్తున్నాను.
నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.
16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
జల ప్రళయం ప్రారంభం
7 అప్పుడు నోవహుతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ కాలపు దుర్మార్గుల మధ్య నీవు మంచి వాడివిగా నాకు కనబడ్డావు. కనుక నీ కుటుంబం అంతటినీ కలుపుకొని మీరంతా ఓడలోపలికి వెళ్లండి. 2 శుద్ధమయిన జంతువులన్నింటిలో నుండి ఏడేసి జాతులు (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో, భూమి మీద ఉన్న ఇతర జంతువులన్నింటిలోనుండి ఒక్క జత (మగది ఒకటి, ఆడది ఒకటి) తీసుకో. ఈ జంతువులన్నింటిని నీతోబాటు ఓడలోనికి నడిపించు. 3 ఆకాశంలో ఎగిరే పక్షులన్నింటిలో నుండి ఏడేసి జతలు (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో. ఇలా చేయటంవల్ల మిగతా జంతువులన్ని నాశనం చేయబడిన తర్వాత కూడా ఈ జంతువులన్ని భూమిమీద జీవించడానికి వీలవుతుంది. 4 ఇంక ఏడు రోజులకు భూమిమీద విస్తారమైన వర్షం కురిపిస్తాను. 40 పగళ్లు, 40 రాత్రులు వర్షం కురుస్తుంది. భూమిమీద జీవించే ప్రతిప్రాణి నాశనం చేయబడుతుంది. నేను చేసినవన్నీ నశించిపోతాయి.” 5 యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నిటి విషయంలో నోవహు విధేయుడయ్యాడు.
6 ఈ జలప్రళయము వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరాలు. 7 వరద నీటినుండి తప్పించుకొనేందుకు నోవహు, అతని కుంటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడ ఓడలో ఉన్నారు. 8-9 పవిత్ర జంతువులన్నీ, భూమిమీది ఇతర జంతువులన్నీ, పక్షులన్నీ, నేలమీద ప్రాకు ప్రాణులన్నీ నోవహుతో పాటు ఓడలోకి వెళ్లాయి. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్లుగా ఆడ, మగ అనే జంటలుగ లోపలికి వెళ్లాయి. 10 ఏడు రోజుల తర్వాత వరద ప్రారంభమయింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది.
11-13 రెండవ నెల 17వ రోజున భూమి క్రింద ఉన్న జల ఊటలన్నీ బ్రద్దలై, నేలనుండి నీరు ప్రవహించటం మొదలయింది. అదే రోజున భూమిమీద భారీ వర్షాలు కురవటం ప్రారంభం అయింది. ఆకాశానికి కిటికీలు తీసినట్లుగా ఉంది. 40 పగళ్లు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. సరిగ్గా అదే రోజున నోవహు, అతని భార్య, అతని కుమారులు షేము, హాము, యాఫెతు, వారి భార్యలు ఓడ ఎక్కారు. ఈ సమయంలో నోవహు 600 సంవత్సరాల వయస్సువాడు. 14 ఆ మనుష్యులు, భూమిమీదనున్న అన్ని రకాల జంతువులు ఆ ఓడలో ఉన్నారు. అన్ని రకాల పశువులు, నేలమీద ప్రాకు అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు ఆ ఓడలో ఉన్నాయి. 15 ఈ జంతువులన్నీ నోవహుతో కలిసి ఓడలోకి వెళ్లాయి. ప్రాణం ఉన్న ప్రతి రకం జంతువు రెండేసి చొప్పున వచ్చాయి. 16 సరిగ్గా దేవుడు ఆజ్ఞాపించినట్లే ఈ జంతువులన్నీ ఓడలో జతలు జతలుగా ప్రవేశించాయి. తరువాత యెహోవా ఓడ తలుపులు మూసివేశాడు.
17 40 రోజుల పాటు నీళ్లు భూమిమీద వరదలై పారాయి. నీటిమట్టం పెరుగుతూ ఓడను నేలమీదనుండి పైకి లేపడం మొదలయింది. 18 నీటిమట్టం పెరగటం కొనసాగుతూనే ఉంది. ఓడ నేలకు చాలా ఎత్తుగా నీటిమీద తేలుతోంది. 19 నీటి మట్టం చాలా పైకి లేచినందువల్ల గొప్ప ఎత్తయిన పర్వతాలు అన్నీ నీళ్లలో మునిగిపోయాయి. 20 పర్వత శిఖరాలకు పైగా నీటిమట్టం లేస్తూనే ఉంది. అన్నింటికంటే ఎత్తయిన పర్వత శిఖరానికి ఇంకా 20 అడుగులు ఎత్తుగానే నీటిమట్టం ఉంది.
21-22 భూమిమీద బ్రతికి ఉన్న ప్రతి ప్రాణీ చనిపోయింది. ప్రతి పురుషుడు, స్త్రీ మరణించారు. పక్షులు, పశువులు, జంతువులు ఎగిరే ప్రతి ప్రాణి చంపివేయబడ్డాయి. బ్రతికి శ్వాసించే ప్రతి జీవి చనిపోయింది. 23 కనుక భూమిమీద ఉన్న సకల ప్రాణులను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి అన్నింటినీ దేవుడు నాశనం చేశాడు. ఇవన్నీ భూమిమీద నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలోవున్న నోవహు అతనితో ఉన్న మనుష్యులు, జంతువులు మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు. 24 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేశాయి.
తుఫాను
13 దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. 14 అంతలోనే, ఊరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. 15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది. 16 “కౌద” అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. 17 దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ “సూర్తిస్” ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెళ్తుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు.
18 మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు. 19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. 20 సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము.
21 చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి మీరు క్రేతునుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు. 22 కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది. 23 నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు: 24 ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’ 25 అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. 26 మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు.
27 పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. 28 బుడుదు[a] నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుందని తెలుసుకున్నారు. 29 ఓడ రాళ్ళకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. 30 నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశ్యం. 31 అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు. 32 ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు.
33 సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినమని చెబుతూ, “గడిచిన పదునాలుగు రోజులనుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు. 34 ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు. 35 ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు. 36 అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. 37 మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు. 38 వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు.
© 1997 Bible League International