Revised Common Lectionary (Semicontinuous)
22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. 23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.
24 “ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. 25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతి వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.
27 “మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. 28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’
29 “మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు. 30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 31 ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”
8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
నేను నీకు పొట్టేళ్లతో ధూపం[a] ఇస్తున్నాను.
నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.
16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
13 ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హాని చేస్తారు? 14 కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.” 15 క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. 16 కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు.
17 చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.
18 క్రీస్తు మీ పాపాల నిమిత్తం
తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు.
దేవుని సన్నిధికి మిమ్మల్ని
తీసుకు రావాలని నీతిమంతుడైన
క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు.
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా,
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.
19 పరిశుద్ధాత్మ ద్వారా, చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధించాడు. 20 గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు. 21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడిగివేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. 22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.
పవిత్రాత్మ వాగ్దానం
15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించినట్లు చేస్తారు. 16-17 మీతో చిరకాలం ఉండి, మీకు సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని[a] పంపుమని నేను తండ్రిని అడుగుతాను. ఆయన ఆత్మను పంపుతాడు. ఆ పవిత్రాత్మ సత్యాన్ని ప్రకటించటం తన కర్తవ్యం. ప్రపంచం ఆయన్ని చూడలేదు. ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కనుక ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మీతో ఉన్నాడు కనుక మీకు ఆయన గురించి తెలుసు. ఆయన భవిష్యత్తులో మీతో ఉంటాడు. లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎందుకంటే అది ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు.
18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను. 19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు. 20 ఆ రోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు. 21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”
© 1997 Bible League International