Revised Common Lectionary (Semicontinuous)
యేసు పరలోకానికి వెళ్ళటం
6 వాళ్ళంతా కలుసుకొన్నప్పుడు, “ప్రభూ! మీరు ఈ సమయాన ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా?” అని యేసును అడిగారు.
7 ఆయన వాళ్ళతో, “తండ్రి తన అధికారంతో గడియలను, రోజులను నియమించాడు. కాని వాటిని తెలుసుకొనే అవసరం మీకు లేదు. 8 కాని పవిత్రాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలోనూ, ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు” అని అన్నాడు.
9 ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది. 10 ఆయన వెళ్తూ ఉంటే వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకొన్న యిద్దరు వ్యక్తులు వాళ్ళ ప్రక్కన నిలుచొని వాళ్ళతో, 11 “గలిలయ ప్రజలారా! ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీనుండి పరలోకానికి తీసుకు వెళ్ళబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మళ్ళీ తిరిగి వస్తాడు” అని అన్నారు.
మత్తీయని ఎన్నుకోవటం
12 ఆ తర్వాత వాళ్ళు ఒలీవల కొండనుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది.[a] 13 వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, “జెలోతే”[b] అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా.
14 వీళ్ళంతా సమావేశమై ఒకే మనస్సుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండేవాళ్ళు.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
68 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము.
ఆయన శత్రువులు అందరూ ఆయన దగ్గర్నుండి పారిపోయెదరుగాక!
2 గాలికి ఎగిరిపోయే పొగలా
నీ శత్రువులు చెదరిపోవుదురుగాక.
అగ్నిలో మైనం కరిగిపోయేలా
నీ శత్రువులు నాశనం చేయబడుదురుగాక.
3 కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు.
మంచి మనుష్యులు దేవునితో కలసి సంతోషంగా గడుపుతున్నారు. మంచి మనుష్యులు ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు.
4 దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి.
ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు.
ఆయన పేరు యాహ్.[a]
ఆయన నామాన్ని స్తుతించండి.
5 ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు.
దేవుడు విధవరాండ్రను గూర్చి జాగ్రత్త పుచ్చుకొంటాడు.
6 ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు.
దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు.
కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.
7 దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు.
ఎడారిగుండా నీవు నడిచావు.
8 భూమి కంపించింది.
దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.
9 దేవా, నీవు వర్షం కురిపించావు
మరియు నిస్సారమైన పాత భూమిని నీవు మరల బలపరిచావు.
10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి.
దేవా, అక్కడ పేద ప్రజలకు నీవు ఎన్నో మంచివాటిని యిచ్చావు.
32 భూరాజులారా, దేవునికి పాడండి.
మన యెహోవాకు స్తుతి కీర్తనలు పాడండి.
33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు.
ఆయన శక్తిగల స్వరాన్ని ఆలకించండి.
34 మీ దేవుళ్లందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలను బలపరుస్తాడు.
35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు.
ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు శక్తిని, బలాన్ని ఇస్తాడు.
దేవుని స్తుతించండి.
క్రీస్తు అనుచరుడిగా శ్రమపడటం
12 నా ప్రియమైన సోదరులారా! మీకు అగ్నిపరీక్ష జరుగుతోంది. తద్వారా ఏదో జరుగరానిది జరిగినట్లు ఆశ్చర్యపడకండి. 13 క్రీస్తు కష్టాల్లో మీరు పాలు పంచుకుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన మహిమ వ్యక్తమైనప్పుడు మీరు చాలా ఆనందిస్తారు. 14 ఒకవేళ క్రీస్తు పేరు కారణంగా మీకు అవమానం కలిగితే, మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన ఆత్మ మీలో ఉన్నాడన్నమాట.
6 అందువల్ల దేవుని బలమైన చేతి క్రింద వినయంతో ఉండండి. సరియైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. 7 ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదలివేయండి.
8 మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సాతాను సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని మ్రింగివేయాలని మీ చుట్టు తిరుగుతూ ఉన్నాడు. 9 ఈ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు యిలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు. గనుక దృఢవిశ్వాసంతో ఉండి సాతానుకి ఎదురు తిరగండి.
10 దయామయుడైన దేవుడు, మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలనుభవించాక, ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని యిచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. 11 ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండుగాక! ఆమేన్.
యేసు తనకోసం, తన శిష్యులకోసం ప్రార్థించటం
17 ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూసి ఈ విధంగా ప్రార్థించాడు: “తండ్రి! సమయం వచ్చింది. నీ కుమారునికి మహిమ కలిగించు. అప్పుడు కుమారుడు నీకు మహిమ కలిగిస్తాడు. 2 ప్రజలందరిపై కుమారునికి అధికారమిచ్చావు. నీవు అప్పగించిన వాళ్ళకు, ఆయన అనంత జీవితం యివ్వాలని నీ ఉద్దేశ్యం. 3 నీవు మాత్రమే నిజమైన దేవుడవు. నిన్నూ, నీవు పంపిన ‘యేసుక్రీస్తు’ను తెలుసుకోవటమే అనంత జీవితం. 4 పూర్తి చేయుమని నీవు నాకు అప్పగించిన కార్యాన్ని పూర్తిచేసి ఈ ప్రపంచంలో నీకు మహిమ కలిగించాను. 5 తండ్రీ! ఈ ప్రపంచం ఆరంభం కాక ముందు నీతో పాటు నాకు కూడా మహిమ ఉండేది. ఇప్పుడు ఆ మహిమ నీ సమక్షంలో నాకు కలిగేటట్లు చేయుము.
6 “ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు నీ వాళ్ళు. కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ సందేశాన్ని పాటించారు. 7 నీవు నాకు ఎన్నోయిచ్చావు. అవన్నీ నాకిచ్చినావని వాళ్ళకిప్పుడు తెలిసింది. 8 ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో కలిగింది. 9 నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రపంచాని కోసం ప్రార్థించటం లేదు. నీవు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కావాలని ప్రార్థిస్తున్నాను. 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతోంది.
11 “నేనీ ప్రపంచంలో యిక ఉండను. కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో వాళ్ళను రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉంటారు.
© 1997 Bible League International