Revised Common Lectionary (Semicontinuous)
93 యెహోవాయే రాజు!
ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు.
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి.
3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది.
ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి,
4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి.
కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి.
నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
కొత్త నాయకుడు యెహోషువ
31 అప్పుడు మోషే వెళ్లి, ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పాడు. 2 మోషే వాళ్లతో ఇలా చెప్పాడు, “ఇప్పుడు నాకు 120 సంవత్సరాల వయస్సు. ఇంక మిమ్మల్ని నేను నడిపించలేను. ‘నీవు యొర్దాను నది దాటి వెళ్లవు’ అని యెహోవా నాతో చెప్పాడు. 3 మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్తాడు. మీకోసం ఈ రాజ్యాలను ఆయనే నాశనం చేస్తాడు. వారి దగ్గరనుండి వారి రాజ్యాన్ని మీరు తీసుకుంటారు. యెహోషువ మిమ్మల్ని ముందుగా దాటిస్తాడు. ఇది యెహోవా చెప్పాడు:
4 “అమోరీ రాజులైన సీహోను, ఓగులకు చేసినట్టే యెహోవా ఈ రాజ్యాలకు చేస్తాడు. ఆ రాజుల దేశానికి చేసిన విధముగానే ఆయన చేస్తాడు. వారి దేశాన్ని యెహోవా నాశనం చేసాడు. 5 మరియు మీరు ఈ రాజ్యాలను నాశనం చేసేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. మీరు చేయాలని నేను చేప్పిన విషయాలన్నీ మీరు వాళ్లకు చేయాలి. 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. ఈ జనాలకు భయపడకండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళ్తున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేయకుండా ఉండడు.”
7 అప్పుడు మోషే యెహోషువాను పిలిచాడు. మోషే యెహోషువతో చెబుతుంటే ఇశ్రాయేలు ప్రజలంతా విన్నారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, వారి పూర్వీకులకు యిస్తానని యెహోవా వాగ్దానం చేసిన దేశంలోనికి ఈ ప్రజలను నీవు నడిపించాలి. ఈ దేశాన్ని తమ స్వంతంగా తీసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలకు నీవు సహాయం చేయాలి. 8 యెహోవా నీకు ముందు వెళ్తాడు. సాక్షాత్తూ ఆయనే నీతో ఉంటాడు. ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడు నిన్ను విడువడు, భయపడవద్దు, దిగులుపడవద్దు.”
ప్రబోధాల పుస్తకాన్ని మోషే వ్రాయటం
9 అప్పుడు మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి, లేవీ సంతానపు యాజకులకు ఇచ్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టె మోసే పని వాళ్లదే. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు నాయకులందరికి కూడా మోషే యిచ్చాడు. 10 తర్వాత మోషే నాయకులకు ఆజ్ఞాపించాడు. అతను ఇలా చెప్పాడు: “ప్రతి ఏడు సంవత్సరాల ఆఖరిలో, స్వాతంత్ర్యపు సంవత్సరంలో, పర్ణశాలల పండుగ సమయములో ఈ ధర్మశాస్త్రం చదవండి. 11 ఆ సమయంలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలంతా వస్తారు. అప్పుడు ప్రజలు వినగలిగేటట్టు నీవు వారికి ఈ ధర్మశాస్త్రం చదివి వినిపించాలి. 12 పురుషులు, స్త్రీలు చిన్నపిల్లలు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు అందరిని సమావేశ పర్చాలి. వాళ్లు ధర్మశాస్త్రాన్ని విని, మీ దేవుడైన యెహోవాను గౌరవించంటం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు వారు జాగ్రత్తగా విధేయులవుతారు. 13 ధర్మశాస్త్రం ఎరుగనివారి సంతానంవాళ్లంతా దానిని వింటారు. వాళ్లు మీ దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకుంటారు. యొర్దాను నది ఆవలి ప్రక్క మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో మీరు జీవించినంత కాలం వారు ఆయనను గౌరవిస్తారు.”
దుఃఖము సంతోషముగా మారటం
16 “కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు. ఆ తదుపరి మరి కొంత కాలం గడిచాక మీరు నన్ను చూస్తారు.”
17 ఆయన శిష్యుల్లో కొందరు, “‘కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు’ అని అనటంలోను మరియు, ‘మరి కొంత కాలం గడిచాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు’ అని అనటంలో అర్థమేమిటి? పైగా ‘నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ అని అంటున్నాడే! అంటే ఏమిటి?” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 18 “‘కొంత కాలం’ తర్వాత అని అనటంలో ఆయన ఉద్దేశ్యమేమిటి? ఆయనేమంటున్నాడో అర్థం కావటం లేదు!” అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుకొన్నారు.
19 ఈ విషయాన్ని గురించి వాళ్ళడగాలని అనుకుంటున్నారని యేసు గ్రహించాడు. అందువలన ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “‘కొంత కాలం గడిచాక నన్ను చూడరు, మరి కొంత కాలం గడిచాక నన్ను చూస్తారు’ అని నేనటంలో అర్థమేమిటని పరస్పరం మాట్లాడుకుంటున్నారా? 20 మీరు దుఃఖిస్తున్నప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇది నిజం.
21 “ప్రసవించే సమయం వచ్చినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ నొప్పులు అనుభవిస్తుంది. శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఆనందంలో తన వేదన మరచి పోతుంది. 22 అదే విధంగా యిది మీరు దఃఖించే సమయం. కాని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఆనందాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. 23 ఆ రోజు మీరు నన్ను ఏమీ అడగరు. ఇది నిజం. నా పేరిట మీరేది అడిగినా తండ్రి మీకిస్తాడు. 24 ఇంత కాలం మీరు నా పేరిట ఏమీ అడగలేదు. ‘అడగండి; మీకు లభిస్తుంది’ అప్పుడు మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.
© 1997 Bible League International