Revised Common Lectionary (Semicontinuous)
99 యెహోవాయే రాజు.
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
దేవా, నీతిని నీవు చేశావు.
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
6 మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
అహరోను ప్రజల్ని రక్షించటం
41 మరునాడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేసారు. వారు, “యెహోవా ప్రజలను మీరు చంపారు” అన్నారు.
42 మోషే, అహరోనులు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర నిలబడి ఉన్నారు. మోషే, అహరోనుల మీద ఫిర్యాదు చేయటానికి ప్రజలు ఆచోట చేరారు. అయితే వారు సన్నిధి గుడారం వైపు చూచినప్పుడు, మేఘం దానిని అవరించి, యెహోవా మహిమ అక్కడ ప్రత్యక్షమయింది. 43 అప్పుడు మోషే. అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వెళ్లారు.
44 అప్పుడు యెహోవా మోషేతో 45 “ఇప్పుడు నేను వీళ్లను నాశనం చేస్తాను గనుక మీరు దూరంగా తొలగిపొండి” అని చెప్పాడు. కనుక మోషే, అహరోనులు సాష్టాంగపడ్డారు.
46 అప్పుడు మోషే “నీ ధూపార్తిని బలిపీఠపు నిప్పులతో నింపు. దానిమీద సాంబ్రాణి వేయి. త్వరపడి ప్రజల సమాజం దగ్గరకు వెళ్లి వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయి. యెహోవా వారి మీద కోపంగా ఉన్నాడు. కష్టాలు అప్పుడే మొదలయ్యాయి” అని అహరోనుతో చెప్పాడు.
47 కనుక మోషే చెప్పినట్టు అహరోను చేసాడు. అతడు నిప్పులు, సాంబ్రాణి తీసుకొని ప్రజలందరి మధ్యకు పరుగెత్తాడు, అయితే అప్పుటకే ప్రజల్లో రోగం మొదలయింది. ప్రజలకోసం ప్రాయశ్చిత్తంగా అహరోను ధూపం వేసాడు. 48 బ్రతికి ఉన్నవాళ్లకు, చచ్చిన వాళ్లకు మధ్య నిలబడ్డాడు అహరోను. అంతటితో ఆ రోగం ఆగిపోయింది. 49 అయితే వారి పాపం నిమత్తం అహరోను ప్రాయశ్చిత్తం చేయకముందే ఆ రోగంవల్ల కోరహు మూలంగా చచ్చినవాళ్లు కాక ఇంకా 14,700 మంది చనిపోయారు. 50 అప్పుడు సన్నిధి గుడార ప్రవేశం దగ్గర ఉన్న మోషే వద్దకు అహరోను తిరిగి వెళ్లాడు. ప్రజల్లో ఆ భయంకర రోగం నిలిచిపోయింది.
దేవుని వరాలకు మంచి నిర్వాహకులుగా ఉండండి
7 అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మనిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించ గలుగుతారు. 8 అన్నిటికన్నా ముఖ్యంగా, “ప్రేమ” పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి. 9 సణగకుండా, పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి. 10 ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి. 11 మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచినవాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవ చెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.
© 1997 Bible League International