Revised Common Lectionary (Semicontinuous)
55 కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపు చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు. 56 “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు.
57 ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు. 58 అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటనను చూస్తున్నవాళ్ళు తమ వస్త్రాల్ని “సౌలు” అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు. 59 వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు. 60 ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
31 యెహోవా, నీవే నా కాపుదల.
నన్ను నిరాశపరచవద్దు.
నా మీద దయ ఉంచి, నన్ను రక్షించుము.
2 దేవా, నా మాట ఆలకించుము.
వేగంగా వచ్చి నన్ను రక్షించి
నా బండగా ఉండుము. నా క్షేమస్థానంగా ఉండుము.
నా కోటగా ఉండుము. నన్ను కాపాడుము.
3 దేవా, నీవే నా బండవు, కోటవు
కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము.
4 నా శత్రువులు నా ఎదుట ఉచ్చు ఉంచారు.
వారి ఉచ్చు (వల) నుండి నన్ను రక్షించుము. నీవే నా క్షేమస్థానం.
5 యెహోవా, నీవే మేము నమ్ముకోదగిన దేవుడవు.
నా జీవితం నేను నీ చేతుల్లో పెడ్తున్నాను.
నన్ను రక్షించుము.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.
2 అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు. 3 ప్రభువు మంచివాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు.
4 మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. 5 మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. 6 ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు:
“అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను!
పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది.
ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”(A)
7 ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు:
“ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన
రాయి మూలకు తలరాయి అయింది.”(B)
8 మరొక చోట యిలా వ్రాయబడి ఉంది:
“ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది.
ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.”(C)
దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.
9 కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు.
10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు.
ఇప్పుడు మీరు దేవుని ప్రజ.
పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు.
కాని యిప్పుడు లభించింది.
యేసు తన శిష్యులను ఆదరించటం
14 “మీరు ఆందోళన చెందకండి. దేవుణ్ణి నమ్మండి. నన్ను కూడా నమ్మండి. 2 నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను. 3 నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం. 4 నేను వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరకే తెలుసు” అని యేసు అన్నాడు.
5 తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు.
6 యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు. 7 నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు.
8 ఫిలిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. అది చాలు” అని అన్నాడు.
9 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అలాగైతే తండ్రిని చూపుమని ఎందుకు అడుగుతున్నావు? 10 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా? నేను చెప్పే మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు. 11 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు చూసైనా నమ్మండి.
12 “ఇది నిజం. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కడూ నేను చేసిన కార్యాలు చేస్తాడు. వీటికన్నా యింకా గొప్ప కార్యాలే చేస్తాడు. 13 కుమారుని ద్వారా తండ్రి మహిమ పొందటానికి మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను. 14 నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేస్తాను.
© 1997 Bible League International