Revised Common Lectionary (Semicontinuous)
99 యెహోవాయే రాజు.
కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు.
ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
దేవా, నీతిని నీవు చేశావు.
యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
6 మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
దేవుడు యాజకులను అంగీకరించుట
9 ఎనిమిదో రోజున అహరోనును, అతని కుమారులను మోషే పిలిచాడు. ఇశ్రాయేలు పెద్దలను కూడా అతడు పిలిచాడు. 2 అహరోనుతో మోషే ఇలా చెప్పాడు, “ఒక కోడెదూడను, పొట్టేలును తీసుకొని రండి. వాటిలో ఏ దోషం ఉండకూడదు. కోడెదూడను పాపపరిహారార్థబలిగాను, పొట్టేలును దహనబలిగాను యెహోవాకు అర్పించండి. 3 ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి, ‘పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకను తీసుకోండి. దహన బలికోసం ఒక కోడెదూడను, ఒక గొర్రెపిల్లను తీసుకోండి. కోడెదూడ, గొర్రెపిల్ల ఒక్క సంవత్సరం వయస్సుగలవి కావాలి. ఆ జంతువుల్లో ఏ దోషమూ ఉండకూడదు. 4 సమాధాన బలుల కోసం ఒక కోడెదూడను, ఒక పొట్టేలును తీసుకోండి. ఆ జంతువులను, నూనెతో కలుపబడ్డ నైవేద్యాన్ని తీసుకొని, వాటిని యెహోవాకు అర్పించండి. ఎందుకంటే ఈవేళ యెహోవా మీకు ప్రత్యక్ష మవుతాడు.’”
5 కనుక ప్రజలంతా సన్నిధి గుడారం దగ్గరకు వచ్చారు. మోషే ఆజ్ఞాపించిన వాటన్నింటినీ వారంతా తీసుకొచ్చారు. ప్రజలంతా యెహోవా ఎదుట నిలబడ్డారు. 6 “యెహోవా ఆజ్ఞప్రకారం మీరు చేసారు కనుక యెహోవా మహిమను మీరు చూస్తారు” అన్నాడు మోషే.
7 అప్పుడు అహరోనుతో మోషే ఈ సంగతులు చెప్పాడు: “వెళ్లి, యెహోవా ఆజ్ఞాపించిన వాటిని జరిగించు. బలిపీఠం దగ్గరకు వెళ్లి, పాపపరిహారార్థ బలులు, దహనబలి అర్పణలు అర్పించు. మీ పాపాలు, ప్రజల పాపాలు తుడిచివేయబడేందుకు వాటిని జరిగించు. ప్రజల బలులను నీవు తీసుకొని, వారి పాపాలను పరిహరించే వాటిని జరిగించు.”
8 కనుక అహరోను బలిపీఠం దగ్గరకు వెళ్లాడు. పాపపరిహారార్థ బలికోసం కోడె దూడను అతడు వధించాడు. ఈ పాపపరిహారార్థ బలి అతని కోసమే. 9 అప్పుడు అహరోను కుమారులు ఆ రక్తాన్ని అహరోను దగ్గరకు తెచ్చారు. అహరోను తన వేలు ఆ రక్తంలో ముంచి, బలిపీఠం కొమ్ములమీద దాన్ని చల్లాడు. తర్వాత అహరోను ఆ రక్తాన్ని బలిపీఠం అడుగున పోసాడు. 10 పాపపరిహారార్థ బలిలోనుంచి కొవ్వును, మూత్రగ్రంథులను, కాలేయం యొక్క కొవ్విన భాగాన్ని అహరోను తీసుకొని, బలిపీఠం మీద అతడు వాటిని దహించాడు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్లే అతడు అలా చేసాడు. 11 తర్వాత మాంసాన్ని, చర్మాన్ని పాళెము వెలుపల అగ్నితో అహరోను కాల్చివేసాడు.
22 అప్పుడు అహరోను ప్రజల వైపుగా తన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు. అహరోను పాపపరిహారార్థ బలి అర్పణను, దహనబలి అర్పణను, సమాధాన బలి అర్పణ, అర్పించటం ముగించిన తర్వాత అతడు బలిపీఠం నుండి దిగి వచ్చాడు.
23 మోషే, అహరోనులు సన్నిధి గుడారం లోపలకు వెళ్లారు. వారు బయటకు వచ్చి ప్రజలను ఆశీర్వదించారు. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. 24 యెహోవా నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీది దహన బలిని, కొవ్వును దహించి వేసింది. ప్రజలంతా ఇది చూచినప్పుడు ఉత్సాహధ్వనిచేసి సాష్టాంగపడ్డారు.
మారిన జీవితాలు
4 క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. 2 ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటివానికి పాపంతో సంబంధముండదు. 3 గతంలో మీరు యూదులుకాని వాళ్ళవలే పోకిరి చేష్టలకు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని విగ్రహారాధనలకులోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుచుండుటకు గడచిన కాలమే చాలును.
4 కాని ప్రస్తుతం మీరు వాళ్ళవలె మితిమీరిన దుష్ప్రవర్తనకు లోనై వాళ్ళతో సహ పరుగెత్తనందుకు, వాళ్ళు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. 5 అయితే చనిపోయినవాళ్ళ మీద బ్రతికియున్నవాళ్ళ మీద, తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. 6 ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయినవాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పుచెప్పినట్లుగానే వాళ్ళమీద కూడా తీర్పు చెపుతాడు.
© 1997 Bible League International