Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 16

దావీదుకు అభిమాన కావ్యము.

16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
“యెహోవా, నీవు నా యజమానివి
    నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
    అని నేను యెహోవాతో చెప్పాను.
మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
    “వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”

కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
    ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
    ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
    యెహోవా, నీవే నన్ను బలపరచావు.
    యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
నా వంతు చాలా అద్భుతమయింది.
    నా స్వాస్థ్యము చాలా అందమయింది.
యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
    రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.

నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
    ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
    నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
    నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
    నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
    యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
    నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.

ద్వితీయోపదేశకాండము 32:15-27

15 “కానీ యెష్రూను కొవ్వు పట్టి బలిసిన ఎద్దులా తన్నుతన్నాడు.
    వాడు బాగా తిని బలిసాడు. వానికి మంచి పోషణ దొరికింది.
వాడు తనను చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసాడు.
    వాడు ఆ బండను (యెహోవాను) తన రక్షకునిగా అంగీకరించలేదు.
16 యెహోవా ప్రజలు యితర దేవుళ్లను పూజించి ఆయనకు రోషం పుట్టించారు.
    యెహోవాకు అసహ్యమైన వారి విగ్రహాల మీద ఆయనకు కోపం వచ్చేటట్లు వారు చేసారు.
17 నిజానికి దేవుళ్లు కాని దయ్యాలకు వారు బలులు అర్పించారు.
    వాళ్లకు తెలియని దేవుళ్లకు వారు బలులు అర్పించారు.
    ఈ దేవుళ్లు మీ పూర్వీకులు ఎన్నడూ పూజించని కొత్త దేవుళ్లు.
18 మిమ్మల్ని సృష్టించిన ఆశ్రయ దుర్గమును (దేవుణ్ణి) మీరు విడిచిపెట్టేసారు.
    మీకు జీవం ప్రసాదించిన దేవుణ్ణి మీరు మరచిపోయారు.

19 “యెహోవా కుమారులు, కుమార్తెలు ఆయనకు కోపం పుట్టించినందువల్ల
    ఆయన అది చూచి తన ప్రజలను నిరాకరించాడు.
20 అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు,
‘వారినుండి నేను నా ముఖం దాచుకొంటాను.
    వాళ్ల అంతం ఏమిటో నేను చూడగలను.
ఎందుకంటే వారు చాలా చెడ్డ తరంవారు
వారు అపనమ్మకమైన పిల్లలు.
21-22 దేవుళ్లు కాని వాటితో వారు నాకు రోషం కలిగించారు.
    పనికిమాలిన ఈ విగ్రహాలతో వారు నాకు కోపం పుట్టించారు.
నిజానికి రాజ్యం కాని ఒక రాజ్యంతో నేను వారికి రోషం పుట్టిస్తాను.
    ఒక బుద్ధిహీనమైన రాజ్యంతో నేను వారికి కోపం పుట్టిస్తాను.
నా కోపం అగ్నిని రాజబెట్టింది;
    నా కోపం పాతాళ అగాధంవరకు మండుతుంది. భూమిని,
    దాని పంటను నా కోపం నాశనం చేస్తుంది.
    నా కోపం పర్వతాల పునాదులకు నిప్పు అంటిస్తుంది.

23 “‘ఇశ్రాయేలీయుల మీద నేను కష్టాలు ఉంచుతాను.
    నేను వాళ్లమీద నా బాణాలు విసురుతాను.
24 ఆకలిచేత వాళ్లు బలహీనమై సన్నబడిపోతారు. మండే వేడిచేత.
    భయంకర నాశనంచేత వారు నాశనమైపోతారు.
బురదలో ప్రాకే పాముల విషం,
    మృగాల కోరలు నేను వారిమీదికి పంపిస్తాను.
25 బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది;
    లోపల ఖడ్గం భయాన్ని పుట్టిస్తుంది.
యువకుడ్ని, కన్యనుకూడ అది నాశనం చేస్తుంది. పసివారిని,
    తలనెరిసిన వృద్ధులను కూడ అది నాశనం చేస్తుంది.

26 “‘నేనంటాను: ఇశ్రాయేలు వాళ్లను నేను దూరంగా ఊదేస్తాను.
    ప్రజలు ఇశ్రాయేలు వాళ్లను మరచిపోయేటట్టు నేను చేస్తాను.
27 ఆయితే వారి శత్రువు చెప్పేది నాకు తెలసు
    అది నాకు చికాకు కలిగిస్తుంది.
ఇశ్రాయేలీయుల శత్రువు అపార్థం చేసుకొని,
    మా స్వంత శక్తితో మేము గెలిచాము
    ఇది యెహోవా చేయలేదు’ అనవచ్చును.

ద్వితీయోపదేశకాండము 32:39-43

39 “‘అప్పుడు చూడండి, నేనే, నేను మాత్రమే
    దేవుణ్ణి. ఇంకే దేవుడూ లేడు.
ప్రజలను బ్రతకనిచ్చేది,
    చంపేదీ నిర్ణయించే వాడ్ని నేనే.
నేను ప్రజల్ని బాధించగలను,
    బాగు చేయగలను.
నా శక్తినుండి ఒక మనిషిని ఏ మనిషి రక్షించ లేడు.
40 ఆకాశం వైపు నేను నాచేయి పైకెత్తి ఈ వాగ్దానం చేస్తున్నాను.
నేను శాశ్వతంగా జీవించటం సత్యమయితే,
    ఈ సంగతులన్నీ జరుగుతాయి అనేది కూడ సత్యమే.
41 నేను ప్రమాణం చేస్తున్నాను,
    తళతళలాడే నా ఖడ్గానికి పదునుపెడ్తాను.
    నా శత్రువుల్ని శిక్షించటానికి దానిని నేను ఉపయోగిస్తాను.
    నేను వారికి తగిన శిక్ష యిస్తాను.
42 నా శత్రువులు చంపబడతారు, ఖైదీలుగా తీసుకొనిపోబడతారు.
నా బాణాలు వారి రక్తంతో కప్పబడి ఉంటాయి.
నా ఖడ్గం వారి సైనికుల శిరస్సులను ఛేదిస్తుంది.’

43 “దేవుని ప్రజలకోసం సర్వప్రపంచం సంతోషించాలి.
    ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు గనుక.
    తన సేవకులను చంపే వాళ్లను ఆయన శిక్షిస్తాడు గనుక.
ఆయన తన శత్రువులకు తగిన శిక్షయిస్తాడు.
ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు.”

లూకా 9:21-27

21 “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు ఖండితంగా చెప్పాడు.

యేసు తన మరణాన్ని గురించి చెప్పటం

(మత్తయి 16:21-28; మార్కు 8:31–9:1)

22 ఆయన వాళ్ళతో, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ని తిరస్కరిస్తారు. ఆయన చంపబడి మూడవ రోజున బ్రతికింపబడతాడు” అని అన్నాడు.

23 ఆ తర్వాత వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా వెంట రావాలనుకొన్నవాడు తన కోరికల్ని చంపుకొని, తన సిలువను ప్రతిరోజు మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 24 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొంటాడు. 25 ప్రపంచాన్నంతా జయించి తనను పోగొట్టుకొని, తన జీవితాన్ని నాశనం చేసుకొంటే దానివల్ల కలిగే లాభమేమిటి? 26 నన్ను, నా సందేశాన్ని అంగీకరించటానికి సిగ్గుపడిన వాళ్ళ విషయంలో, మనుష్యకుమారుడు తన తేజస్సుతో, తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతల తేజస్సుతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. 27 ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడకుండా మరణించరు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International