Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
64 దేవా, నా ప్రార్థన ఆలకించుము.
నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
2 నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.
ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
3 వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.
వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
4 వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీపరుని మీద వేస్తారు.
అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడతాడు.
5 అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.
వారు వారి ఉరులను పెడతారు. “వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని” వారనుకొంటారు.
6 మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.
మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతో కష్టం.
7 కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయగలడు.
అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
8 దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.
కాని దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు.
ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు.
అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
9 దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.
వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు.
అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు.
ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.
వారు ఆయన్ని నమ్ముకోవాలి.
మంచి మనుష్యుల్లారా, మీరంతా యెహోవాను స్తుతించండి.
ఫరో ఒక సింహమా? ఘటసర్పమా?
32 చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల (మార్చి) మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి ఈ విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా చెప్పు:
“‘దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమైన యువకిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు.
కాని, నిజానికి నీవు సముద్రాల్లో తిరుగాడే మహాసర్పానివా.
నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటున్నావు.
నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తున్నావు.
నీవు ఈజిప్టు నదులను కెలుకుతున్నావు.’”
3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“అనేక మంది ప్రజలను నేను ఒక దగ్గరికి చేర్చాను.
నేనిప్పుడు నా వలను నీ మీదికి విసురుతాను.
ఆ ప్రజలంతా అప్పుడు నిన్ను లోపలికి లాగుతారు.
4 పిమ్మట నిన్ను ఎండిన నేలపై నేను పడేస్తాను.
నిన్ను పొలాల్లో విసరివేస్తాను.
నిన్ను తినటానికి పక్షులన్నిటినీ రప్పిస్తాను.
కడుపునిండా నిన్ను తినటానికి అన్నిచోట్ల నుండి అడవి జంతువులను రప్పిస్తాను.
5 నీ కళేబరాన్ని పర్వతాల మీద చిందర వందరగా వేస్తాను.
నీ కళేబరంతో లోయలు నింపుతాను.
6 నీ రక్తాన్ని పర్వతాలపై నేను ఒలక బోస్తాను.
అది భూమిలో ఇంకిపోతుంది.
నదులన్నీ నీతో నిండి ఉంటాయి.
7 నిన్ను మాయం చేస్తాను.
నేను ఆకాశాన్ని కప్పివేసి నక్షత్రాలు కన్పించకుండా చేస్తాను.
ఒక మేఘంతో నేను సూర్యుణ్ణి కప్పివేయగా చంద్రుడు ప్రకాశించడు.
8 ఆకాశంలో మెరిసే జ్యోతులన్నీ నీపై వెలుగును ప్రసరించకుండా చేస్తాను.
నీ దేశమంతటా నేను చీకటిమయం చేస్తాను.
9 “నిన్ను నాశనం చేయటానికి నీ మీదికి నేను శత్రువును తీసుకొని వచ్చినట్లు తెలుసుకొని అనేక మంది ప్రజలు దుఃఖముఖులై, తలక్రిందులౌతారు. నీ వెరుగని దేశాలు కూడా కలవరపాటు చెందుతాయి. 10 నీ విషయంలో చాలా మంది ఆశ్చర్యపోయేలా చేస్తాను. నేను నా కత్తిని వారి ముందు ఝుళిపించడానికి మునుపే వారి రాజులు నీ విషయంలో విపరీతంగా భయపడతారు. నీవు పతనమైన రోజున ప్రతిక్షణం రాజులు భయంతో కంపించి పోతారు. ప్రతీ రాజూ తనభద్రత కొరకు భయపడతాడు.”
యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం
(మత్తయి 17:14-18; మార్కు 9:14-27)
37 మరుసటి రోజు వాళ్ళు కొండ దిగగానే పెద్ద ప్రజల గుంపు ఒకటి యేసును చూడటానికి అక్కడ సమావేశమైంది. 38 ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! వచ్చి నా కుమారుణ్ణి కటాక్షించుమని వేడు కుంటున్నాను. నాకు ఒక్కడే కుమారుడు. 39 ఒక దయ్యం అతణ్ణి ఆవరిస్తుంది. అది మీదికి రాగానే అతడు బిగ్గరగా కేకలు వేస్తాడు. అది ఆతణ్ణి క్రింద పడవేస్తుంది. అతడు వణుకుతూ నోటినుండి నురుగులు కక్కుతాడు. అది అతణ్ణి వదలటం లేదు. అతణ్ణి పూర్తిగా నాశనం చేస్తొంది. 40 ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల్ని వేడుకున్నాను. కాని వాళ్ళు ఆ పని చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.
41 యేసు, “మూర్ఖతరం వారలారా! విశ్వాస హీనులారా! మీతో ఉండి ఎన్ని రోజులు సహించాలి? నీ కుమారుణ్ణి పిలుచుకురా!” అని అన్నాడు.
42 ఆ దయ్యం పట్టినవాడు వస్తూవుంటే అది అతణ్ణి నేల మీద పడవేసింది. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళిపొమ్మని గద్దించి ఆ బాలునికి నయం చేశాడు. తదుపరి అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు. 43 దేవుని మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
(మత్తయి 17:22-23; మార్కు 9:30-32)
యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు:
© 1997 Bible League International