Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
యూదా రాజుగా హిజ్కియా
29 హిజ్కియా రాజయ్యేనాటికి ఇరువై యైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా. అబీయా జెకర్యా కుమార్తె. 2 ప్రభువైన యెహోవా ఆశించిన మంచి కార్యాలన్నీ హిజ్కియా చేశాడు. తన పూర్వీకుడైన దావీదులా అతడు ప్రతి మంచి పనినీ చేశాడు.
3 హిజ్కియా ఆలయానికి తలుపులు పెట్టించి, ద్వారాలను పటిష్ఠంచేశాడు. హిజ్కియా ఆలయాన్ని మరల తెరిచాడు. అతడు రాజైన మొదటి సంవత్సరం మొదటి నెలలో ఈ పని చేశాడు. 4-5 యాజకులను, లేవీయులను హిజ్కియా సమావేశపర్చాడు. ఆలయానికి తూర్పు భాగానగల ఖాళీ ప్రదేశంలో అతడు వారిని కలిశాడు. వారితో హిజ్కియా యిలా అన్నాడు: “లేవీయులారా, ఇది వినండి! మీరంతా పవిత్ర సేవా కార్యక్రమానికి సిద్ధంకండి. యెహోవా యొక్క ఆలయాన్ని పవిత్రం చేసే కార్యక్రమానికి అంతా సిద్ధం చేయండి. యెహోవా మీ పితరులు అనుసరించిన దేవుడు. ఆలయానికి చెందని వస్తువులన్నీ అక్కడ నుంచి తీసిపారవేయండి. ఆ వస్తువులు ఆలయాన్ని పవిత్రం చేయజాలవు. 6 మన పూర్వీకులు యెహోవాను వదిలి పెట్టారు. యెహోవా యొక్క ఆలయాన్ని చూడకుండా వారి ముఖాలు తిప్పుకున్నారు. 7 వారు మండప ద్వారాలు మూసివేసి, ఆలయ దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవుని ఆలయపు పవిత్ర స్థానంలో ధూపం వేయటం, దహనబలులు అర్పించటం మానివేశారు. 8 కావున యెహోవా యూదా, యెరూషలేము ప్రజలపట్ల మిక్కిలి కోపంగా వున్నాడు. యెహోవా వారిని శిక్షించాడు. అన్యదేశాలవారు యెహోవా పేరు విని భయపడ్డారు. యూదా, యెరూషలేము ప్రజలను యెహోవా శిక్షించిన తీరు చూసి వారు మిక్కిలి విస్మయం చెందారు. అన్యులు యూదా ప్రజలను చూసి అస్యహించుకుని, సిగ్గుతో తలలు ఆడించారు. ఇవన్నీ నిజమైన విషయాలని మీకు తెలుసు. స్వయంగా మీ కళ్లతో మీరే చూడవచ్చు. 9 అందువల్లనే మీ పూర్వీకులు యుద్ధంలో చంపబడ్డారు. మన కుమారులు, కుమార్తెలు, భార్యలు బందీలుగా చేయబడ్డారు. 10 కావున హిజ్కియానైన నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకోదలిచాను. అప్పుడాయన మనపట్ల ఎంతమాత్రం కోపగించడు. 11 కావున మీరు సోమరితనం మానండి. ఏమాత్రం కాలయాపన చేయవద్దు. యెహోవాకు సేవ చేయటానికి యెహోవాయే మిమ్ముల్ని ఎన్నుకున్నాడు. మీరాయనను సేవించి, ఆయనకు దూపం వేయాలి.”
12-14 ఆలయాన్ని శుద్ధి చేయటానికి ఉద్యమించిన లేవీయులు ఎవరనగా:
కహాతీయుల వంశం నుండి అమాశై కుమారుడైన మహతు, మరియు అజర్యా కుమారుడైన యోవేలు.
మెరారీ వంశం నుండి అబ్దీ కుమారుడైన కీషు, మరియు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా.
గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యెవాహు; యెవాహు కుమారుడైన ఏదేను.
ఎలీషాపాను సంతతిలో షిమ్రీ, యెహియేలు,
ఆసాపు సంతతిలో జెకర్యా, మత్తన్యా.
హేమాను సంతతిలో యెహీయేలు, షిమీ
యెదూతూను సంతతిలో షెమయా, ఉజ్జీయేలు.
15 ఈ లేవీయులు తమ సోదరులనందరినీ పిలిపించి ఆలయాన్ని పవిత్రపర్చడానికి సంసిద్ధులయ్యారు. యెహోవా సంకల్పంతో వచ్చిన రాజాజ్ఞను వారు శిరసావహించారు. వారు ఆలయాన్ని శుద్ధి చేయటానికి లోనికి వెళ్లారు. 16 యాజకులు ఆలయాన్ని పవిత్ర పర్చటానికి అతి పవిత్రస్థలంలోనికి వెళ్లారు. ఆలయంలో వారు చూసిన అపవిత్రమైన వస్తువులన్నిటినీ తీసివేశారు. నిషేధించబడిన వస్తువులన్నిటినీ ఆలయపు ఆవరణలోనికి తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి ఆ నిషిద్ధ వస్తువులన్నిటినీ లేవీయులు కిద్రోను లోయకు తీసికొని వెళ్లి పారవేశారు. 17 మొదటి నెల మొదటి రోజున లేవీయులు పరిశుద్ధ కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. నెలలో ఎనిమిదవ రోజున లేవీయులు ఆలయ ఆవరణలోకి వచ్చారు. అప్పటి నుంచి మరో ఎనిమిది రోజులపాటు పవిత్రారాధనకు పనికి వచ్చేలా ఆలయాన్ని శద్ధిచేశారు. మొదటి నెలలో పదహారవ రోజున పని ముగించారు.
18 పిమ్మట వారు రాజైన హిజ్కియా వద్దకు వెళ్లారు. వారు ఆయనతో, “హిజ్కియా రాజా, మేము పూర్తి ఆలయాన్ని, దహనబలుల బలిపీఠాలను ఆలయంలో ఇతర పరికరాలను శుభ్రపర్చాము. నైవేద్యపు రొట్టెను వుంచే బల్లను, ఆ బల్ల మీద ఉపయోగించే పరికరాలను శుద్ధి చేశాము. 19 రాజైన అహాజు విశ్వాసంలేనివాడై, తాను రాజుగా వున్నప్పుడు కొన్ని వస్తువులను పారవేశాడు. కాని మేము ఆ వస్తువులన్నిటినీ సేకరించి తిరిగి అక్కడ వుంచి పవిత్ర సేవకార్యక్రమానికి సిద్ధం చేసాము. అవన్నీ ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు వున్నాయి” అని చెప్పారు.
ధర్మశాస్త్రమా? లేక విశ్వాసమా?
3 గలతీయ ప్రజలారా! మీరు అవివేకులు. మిమ్ములను ఎవరు మోసగించారు? యేసు క్రీస్తు సిలువకు వేయబడినదానిలో ఉన్న అర్థం మీ కళ్ళ ముందు స్పష్టంగా చిత్రించాము. 2 మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ధర్మశాస్త్రం అనుసరించటం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందారా? లేక సువార్తను విశ్వసించటం వల్ల పొందారా? 3 మీరింత అవివేకులా? పరిశుద్ధాత్మతో ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నం ద్వారా నీతిమంతులు కావాలని చూస్తున్నారా? 4 మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను. 5 దేవుడు పరిశుద్ధాత్మను పంపి మీ కోసం మహత్కార్యాలు చేస్తున్నది మీరు ధర్మశాస్త్రం అనుసరించినందుకా? లేక సువార్తను విశ్వసించినందుకా?
6 అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”(A) 7 కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి. 8 యూదులు కానివాళ్ళను దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు వ్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహాముతో, “అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులౌతారు!”(B) అని ముందే చెప్పాడు. 9 కనుక అబ్రాహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదే విధంగా అతని వలె విశ్వసించిన వాళ్ళు కూడా ధన్యులౌతారు.
© 1997 Bible League International