Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 11:26-12:10

దావీదు బత్షెబను వివాహమాడటం

26 తన భర్త ఊరియా చనిపోయినట్లు బత్షెబ విన్నది. తన భర్తకై విలపించింది. 27 సంతాప దినాలు గడిచాక, దావీదు తన మనుష్యులను పంపి ఆమెను తన ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. తరువాత ఆమె దావీదుకు భార్య అయింది. దావీదు వల్ల ఆమెకు కుమారుడు జన్మించాడు. దావీదు చేసిన ఈ చెడ్డ పనిని యోహోవ ఆమోదించలేదు.

నాతాను దావీదుతో మాట్లాడటం

12 యెహోవా నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదు వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు ధనవంతుడు. రెండవవాడు దరిద్రుడు. ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి. కాని పేదవానివద్ధ తాను కొనుక్కున్న ఒక ఆడ గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు. ఆ గొర్రెపిల్లను పేదవాడు సాకాడు. ఆ పేదవానితో పాటు, అతని పిల్లలతో పాటు ఆ గొర్రెపిల్ల కూడ పెరిగింది. ఆ గొర్రెపిల్ల పేదవాని కంచంలో తిని, వాని గిన్నెలో నీళ్లు తాగింది. ఆ పేదవాని రొమ్ము మీద గొర్రెపిల్ల పడుకొని నిద్రపోయేది. పేదవానికి ఆ గొర్రెపిల్ల ఒక కూతురిలా వుండేది.

“ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని ఆ యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రికునికి ఆహారంగా వండించాడు.”

ఇది వింటున్న దావీదుకు ధనికునిపై విపరీతంగా కోపం వచ్చింది. “యెహోవా జీవము తోడుగా ఈ పని చేసిన ఆ వ్యక్తి నిశ్ఛయంగా చావవలసిందే! ఆ గొర్రె పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్లించాలి. ఎందుకంటే వాడు ఈ భయంకరమైన పని చేశాడు. పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో అన్నాడు.

నాతాను దావీదుతో అతని పాపాన్ని తెలియజెప్పటం

“ఆ వ్యక్తివి నీవే అన్నాడు నాతాను దావీదుతో. ఇశ్రాయేలు దేవుడైన యోహోవా నీ విషయంలో ఇలా అంటున్నాడని నాతాను దావీదుతో చెప్పాడు: నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషిక్తం చేశాను. సౌలునుండి నిన్ను కాపాడాను. అతని కుటుంబాన్ని, భార్యలను నీవు తీసుకొనేలా చేశాను. పైగా ఇశ్రాయేలు పైన, యూదా పైన రాజుగా నియమించాను. ఇవన్నీ చాలవన్నట్లు, నీకు ఇంకా చాలా ఇచ్చాను కావున ఎందువల్ల యెహోవా ఆజ్ఞను తిరస్కరించావు? దేవుడు చెడ్డదని చెప్పిన దానిని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను నీవు కత్తితో చంపించావు. అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు. అవును; నీవు ఊరియాను అమ్మోనీయుల కత్తితో చంపావు! 10 కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించుకున్నావు.”

2 సమూయేలు 12:13-15

13 నాతానుతో, “యెహోవా పట్ల నేను పాపం చేశాను” అని దావీదు చెప్పాడు.

అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంపబడవు. 14 కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు నీ యెహోవాని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.”

దావీదు బత్షెబల శిశువు మరణించటం

15 పిమ్మట నాతాను ఇంటికి వెళ్లిపోయాడు. ఊరియాభార్య ద్వారా దావీదుకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బు పడేలా యెహోవా చేశాడు.

కీర్తనలు. 32

దావీదు దైవధ్యాన కీర్తన.

32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
    తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
    తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.

దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
    కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
    నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
    తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.

అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
    కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
    నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
    మరియు నీవు నా పాపాలను క్షమించావు.
దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
    కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
    నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
    నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
    నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
    నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
    ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”

10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
    కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.

గలతీయులకు 2:15-21

15 పుట్టుకతో మనము యూదులము. యూదులు కానివాళ్ళలా పాపం చేసేవాళ్ళము కాదు. 16 ధర్మశాస్త్రాన్ని ఆచరించటం వల్ల నీతిమంతుడు కాడని, యేసుక్రీస్తును విశ్వసించటం వల్ల మాత్రమే ఒకడు నీతిమంతుడౌతాడని మనకు తెలుసు. ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరూ నీతిమంతులుగా కాలేరు. కనుక మనం కూడా ధర్మశాస్త్రం వల్ల కాకుండా యేసుక్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం వల్ల నీతిమంతులం కావాలనే ఉద్దేశ్యంతో ఆయన్ని విశ్వసించాము.

17 మనము క్రీస్తు వల్ల నీతిమంతులం కావాలని ఆయన్ని విశ్వసించామంటే దాని అర్థం మనం పాపులమనే కాదా! అంటే క్రీస్తు పాపానికి తోడ్పడుతున్నాడా? ఎన్నటికీ కాదు. 18 నేను వదిలివేసిన ధర్మశాస్త్రాన్ని నేనే మళ్ళీ బోధిస్తే నేను ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినవాణ్ణవుతాను. 19 నేను దేవుని కోసం జీవించాలని ధర్మశాస్త్రం పట్ల మరణించాను. ధర్మశాస్త్రమే నన్ను చంపింది. 20 నేను క్రీస్తుతో సహా సిలువ వేయబడ్డాను. కాబట్టి నేను జీవించటం లేదు. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఈ దేహంలో నన్ను ప్రేమించి నా కోసం మరణించిన దేవుని కుమారుని పట్ల నాకున్న విశ్వాసంవల్ల నేను జీవిస్తున్నాను. 21 దేవుని దయను నేను కాదనలేను. ధర్మశాస్త్రంవల్ల ఒకడు నీతిమంతుడు కాగలిగితే మరి క్రీస్తు ఎందుకు మరణించినట్లు?

లూకా 7:36-8:3

పాపపు స్త్రీ యేసు పాదాలకు అత్తరు పూయటం

36 ఒకసారి ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి భోజనానికి పిలిచాడు. యేసు అతని యింటికి వెళ్ళాడు. ఆయన భోజనానికి కూర్చొని ఉండగా, 37 ఆ పట్టణంలో పాపాలు చేస్తూ జీవిస్తున్న ఒక స్త్రీ యేసు పరిసయ్యుని యింట్లో భోజనం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. వెళ్ళేముందు చలువరాతి బుడ్డిలో ఖరీదైన అత్తరు తన వెంట తీసుకువెళ్ళింది. 38 వెనుకనుండి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నిలుచొంది. ఆయన పాదాలను తన కన్నీటితో తడిపి, తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంది. వాటిపై అత్తరు పోసింది.

39 ఆయన్ని ఆహ్వానించిన పరిసయ్యుడు ఇది చూసి, “ఆయన ప్రవక్త అయినట్లైతే తనను ఎవరు తాకారో, ఆమె ఎలాంటి స్త్రీయో, అంటే ఆమె పాపం చేస్తూ జీవించే స్త్రీయని తెలుసుకుంటాడు” అని తన మనస్సులో అనుకున్నాడు.

40 యేసు అతనితో, “సీమోనూ, నీకో విషయం చెప్పాలి!” అని అన్నాడు.

“చెప్పండి, బోధకుడా!” అని సీమోను అన్నాడు.

41 యేసు, “ఇద్దరు వ్యక్తులు ఒక షావుకారికి అప్పుండినారు. వాళ్ళలో ఒకడు అయిదు వందల దేనారాలు, యింకొకడు యాభై దేనారాలు అప్పు తీసుకొని ఉన్నారు. 42 ఇద్దరిలో ఎవ్వరి దగ్గర కూడా అప్పుతీర్చటానికి డబ్బులేదు. అందువల్ల ఆ షావుకారు వాళ్ళిద్దరి అప్పు రద్దు చేశాడు. ఆ యిద్దరిలో ఎవరు ఆ షావుకారి పట్ల ఎక్కువ ప్రేమ కనుబరుస్తారు?” అని అడిగాడు.

43 “ఎక్కువ ధనం అప్పున్నవాడని నేననుకొంటాను” అని సీమోను సమాధానం చెప్పాడు.

యేసు, “నీ తీర్పు సరియైనది” అని అన్నాడు. 44 ఆ తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ యింటికి వచ్చాను. కాళ్ళు కడుక్కోవటానికి నీవు నీళ్ళు కూడా ఇవ్వలేదు. కాని ఈమె నా కాళ్ళు తన కన్నీటితో కడిగి తన వెంట్రుకలతో తుడిచింది. 45 నీవు నన్ను ప్రేమతో హృదయానికి హత్తుకోలేదు. కాని ఈమె యింట్లోకి వచ్చినప్పటినుండి నా కాళ్ళను భక్తితో ముద్దాడటం మానలేదు. 46 నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది. 47 అందువల్ల నేను చెప్పేదేమిటంటే ఆమె చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దీనికి ఆమె చూపిన అమితమైన ప్రేమే నిదర్శనం. కొన్ని పాపాలు మాత్రమే క్షమించబడిన వానికి కొంత ప్రేమ మాత్రమే ఉంటుంది” అని అన్నాడు.

48 ఆ తర్వాత యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.

49 అక్కడున్న మిగతా అతిథులు, “పాపాలు కూడా క్షమించటానికి యితడెవరు?” అని పరస్పరం మాట్లాడుకున్నారు.

50 యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. శాంతంగా వెళ్ళు!” అని అన్నాడు.

యేసుతో ఒక గుంపు

ఆ తర్వాత యేసు పట్టణాలు, పల్లెలు పర్యటించి దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రజలకు ప్రకటించాడు. పన్నెండుమంది అపొస్తలులు ఆయన వెంటే ఉన్నారు. దయ్యాలు విడిపించబడిన కొందరు స్త్రీలు, రోగాలు నయం చేయబడిన కొందరు స్త్రీలు కూడా ఆయన వెంట ఉన్నారు. వీళ్ళలో మగ్దలేనే అని పిలవబడే మరియ ఒకతె. ఈమె నుండి ఏడు దయ్యాలు విడిపించబడ్డాయి. హేరోదు రాజుకు కుడిభుజంగా ఉన్న కూజా భార్య యోహన్న, సూసన్న, మొదలగు చాలా మంది స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. వీళ్ళు తమ స్వంత డబ్బుతో యేసుకు, ఆయన అపొస్తలులకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International