Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 32

దావీదు దైవధ్యాన కీర్తన.

32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
    తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
    తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.

దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
    కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
    నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
    తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.

అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
    కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
    నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
    మరియు నీవు నా పాపాలను క్షమించావు.
దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
    కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
    నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
    నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
    నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
    నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
    ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”

10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
    కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.

2 సమూయేలు 15:1-12

అబ్షాలోము అనేకులను స్నేహితులుగా చేసుకోవటం

15 ఇదంతా ఆయిన పిమ్మట అబ్షాలోము తనకై ప్రత్యేకంగా ఒక రథాన్ని మరియు గుర్రములను సమకూర్చుకున్నాడు. తన రథం సాగుతూ వుండగా ముందు వెళ్లటానికి ఏబది మంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు. అబ్షాలోము ఉదయం పెందలకడలేచి నగర ద్వారం[a] వద్ద నిలబడేవాడు. అక్కడికి ఎవరైనా ఏదైనా సమస్యపై న్యాయం కోరుతూ దావీదు రాజు కొరకు వస్తే, అబ్షాలోము వారిని పిలిచేవాడు. వారిని “ఏ నగరం నుండి వచ్చినారని” అడిగేవాడు. “ఇశ్రాయేలు వంశాలలో ఒకడినని” ఆ వచ్చినవాడు చెప్పేవాడు. అందుకు అబ్షాలోము “చూడు, నీవు నిజమే చెబుతున్నావు. కాని దావీదు రాజు నీవు చెప్పేది వినడు” అని అనేవాడు.

అబ్షాలోము ఇంకా ఇలా అనేవాడు, “ఓహో, ఈ రాజ్యంలో నన్నెవరైనా న్యాయాధిపతిగా చేయాలని నేను ఆశిస్తున్నాను. న్యాయం కోరుతూ ఎవరు ఏ సమస్యతో వచ్చినా వారికి తగిన న్యాయం నేనప్పుడు చేయగలుగుతాను. వచ్చిన వాని సమస్యకు తగిన పరిష్కారం కనుగొని సహాయం చేయగలుగుతాను.”

ఎవరైనా అబ్షాలోము వద్దకు వచ్చి ప్రణమిల్లి నమస్కరించబోతే, అతను వాని కొరకు ముందుకు వెళ్లి, అతనిని ఆదరంగా తన వద్దకు తీసుకొనేవాడు. తరువాత ఆ వచ్చిన వానిని అతను స్నేహపూర్వకంగా ముద్దు పెట్టుకొనేవాడు. దావీదు రాజు వద్దకు న్యాయం కోసం ఇశ్రాయేలు నుండి ఎవరు వచ్చినా అబ్షాలోము అలా చేసేవాడు. ఈ రకంగా ఇశ్రాయేలు ప్రజలందరి హృదయాలనూ అబ్షాలోము గెలిచాడు.

దావీదు రాజ్యాన్ని కైవశం చేసుకోవటానికి అబ్షాలోము పథకం

నాలుగేండ్ల[b] తరువాత దావీదు రాజుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “హెబ్రోనులో నేను వుండగా యెహోవాకి నేను మొక్కుకున్నాను. దయచేసి ఆ మొక్కు చెల్లించటానికి నన్ను వెళ్లనీయండి. గతంలో నేను సిరియ దేశమందలి గెషూరులో వుండగా మొక్కాను. నన్ను యెహోవా మరల యెరూషలేముకు తీసుకొని వస్తే యెహోవాను ఆరాధించెదనని మొక్కుకున్నాను.”

“ప్రశాంతంగా వెళ్లిరా!” అని దావీదు రాజు అన్నాడు.

అబ్షాలోము హెబ్రోనుకు వెళ్లాడు. 10 కాని అబ్షాలోము వేగుల వారిని ఇశ్రాయేలు వంశాల వారందరి వద్దకు పంపాడు. వారు వెళ్లి ప్రజలలో, “మీరు బాకా నాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో రాజయ్యాడు.!” అని కేకలు పెట్టమన్నాడు.

11 అబ్షాలోము తనతో వెళ్లటానికి రెండువందల మందిని ఆహ్వానించాడు. యెరూషలేము నుండి వారంతా అతనితో వెళ్లారు. కాని అతడు ఏమి యుక్తి పన్నుతున్నాడో వారికి తెలియదు.

12 అహీతోపెలు దావీదు సలహాదారులలో ఒకడు. అహీతోపెలు గీలో పట్టణవాసి, అబ్షాలోము బలులు సమర్పించేటప్పుడు అతడు అహీతోపెలును గీలో పట్టణం నుంచి రమ్మని కబురు పంపాడు. అబ్షాలోము పన్నినయుక్తులన్నీ సక్రమంగా సాగుతున్నాయి. ప్రజలు అబ్షాలోమును అధిక సంఖ్యలో బలపర్చ నారంభించారు.

రోమీయులకు 11:1-10

దేవుని దయ

11 “మరి దేవుడు తన ప్రజల్ని నిరాకరించాడా?” అని నేను అడుగుతున్నాను. లేదు, నేను స్వయంగా ఇశ్రాయేలు వంశీయుణ్ణి. బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. అబ్రాహాము మా మూలపురుషుడు. తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాకరించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని వ్రాసారో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీయులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా విన్నవించుకొన్నాడు: “ప్రభూ! వాళ్ళు నీ ప్రవక్తల్ని చంపివేసారు. నీ బలిపీఠాన్ని నేలమట్టం చేసారు. మిగిలినవాణ్ణి నేనొక్కణ్ణే. నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు.”(A) అప్పుడు దేవుని స్వరం ఈ విధంగా అన్నది: “బయలు ముందు మోకరించని ఏడువేల మందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకొన్నాను.”(B)

అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపొయ్యారు. ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.[a]

7-8 అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు మనసారా కోరుకొన్నది లభించలేదు. కాని దేవుడు ఎన్నుకొన్నవాళ్ళకు అది లభించింది. ఇశ్రాయేలు దేశంలోని మిగతా ప్రజలు సువార్తను నిరాకరించారన్న విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“దేవుడు వాళ్ళకు మత్తుగల ఆత్మను.”(C)

“చూడలేని కళ్ళను,
    వినలేని చెవుల్ని ఇచ్చాడు.
ఈనాడు కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు.”(D)

ఈ సందర్భాన్ని గురించి దావీదు ఈ విధంగా అంటున్నాడు:

“వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు వేసుకొన్న బల్లలు బోనులవలె, వలలవలె మారుగాక!
    వాళ్ళు క్రిందపడి శిక్షను అనుభవించుదురు గాక!
10 వాళ్ళ కన్నులు చీకటితో నిండిపోయి, వాళ్ళ దృష్టి నశించుగాక!
    వాళ్ళ నడుములు కష్టాలతో వంగిపోయివాళ్ళు ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవుదురు గాక!”(E)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International