Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 64

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

64 దేవా, నా ప్రార్థన ఆలకించుము.
    నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.
    ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.
    వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీపరుని మీద వేస్తారు.
    అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడతాడు.
అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.
    వారు వారి ఉరులను పెడతారు. “వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని” వారనుకొంటారు.
మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.
    మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతో కష్టం.
కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయగలడు.
    అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.
    కాని దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు.
ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు.
    అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.
    వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు.
అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు.
    ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.
    వారు ఆయన్ని నమ్ముకోవాలి.
మంచి మనుష్యుల్లారా, మీరంతా యెహోవాను స్తుతించండి.

యోబు 19:1-22

యోబు జవాబు

19 అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు:

“ఎంతకాలం మీరు నన్ను బాధిస్తారు;
    మాటలతో నన్ను నలుగగొడతారు?
ఇప్పటికి మీరు నన్ను పదిసార్లు అవమానించారు.
    మీరు నా మీద దాడి చేసేటప్పడు ఎలాంటి సిగ్గూ ఉండదు మీకు.
ఒకవేళ నేను పాపం చేసినా,
    అది నా సమస్య అది మిమ్మల్ని బాధించదు.
మీరు కేవలం నా కంటే మంచివాళ్లలా చూపించుకోవాలని కోరుతున్నారు.
    నా కష్టాలకు కారణం నా తప్పు మాత్రమే అని మీరు అంటారు.
కానీ నాకు అపకారం చేసినవాడు దేవుడు.
    ఆయన నన్ను పట్టుకోవటానికి తన వలను నా చుట్టూరా వేశాడు.
‘నాకు అపకారం జరిగింది.’ అని నేను కేకలు వేస్తాను.
    నాకు జవాబు ఏమీ రాదు. సహాయం కోసం నేను గట్టిగా కేకలు వేసినా న్యాయం కోసమైనా నా మొర ఎవరూ వినరు.
నేను ముందుకు వెళ్లలేకుండా దేవుడు నా మార్గం మూసివేశాడు.
    నా త్రోవను ఆయన చీకట్లో దాచి పెట్టేశాడు.
నా ఐశ్వర్యాన్ని దేవుడు తీసివేసుకొన్నాడు.
    నా తలమీద కిరీటాన్ని ఆయన తీసివేసుకొన్నాడు.
10 నేను చచ్చేంతవరకు నన్ను ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కవరకు దేవుడు విరుగగొడతాడు.
    ఒక చెట్టుదాని వేళ్లతో సహా పెల్లగించబడ్డట్టు ఆయన నా ఆశ తీసివేస్తాడు
11 దేవుని కోపం నాకు వ్యతిరేకంగా మండుతుంది.
    ఆయన నన్ను తన శత్రువు అని పిలుస్తున్నాడు.
12 నా మీద దాడి చేసేందుకు దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు.
    వారు నా చుట్టూరా దుర్గాలు నిర్మిస్తారు.
    నా గుడారం చుట్టూరా వారు బసచేస్తారు.

13 “నా సోదరులు నన్ను ద్వేషించేటట్టు దేవుడు చేశాడు.
    నా స్నేహితులందరికీ నేను పరాయివాడను.
14 నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు.
    నా స్నేహితులు నన్ను మరచిపోయారు.
15 నా ఇంట్లో అతిధులు, పనికత్తెలు
    నేనేదో పరాయివాడిలా, విదేశీయునిలా నన్ను చూస్తారు.
16 నేను నా సేవకుని పిలిస్తే వాడు జవాబివ్వడు.
    సహాయం కోసం నేను బతిమలాడినా నా సేవకుడు జవాబు ఇవ్వడు.
17 నా శ్వాస వాసన అంటే నా బార్యకు అసహ్యం.
    నా స్వంత సోదరులు నన్ను ద్వేషిస్తారు.
18 చిన్న పిల్లలు కూడా నన్ను గేళి చేస్తారు.
    నేను వాళ్ల దగ్గరకు వస్తే వాళ్లు నాకు విరోధంగా చెడు సంగతులు మాట్లాడుతారు.
19 నాకు సన్నిహితమైన స్నేహితులు అందరూ నన్ను అనహ్యించుకొంటారు.
    చివరికి నేను ప్రేమించే మనుష్యులు కూడా నాకు విరోధులయ్యారు.

20 “నేను ఎంత సన్నగా ఉన్నానంటే నా ఎముకల మీద నా చర్మం వ్రేలాడుతూ ఉంది.
    నాలో నాకు కొద్దిపాటి ప్రాణం మాత్రమే మిగిలి ఉంది.

21 “నాపై దయ చూపండి, నా స్నేహితులారా, నాపై దయ చూపండి.
    దేవుని హస్తం నాకు విరోధంగావుంది.
22 దేవుడు చేసినట్టు, మీరు ఎందుకు నన్ను హింసిస్తారు?
    నన్ను బాధించి మీరెందుకు ఎన్నడూ తృప్తి చెందటం లేదు?

ఎఫెసీయులకు 2:11-22

మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము

11 మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 12 అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 13 కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు.

14 మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. 15 ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. 16 ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. 17 క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. 18 ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.

19 అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. 20 మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. 21 ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. 22 ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International