Revised Common Lectionary (Complementary)
19 యెహోవా, నన్ను విడువకుము!
నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము.
22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
యెహోవా వారిని ద్వేషించడు.
ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.
25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
చెడ్డవాళ్లు వారి జీవితాలు మార్చుకోవాలి
59 చూడు, నిన్ను రక్షించుటకు యెహోవా శక్తి చాలు. సహాయంకోసం నీవు ఆయనను అడిగినప్పుడు ఆయన వినగలడు. 2 కానీ నీ పాపాలు నిన్ను నీ దేవుని నుండి వేరుచేశాయి. యెహోవా నీ పాపాలు చూసి, నీ నుండి తిరిగిపోతాడు. 3 నీ చేతులు మైలగా ఉన్నాయి, అవి రక్తంతోనిండి ఉన్నాయి. నీ వేళ్లు దోషంతో నిండి ఉన్నాయి. నీవు నీ నోటితో అబద్ధాలు చెబుతున్నావు. నీ నాలుక చెడు విషయాలు పలుకుతుంది. 4 ఎవ్వరూ ఇతరులను గూర్చి సత్యం చెప్పరు. ప్రజలు ఒకరి మీద ఒకరు న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు, వారి వ్యవహారం గెలుచుకొనేందుకు వారు తప్పుడు వాదాలమీద ఆధారపడతారు. వారు ఒకరిని గూర్చి ఒకరు అబద్ధాలు చెబుతారు. వారు చిక్కులతో నిండిపొయి, కీడును పుట్టిస్తారు. 5 విషసర్పాల గ్రుడ్లవలె, వారు కీడును పొదుగుతారు. ఆ గ్రుడ్లు ఒకటి తింటే నీవు చస్తావు. ఆ గ్రుడ్లలో ఒకదాన్ని నీవు పగులగొడితే, ఒక విషసర్పం బయటకు వస్తుంది. ప్రజలు అబద్ధాలు చెబుతారు.
ఈ అబద్ధాలు సాలెగూళ్లలా ఉంటాయి. 6 వారు అల్లే ఈ గూళ్లు బట్టలకు ఉపయోగపడవు. ఆ గూళ్లతో నిన్ను నీవు కప్పుకోలేవు.
కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేస్తారు, ఇతరులను బాధించుటకు వారి చేతులు ప్రయోగిస్తారు. 7 కీడుకు పరుగులెత్తుటకు ఆ ప్రజలు వారి పాదాలను ఉపయోగిస్తారు. ఏ తప్పూ చేయని వారిని చంపటానికి వారు త్వరపడతారు. వారు చెడు తలంపులు తలుస్తారు. దౌర్జన్యం, దొంగతనం వారి జీవిత విధానం. 8 ఆ ప్రజలకు శాంతి మార్గం తెలియదు. వారి జీవితాల్లో మంచితనం ఏమీలేదు. వారి మార్గాలు నిజాయితీగా లేవు. వారు జీవించినట్టుగా జీవించేవారెవరి జీవితాల్లోనూ ఎన్నటికి శాంతి ఉండదు.
ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపు కలిగించటం
27 యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా యిద్దరు గ్రుడ్డివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు.
28 యేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
29 అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, “మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని అన్నాడు. 30 వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి!” అని వాళ్ళను హెచ్చరించాడు. 31 కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేసారు.
32 వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాడి నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్ఘాంతపోయి, “ఇలాంటిదేదీ ఇదివరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే?” అని అన్నారు.
34 కాని పరిసయ్యులు, “అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.
© 1997 Bible League International