Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నెహెమ్యా 11-13

యెరూషలేములోనికి క్రొత్త ప్రజలు

11 ఇశ్రాయేలు ప్రజల నాయకులు అప్పుడు యెరూషలేము నగరంలోకి నివాసం మార్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు నగరంలోకి ఇంకెవరు రావాలో నిర్ణయించవలసి వచ్చింది. అందుకని వాళ్లు చీట్లు వేశారు. ఇశ్రాయేలీయులు పదిమందిలో ఒకరు పవిత్ర నగరమైన యెరూషలేములో నివసించాలన్నది నిర్ణయం. మిగిలిన తొమ్మండుగురూ తమతమ పట్టణాల్లో నివసించవచ్చు. కొందరు యెరూషలేములో నివసించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్లు అలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు మిగిలిన వాళ్లు వాళ్లకి కృతజ్ఞత తెలిపారు.

యెరూషలేములో నివసించిన నాయకులెవరనగా: (కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలోమోను సేవకుల వంశీయులు యూదా పట్టణాల్లో నివసించారు. ఆయా పట్టణాల వాళ్లలో ప్రతి ఒక్కడూ తన స్వంత భూమిమీద ఉన్నారు. యూదా, బెన్యామీను వంశాలకు చెందిన ఇతరులు యెరూషలేము నగరంలో నివసించారు.)

ఈ క్రింది యూదా వంశీయులు యెరూషలేముకి తరలి వెళ్లారు:

ఉజ్జీయా కొడుకు అతాయా (ఉజ్జీయా జెకర్యా కొడుకు. జెకర్యా అమర్యా కొడుకు. అమర్యా షెపట్యా కొడుకు. షెపట్యా మహలేలు కొడుకు. మహలేలు పెరెసు వంశీయుడు), బారూకు కొడుకు మయశేయా (బారూకు కొల్హోజె కొడుకు, కొల్హోజె హజాయా కొడుకు. హజాయా అదాయా కొడుకు. అదాయా యోయారీబు కొడుకు. యోయారీబు జెకర్యా కొడుకు. జెకర్యా షెలా వంశీయుడు). యెరూషలేములో కాపురమున్న పెరెసు వంశీయులు నాలుగు వందల అరవై మంది. వారందరూ ధైర్యశాలులు.

యెరూషలేముకి కాపురం మార్చిన బెన్యామీను వంశీయులు:

మెషుల్లాము కొడుకు సల్లు (మెషుల్లాము యోవేదు కొడుకు. యోవేదు పెదాయా కొడుకు. పెదాయా కోలాయా కొడుకు. కోలాయా మయశేయా కొడుకు. మయశేయా ఈతీయేలు కొడుకు. ఈతీయేలు యెషయా కొడుకు). జెసయ్యను అనుసరించినవారు: గబ్బయి, సల్లయి, వాళ్లు మొత్తం తోమ్మిది వందల ఇరవై ఎనిమిదిమంది. జిఖ్రీ కొడుకు యోవేలు వారికి పర్యవేక్షకుడు. హోసెనూయా కొడుకు యూదా యెరూషలేము నగరవు రెండవ ప్రాంతపు వర్యవేక్షకుడు.

10 యెరూషలేముకి తరలి వెళ్లిన యాజకులు:

యోయారీబు కొడుకు యెదాయా, యాకీను, 11 హిల్కీయా కొడుకు శెరాయా (హిల్కీయా మెషూల్లము కొడుకు, మెషూల్లము సాదోకు కొడుకు. సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు అహీటూబు కొడుకు. అహీటూబు ఆలయంలో పర్యవేక్షకుడు), 12 వీరి సోదరులు ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఆలయ సేవకులు, యెరోహాము కొడుకు అదాయా (యెరోహాము పెలల్యా కొడుకు, పెలల్యా అమ్జీ కొడుకు, అమ్జీ జెకర్యా కొడుకు, జెకర్యా పషూరు కొడుకు, పషూరు మల్కియా కొడుకు), 13 మల్కియా సోదరులు రెండువందల నలభై రెండు మంది (వీళ్లు తమతమ కుటుంబాల పెద్దలు) అజరేలు కొడుకు అమష్షయి (అజరేలు అహాజయి కొడుకు, అహాజయిమెషిల్లేమోతు కొడుకు, మెషిల్లేమెతు ఇమ్మేరు కొడుకు), 14 ఇమ్మేరు సోదరులు నూట ఇరవై ఎనిమిది మంది (వీళ్లు సాహసికులైన సైనికులు) వీరిపై అధికారి హగెదోలీము కొడుకు జబ్దీయేలు.

15 లేవీయుల్లో ఈ కింది వారు యెరూషలేముకు చేరుకున్నారు:

షష్షూబు కొడుకు షెమాయా, (హష్షూబు అజ్రీకాము కొడుకు, అజ్రీకాము హషబియా కొడుకు, హషబియా బున్నీ కొడుకు), 16 షబ్బెతయి, యోజాబాదు (వీళ్లిద్దరూ లేవీయుల నాయకులు. వీళ్లు ఆలయం బయటి పనుల పర్యవేక్షకులు), 17 మత్తన్యా (మత్తన్యా మీకా కొడుకు, మీకా జబ్ది కొడుకు, జబ్ది ఆసాఫు కొడుకు. ఆసాఫు దైవ స్తోత్రాలు, ప్రార్థన గేయాలు పాడటంలో గాయకులకి నాయకత్వం వహించేవాడు), బక్బుక్యా (తన సోదరులపై అజమాయిషీలో బక్బుక్యాది రెండవ స్థానం), షమ్మూయ కొడుకు అబ్దా, (షమ్మూయ గాలాలు కొడుకు, గాలాలు యెదూతూను కొడుకు.) 18 ఈ విధంగా, పవిత్ర నగరం యెరూషలేముకి తరలి వచ్చిన లేవీయులు రెండు వందల ఎనభై నాలుగు మంది వున్నారు.

19 యెరూషలేముకి తరలి వచ్చిన ద్వార పాలకులు:

అక్కూబు, టల్మోను, వాళ్ల సోదరుల్లో నూటడెభ్భై రెండు మంది. వాళ్లు నగర ద్వారాలను శ్రద్ధగా కాపలా కాశారు.

20 ఇశ్రాయేలీయుల్లో ఇతరులు, ఇతర యాజకులు, లేవీయులు యూదాలోని అన్ని పట్టణాల్లోనూ నివసించారు. వాళ్లలో ప్రతి ఒక్కడూ తన పూర్వీకుల స్వంత భూమిలోనే నివసించారు. 21 ఆలయ సేవకులు ఓఫెలు కొండ మీద ఉన్నారు. ఆలయ సేవకుల నాయకులు జీహా, గిష్పా.

22 యెరూషలేములోని లేవీయుల నాయకుడు ఉజ్జీ. ఉజ్జీ బానీ కొడుకు (బానీ హషబియా కొడుకు, హషబియా మత్తనయా కొడుకు, మత్తనయా మీకా కొడుకు), ఉజ్జీ ఆసాపు వంశీయుడు. ఆసాపు వంశీయులు గాయకులు, ఆలయంలో జరిగే సేవకు వాళ్లు బాధ్యులు. 23 గాయకులు రాజు ఆజ్ఞలకు బద్ధులు. రాజు ఆజ్ఞలు ఏరోజుకారోజు గాయకులు చేయవలసిన పనులను పేర్కొన్నాయి. 24 రాజు నిర్దేశించిన పనులు యేమిటో జనులకు చెప్పినవాడు పెతహయా (పెతహయా మెషెబెయేలు కొడుకు. మెషెబెయేలు జెరహు వంశీయుడు. జెరహు యూదా కొడుకు).

25 యూదా ప్రజలు ఈ క్రింది పట్టణాల్లో నివసించారు: కిర్యతర్బా, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు, దీబోను, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు; యెకబ్సెయేలు దీని చుట్టూవున్న చిన్న పట్టణాలు, 26 యేషూవ, మెలాదా, బేత్పెలెతు, 27 హజర్‌షువలు, బెయేర్షెబా, దాని చుట్టూ వున్న చిన్న పట్టణాలు, 28 సిక్లగు, మెకోనా, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు, 29 ఏన్రిమ్మోను, జోరయా, యర్మూతు, జానోహ, అదుల్లాము, 30 వాటి చుట్టూ వున్న చిన్న పట్టణాలు; లాకీషు, దాని చుట్టూవున్న పొలాలు; అజేకా, దాని చుట్టూవున్న చిన్న పట్టణాలు. ఈ విధంగా యూదా ప్రజలు బెయేర్షెబానుంచి హిన్నోము లోయ వరకూ నివాసం వున్నారు.

31 గెబకి చెందిన బెన్యామీను వంశస్థులు మిక్మషు, హాయి, బేతేలు, దాని చుట్టూవున్న చిన్నపట్టణాల్లో, 32 అనాతోతు, నోబు, అనన్యాలలో, 33 హాసోరు, రామా, గిత్తంలలో, 34 హదీదు, జెబోయిము, నెబల్లాటుల్లో, 35 లోదు, ఓనో, చేతి వృత్తుల వాళ్ల లోయలో నివాసం వున్నారు. 36 లేవీయుల కొన్ని బృందాలు బెన్యామీను ప్రాంతానికి మారారు.

యాజకులు, లేవీయులు

12 యూదా దేశానికి తిరిగి వచ్చిన యాజకులు, లేవీయులు వీళ్లు: వీళ్లు షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతో, యేషూవతో కలిసి తిరిగి వచ్చిన వాళ్లు. వాళ్ల పేర్ల జాబితా ఇది:

శెరాయా, యిర్మియా, ఎజ్రా,

అమర్యా, మల్లూకు, హట్టూషు,

షెకన్యా, రెహూము, మెరేమోతు,

ఇద్దో, గిన్నెతోను, అబీయా,

మియామీను, మయెద్యా, బిల్గా,

షెమయా, యెయారీబు, యెదాయా,

సల్లూ, ఆమోకు, హిల్కియా, యెదాయా,

యేషూవ కాలంలో వీళ్లు యాజకుల నాయకులు, బంధువులు.

లేవీయులు వీళ్లు: యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, మత్తన్యా. మత్తన్యా బంధువులతోబాటు వీళ్లు దేవుని భజనల విషయంలో బాధ్యులు. బక్బుక్యా, ఉన్నీలు ఆ లేవీయుల బంధువులు. వీళ్లిద్దరూ వాళ్లకి ఎదురుగా నిలిచి ఆరాధన సభలో పాల్గానేవారు. 10 యేషూవా యోయాకీము తండ్రి. యోయాకీము ఎలియాషీబు తండ్రి. ఎలియాషీబు యోయాదా తండ్రి. 11 యోయాదా యోనాతాను తండ్రి. యోనాతాను యెద్దూవ తండ్రి.

12 యోయాకీము కాలంలో యాజకుల కుటుంబాల నాయకులు వీళ్లే:

శెరాయా కుటుంబ నాయకుడు మెరాయా.

యిర్మీయా కుటుంబ నాయకుడు హనన్యా.

13 ఎజ్రా కుటుంబ నాయకుడు మెషుల్లాము.

అమర్యా కుటుంబ నాయకుడు యెహోహానాను.

14 మల్లూకు కుటుంబ నాయకుడు యోనాతాను.

షెకన్యా కుటుంబ నాయకుడు యోసేపు.

15 హారీము కుటుంబ నాయకుడు అద్నా.

మెరేమోతు కుటుంబ నాయకుడు హెల్కయి.

16 ఇద్దో కుటుంబ నాయకుడు జెకర్యా.

గిన్నేతోను కుటుంబ నాయకుడు మెషుల్లాము.

17 అబీయా కుటుంబ నాయకుడు జిఖ్రీ,

మిన్‌యామీను, మాదేయా కుటుంబాల నాయకుడు పిల్టయి.

18 బిల్గా కుటుంబ నాయకుడు షమ్మూయి.

షెమాయా కుటుంబ నాయకుడు యెహోనాతాను.

19 యోయారీబు కుటుంబ నాయకుడు మత్తెనయి.

యెదాయా కుటుంబ నాయకుడు ఉజ్జీ.

20 సల్లయి కుటుంబ నాయకుడు కల్లయి.

అమోకు కుటుంబ నాయకుడు ఏబెరు.

21 హిల్కియా కుటుంబ నాయకుడు హషబ్యా.

యెదాయా కుటుంబ నాయకుడు నెతనేలు.

22 పారసీక రాజు దర్యావేషు పాలనకాలంలో ఎల్యాషీబు, యోదాయా, యోహానాను, యద్దూవ కాలపు లేవీ కుటుంబాల పెద్దల, యాజకుల పేర్లు నమోదు చేయబడ్డాయి. 23 లేవీ కుటుంబ నాయకులు, ఎల్యాషిబు కొడుకైన యోహానాను పేర్లు చరిత్ర గ్రంథంలో లిఖించబడ్డాయి. 24 లేవీయుల నాయకులు వీళ్లు: షేరేబ్యా, కద్మీయేలు కొడుకు యేషూవా, వాళ్ల సోదరులు. వాళ్ల సోదరులు వీళ్లకి ఎదురుగా నిలబడి దైవ స్తోత్రాలు, భజన పాటలు పాడేవారు. ఒక బృందం మరో బృందానికి సమాధానంగా పాడుతుంది. దేవుని ప్రతినిధి అయిన దావీదు ఆదేశించిన రీతిలో ఈ స్తుతిపాటలు సాగుతాయి.

25 వెలుపలి ద్వారాల ప్రక్కన వున్న సామాన్ల గదులను కాసే ద్వారపాలకుల పేర్లు: మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, టల్మోను, అక్కూబు. 26 ఈ ద్వారపాలకులు యెయాకీము కాలంలో కొలువు చేశారు. యోయాకీము యేషూవా కొడుకు. యేషూవా యోయాదాకు కొడుకు. ఆ ద్వారపాలకులు నెహెమ్యా పాలనాధికారిగా వున్న కాలంలో, యాజకుడు, ఉపదేశకుడు అయిన ఎజ్రా కాలంలో కూడా కొలువుచేశారు.

యెరూషలేము ప్రాకార ప్రతిష్ట

27 ప్రజలు యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించారు. వాళ్లు లేవీయులందర్నీ యెరూషలేముకి తీసుకువచ్చారు. ఆ లేవీయులు తాము నివసించే ఆయా పట్టణాలనుంచి వచ్చారు. వాళ్లు యెరూషలేముకి ప్రాకారం ప్రతిష్ఠించటం కోసం వచ్చారు. లేవీయులు దైవ స్తోత్రాలు పాడేందుకూ, కీర్తనలు పాడేందుకూ వచ్చారు. వాళ్లు స్వరమండల సితారలు, తాళాలు వాయించారు. తంబురలు మోగించారు.

28-29 గాయకులందరూ కూడా యెరుషలేముకి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టూవున్న పట్టణాల నుంచి వచ్చారు. వాళ్లు నెటోపా పట్టణం నుంచి, బేత్‌గిల్గాలు, గెబ, అజ్‌మావెతుల నుంచి వచ్చారు. ఆ గాయకులు యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తమకోసం చిన్న చిన్న పట్టణాలు నిర్మించుకున్నారు.

30 యాజకులూ, లేవీయులూ తమని తాము పవిత్రం చేసుకున్నారు. తర్వాత వాళ్లు యెరూషలేము ప్రాకారాలన్నీ ఒక ఆచారములో పవిత్రీకరించారు.

31 అప్పుడు నేను (నెహెమ్యాను) యూదా నాయకులకి పైకెక్కి ప్రాకారం మీద నిలబడమని చెప్పాను. దైవ స్తుతి, కృతజ్ఞత గీతాలు పాడేందుకు రెండు పెద్ద గాయక బృందాలను కూడా ఎంపిక చేశాను. వాటిలో ఒక బృందం కుడివైపున పెంట గుమ్మం దిశగా పోయి ప్రాకారం పైకి ఎక్కాలి. 32 హోషెయా, యూదా నాయకుల్లో సగంమంది ఆ గాయకుల వెంట వెళ్లారు. 33 అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, 34 యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా, మొదలైనవారు కూడా వాళ్లతో వెళ్లారు. 35 యాజకుల్లో కొందరు కూడా బూరలు ఊదుతూ వాళ్లని ప్రాకారం దాకా అనుసరించారు, జెకర్యా కూడా వాళ్ల వెంట నడిచాడు (జెకర్యా యోనాతాను కొడుకు, యోనాతాను షెమయా కొడుకు, షెమయా మత్తనయా కొడుకు, మత్తనయా మీకాయా కొడుకు. మీకాయా జక్కూరు కొడుకు, జక్కూరు అసాఫు కొడుకు). 36 అంతేకాక ఆసాపు సోదరులు కూడా వున్నారు. వాళ్లు: షెమయా, అజరేలు, మిలయి, గిలలయి, మాయి, నెతనేలు, యూదా, హానానీ. వాళ్ల దగ్గర దైవ జనుడయిన దావీదు తయారు చేసిన సంగీత వాద్యాలు వున్నాయి. ఉపదేశకుడైన ఎజ్రా ప్రాకారానికి ప్రతిష్ఠ చేసే బృందానికి అగ్రభాగాన నడిచాడు. 37 వాళ్లు ఊట గుమ్మం దగ్గరికి వెళ్లారు. వాళ్లు మెట్లు ఎక్కి దావీదు నగరం[a] చేరుకున్నారు. వాళ్లు ప్రహరీగోడపైన నిలబడ్డారు. వాళ్లు దావీదు భవనం దాటి, ఊట గుమ్మం దిశగా గోడమీద నడిచి వెళ్లారు.

38 రెండవ గాయక బృందం రెండో దిశకి ఎడమ దిశకి బయల్దేరింది. వాళ్లు గోడపైకి వెళ్తున్నప్పుడు నేను వాళ్లని అనుసరించాను. జనంలో సగంమంది కూడా వాళ్లని అనుసరించారు. వాళ్లు అగ్ని గుండాల శిఖరాన్ని దాటి, వెడల్పు గోడను చేరుకున్నారు. 39 తర్వాత వాళ్లు ఈ క్రింది ద్వారాలు దాటారు: ఎఫ్రాయిము గుమ్మము, పురాతన గుమ్మము, మత్స్య గుమ్మము హనాన్యేలు శిఖరము, శతశిఖరము, గొర్రెల ద్వారం దాటి చివరకు కావలి ద్వారం దగ్గర ఆగారు. 40 అటు తర్వాత, ఆ గాయక బృందాలు రెండూ దేవుని ఆలయంలో తమ తమ స్థానాలకు చేరుకున్నాయి. నేను నా స్థానంలో నిలిచాను. అధికారుల్లో సగంమంది ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు. 41 తర్వాత ఈ క్రింది యాజకులు ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయ, ఎల్యోయెనై, జెకర్యా, హనన్యా బూరలు పట్టుకుని తమతమ స్థానాల్లో నిలిచారు. 42 తర్వాత, మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏజెరు అనే యాజకులు ఆలయంలో తమతమ స్థానాల్లో నిలబడ్డారు.

అప్పుడు రెండు గాయక బృందాలూ ఇజ్రహాయా నాయకత్వాన పాడనారంభించాయి. 43 ఈ విధంగా, ఆ ప్రత్యేక దినాన యాజకులు చాలా బలులు అర్పించారు. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా వున్నారు. దేవుడే వారందరినీ ఆనందపరవశుల్ని చేశాడు. చివరకు స్త్రీలు, పిల్లలు సైతం మహోత్సాహంతో, ఆనందంలో తేలియాడారు. దూర ప్రాంతాలవారు సైతం యెరూషలేము నుంచి వెలువడే ఆనంద కోలాహలాన్ని వినగలిగారు.

44 ఆ రోజున వస్తుపులను భద్రపరచు గదులలో భద్రపరచు కొందరిని నియమించారు. జనం తమ తొలికాపు ఫలాలను, పదోవంతు పంటలను తీసుకు వచ్చారు. వస్తువులను భద్రపరచువారు వాటిని వస్తువులను భద్రపరచు గదులలో పదిలపరిచారు. బాధ్యులుగా వున్న యాజకుల, లేవీయుల విషయంలో యూదా జనసామాన్యం చాలా తృప్తి చెందారు. అందుకని, వాళ్లు గిడ్డంగుల్లో పెట్టేందుకు చాలా వస్తువులు తెచ్చారు. 45 యాజకులూ, లేవీయులూ తమ దేవునిపట్ల భక్తిభావంతో ఈ పనులు చేశారు. వాళ్లు జనాన్ని పరిశుద్ధులను చేసే విధానాలు ఆచరించారు. గాయకులూ, ద్వారపాలకులూ తమ తమ విధులను నిర్వర్తించారు. దావీదూ, సొలొమోనూ ఆదేశించిన పనులన్నీ వాళ్లు చేశారు. 46 (ఎన్నడో పూర్వం, దావీదు కాలంలో, ఆసాపు ప్రధానుడుగా వున్నాడు. అతనికి చాలా స్తోత్రాలూ, దైవసంకీర్తనలూ తెలుసును.)

47 ఈ విధంగా, జెరుబ్బాబెలు, నెహెమ్యాల కాలంలో, ఇశ్రాయేలు ప్రజలందరూ గాయకుల, ద్వార పాలకుల సహాయార్థం ప్రతిరోజూ ఏదో ఒకటి ఇస్తూనే వుండేవారు. జనం కూడా తదితర లేవీయుల కోసం ఏదోఒకటి, ఎంతో కొంత కేటాయించేవారు. పోతే, లేవీయులు అహరోను వంశీకుల (యాజకుల) కోసం కొంత సొమ్ము కేటాయించేవారు.

నెహెమ్యా చివరి ఆదేశాలు

13 ఆ రోజున మోషే గ్రంథం ప్రజలందరకీ వినిపించేలా బిగ్గరగా పఠింపబడింది. అమ్మోనీయుల్లోగాని, మెయాబీయుల్లోగాని ఏ ఒక్కరూ దేవుని ప్రజల మధ్య ఎల్లప్పుడు ఉండుటకు అనుమతింపబడరన్న నిబంధన మోషే గ్రంథంలో వ్రాసి వుందన్న విషయం జనం గ్రహించారు. ఇశ్రాయేలీయులకి వాళ్లు ఆహారంగాని, నీరుగాని ఇవ్వలేదు. అందుకే ఈ నిబంధన లిఖించబడింది. పైగా ఇశ్రాయేలీయులకు శాపం ఇచ్చేందుకు బిలాముకు డబ్బు కూడా చెల్లించారు. కాని దేవుడు ఆ శాపాన్ని తిప్పికొట్టి, దాన్ని మనకొక వరంగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధనను విన్నారు. వాళ్లు దాన్ని పాటించారు. విదేశీయుల సంతానాల నుంచి వాళ్లు తమని తాము వేరుజేసుకున్నారు.

4-5 అయితే, ఇది జరిగేందుకు ముందు, ఎల్వాషీబు టొబీయాకి ఆలయంలో ఒక గది ఇచ్చాడు ఎల్వాషీబు దేవుని ఆలయంలో వస్తువులను భద్రపరచే గదులకు బాధ్యుడైన యాజకుడు. ఎల్యాషీబు టోబీయాకి సన్నిహిత మిత్రుడు. ఆ గది ధాన్యార్పణలు ధూప సామగ్రి, ఆలయానికి చెందిన గిన్నెలు, వస్తువులు దాచేందుకు ఉద్దేశింపబడింది. లేవీయులు, గాయకులు ద్వారపాలకుల కోసం పంట ధాన్యాల్లో పదోవంతు కొత్త ద్రాక్షారసం, నూనె కూడా ఆ గదిలోనే ఉంచారు. యాజకులకు వచ్చిన కానుకలను కూడా ఆ గదిలోనే ఉంచారు. కాని, ఎల్యాషీబు ఆ గదిని టోబీయాకి ఇచ్చాడు.

ఇదంతా జరుగుతున్నప్పుడు నేను యెరూషలేములో లేను. నేను బబులోనుకి రాజును కలిసేందుకు వెళ్లాను. అర్తహషస్త బబులోను రాజుగావున్న 32వ ఏట నేను బబులోనుకి వెళ్లాను. తర్వాత, నేనా రాజును యెరూషలేముకి తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాను. అలా నేను యెరూషలేముకి తిరిగి వచ్చాను. యెరూషలేములో ఎల్యాషీబు చేసిన విచారకరమైన విషయం నేను విన్నాను. ఎల్యాషీబు టోబీయాకి మన దేవుని ఆలయంలో ఒక గది యిచ్చాడు! ఎల్యాషీబు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. కనుక నేను టోబీయా వస్తువులన్నీ గది బయటికి విసిరేశాను. ఆ గదులను స్వచ్ఛంగా, పరిశుభ్రం చేయాలని ఆజ్ఞనిచ్చాను. తర్వాత నేను గిన్నెలను, వస్తుపులను, ధాన్యాం కానుకలను, ధూప సామగ్రిని తిరిగి ఆ గదుల్లో పెట్టించాను.

10 లేవీయులకి వాళ్ల వంతులను జనం ఇవ్వలేదని కూడా నేను విన్నాను. దానితో లేవీయులూ, గాయకులూ తమ స్వంత పొలాల్లో పని చేసుకునేందుకు తిరిగి వెళ్లిపోయారు. 11 అందుకని, నేనా అధికారులకు వాళ్లు చేసింది తప్పని చెప్పాను. “మీరు దేవుని ఆలయం విషయంలో తగిన శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు?” అని నేను వాళ్లని నిలదీశాను. తర్వాత, లేవీయులందర్నీ నేను సమావేశపరచాను. నేను వాళ్లకి తమ తమ స్థానాలకి, ఆలయంలో కొలువులకి తిరిగి రమ్మని చెప్పాను. 12 తర్వాత, యూదాలోని వాళ్లందరూ ఆలయంలో తమ ధాన్యంలో పదోవంతును, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెని సమర్పించారు. ఆ వస్తువులు వస్తువులను భద్రపరచు గదుల్లో ఉంచబడ్డాయి.

13 ఆ గిడ్డంగులకి నేనీ క్రింది వారిని భద్రపరచు వారుగా నియమించాను: యాజకుడు షెలెమ్యా, ఉపదేశకుడు సాదోకు, లేవీయుడు పెదయా. వారికి సహాయకుడుగా హానానును నియమించాను. హానాను జక్కూరు కొడుకు, మత్తన్యా మనుమడు. వీళ్లు విశ్వాసపాత్రులన్న విషయం నాకు తెలుసు. వాళ్లు తమ బంధువులకు ఆయా వస్తువులు అందచేసే విషయంలో బాధ్యులు.

14 దేవా, నేను చేసిన ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుపెట్టుకో, నా దేవుని ఆలయ నిర్మాణంకోసం, దాని కొలువులకోసం నేను చిత్తశుద్ధితో నమ్మకంగా చేసినవన్నీ గుర్తంచుకో దేవా.

15 ఆ రోజుల్లో యూదాలో జనం సబ్బాతు (విశ్రాంతి) నాడు కూడా పనిచేయడం నేను గమనించాను. జనం ద్రాక్షాపళ్లు తొక్కి రసం తీయడం చూశాను. జనం ధాన్యం తీసుకురావడం, దాన్ని గాడిదలమీద మోపడం చూశాను. నగరంలో జనం ద్రాక్షాను, అంజూరపళ్లను, రకరకాల వస్తువులను తీసుకు రావడం చూశాను. వాళ్లు సబ్బాతు (విశ్రాంతి) రోజున ఈ వస్తుపులన్నింటినీ యెరూషలేముకి తెస్తున్నారు. అందుకని, నేను వాళ్లకి ఈ విషయంలో హెచ్చరిక చేశాను. నేను వాళ్లకి సబ్బాతు రోజున ఆహారం అమ్మకూడదని చెప్పాను.

16 తూరు నగరానికి చెందిన కొందరు యెరూషలేములో వున్నారు. వాళ్లు చేపలను, రకరకాల వస్తువులను యెరూషలేములోకి తెచ్చి, సబ్బాతు రోజున అమ్ముతున్నారు. యూదులు ఆ వస్తువులను కొంటున్నారు. 17 యూదాలోని ముఖ్యులకు వాళ్లు చేస్తున్నది పొరపాటని చెప్పాను. నేనా ముఖ్యులకి ఇలా చెప్పాను: “మీరు చాలా చెడ్డపని చేస్తున్నారు. మీరు సబ్బాతును నాశనం చేస్తున్నారు. మీరు సబ్బాతును అన్ని ఇతర రోజుల మాదిరిగా మారుస్తున్నారు. 18 మీ పూర్వీకులు కూడా సరిగ్గా ఈ పనులే చేశారన్న విషయం మీకు తెలుసు. అందుకే యెహోవా మనకీ, ఈ నగరానికీ, ఈ ఇబ్బందులూ, విపత్తులూ తెచ్చాడు. మీరు సరిగ్గా అవే పనులు చేస్తున్నారు. అందుకని, ఇలాంటి చెడుగులే ఇశ్రాయేలుకి మరిన్ని దాపురిస్తాయి. ఎందుకంటే, సబ్బాతు రోజు ముఖ్యమైనది కాదన్నట్లు దాన్ని మీరు నాశనం చేస్తున్నారు.”

19 అందుకని, నేనేమి చేశానంటే: ప్రతి శుక్రవారము సాయంత్రము (విశ్రాంతి దినానికి ముందు) చీకటి పడేందుకు సరిగ్గా ముందు, యెరూషలేము ద్వారాలను మూసేసి, తాళాలు బిగించమని ద్వార పాలకులను నేను ఆదేశీంచాను. ఆ తలుపులను సబ్బాతు రోజు ముగిసేదాకా తియ్యరాదు. ద్వారాల దగ్గర నా స్వంత మనుషుల్లో కొందర్ని పెట్టాను. సబ్బాతు రోజున యెరూషలేము నగరంలోకి ఎట్టి పరిస్థితిల్లోనూ ఎలాంటి సరుకుల మూటలూ రాకుండా చూడమని నేను వాళ్లని కట్టడిచేశాను.

20 ఒకటి రెండు సార్లు వ్యాపారస్తులూ, చిల్లర వర్తకులూ రాత్రి పూట యెరూషలేము ప్రాకారం వెలుపల గడపవలసివచ్చింది. 21 అయితే, నేనా వ్యాపారస్తుల్నీ చిల్లర వర్తకుల్నీ, “రాత్రిపూట ద్వారం ముందర గడపవద్దు. మీరు మరోసారి అలా చేస్తే మిమ్మల్ని పట్టుకొంటాను” అని హెచ్చరించాను. దానితో, అప్పట్నుంచి వాళ్లు తమ సరుకులు అమ్ముకునేందుకు సబ్బాతు రోజున మళ్లీరాలేదు.

22 తర్వాత తమని తాము పరిశుద్ధుల్నీ చేసుకోమని నేను లేవీయుల్ని ఆదేశించాను. వాళ్లలా చెశాక, వాళ్లు పోయి, ద్వారాలను కావలి కాయాలి. సబ్బాతు రోజును ఒక పవిత్ర దినంగా వుంచేందుకు గాను ఇవన్నీ చేశాను. ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో దేవా.

నామీద దయవుంచి, ఘనమైన నీ ప్రేమా, దయ నామీద ప్రసరింపచెయ్యి.

23 ఆ రోజుల్లో కొందరు యూదులు అష్టోదు, అమ్మోను, మోయాబు దేశాలకు చెందిన స్త్రీలను పెళ్లి చేసుకున్న విషయం కూడా నేను గమనించాను. 24 ఆ వివాహాల ఫలితంగా పుట్టిన పిల్లల్లో సగం ముదికి యూదా భాషలో మాట్లాడటం చేతకాదు. ఆ పిల్లలు అష్డోదు, అమ్మోను లేక మోయాబు భాష మాట్లడేవారు. 25 అందుకని, వాళ్లు పొరపాటు చేస్తున్నారని నేను వాళ్లకి చెప్పాను. నేను వాళ్లని శపించాను. వాళ్లలో నేను కొందర్ని కొట్టాను కూడా. కొందర్ని జుట్టు పట్టుకొని గుంజాను. వాళ్లచేత నేను బలవంతాన దేవుని సాక్షిగా ప్రమాణం చేయించాను. నేను వాళ్లకి ఇలా చెప్పాను: “మీరు వాళ్ల అమ్మాయిల్ని పెళ్లి చేసుకో కూడదు. ఆ విదేశీయుల కూతుళ్లని మీ అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా చూడండి. అలాగే, మీ అమ్మాయిలు ఆ విదేశీయుల కొడుకుల్ని పెళ్లిచేసుకోకుండా చూడండి. 26 ఇలాంటి పెళ్లిళ్లు సొలొమోను లాంటివాడు సైతం పాపం చేసేందుకు కారణమయ్యాయని మీకు తెలుసు. ఎన్నెన్నో దేశాల్లో సొలొమోనంతటి గొప్ప రాజు లేడు. సొలొమోను దేవుని ప్రేమ పొందినవాడు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలు దేశమంతటికీ రాజును చేశాడు. అలాంటి సొలొమోను సైతం విదేశీ స్త్రీల మూలంగా పాపం చేయవలసి వచ్చింది. 27 మరి ఇప్పుడు మీరు కూడా అలాంటి ఘోర పాపమే చేస్తున్నట్లు వింటున్నాం. మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించడం లేదు. మీరు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు.”

28 యోయాదా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కొడుకు. యోయాదా కొడుకుల్లో ఒకడు హోనానువాసి అయిన సన్బల్లటుకి అల్లుడు. నేను అతని చోటు విడిచిపెట్టేలా చేశాను. నేనతను పారిపోయేలా కట్టడిచేశాను.

29 ఓ నా దేవా, నీవు వాళ్లని శిక్షించు. వాళ్లు యాజకత్వాన్ని అపవిత్రం చేశారు. అదేదో అంత ముఖ్యం కాదన్నట్లు వాళ్లు వ్యవహరించారు. యాజకులతోనూ, లేవీయులతోనూ నీవు చేసుకున్న ఒడంబడికను వాళ్లు పాటించలేదు. 30 అందుకని నేనా యాజకులనూ, లేవీయులనూ శుచులనుగా, పరిశుద్ధులనుగా చేశాను. నేను విదేశీయులందర్నీ, వాళ్లు నేర్పిన వింత విషయాల్నీ తొలగించాను. నేను లేవీయులకీ, యాజకులకీ వాళ్ల అసలైన సొంత విధులనూ, బాధ్యతలనూ అప్పగించాను. 31 జనం కట్టెల కానుకలనూ, తొలి ఫలాలనూ సరైన సమయాల్లో పట్టుకు వచ్చేలా చూశాను.

ఓ నా దేవా, నేను చేసిన ఈ మంచి పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో.

కీర్తనలు. 126

యాత్ర కీర్తన.

126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
    తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
మేము నవ్వుకుంటున్నాము.
    మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
    “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!

యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
    ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
    కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
    కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International