Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఎజ్రా 4-6

దేవాలయ పునర్నిర్మాణానికి విరోధులు

1-2 ఆ ప్రాంతంలో నివసించే చాలామంది యూదా, బెన్యామీను జాతీయులకు విరోధులు. చెర నుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు దేవాలయం నిర్మిస్తున్నారని విన్న ఆ శత్రువులు జెరుబ్బాబెలు దగ్గరకీ, వంశ పెద్దల దగ్గరికీ వచ్చి, “నిర్మాణంలో మీకు మమ్మల్ని తోడ్పడనివ్వండి. మేమూ మీలాంటివాళ్లమే. మీ దేవుణ్ణి సహాయం నిమిత్తం మేమూ అర్థిస్తాము. అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడికి తెచ్చినప్పట్నుంచీ మేము మీ దేవునికే బలులు సమర్పించాము” అన్నారు.

కాని, జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలుకు చెందిన ఇతర వంశాల పెద్దలూ వాళ్లకి ఇలా సమాధానం చెప్పారు: “కుదరదు, మా దేవుని ఆలయ నిర్మాణంలో మాకు తోడ్పడే అవకాశం మీకు లేదు. యెహోవాకు ఆలయ నిర్మాణం చేసే హక్కు మాది మాత్రమే. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. ఇది పారశీక రాజు కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ.”

ఈ మాటలతో వాళ్లకి కోపం వచ్చింది. దానితో వాళ్లు యూదులకు ఇబ్బందులు కలిగించ నారంభించారు. దేవాలయం నిర్మించకుండా యూదులను వాళ్లు నిరుత్సాహపరచి, నిరోధించసాగారు. వాళ్లు ప్రభుత్వాధికారులకు లంచాలిచ్చి, వాళ్లు యూదా ప్రజలకు వ్యతిరేకంగా పని చేసేలా చూశారు. ఆ అధికారులు యూదుల దేవాలయ నిర్మాణ పథకాలను భగ్నం చేసేందుకు నిరంతరం కృషిచేశారు. కోరెషు పారశీక రాజుగా వున్నకాలంలో దర్యావేషు పారశీక రాజు అయ్యేంత వరకూ వాళ్ల యీ ప్రయత్నం కొనసాగింది.

యూదులను అడ్డుకొనేందుకుగాను ఆ శత్రువులు పారశీక రాజుకి లేఖలు సైతం వ్రాశారు. అహష్వేరోషు[a] రాజు అయిన ఏడాది వాళ్లొక లేఖ వ్రాశారు.

యెరూషలేము పునర్నిర్మాణానికి విరోధులు

ఆ తరువాత అర్తహషస్త[b] పారశీకానికి కొత్తగా రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదులమీద నిందారోపణలు చేస్తూ లేఖలు వ్రాశారు. అలా వ్రాసినవాళ్లు: బిష్లాము, మిత్రదాతు, టాబెయేలు, ఆ బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు ఆ లేఖలు అరమేయికు[c] భాషలో, అరమేయికు లిపిలో వ్రాశారు.

[d] అప్పుడు ప్రాంతీయాధికారి రెహూమూ, కార్యదర్శి షిమ్షయి కూడా యెరూషలేము ప్రజలకి వ్యతిరేకంగా ఒక లేఖ వ్రాసి, పారసీక రాజు అర్తహషస్తకి పంపారు. ఆ లేఖలో వాళ్లిలా వ్రాశారు.

ప్రాంతీయాధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయీ, న్యాయమూర్తులు, టర్పెలాయేలు, పారశీకం, అర్కె, బబులోను, సూసాకి చెందిన ఏలాము మరియు ఇతర ప్రాంతాల ప్రజలమీది ముఖ్యాధికారులు, 10 గొప్పవాడైన బలవంతుడైన అషురుబానిపాలు సమరియా నగరానికీ, యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాలకూ తరలించిన ప్రజల మహజరు.

11 అర్తహషస్త ప్రభువుకి, యూఫ్రటీసు నదియొక్క పశ్చిమాన నివసించే తమ దాసులు చేసుకున్న విన్నపం:

12 అర్తహషస్త మహారాజుగారికి, తమరు తమవద్ద నుంచి పంపివేసిన యూదులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ యూదులు ఇప్పుడా నగరాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. యెరూషలేము ఒక చెడ్డ నగరం. ఆ నగర ప్రజలు ఎల్లప్పుడూ ఇతర రాజుల మీద తిరగబడుతూవచ్చారు. ఇప్పుడు యూదులు పునాదులు కట్టుదిట్టంచేసి, ప్రాకారాలు కడుతున్నారు.[e]

13 అంతేకాదు అర్తహషస్త మహాప్రభూ, యెరూషలేము నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యెరూషలేము ప్రజలు తమ వృత్తిపన్నులు చెల్లించడం నిలిపేస్తారు. తమ గౌరవార్థం డబ్బు పంపడం మానేస్తారు. వాళ్లు సుంకం పన్నులు చెల్లించడం కూడా మానేస్తారు. ఏలినవారికి ఆ సొమ్మంతా నష్టమవుతుంది.

14 ప్రభువుల పట్ల మాకు బాధ్యతవుంది. తమకీ నష్టాలు వాటిల్లడం మేము చూడలేము. అందుచేతనే తమకీ విషయాలు తెలియజేసుకుంటున్నాము.

15 అర్తహషస్త మహారాజా, తమకు పూర్వం రాజ్యమేలిన రాజులు వ్రాయించిన చరిత్ర పత్రాలు తమరు పరిశీలించండి. ఆ పత్రాలవల్ల యెరూషలేము ఎల్లప్పుడూ యితర రాజులకు వ్యతిరేకంగా తిరుగబడినట్లు తమకు తెలియవస్తుంది. ఇతర రాజులకూ, రాజ్యాలకూ వీళ్ల తిరుగుబాట్లు పెద్దకీడుగా పరిణమించాయి. ప్రాచీనకాలం నుంచి యీ నగరంలో అనేక తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి! యెరూషలేము నాశనం చేయబడినది సరిగ్గా అందుకే!

16 అర్తహషస్త మహారాజా, ఈ నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతంమీద తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాము.

17 అప్పుడు అర్తహషస్త రాజు వాళ్లకి ఇలా సమాధానం ఇచ్చాడు:

ప్రాంతీయాధికారి రెహూముకి, కార్యదర్శి షిమ్షయికి, సమరియాలోను, యూఫ్రటీసు నదికి పశ్చిమాన మీతో బాటు నివసించేవారికి,

శుభాకాంక్షలు.

18 మీరు మాకు పంపిన లేఖను అనువదించి మాకు వినిపించారు. 19 నా వెనుకటి రాజుల పత్రాలు గాలించవలసిందిగా నేను ఆదేశించాను. ఆ పత్రాలు చదివి వినిపించారు. రాజులకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసిన సుదీర్ఘ చరిత్ర యెరూషలేముకు ఉన్నట్లు మేము కనుగొన్నాము. యెరూషలేములో తరచూ పితూరీలు, తిరుగుబాట్లు సంభవించాయి. 20 యెరూషలేమునూ, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతమంతటినీ శక్తిసంపన్నులైన రాజులు పాలించారు. పన్నులు, రాజుల గౌరవార్థం కానుకలు, సుంకం పన్నులు ఆ రాజులకు చెల్లింపబడ్డాయి.

21 ఇప్పుడిక మీరు చేయవలసినది, వాళ్లని పని నిలిపివేయవలసినదిగా ఆజ్ఞ జారీ చేయడం. యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా మీరా ఆజ్ఞ ఇవ్వాలని నా ఆదేశం. 22 ఈ వ్యవహారంలో అశ్రద్ధ జరగకుండా మీరు జాగ్రత్తవహించాలి. మనం యెరూషలేము పునర్నిర్మాణాన్ని కొనసాగనివ్వరాదు. అదే జరిగితే మాకింక యెరూషలేమునుంచి ఎంత మాత్రమూ డబ్బు ముట్టదు.

23 అర్తహషస్త రాజు పంపిన ఈ లేఖ నకలు రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, వాళ్లతోవున్న ఇతర ప్రజలకు అందింది. దాన్ని చదివిన మీదట వాళ్లు వెంటనే యెరూషలేములోని యూదుల వద్దకు వెళ్లారు. ఆ యూదుల చేత నిర్మాణపు పనిని వాళ్లు బలవంతాన నిలిపివేయించారు.

దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోవుట

24 దానితో, యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది.[f] పారసీక రాజు దర్యావేషు పాలన రెండవ సంవత్సరం[g] దాకా తిరిగి ఈ నిర్మాణ కృషి కొనసాగలేదు.

ఆ కాలంలో ప్రవక్తలైన హగ్గయి,[h] ఇద్దో కొడుకు జెకర్యా[i] దేవుని పేరట ప్రవచించారు. యూదా, యెరూషలేములోని యూదులను వాళ్లు ప్రోత్సహించారు. దానితో, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవలు యెరూషలేములోని దేవాలయ నిర్మాణ కృషిని తిరిగి ప్రారంభించారు. దేవుని ప్రవక్తలందరూ వారితో ఉండి, ఆ పనికి తోడ్పడుతూ వచ్చారు. ఆ కాలంలో యూఫ్రటీసునది పశ్చిమ ప్రాంతానికి తత్తెనైయు అధిపతి. తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు నిర్మాణ కృషి సాగిస్తున్న జెరుబ్బాబెలు, యేషూవ, తదితరుల వద్దకు వెళ్లి, “ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి, దీన్ని సరికొత్తదానిగా రూపొందించడానికి మీకు ఎవరు అనుమతినిచ్చారు?” అని నిలదీశారు. అంతేకాదు, వాళ్లు జెరుబ్బాబెలును, “ఈ భవనం పని చేస్తున్న వాళ్ల పేర్లు యేమిటి?” అని కూడా ప్రశ్నించారు.

అయితే, యూదా నాయకుల మీద దేవుని దృష్టివుంది. దర్యావేషు రాజుకి భవన నిర్మాతలు లేఖలు పంపుకున్నారు. రాజు సమాధానం పంపేదాకా, వాళ్లు పనిని నిలుపు చేయవలసిన అవసరం లేకపోయింది. వాళ్లు తమ నిర్మాణ కృషిని కొనసాగించారు.

యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతాధిపతి అయిన తతైనైయు, షతర్బోజ్నయి, వారి ముఖ్య సహోద్యోగులు దర్యావేషు రాజుకి ఒక లేఖ పంపారు. ఆ లేఖ నకలు ఇది:

దర్యావేషు రాజుకి,

శుభం!

దర్యావేషు రాజుకి మేము ఇందు మూలంగా తెలియజేసేది ఏమంటే, తమ ఆదేశం మేరకు యూదా రాజ్యంలో గొప్ప దేవుని ఆలయానికి మేము వెళ్లాము. యూదాలోని ప్రజలు ఆ ఆలయాన్ని పెద్దపెద్ద రాళ్లతో కడుతున్నారు. గోడల్లో వాళ్లు పెద్ద దూలాలు పరుస్తున్నారు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాళ్లు చాలా వేగంగా నిర్మాణం సాగిస్తున్నారు. త్వరలోనే పనిపూర్త వుతుంది.

వాళ్లు చేస్తున్న పనిని గురించి మేము వాళ్ల నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడిగాము. “ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించేందుకూ, కొత్తదానిగా దాన్ని రూపొందించేందుకూ మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని మేము ప్రశ్నించాము. 10 మేము వాళ్ల పేర్లు కూడా అడిగాము. వాళ్లెవరో మీరు తెలుసు కోగలిగేందుకు వీలుగా మేము వాళ్ల పేర్లు వ్రాసి పెట్టాలని అనుకున్నాము.

11 వాళ్లు మాకు ఇచ్చిన సమాధానం యిది:

“మేము భూ, పరలోకాల అధిపతియైన యెహోవా దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు మహారాజొకడు నిర్మించి ముగించిన దేవాలయాన్ని మేమిప్పుడు తిరిగి నిర్మిస్తున్నాం. 12 కాని, మా పూర్వీకులు దేవునికి కోపం తెప్పించారు. ఆయన వారిని బబులోను రాజైన నెబుకద్నెజరుకు లోబరిచాడు. నెబుకద్నెజరు ఈ దేవాలయాన్ని నిర్మూలించాడు, ప్రజలను బలవంతాన బబులోనుకు బందీలుగా తీసుకుపోయాడు. 13 అయితే, కోరెషు రాజు దేవాలయం తిరిగి నిర్మింపబడాలని ఒక ప్రత్యేకాజ్ఞ జారీ చేశాడు. 14 కోరెషు గతంలో యెహోవా దేవాలయం నుంచి కొల్లగొట్టిన వెండి, బంగారు వస్తువులను బబులోనులోని అబద్ధపు దేవత ఆలయంనుంచి బయటికి తీయించాడు. నెబుకద్నెజరు గతంలో ఆ వస్తువులను యెరూషలేములోని ఆలయం నుంచి కొల్లగొట్టి, వాటిని బబులోను లోని తన అబద్ధపు దేవత దేవాలయంలో ఉంచాడు. ఇప్పుడు కోరెషు రాజు ఆ వెండి, బంగారు వస్తువులను షేష్బజ్జరుకు ఇచ్చాడు. కోరెషు షేష్బజ్జరును ప్రాంతీయాధికారిగా నియమించాడు.”

15 కోరెషు షేష్బజ్జరును ఇలా ఆదేశించాడు: “నువ్వీ వెండి, బంగారు వస్తువులను తీసుకుపోయి, వాటిని తిరిగి యెరూషలేములోని దేవాలయంలో పెట్టు. గతంలో ఉన్న చోటనే దేవాలయాన్ని తిరిగి నిర్మింప జేయి.”

16 షేష్బజ్జరు వచ్చి, యెరూషలేములోని దేవాలయానికి పునాదులు నిర్మించాడు. ఆనాటి నుంచి నేటిదాకా పని కొనసాగింది. అయితే, ఆ పని యింకా పూర్తి కాలేదు.

17 ఇప్పుడిక, తమకి సమ్మతమైతే, రాజుగారి ఆధికారిక, చారిత్రక పత్రాలను గాలించండి. యెరూషలేములో దేవాలయం నిర్మించుమని కోరెషు రాజు ఆజ్ఞ జారీ చేశాడన్న మాట నిజమేనేమో పరిశీలించుము. తర్వాత తమరీ విషయంలో తీసుకున్న నిర్ణయమేమిటో దయచేసి మాకొక లేఖద్వారా తెలియజేయండి.

దర్యావేషు ఆజ్ఞ

దర్వావేషు రాజు తన ముందరి రాజుల చారిత్రక పత్రాలను గాలించవలసిందిగా ఆదేశించాడు. ఆ పత్రాలు బబులోనులో డబ్బును పదిలపరచిన ఖజానాలోనే పదిలపరచబడ్డాయి. మాదీయ రాష్ట్రంలోని ఎగ్బతానా కోటలో చుట్టబడిన పత్రం ఒకటి కనిపించింది. ఆ చుట్టబడిన పత్రం[j] లో యిలా వ్రాయబడి వుంది:

అధికార పత్రం: కోరెషు రాజు పాలన మొదటి సంవత్సరంలో, కోరెషు యెరూషలేములోని దేవాలయం విషయంలో ఈ క్రింది ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞలో ఇలా పేర్కొనబడింది:

బలులు అర్పించేందుకు అనువైన యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించబడాలి. దానికి పునాదులు వెయ్యనియ్యండి, దేవాలయం (పొడవు 90 అడుగులు, వెడల్పు 90 అడుగులు వుండాలి.) దాని చుట్టూ వుండే గోడ మూడు వరుసల పెద్ద రాళ్లతో, ఒక వరుస పెద్ద కొయ్య దూలాలతో నిర్మింపబడాలి. దేవాలయ నిర్మాణానికయ్యే ఖర్చులు రాజు ఖజానానుంచి చెల్లించాలి. అంతేకాదు, దేవాలయం నుంచి తెచ్చిన వెండి, బంగారు వస్తువులు తిరిగి వాటి వాటి స్థానాల్లో వుంచబడాలి. వెనక, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలోంచి కొల్లగొట్టి, ఆ వస్తువులను బబులోనుకు తెచ్చాడు. వాటిని తిరిగి ఆ దేవాలయంలో వుంచాలి.

ఇప్పుడిక దర్యావేషునైన నేను,

యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంత అధికారియైన తత్తెనైయు, షెతర్బోజ్నయినీ, ఆ రాజ్యంలో నివసించే అధికారులందరినీ యెరూషలేముకు దూరంగా పుండవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. అక్కడి పనివాళ్లని వేధించకండి. ఆ దేవాలయ నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నించకండి. యూదా పాలనాధికారీ, యూదా నాయకులూ ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలి. ఆ దేవాలయం పూర్వం ఎక్కడున్నదో సరిగ్గా అదే స్థలంలో దాన్ని తిరిగి నిర్మించాలి.

ఇప్పుడు నేనీక్రింది ఆజ్ఞను జారీ చేస్తున్నాను. దేవాలయం నిర్మిస్తున్న యూదా పెద్దలకు, మీరు ఈ క్రింది పనులు చెయ్యాలి. దేవాలయ నిర్మాణ ఖర్చులు పూర్తిగా ఖాజానానుంచి చెల్లింపబడాలి. ఆ సొమ్ము యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలోని రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేయబడాలి. ఆ నిర్మాణం ఆగిపోకుండా వుండేందుకుగాను మీరీ పనులు త్వర త్వరగా చెయ్యాలి. వాళ్లకి ఏమి కావాలన్నా సరే ఇవ్వండి. పరలోక దేవునికి బలి ఇచ్చేందుకు వాళ్లు దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు కావాలంటే, వాటిని వాళ్లకి ఇవ్వండి. యెరూషలేము యాజకులు గోధుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె కావాలంటే, వాటిని మీరు ప్రతిరోజూ వాళ్లకి తప్పనిసరిగా ఇవ్వండి. 10 పరలోక దేవుని సంతృప్తి పరచేందుకోసం మీరు వీటిని యూదా యాజకులకు ఇవ్వండి. ఆ యాజకులు నా కోసం, నా కొడుకుల కోసం ప్రార్థన చేసేందుకుగాను మీరు వాటిని వాళ్లకి ఇవ్వండి.

11 దీనికీ తోడు నా మరో ఆజ్ఞ: ఎవరైనా ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే అతని ఇంటి దూలాన్ని ఊడపీకి, దానితో అతని పొట్టలో పొడవాలి. అతని ఇంటిని ధ్వంసంచేసి, దాన్నొక రాళ్ల కుప్పగా మార్చాలి.

12 దేవుడు యెరూషలేములో తన నామమును ఉంచాడు. ఈ నా ఆజ్ఞను ధిక్కరించ ప్రయత్నించే వ్యక్తి ఒక రాజైనా, మరొకడెవడైనా, అతన్ని ఆ దేవుడు ఓడిస్తాడని నేను ఆశిస్తున్నాను, యెరూషలేములోని ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ఏ వ్యక్తి అయినా ప్రయత్నిస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడని నేను ఆశిస్తున్నాను.

జాగ్రత్త, ఇది నా (దర్యావేషు రాజు) తిరుగులేని ఆజ్ఞ. దీన్ని విధిగా వెంటనే, పూర్తిగా పాటించాలి!

దేవాలయ నిర్మాణ పనిపూర్తి, ప్రతిష్ఠ

13 సరే, యూఫ్రటీసు నది పశ్చమ ప్రాంత పాలనాధికారి తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు దర్యావేషు రాజు ఆజ్ఞను సంపూర్ణంగా పాటించారు. 14 దానితో, యూదుల పెద్దలు (నాయకులు) నిర్మాణ కృషిని కొనసాగించారు. ప్రవక్త హగ్గయి, ఇద్దో కొడుకు జెకర్యాల ప్రోత్సాహంతో వాళ్లు జయప్రదమయ్యారు. వాళ్ల దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞాపాలన క్రమంలో యీ పని పూర్తయింది. ఈ పని పూర్తయ్యేందుకు పారసీక రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆజ్ఞలు పాలింపబడటం కూడా కారణమే. 15 దేవాలయ నిర్మాణం అదారు నెల, మూడవ రోజున[k] దర్వావేషు రాజు పాలన ఆరవ ఏట[l] పూర్తయింది.

16 అప్పుడిక ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, నిర్భంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన ఇతరులు ఆ దేవాలయ ప్రతిష్ఠను పెద్ద పండుగలా, ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.

17 వాళ్లు దేవాలయ ప్రతిష్ఠ పండుగను యిలా జరుపుకున్నారు: వాళ్లు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపోతులను బలి ఇచ్చారు. వాళ్లు 12 మేకపోతులను ఇశ్రాయేలీయులందరి కొరకు పాపపరిహారార్థ బలిగాయిచ్డారు. అది ఒక్కొక్క వంశానికి ఒకటి చొప్పున 12 వంశాల ఇశ్రాయేలీయులకు. 18 అటు తర్వాత, యెరూషలేము దేవాలయంలో సేవల నిమిత్తం వాళ్లు తమ వంశాల్లోనూ, లేవీయులు తమ వంశాల్లోనూ, యాజకులను ఎంపిక చేశారు. వాళ్లీ కార్యక్రమాలను సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలోని నిబంధనల ప్రకారం చేశారు.

పస్కా పండుగ

19 [m] మొదటి నెల పద్నాల్గవ రోజున నిర్బంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన యూదులు పస్కా పండుగ జరుపుకున్నారు. 20 యాజకులు, లేవీయులు ఆ రోజున తమను తాము శుద్ధిచేసుకున్నారు. వాళ్లందరూ తమని తాము శుభ్రం చేసుకుని పస్కా పండుగ నాడు చేసుకునేందుకు సంసిద్ధులయ్యారు. లేవీయులు నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూదులందరి కోసం పస్కా పండుగ గొర్రెపిల్లల్ని బలియిచ్చారు. వాళ్లీ బలిని తమ సోదరులైన యాజకుల కోసం, తమకోసం ఇచ్చారు. 21 అలాగు, నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ పస్కా పండుగ భోజనం చేశారు. ఇతరులు స్నానాదులతో తమని తాము శుభ్రం చేసుకుని, ఆ దేశంలో నివసించే ఇతర మనుష్యుల అపరిశుభ్ర అంశాలనుంచి తమని తాము వేరు చేసుకున్నారు. అలా పరిశుద్ధులైన వాళ్లు కూడా పస్కా పండుగ భోజనంలో పాల్గొన్నారు. వాళ్లు సహాయం కోసం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దగ్గరకు పోగలిగేందుకు, వారు తమ్మును తాము వేరు చేసుకొని పరిశుద్ధ పరచుకొన్నారు. 22 వాళ్లు ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. అష్షూరు రాజు[n] మనోవైఖరిని మార్చి, యెహోవా వాళ్లకెంతో సంతోషం కలిగించాడు. దానితో, అష్షూరు రాజు దేవాలయ పునర్నిర్మాణ కృషిని సాగిం చేందుకు వాళ్లకి తోడ్పడ్డాడు.

కీర్తనలు. 137

137 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని
    సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లకు[a] మన సితారాలు తగిలించాము.
బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.
    సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు.
    సీయోను గూర్చి పాటలు పాడమని వారు మనకు చెప్పారు.
కాని విదేశంలో మనం యెహోవాకు
    కీర్తనలు పాడలేము!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
    నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక!
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
    నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకుపోవును గాక!
నేను ఎన్నటికీ నిన్ను మరువనని
    వాగ్దానం చేస్తున్నాను.

యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!
    యెహోవా, యెరూషలేము పడిన రోజున
ఎదోమీయులు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకొనుము.
    దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!
    నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
    నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International