Chronological
యేసు వంశావళి
(లూకా 3:23-38)
1 యేసు క్రీస్తు వంశక్రమము: ఈయన దావీదు మరియు అబ్రాహాము వంశానికి చెందినవాడు.
2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు.
ఇస్సాకు కుమారుడు యాకోబు.
యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు.
3 యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. (పెరెసు, జెరహుల తల్లి తామారు.)
పెరెసు కుమారుడు ఎస్రోము.
ఎస్రోము కుమారుడు అరాము.
4 అరాము కుమారుడు అమ్మీనాదాబు.
అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను.
నయస్సోను కుమారుడు శల్మా.
5 శల్మా కుమారుడు బోయజు. (బోయజు తల్లి రాహాబు.)
బోయజు కుమారుడు ఓబేదు. (ఓబేదు తల్లి రూతు.)
ఓబేదు కుమారుడు యెష్షయి.
6 యెష్షయి కుమారుడు రాజు దావీదు.
దావీదు కుమారుడు సొలొమోను. (సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.)
7 సొలొమోను కుమారుడు రెహబాము.
రెహబాము కుమారుడు అబీయా.
అబీయా కుమారుడు ఆసా.
8 ఆసా కుమారుడు యెహోషాపాతు.
యెహోషాపాతు కుమారుడు యెహోరాము.
యెహోరాము కుమారుడు ఉజ్జియా.
9 ఉజ్జియా కుమారుడు యోతాము.
యోతాము కుమారుడు ఆహాజు.
ఆహాజు కుమారుడు హిజ్కియా.
10 హిజ్కియా కుమారుడు మనష్షే.
మనష్షే కుమారుడు ఆమోసు.
ఆమోసు కుమారుడు యోషీయా.
11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు.
12 బబులోను నగరానికి కొనిపోబడిన తరువాతి వంశ క్రమము:
యెకొన్యా కుమారుడు షయల్తీయేలు.
షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు.
13 జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు.
అబీహూదు కుమారుడు ఎల్యాకీము.
ఎల్యాకీము కుమారుడు అజోరు.
14 అజోరు కుమారుడు సాదోకు.
సాదోకు కుమారుడు ఆకీము.
ఆకీము కుమారుడు ఎలీహూదు.
15 ఎలీహూదు కుమారుడు ఎలియాజరు.
ఎలియాజరు కుమారుడు మత్తాను.
మత్తాను కుమారుడు యాకోబు.
16 యాకోబు కుమారుడు యోసేపు.
యోసేపు భార్య మరియ.
మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు.
17 అంటే అబ్రాహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పదునాలుగు తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరాలు. అలా కొనిపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు పదునాలుగు తరాలు.
యేసు క్రీస్తు జననం
(లూకా 2:1-7)
18 యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది. 19 కాని ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు అమెను నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో అనుకొన్నాడు.
20 అతడీవిధంగా అనుకొన్న తర్వాత, దేవదూత అతనికి కలలో కనిపించి, “యోసేపూ, దావీదు కుమారుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు. 21 ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక ఆయనకు ‘యేసు’ అని పేరు పెట్టు” అని అన్నాడు.
22-23 ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: “కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళాయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు”(A) ఇది నిజం కావటానికే ఇలా జరిగింది.
24 యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. 25 కాని, ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి “యేసు” అని నామకరణం చేసాడు.
యేసు జన్మ వృత్తాంతం
(మత్తయి 1:18-25)
2 ఇది యిలా వుండగా రోమా సామ్రాజ్యమంతటా జనాభా లెక్కలు సేకరించటానికి కైసరు ఔగుస్తు చక్రవర్తి ఒక ప్రకటన జారీ చేశాడు. 2 కురేనియ సిరియ దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటి సారిగా ఇలాంటి జనాభా లెక్కలు సేకరింపబడ్డాయి. 3 అందువల్ల ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి తమ స్వగ్రామాలకు వెళ్ళారు.
4 యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి అతడు గలిలయలోని నజరేతు అనే పట్టణం నుండి యూదయ దేశంలోని దావీదు పట్టణానికి వెళ్ళాడు. దీన్ని బేత్లెహేము అని అనే వాళ్ళు. 5 మరియతో ఇతనికి పెళ్ళి నిశ్చయమై ఉంది. మరియ గర్భంతో ఉంది. అతడు ఆమెను తన వెంట తీసుకొని తమ పేర్లు జాబితాలో వ్రాయించుకోటానికి వెళ్ళాడు. 6 వాళ్ళక్కడ ఉండగా ఆమెకు ప్రసవవేదన వచ్చింది. 7 ఆమె మగ శిశువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమారుడు. వాళ్ళకు సత్రంలో గది దొరకనందువల్ల ఆమె ఆ పసివాణ్ణి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది.
గొఱ్ఱెల కాపరులు చూసిన దృశ్యం
8 ఊరు ప్రక్క పొలాల్లో ఉన్న గొఱ్ఱెల కాపరులు రాత్రివేళ తమ గొఱ్ఱెల్ని కాపలాకాస్తూ ఉన్నారు. 9 ఒక దేవదూత వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ చుట్టూ దివ్యమైన వెలుగు ప్రకాశించింది. వాళ్ళు చాలా భయపడ్డారు. 10 ఆ దేవదూత వాళ్ళతో, “భయపడకండి! మీకే కాక ప్రజలందరికి ఆనందం కలిగించే సువార్త తెచ్చాను. 11 దావీదు పట్టణంలో ఈ రోజు మీకోసం రక్షకుడు జన్మించాడు. ఆయనే మన ప్రభువు. 12 మీకొక గుర్తు చెబుతాను. పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు” అని అన్నాడు.
13 తక్షణం పరలోకంలోనుండి చాలామంది దేవదూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు:
14 “మహోన్నత లోకంలోవున్న దేవునికి మహా తేజస్సు కలుగుగాక!
భూమ్మీద ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగుగాక!”
15 దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళి పొయ్యాక గొఱ్ఱెల కాపరులు, “జరిగిన దాన్ని గురించి ప్రభువు మనకు చెప్పాడు. బేత్లెహేము వెళ్ళి ఇది చూసి వద్దాం” అని మాట్లాడుకొన్నారు.
16 వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళారు. మరియను, యోసేపును, తొట్టిలో పడుకొనివున్న పసివాణ్ణి, చూసారు. 17 ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో చెప్పారు. 18 వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్యపోయారు. 19 కాని, మరియ యివన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది. 20 గొఱ్ఱెల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవదూత చెప్పినట్లు జరిగినందుకు వాటిని గురించి మాట్లాడుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన తేజస్సును పొగుడుతూ తిరిగి వెళ్ళిపొయ్యారు.
21 ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు.
బాలుని దేవాలయానికి తీసుకెళ్ళటం
22 మోషే ధర్మశాస్త్రానుసారం మరియ, యోసేపులు పరిశుభ్రం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్పించటానికి యెరూషలేముకు వెళ్ళారు. 23 ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో, “మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి”[a] అని వ్రాయబడి ఉంది. 24 అంతేకాక, ప్రభువు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావురాలనైనా లేక రెండు గువ్వలనైనా బలి యివ్వాలనుకొన్నారు.
సుమెయోను యేసును చూడటం
25 ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. 26 ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపర్చాడు. 27 పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు. 28 సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్తో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించడం మొదలు పెట్టాడు:
29 “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు.
30 నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూసాను.
31 నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలందరి ముందు ఎన్నుకొన్నావు!
32 యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే.
నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!”
33 యేసు తల్లితండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. 34 ఆ తర్వాత సుమెయోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరియతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు. 35 తద్వారా మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట పడ్తాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.”
అన్నా యేసును చూడటం
36 ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త్రి కూడా ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. 37 అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది.
38 మరియ, యోసేపులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి గురించి చెప్పింది.
© 1997 Bible League International