Chronological
యేసు పక్షవాత రోగిని నయం చేయటం
(మార్కు 2:1-12; లూకా 5:17-26)
9 యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు. 2 కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.
3 ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు.
4 వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు? 5 ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా? 6 పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
7 పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు. 8 ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.
మత్తయిని పిలవటం
(మార్కు 2:13-17; లూకా 5:27-32)
9 యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు.
10 యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. 11 పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు.
12 యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. 13 ‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’(A) అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.
యేసు ఇతర మతనాయకులవలె కాదు
(మార్కు 2:18-22; లూకా 5:33-39)
14 ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, “మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.
15 యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమారుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం చెప్పాడు.
16 “పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది. 17 అదే విధంగా క్రొత్త ద్రాక్షారసమును పాతతోలు సంచిలో దాచరు. అలా చేస్తే ఆ తోలుసంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు.
యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం
(మార్కు 5:21-43; లూకా 8:40-56)
18 యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల సమాజమందిరానికి అధికారిగా ఉన్నవాడు ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరిల్లి, “నా కూతురు చనిపోయింది. కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది” అని అన్నాడు.
19 యేసు, ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్ళారు.
20 వాళ్ళు వెళ్తుండగా పండ్రెండేండ్ల నుండి రక్త స్రావంతో బాధ పడ్తున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. 21 ఆమె, “నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు నయమైపోతుంది” అని తనలో తాను అనుకొన్నది.
22 యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, “ధైర్యంగా వుండమ్మా! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది” అని అన్నాడు.
23 యేసు ఆ అధికారి యింట్లోకి ప్రవేశిస్తూ, అక్కడ పిల్లన గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండటం చూసాడు. 24 వాళ్ళతో, “వెళ్ళిపొండి, ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే!” అని అన్నాడు. వాళ్ళాయన్ని హేళన చేసారు. 25 ఆయన వాళ్ళను పంపేసాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి తాకాడు. ఆమె వెంటనే లేచి నిలుచుంది. 26 ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపు కలిగించటం
27 యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా యిద్దరు గ్రుడ్డివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు.
28 యేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
29 అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, “మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని అన్నాడు. 30 వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి!” అని వాళ్ళను హెచ్చరించాడు. 31 కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేసారు.
32 వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాడి నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్ఘాంతపోయి, “ఇలాంటిదేదీ ఇదివరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే?” అని అన్నారు.
34 కాని పరిసయ్యులు, “అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.
కొద్దిమంది పనివాళ్ళు
35 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ అన్ని పట్టణాలు, పల్లెలు పర్యటన చేసాడు. దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించాడు. అన్నిరకాల రోగాల్ని, బాధల్ని నయం చేసాడు. 36 ప్రజలు కాపరిలేని గొఱ్ఱెల్లా అలసిపోయి, చెదరిపోయి ఉండటం చూసి యేసు వాళ్ళపై జాలి పడ్డాడు. 37 ఆ తర్వాత తన శిష్యులతో, “పంట బాగా పండింది కాని పని వాళ్ళే తక్కువగా ఉన్నారు. 38 పంట ప్రభువును, పంట కోయటానికి పనివాళ్ళను పంపమని ప్రార్థించండి” అని అన్నాడు.
యేసు అపోస్తలులను పంపటం
(మార్కు 3:13-19; 6:7-13; లూకా 6:12-16; 9:1-6)
10 యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి దయ్యాల్ని వదిలించటానికి, అన్ని రకాల వ్యాధుల్ని, బాధల్ని నయం చేయటానికి వాళ్ళకధికారం ఇచ్చాడు. 2 ఆ పన్నెండుగురి అపోస్తలుల పేర్లు ఇవి:
సీమోను; ఇతన్నే పేతురు అని పిలిచేవాళ్ళు.
అతని సోదరుడు అంద్రెయ.
జెబెదయి కుమారుడు యాకోబు,
యాకోబు సోదరుడు యోహాను.
3 ఫిలిప్పు,
బర్తొలొమయి,
తోమా,
పన్నులు సేకరించే మత్తయి,
అల్ఫయి కుమారుడు యాకోబు,
తద్దయి అని పిలువబడే లెబ్బయి,
4 కనానీయుడైన సీమోను,
యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.
5 ఆ పన్నెండుగురిని ప్రజల వద్దకు పంపుతూ వారికి యేసు ఈ విధంగా ఉపదేశించాడు: “యూదులు కాని వాళ్ళ దగ్గరకు గాని, సమరయ దేశంలోని పట్టణాలలోకి గాని వెళ్ళకండి. 6 దానికి మారుగా ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళండి. వారు తప్పిపోయిన గొఱ్ఱెలవలె ఉన్నారు. 7 వెళ్ళి, దేవుని రాజ్యం దగ్గరలోనే ఉందని ప్రకటించండి. 8 జబ్బుతో ఉన్న వాళ్ళకు నయం చెయ్యండి. దయ్యాలను వదిలించండి. మీకు ఉచితంగా లభించింది ఉచితంగా యివ్వండి. 9 బంగారం కాని, వెండికాని, రాగి కాని మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి, 10 మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేతి కర్రను కాని మీ వెంట తీనుకెళ్ళకండి. పని చేసిన వాళ్ళకు కూలి దొరకాలి కదా!
11 “మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా మంచి వాడెవరో విచారించి, ఆ గ్రామం వదిలే దాకా అతని ఇంట్లోనే ఉండండి. 12 మీరా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ‘శాంతి కలుగునుగాక’ అనండి. 13 ఆ ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఆ ఇంటివారికి కలుగుతుంది. లేక పోయినట్లైతే ఆ శాంతి మీకే తిరిగి వస్తుంది. 14 ఒక వేళ, మీకు ఎవ్వరూ స్వాగతం చెప్పక పోయినట్లైతే, ఆ ఇంటిని కాని లేక ఆ గ్రామాన్ని కాని వదిలి వెళ్ళేముందు మీ కాలి ధూళి దులిపి వెయ్యండి. 15 ఇది సత్యం, తీర్పు చెప్పే రోజు సొదొమ మరియు గొమొఱ్ఱా పట్టణాలకన్నా మీరు వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది.
కష్టాలను గురించి యేసు హెచ్చరించటం
(మార్కు 13:9-13; లూకా 21:12-17)
16 “తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పాపురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి. 17 కాని, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలుకొడతారు. 18 వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకు వెళ్తారు. మీరు వాళ్ళ ముందు, యూదులుకాని ప్రజలముందు నా గురించి చెప్పాలి. 19 వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు. 20 ఎందుకంటే, మాట్లాడేది మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.
21 “సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళను చంపుతారు. 22 ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరి దాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. 23 మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని యింకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్ని తిరగక ముందే మనుష్యకుమారుడు వస్తాడు.
24 “విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు. 25 విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు[a] అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా!
దేవునికి భయపడుము, జనులకు కాదు
(లూకా 12:2-7)
26 “అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి. 27 నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి.
28 “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి. 29 ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు. 30 మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. 31 అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు.
నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవద్దు
(లూకా 12:8-9)
32 “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను. 33 కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను.
యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును
(లూకా 12:51-53; 14:26-27)
34 “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. 35-36 ఎందుకంటే నేను,
‘తండ్రి కుమార్ల మధ్య,
తల్లీ కూతుర్ల మధ్య,
అత్తా కోడళ్ళ మధ్య,
విరోధం కలిగించాలని వచ్చాను.
ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’(B)
37 “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు. 38 నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు. 39 జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు.
నిన్ను ఆహ్వానించువారిని దేవడు దీవించును
(మార్కు 9:41)
40 “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే. 41 ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు. 42 మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.”
© 1997 Bible League International