Chronological
దావీదు కుమారులు
3 హెబ్రోను పట్టణంలో దావీదుకు కొందరు కుమారులు పుట్టారు. ఆ కుమారులు ఎవరనగా:
దావీదు మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి పేరు అహీనోయము. ఆమె యెజ్రెయేలుకు చెందిన స్త్రీ,
రెండవ కుమారుని పేరు దానియేలు. అతని తల్లి పేరు అబీగయీలు. ఆమె కర్మేలుకు చెందినది.
2 మూడవ కుమారుడు అబ్షాలోము. తల్మయి కుమార్తెయగు మయకా అతని తల్లి. తల్మయి గెషూరుకు రాజు.
నాల్గవ కుమారుని పేరు అదోనీయా. అతని తల్లి పేరు హగ్గీతు.
3 ఐదవ కుమారుడు షెఫట్య. అతని తల్లి పేరు అబీటలు. ఆరవవాడు ఇత్రెయాము. ఇతని తల్లి దావీదు భార్య ఎగ్లా.
4 దావీదుకు ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో జన్మించారు.
దావీదు అక్కడ ఏడు సంవత్సరాల ఆరు నెలలపాటు పాలించాడు. దావీదు యెరూషలేములో ముప్పదిమూడు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 5 దావీదుకు యెరూషలేములో పుట్టిన సంతానమెవరనగా:
బత్షెబకు నలుగురు సంతానం. వారు షిమ్యా, షోబాబు, నాతాను మరియు సొలొమోను. బత్షెబ అమ్మీయేలు కుమార్తె. 6-8 దావీదు యొక్క మరి తొమ్మండుగురు కుమారులు ఎవరనగా: ఇభారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, నెపెగు, యాఫీయ, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు. 9 వారంతా దావీదు కుమారులు. దావీదుకు ఇంకా దాసీ వలన కూడ కుమారులు కలిగారు. తామారు దావీదు కుమార్తె.
దావీదు తర్వాత యూదా రాజులు
10 సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా. ఆసా కుమారుడు యెహోషాపాతు. 11 యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు అహజ్యా. అహజ్యా కుమారుడు యోవాషు. 12 యోవాషు కుమారుడు అమజ్యా. అమజ్యా కుమారుడు అజర్యా. అజర్యా కుమారుడు యోతాము. 13 యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా. హిజ్కియా కుమారుడు మనష్షే. 14 మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.
15 యోషీయా కుమారులెవరనగా: యోహానాను మొదటి కుమారుడు. రెండవవాడు యెహోయాకీము. మూడవ కుమారుడు సిద్కియా. నాల్గవవాడు షల్లూము.
16 యెహోయాకీము సంతానంలో అతని కుమారుడు యెకొన్యా, అతని కుమారుడు సిద్కియా వున్నారు.[a]
బబులోను చెఱ తర్వాత దావీదు కుటుంబం
17 యెహోయాకీను[b] బబులోనులో బందీ అయిన పిమ్మట యెకొన్యా సంతానం ఎవరనగా: షయల్తీయేలు, 18 మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా మరియు నెదబ్యా.
19 పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా, షెలోమీతు మరియు వారి సహోదరి. 20 జెరుబ్బాబెలుకు ఐదుగురు కుమారులు. వారి పేర్లు: హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా మరియు యూషబెస్హెదు.
21 హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫయా, అర్నాను, ఓబద్యా మరియు షెకన్యా.[c]
22 షెకన్యా సంతతిలో షెమయా ఒకడు. షెమయాకు ఆరుగురు కుమారులు: వారు షెమయా, హట్టూషు, ఇగాలు బారియహు, నెయర్యా, షాపాతు.
23 నెయర్యాకు ముగ్గురు కుమారులు: వారు ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము.
24 ఎల్యోయేనై కుమారులు ఏడుగురు: వారు హోదవయా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా మరియు అనాని.
ఇతర యూదా కుటుంబ సమూహాలు
4 యూదా కుమారులు ఎవరనగా:
పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు.
2 శోబాలు కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు యహతు. యహతు కుమారులు అహూమై, లహదు అనువారు. అహూమై, లహదు వంశీయులే సొరాతీయులు. అబేయేతాము తండ్రియగు హారేపు సంతతివారెవరనగా
3 అబీయేతాము కుమారులు యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు అనేవారు. వారి సోదరి పేరు హజ్జెలెల్పోని.
4 పెనూయేలు కుమారుడు గెదోరు. ఏజెరు కుమారుడు హూషా. హూరు సంతతి వారెవరనగా:
హూరు అనువాడు ఎఫ్రాతాకు పెద్ద కుమారుడు. ఎఫ్రాతా కుమారుడు బేత్లెహేము.
5 తెకోవ తండ్రి పేరు అష్షూరు. తెకోవకు హెలా మరియు నయరా అను ఇద్దరు భార్యలు. 6 నయరాకు అహూజాము, హెపెరు, తేమని, హాయహష్తారీ అనేవారు పుట్టారు. వీరంతా అష్షూరుకు నయరావల్ల పుట్టిన కుమారులు. 7 హెలా కుమారులు జెరెతు, సోహరు, ఎత్నాను మరియు కోజు అనువారు. 8 కోజు కుమారులు ఆనూబు, జోబేబా. అహర్హేలు సంతతి వారందరికీ కోజు మూలపురుషుడు. అహర్హేలు అనేవాడు హారుము కుమారుడు.
9 యబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటె మంచివాడు. “నేనతనికి యబ్బేజు అని నామకరణం చేశాను. ఎందువల్లననగా నేనతనిని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను” అని అతని తల్లి చెప్పింది. 10 యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.
11 కెలూబు అనువాడు షూవహుకు సోదరుడు. కెలూబు కుమారుని పేరు మెహీరు. మెహీరు కుమారుని పేరు ఎష్తోను. 12 ఎష్తోను కుమారుల పేర్లు బేత్రాఫాను, పాసెయ మరియు తెహిన్నా. తెహిన్నా కుమారుని పేరు ఈర్నాహాషు.[d] వారంతా రేకా నుండి వచ్చిన వారు.
13 కనజు కుమారులు ఇద్దరు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలుకు హతతు, మెయానొతై అనే ఇద్దరు కుమారులు. 14 మెయానొతై కుమారుని పేరు ఒఫ్రా.
శెరాయా కుమారుని పేరు యోవాబు. యోవాబు కుమారుని పేరు గెహరష్షీము. (దీనినే “పని వారి లోయ” అంటారు). హస్త నైపుణ్యం గల పనివారు నివసించే చోటు గనుక ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.
15 యెపున్నె కుమారుని పేరు కాలేబు. కాలేబు కుమారులు ఈరూ, ఏలా, నయము అనేవారు. ఏలా కుమారుని పేరు కనజు.
16 యెహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అశర్యేలు అనేవారు.
17-18 ఎజ్రా కుమారుల పేర్లు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు కుమారులు మిర్యాము, షమ్మయి, ఇష్బాహు అనేవారు. ఇష్బాహు కుమారుడు ఎష్టెమోను. మెరెదు భార్య ఐగుప్తు (ఈజిప్టు) కు చెందిన స్త్రీ. ఆమెకు యెరెదు, హెబెరు, యెకూతీయేలు అను కుమారులు కలిగారు. యెరెదు కుమారుని పేరు గెదోరు. హెబెరు కుమారుని పేరు శోకో. యెకూతీయేలు కుమారుని పేరు జానోహ. బిత్యా వంశావళి ఏదనగా: బిత్యా ఫరో కుమార్తె. ఈమె ఐగుప్తు (ఈజిప్టు) దేశీయురాలు. మెరెదుకు భార్య.
19 మెరెదు మరో భార్య నహము సోదరి. మెరెదు యొక్క ఈ భార్య యూదాకు చెందిన స్త్రీ.[e] మెరెదు భార్యకు పుట్టిన కుమారులు కెయీలా, ఎష్టెమో అనే వారికి తండ్రులయ్యారు. కెయీలా గర్మీయులకు చెందినవాడు. ఎష్టెమో మాయకాతీయులకు చెందినవాడు. 20 షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను మరియు తీలోను.
ఇషీ కుమారులు జోహేతు మరియు బెన్జోహేతు.
21-22 యూదా కుమారుని పేరు షేలహు. షేలహు కుమారులు ఏరు, లద్దా, యోకీము, కోజేబావారి యోవాషు, శారాపు అనేవారు. ఏరు కుమారుని పేరు లేకా. మారేషా అను వానికి, బేత్ అషీబయలో నారబట్టలు నేయు కుటుంబాల వారికి లద్దా తండ్రి. యోవాషు, శారాపులిద్దరూ మోయాబీయుల స్త్రీలను వివాహమాడారు. పిమ్మట వారు బేత్లెహేముకు తిరిగి వెళ్లారు.[f] ఈ వంశాన్ని గురించిన వ్రాతలన్నీ మిక్కిలి ప్రాచీనమైనవి. 23 షేలహు కుమారులు కుమ్మరి పనివారు. వారంతా నెతాయీములోను, గెదేరాలోను నివసించారు. వారా పట్టణాలలో వుంటూ రాజు కొరకు పనిచేశారు.
షిమ్యోను కుమారులు
24 షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు అనేవారు. 25 షావూలు కుమారుని పేరు షల్లూము. షల్లూము కుమారుడు మిబ్శాము. మిబ్శాము కుమారుడు మిష్మా.
26 మిష్మా కుమారుడు హమ్మూయేలు. హమ్మూయేలు కుమారుడు జక్కూరు. జక్కూరు కుమారుడు షిమీ. 27 షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలిగారు. కాని షిమీ సోదరులకె వరికీ సంతానం లేదు. షిమీ సోదరులకు పెద్ద కుటుంబాలు కూడా లేవు. యూదాలో ఇతర కుటుంబాల మాదిరిగా వారి కుటుంబాలు పెద్దవి కావు.
28 షిమీ సంతానం బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను, 29 బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను, 30 బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, 31 బేత్మర్కా బేతులోను, హజర్సూసాలోను, బేత్బీరీలోను, షరాయిములోను నివసించారు. దావీదు రాజయ్యేవరకు వారా పట్టణాలలో నివసించారు. 32 ఆ పట్టణాల పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాలేవనగా ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను మరియు ఆషాను. 33 అంతేగాక బయలువరకు అనేక ఇతర గ్రామాలు కూడవున్నాయి. ఈ ప్రదేశాల్లో వారు నివసించారు. పైగా వారు తమ వంశచరిత్రను కూడా రాశారు.
34-38 ఆయా వంశాల వారి నాయకులు ఈ విధంగా ఉన్నారు: మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడగు యోషా, యావేలు, యోషిబ్యా కుమారుడైన యెహూ (యోషిబ్యా అనేవాడు శెరాయా కుమారుడు: శెరాయా తండ్రి పేరు అశీయేలు); ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా మరియు షిపి కుమారుడైన జీజా. షిపి అనేవాడు అల్లోను కుమారుడు. అల్లోను తండ్రి పేరు యెదాయా. యెదాయా తండ్రి పేరు షిమ్రీ. షిమ్రీ తండ్రి పేరు షెమయా.
ఈ మనుష్యుల కుటుంబాలన్నీ బాగా విస్తరించి పెరిగాయి. 39 వారు గెదోరుకు, ఆపై భూభాగాలకు, తూర్పున ఉన్న లోయ వరకు సంచరించారు. వారు తమ గొర్రెల మందలకు, ఆవుల మందలకు మేత బయళ్లు వెదుకుతూ ఆ ప్రాంతాల వరకు సంచరించారు. 40 పచ్చిక మెండుగా ఉన్న మంచి భూములను వారు కనుగొన్నారు. సారవంతమైన పంట భూములను కూడ వారు చూసారు. ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం విలసిల్లింది. గతంలో హాము సంతతివారు అక్కడ నివసించారు. 41 యూదా రాజు హిజ్కియా కాలంలో ఇది జరిగింది. ఆ మనుష్యులంతా గెదోరుకు వచ్చి, హామీయులతో పోరాడి, వారి గుడారాలన్నిటినీ నాశనం చేశారు. వారింకా అక్కడ నివసించే మెయోనీయులతో కూడ యుద్ధం చేసి వారిని నాశనం చేసారు. ఈనాటి వరకు అక్కడ మెయోనీయులు లేరు. తరువాత ఈ మనుష్యులే అక్కడ నివసించసాగారు. అక్కడ వారి గొర్రెలకు పుష్కలంగా మేత దొరకడంతో వారక్కడ స్థిరపడ్డారు.
42 ఐదువందల మంది షిమ్యోనీయులు కొండల ప్రాంతమైన శేయీరుకు వెళ్లారు. ఇషీ కుమారుల నాయకత్వంలో వారు వెళ్లారు. వారి పేర్లు ఏవనగా: పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు. షిమ్యోనీయులు అక్కడి స్థానిక ప్రజలతో యుద్ధం చేసారు. 43 అక్కడ చాలా కొద్దిమంది అమాలేకీయులు మాత్రమే ఉంటున్నారు. షిమ్యోనీయులు వారిని హతమార్చారు. అప్పటి నుండి ఈనాటి వరకు షిమ్యోనీయులు శేయీరులో నివసిస్తున్నారు.
రూబేనీయుల సంతతివారు
5 1-3 ఇశ్రాయేలు పెద్ద కుమారుని పేరు రూబేను. రూబేను జ్యేష్ఠ కుమారునికి అర్హమైన ప్రత్యేకాధిక్యతలు అందుకోవలసి ఉంది. కాని రూబేను తన తండ్రి భార్యలలో ఒకదానితో శయనించిన కారణంగా, ఆ ప్రత్యేక ఆధిక్యతలు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి. కావున వారి వంశావళిలో రూబేను పేరు జన్మలో మొదటివాడుగా పేర్కొనబడలేదు. వారి అన్నదమ్ములలో యూదా మిక్కిలి బలపరాక్రమాలు గలవాడు. అందువల్ల నాయకులంతా అతని కుటుంబంలో నుంచే వచ్చారు. కాని యోసేపు కుటుంబానికి జ్యేష్ఠ పుత్రునికి లభించే ప్రత్యేక ఆదరణ, ఆధిపత్యాలు లభించాయి.
రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ అనేవారు.
4 యోవేలు సంతతి ఈ విధంగా వుంది: షెమయా అనేవాడు యోవేలు కుమారుడు. షెమయా కుమారుడు గోగు. గోగు కుమారుడు షిమీ. 5 షిమీ కుమారుడు మీకా. మీకా కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు బేలు. 6 బేలు కుమారుడు బెయేర. అష్షూరు (అస్సీరియా) రాజైన తిగ్లత్పిలేసెరు బెయేరను ఇల్లు వెడలగొట్టాడు. దానితో బెయేర అష్షూరు రాజుకు బందీ అయ్యాడు. రూబేను వంశానికి బెయేర పెద్ద.
7 యోవేలు సోదరుల పేర్లు, అతని వంశావళి వారి వంశ చరిత్రలో పొందుపర్చబడినట్లే క్రమ పద్ధతిలో సరిగ్గా వ్రాయబడినాయి. అవి ఏవనగా: యెహీయేలు మొదటివాడు. తరువాత జెకర్యా మరియు 8 బెల. బెల తండ్రి పేరు ఆజాజు. ఆజాజు తండ్రి షెమ. షెమ తండ్రి పేరు యోవేలు. వారంతా అరోయేరు నుండి నెబో వరకు, బయల్మెయోను వరకు గల ప్రాంతంలో నివసించారు. 9 బెల వంశీయులు తూర్పు దిశన యూఫ్రటీసు నది ఒడ్డున అడవి అంచువరకుగల ప్రాంతంలో నివసించారు. గిలాదులో వారికి లెక్కలేనన్ని ఆవుల మందలు వున్నందున వారక్కడ నివసించసాగారు. 10 సౌలు రాజుగా ఉన్న కాలంలో బెల వంశీయులు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. తరువాత వారు హగ్రీయులకు చెందిన గుడారాలను ఆక్రమించి వాటిలో నివసించారు. గిలాదుకు తూర్పు ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయుల గుడారాలలో వారు నివసించసాగారు.
గాదు సంతతివారు
11 గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు. 12 బాషానులో యోవేలు మొదటి నాయకుడు (పెద్ద). షాపాము రెండవ నాయకుడు. పిమ్మట యహనైషాపాత్ ముఖ్యుడయ్యాడు. 13 వారి కుటుంబాలలో ఏడుగురు అన్నదమ్ములు. వారు మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ మరియు ఏబెరు. 14 వీరు అబీహాయిలు సంతతివారు. అబీహాయిలు అనేవాడు హూరీ కుమారుడు. హూరీ తండ్రి పేరు యారోయ. యారోయ తండ్రి గిలాదు. గిలాదు తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి యెషీషై, యెషీషై తండ్రి యహదో. యహదో తండ్రి బూజు. 15 అహీ అనువాడు అబ్దీయేలు కుమారుడు. అబ్దీయేలు తండ్రి పేరు గూనీ. అహీ వారి వంశ పెద్ద.
16 గాదీయులు గిలాదు ప్రాంతంలో నివసించారు. వారు బాషానులోను, దాని చుట్టుపట్ల గ్రామాలలోను, షారోను సరిహద్దు వరకు గల పొలాలలోను కూడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
17 యోతాము, యరోబాముల కాలంలో ఈ ప్రజల పేర్లన్నీ గాదు వంశ చరిత్రలో వ్రాయబడినాయి. యోతాము యూదాకు రాజు. యరోబాము ఇశ్రాయేలుకు రాజు.
యుద్ధ నైపుణ్యంగల కొందరు సైనికులు
18 మనష్షే వంశంలో సగం మందిలోను, రూబేను, గాదు వంశాలలోను మొత్తం నలుబది నాలుగువేల ఏడు వందల అరవై మంది యుద్ధ వీరులున్నారు. వారు డాళ్లను, కత్తులను చేపట్టగలవారు. వారు బాణవిద్యలో నేర్పరులు. చాకచక్యంతో యుద్ధం చేయగలవారు. 19 వారు హగ్రీయులతోను, యేతూరు, నాపీషు, నోదాబు వారితోను యుద్ధం చేశారు. 20 మనష్షే వంశం వారు, రూబేను, గాదు వంశాల ప్రజలు యుద్ధంలో దేవుని సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవునియందు విశ్వాసమున్న వారు గనుక తమకు సహాయపడమని దేవుని అర్థించారు. కావున దేవుడు వారి ప్రార్థన ఆలకించి సహాయపడ్డాడు. హగ్రీయులను యుద్ధంలో ఓడించటానికి దేవుడు వారికి సహాయం చేసాడు. హగ్రీయులతో వున్న ఇతరులను కూడ వారు ఓడించారు. 21 హగ్రీయులకు చెందిన పశు సంపదనంతా వారు వశపర్చుకున్నారు. వారు ఏబై వేల ఒంటెలను, రెండు లక్షల ఏబైవేల గొర్రెలను, రెండువేల గాడిదలను, మరియు ఒక లక్ష మంది మనుష్యులను పట్టుకున్నారు. 22 యుద్ధంలో రూబేనీయులకు దేవుని సహాయం ఉన్న కారణంగా హగ్రీయులలో చాలామంది చనిపోయారు. అప్పుడు మనష్షే, రూబేను, గాదు వంశీయులు హగ్రీయుల రాజ్యంలో నివసించసాగారు. వారక్కడ బబులోను (బాబిలోనియా) సైన్యం ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా బబులోనుకు పట్టుకుపోయే సమయం వరకు నివసించారు.
23 మనష్షే వంశం వారిలో సగంమంది బాషాను ప్రాంతంలో బెల్హెర్మోను వరకు, శెనీరు, హెర్మోను పర్వతం వరకు నివసించారు. వారి ప్రజలు అధిక సంఖ్యలో విస్తరించారు.
24 మనష్షే కుటుంబంలో ఒక సగంమంది కుటుంబ పెద్దలు ఎవరనగా ఏషెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా మరియు యహదీయేలు. వీరంతా బలపరాక్రమ సంపన్నులు, ప్రసిద్ధి గాంచిన వ్యక్తులు. వారి వారి కుటుంబాలకు వారు పెద్దలు. 25 కాని, వారి పూర్వీకులు ఆరాధించిన దేవుని పట్ల వారు పాపం చేశారు. వారు స్థిరపడినచోట వున్న విగ్రహాలనే వారు ఆరాధించటం మొదలు పెట్టారు. అటువంటి వాళ్లను దేవుడు నాశనము చేశాడు.
26 ఇశ్రాయేలు దేవుడు పూలును యుద్ధానికి పురిగొల్పాడు. పూలు అష్షూరు (అస్సీరియా) రాజు. అతనినే తిగ్లత్పిలేసెరు అని కూడ పిలుస్తారు. అతడు మనష్షే, రూబేను, గాదు వంశీయులతో యుద్ధం చేసాడు. వారిని తమ ఇండ్లు వదిలి వేసేలా బలవంతం చేసి బందీలుగా పట్టుకున్నాడు. తరువాత వారిని హాలహు, హాబోరు, హారా పట్టణాలకు, గోజాను నదీ తీరానికి తీసుకొని వెళ్లాడు. అప్పటినుండి ఈనాటికీ ఆ ఇశ్రాయేలీయుల కుటుంబాల వారు అక్కడ నివసిస్తున్నారు.
© 1997 Bible League International