Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 19-21

లేవీ వంశపు వ్యక్తి మరియు అతని దాసి

19 ఆ సమయమున, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. చాలా దూరానవున్న కొండదేశమైన ఎఫ్రాయిములో లేవీ వంశమునకు చెందిన వ్యక్తి ఉండెను. అతనికి ఒక దాసి[a] వుండెను. ఆమె అతనికి భార్యవలె ఉండెను. యూదాలోని బేత్లెహేముకు ఆ దాసి చెందింది. కాని ఆ దాసి లేవీ వంశపు వ్యక్తితో ఒక ఒడంబడిక చేసుకొంది. ఆమె అతనిని విడిచి పెట్టి, యూదాలోని బేత్లెహేములో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లింది. అక్కడ ఆమె నాలుగు నెలలపాటు ఉంది. తర్వాత ఆమె భర్త ఆమెకోసం వచ్చాడు. ఆమెతో అతను ప్రీతిపూర్వకంగా మాటలాడాడు. ఆమె మరల తన వద్దకు రావాలని అలా మాటలాడాడు. అతను తన సేవకుని, రెండు గాడిదలను తీసుకొని వెళ్లాడు. లేవీ వంశపు వ్యక్తి ఆమె తండ్రి ఇంటికి వచ్చాడు. లేవీ వంశపు వ్యక్తిని చూసి ఆమె తండ్రి బయటికి వచ్చి అతనిని అభినందించాడు. ఆమె తండ్రికి చాలా సంతోషం కలిగింది. ఆ స్త్రీ తండ్రి లేవీ వ్యక్తిని ఇంటిలోనికి తీసుకుని వెళ్లాడు. లేవీ వ్యక్తి మామ అతనిని ఇంట ఉండమని కోరాడు. అందువల్ల ఆ లేవీ వ్యక్తి మూడురోజులున్నాడు. అతను తిని, త్రాగి, మామ ఇంట నిదురించాడు.

నాలుగవ రోజున, తెల్లవారుజామున వారు మేల్కొన్నారు. లేవీ వంశపు వ్యక్తి బయలుదేరే సన్నాహంలో వున్నాడు. కాని ఆ యువతి తండ్రి తన అల్లుడితో ఇలా అన్నాడు: “మొట్టమొదట ఏమైనా తిను. నీవు తిన్న తర్వాత వెళ్లవచ్చును.” అందువల్ల లేవీ వంశపు వాడు అతని మామరు తినుటకు, త్రాగుటకు కలిసి కూర్చొన్నారు. ఆ తర్వాత మామ అతనితో, “ఈ సాయంకాలందాకా ఇక్కడే వుండి, విశ్రాంతి తీసుకుని, ఆనందించి వెళ్లవచ్చు” అన్నాడు. అందువల్ల ఆ ఇద్దరూ కలసి తిన్నారు. లేవీ వంశపువాడు వెళ్లాలని లేచాడు. కాని అతని మామ ఆ రాత్రికి ఉండిపొమ్మని అతనిని వేడుకొన్నాడు.

తర్వాత, ఐదవరోజున తెల్లవారు జామునే లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతడు బయలుదేరే సన్నాహంలో ఉన్నాడు. కాని ఆ స్త్రీ తండ్రి అల్లుడితో ఇలా చెప్పాడు: “మొదట ఏదైనా తిను. నిశ్చింతగా ఈ సాయంకాలందాకా ఉండు.” కనుక వాళ్లిద్దరూ మళ్లీ కలసి తిన్నారు.

తర్వాత లేవీ వంశపువాడు, అతని దాసి అతని సేవకుడు బయలుదేరడానికి లేచారు. కాని ఆ యువతి తండ్రి, “చాలా ప్రొద్దు పోయింది. రోజు చాలావరకు అయిపోయింది. కనుక రాత్రికి ఇక్కడే వుండి సంతోషమనుభవించు. రేపు ఉదయం నీవు తెల్లవారుజామునే మేల్కొని నీ తోవను వెళ్లు” అన్నాడు.

10 కాని లేవీ వంశపువాడు మరోరాత్రికి అక్కడ వుండదలచుకోలేదు. అతను తన రెండు గాడిదలను, తన దాసిని వెంటబెట్టుకున్నాడు. యెబూసు నగరాన్ని సమీపించాడు. (యెరూషలేముకు మరోపేరు యెబూసు). 11 ఆ రోజు చాలావరకు అయిపోయింది. యెబూసు నగరము దగ్గరికి వచ్చారు. అప్పుడు సేవకుడు తన యజమానిని చూసి, “యెబూసు నగరం వద్ద మనము ఆగిపోదాము. ఈ రాత్రికి ఇక్కడే ఉందాము” అన్నాడు.

12 కాని అతని యజమాని అయిన లేవీ వంశపు వాడు, “కాదు, మనము తెలియని నగరం లోపలికి వెళ్లకూడదు. అక్కడి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు కారు. గిబియా నగరానికి మనము వెళదాము” అన్నాడు. 13 లేవీ వంశపు వ్యక్తి, “పదండి, గిబియా లేక రామా నగరానికి వెళదాము. ఈ రెండు నగరాలలో ఒక దానిలో మనము ఈ రాత్రి గడుపుదాము” అన్నాడు.

14 అందువల్ల లేవీ వంశపువాడు, అతనితో ఉన్న మనుష్యులు ముందుకు ప్రయాణం చేశారు. గిబియా నగరమును వారు ప్రవేశించే సమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. బెన్యామీను వంశీయుల ప్రదేశంలో గిబియా ఉంది. 15 అందువల్ల వారు గిబియాలో ఆగిపోయారు. ఆ నగరములో ఆ రాత్రికి ఉండాలని వారనుకున్నారు. వారు నగరం మధ్యకు వచ్చి అక్కడ కూర్చున్నారు. కాని ఎవ్వరూ వారిని తమ ఇంటికి రమ్మని పిలవలేదు.

16 ఆ సాయంకాలం పొలంనుంచి ఒక వృద్ధుడు నగరములోనికి వచ్చాడు. అతని ఇల్లు కొండ దేశమయిన ఎఫ్రాయిములో ఉంది. కాని ఇప్పుడతను గిబియా నగరములో నివసిస్తున్నాడు. (గిబియా మనుష్యులు బెన్యామీను వంశమునకు చెందిన వారు). 17 ఆ వృద్ధుడు లేవీ వంశపువాడయిన ఆ ప్రయాణికుని చూశాడు. ఆ వృద్ధుడు, “మీరెక్కడికి వెళ్తున్నారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని ప్రశ్నించాడు.

18 లేవీ వంశపువాడు ఇలా సమాధానం చెప్పాడు: “మేము యూదాలోని బేత్లెహేమునుంచి ప్రయాణం చేస్తున్నాము. మేము స్వగృహానికి వెళ్తున్నాము. అయితే ఈ రాత్రి ఎవరూ మమ్ములను ఉండమని ఆహ్వానించలేదు. ఎఫ్రాయిము కొండదేశానికి వెనకవున్న వాళ్లము మేము. 19 మా గాడిదలకు తగినంత గడ్డి ఆహారం వున్నాయి. మాకు రొట్టె, మద్యము వున్నాయి. అంటే, నాకు, యువతికి మరియు నా సేవకుడికి. మాకేమీ అవసరము లేదు.”

20 వృద్ధుడు ఇలా చెప్పాడు: “నీవు మా ఇంట్లో ఉండవచ్చు. నీకు కావలసిందంతా నేనిస్తాను. నగర మధ్యలో మాత్రం రాత్రివేళ ఉండకూడదు.” 21 తర్వాత లేవీ వంశపువానిని, అతని మనుష్యుల్ని అతను తన ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతని గాడిదలకు ఆయన మేత పెట్టాడు. వారు కాళ్లు కడుగుకున్నారు. ఆ తర్వాత తినుటకు, త్రాగుటకు అతడు వారికిచ్చాడు.

22 ఆ లేవీ వంశపు వ్యక్తి, అతనితో వున్న మనుష్యులు సంతోషంగా వుండగా, ఆ నగరానికి చెందినవారు కొందరు ఇంటిని చుట్టుముట్టారు. వారు దుర్జనులు. వారు తలుపు కొట్టసాగారు. ఆ ఇంటి స్వంతదారైన వృద్ధుని వుద్దేశించి కేకలు వేయసాగారు. వారు ఇలా అన్నారు; “మీ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని వెలుపలికి తీసుకొని రా. మేమతనితో సంభోగింపదలచాము.”

23 వృద్ధుడు వెలుపలికి పోయి ఆ దుర్జనులతో మాటలాడాడు: “వద్దు, నా స్నేహితులారా! అటువంటి చెడ్డ పనులు చేయవద్దు. అతను మా ఇంటి అతిథి. ఈ మహా పాపకృత్యం మీరు చేయవద్దు అన్నాడు. 24 ఇదుగో చూడండి. ఇక్కడ నా కుమార్తె ఉంది. ఆమెకి ఇంతకు మునుపెన్నడూ సంభోగమంటే ఏమో తెలియదు. ఆమెను నేను వెలుపలికి తీసుకు వస్తాను. మరియు అతని దాసిని కూడ బయటికి తీసుకు వస్తాను. మీ ఇష్టమొచ్చినట్లు వారికి చేయవచ్చు. కాని మా యింటికి వచ్చిన వ్యక్తితో పాపకృత్యం చేయవద్దు” అన్నాడు.

25 కాని ఆ చెడ్డ మనుష్యులు వృద్ధుని మాటలు వినదలచుకోలేదు. అందువల్ల లేవీ వంశపువాడు తన దాసిని వెలుపలికి తీసుకువెళ్లి, ఆమెను చెడ్డవారి చెంత ఉంచాడు. ఆ చెడ్డవారు ఆ రాత్రి అంతా ఆమెను బలాత్కరించారు. తర్వాత తెల్లవారుజామున ఆమెను విడిచిపెట్టారు. 26 తెల్లవారుజామున తన యజమాని నివసిస్తున్న ఇంటికి ఆమె వచ్చింది. ఆమె తలుపు ముందు పడిపోయింది. ఆమె అక్కడే వెలుతురు వచ్చేవరకు పడివుంది.

27 ఉదయాన లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతను ఇంటికి వెళ్లాలని అనుకొన్నాడు. వెలుపలికి వెళ్లుటకుగాను తలుపు తెరిచాడు. గడపవద్ద ఒక చేయి ఉంది. అక్కడ అతని దాసి ఉంది. 28 లేవీ వంశపువాడు, “లే, మనం వెళ్లిపోదాం” అన్నాడు. కాని ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె చనిపోయింది.

లేవీ వంశపు వాడు తన దాసిని గాడిదమీద వేసుకొని ఇంటికి వెళ్లాడు. 29 అతను ఇల్లు చేరుకోగానే ఒక కత్తి తీసుకొని దాసిని పన్నెండు భాగాలుగా ఖండించాడు. తర్వాత అతను ఆ పన్నెండు భాగాలను ఇశ్రాయేలు ప్రజలు నివసించిన అన్ని ప్రదేశాలకు పంపించాడు. 30 ఇది చూసిన వారు, “ఇశ్రాయేలులో ఇంతకు మునుపు ఎన్నడూ ఇలా జరగలేదు, ఈజిప్టునుంచి మనం వచ్చిన నాటినుండి మనం ఇప్పటివరకు ఇలాంటిది చూచి వుండలేదు. దీన్ని గురించి చర్చించి మనమేమి చేయాలో చెప్పండి” అన్నారు.

ఇశ్రాయేలుకీ బెన్యామీనుకీ మధ్య యుద్ధం

20 అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకమైనారు. వారందరూ మిస్పా నగరంలోని యెహోవా సమక్షమున నిలబడుటకు కలిసివచ్చారు. ఇశ్రాయేలులోని ప్రతిచోటునుండి వచ్చారు. గిలాదులోని ఇశ్రాయేలు మనుష్యులు కూడా వచ్చారు. ఇశ్రాయేలులోని వివిధ వంశాల నాయకులూ వచ్చారు. దేవుని ప్రజలు బహిరంగ సభలో వారు తమతమ స్థానములు అలంకరించారు. నాలుగు లక్షల సైనికులు కత్తులతో ఆ చోట వున్నారు. బెన్యామీను వంశమునకు చెందిన మనుష్యులు ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో సమావేశమైన విషయం తెలుసుకొనిరి. “ఈ భయంకర విషయం ఎలా జరిగిందో మాకు చెప్పండి” అని ఇశ్రాయేలు ప్రజలన్నారు.

అప్పుడు చంపబడిన ఆ స్త్రీ భర్త వారితో జరిగిన కథ చెప్పాడు. అతను ఇలా అన్నాడు, “నా దాసి, నేనూ బెన్యామీను ప్రదేశంలోని గిబియా నగరమునకు వచ్చాము. మేమారాత్రి అక్కడ గడిపాము. కాని రాత్రి సమయాన గిబియా నగరపు నాయకులు నేను నివసించే ఇంటికి వచ్చారు. వారు ఇల్లు చుట్టుముట్టారు. నన్ను కూడాలి అనుకున్నారు. వారు నా దాసిని బలాత్కరించారు. ఆమె చనిపోయింది. అందువల్ల నా దాసిని తీసుకుని వచ్చి, ఈమెను పన్నెండు భాగాలుగా ఖండించితిని. తర్వాత ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క వంశంవారికి పంపించాను. నేను మనము స్వీకరించిన పన్నెండు ప్రదేశాలకు పన్నెండు భాగాలను పంపించాను. ఎందుకు చేశాననగా బెన్యామీను ప్రజలు ఈ భయంకర విషయాన్ని ఇశ్రాయేలులో జరిగించారు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలారా, మాట్లాడండి. మనమేమి చేయవలెనో మీరు నిర్ణయం తీసుకోండి.”

ఒకేసారి, అందరు మనుష్యులు లేచి నిలబడ్డారు. ముక్తకంఠంతో అన్నారు: “మేమెవ్వరమూ ఇళ్లకి వెళ్లము. అవును. మాలో ఏ ఒక్కరూ తన ఇంటికి తిరిగి వెళ్లడు. ఇప్పుడు గిబియా నగరానికి ఇలా చేద్దాము. ఆ ప్రజల్ని ఏం చేయాలో దేవుడు తోవ చూపడానికి చీట్లు వేద్దాము. 10 ఇశ్రాయేలు విభిన్న వంశాల నుండి ప్రతి వంద మందిలోనుండి పదిమందిని ఎన్నుకుందాము. ప్రతి వేయి మంది నుండి వంద మందిని ఎన్నుకుందాము. ప్రతి పదివేల మందినుండి వేయి మందిని ఎన్నుకుందాము. మనము ఎంపిక చేసిన ఆ మనుష్యులు సైన్యం కోసం పనులు చేస్తారు. తర్వాత బెన్యామీను ప్రదేశంలోని గిబియా నగరానికి సైన్యం తరలి వెళుతుంది. ఇశ్రాయేలు ప్రజల సైన్యం భయంకరమైన ఈ విషయం జరిపిన ఆ మనుష్యుల్ని శిక్షిస్తుంది.”

11 అందువల్ల ఇశ్రాయేలుకి చెందిన వారందరూ గిబియా నగరానికి చేరారు. వారేమి చేస్తున్నారో, దానికి వారందరూ సమ్మతించారు. 12 ఇశ్రాయేలు ప్రజలు ఒక సందేశమిచ్చి బెన్యామీను వారి వద్దకు పంపించారు. ఆ సందేశమేమనగా, “మీకు చెందిన కొందరు మనుష్యులు చేసిన ఈ ఘోర కృత్యమేమిటి? 13 గిబియా నగరం నుంచి ఆ దుర్జనుల్ని మా వద్దకు పంపండి. వారిని మాకు అప్పజెప్పండి. మేము వారిని చంపుతాము. ఇశ్రాయేలు ప్రజలనుండి ఆ పాపాన్ని తొలగించదలచాము.”

కాని బెన్యామీను వంశానికి చెందిన వారు తమ బంధువులు పంపిన ఆ సందేశాన్ని వినదలచుకోలేదు. ఆ బంధువులు ఇశ్రాయేలులోని ఇతర ప్రజలు. 14 బెన్యామీను వంశంవారు తమ నగరములు విడిచి గిబియా నగరమునకు వెళ్లారు. ఇశ్రాయేలులోని ఇతర వంశాలకు చెందినవారితో పోరాడాలని వారు గిబియా వెళ్లారు. 15 బెన్యామీను వంశం వారు ఇరవై ఆరువేలమంది సైనికుల్ని సమకూర్చుకున్నారు. ఆ సైనికులందరూ యుద్ధానికి తర్ఫీదు పొందినవారు. వారు గిబియా నగరం నుండి ఏడువందల మంది తర్ఫీదు పొందిన సైనికులను సమకూర్చుకున్నారు. 16 పైగా ఎడమ చేతి వాటం గల ఏడువందల మంది తర్ఫీదు పొందిన సైనికులు కూడా ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ చాలా సామర్థ్యంతో వడిసెలను ఉపయోగించగలరు. వారందరూ వడిసెలతో తలవెంట్రుక మీదకి గురి తప్పకుండా రాయి విసరిగలిగేవారు.

17 బెన్యామీను తప్ప మిగిలిన ఇశ్రాయేలు వంశాల వారు మొత్తం మీద నాలుగు లక్షల మంది వీరయోధుల్ని సమకూర్చుకున్నారు. ఆ నాలుగు లక్షల మంది వద్ద ఖడ్గాలున్నాయి. ప్రతి ఒక్కరూ సుశిక్షితుడైన సైనికుడు. 18 ఇశ్రాయేలు ప్రజలు బేతేలు నగరం దాకా వెళ్లారు. బేతేలు వద్ద వారు దేవుని ఇలా అడిగారు: “బెన్యామీను వంశం వారిని ఏ వంశం వారు మొదట ఎదుర్కోవాలి?”

“యూదా వంశం వారు మొదట ఎదుర్కొంటారు” అని యెహోవా బదులు చెప్పాడు.

19 ఆ మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు మేల్కొన్నారు. గిబియా నగరం వద్ద ఒక గుడారం వేశారు. 20 తర్వాత ఇశ్రాయేలు సైన్యం బెన్యామీను సైన్యాన్ని ఎదుర్కోడానికి గిబియా నగరం వద్దకి తరలివెళ్లింది. 21 ఆ తర్వాత బెన్యామీను సైన్యం గిబియా నగరం నుండి బయటికి వచ్చింది. బెన్యామీను సైన్యం ఆ రోజు జరిగిన యుద్ధంలో ఇరవై రెండు వేలమంది ఇశ్రాయేలు సైనికుల్ని హతమార్చింది.

22-23 ఇశ్రాయేలీయులు యెహోవావద్దకు వెళ్లారు. సాయంకాలందాకా విలపించారు. వారు యెహోవాను అడిగారు; “బెన్యామీను ప్రజలతో మళ్లీ మేము యుద్ధం చేయాలా? ఆ మనుష్యులు మా బంధువులు.”

“వెళ్లి, వాళ్లతో యుద్ధం చేయండి” అని యెహోవా సమాధానమిచ్చాడు. ఇశ్రాయేలు మనుష్యులు ఒకరినొకరిని ప్రోత్సాహ పరుచుకున్నారు. మొదటి రోజున చేసినట్లుగా, వారు మళ్లీ యుద్ధానికి తరలి వెళ్లారు.

24 అప్పుడు బెన్యామీను సైన్యం దగ్గరికి ఇశ్రాయేలు సైన్యం వచ్చింది. ఇది యుద్ధం రెండవరోజు. 25 రెండవరోజున సైన్యాన్ని ఎదుర్కొనాలని గిబియా నగరం వెలుపలికి బెన్యామీను సైన్యం వచ్చింది, బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైన్యంలోని పద్దెనిమిది వేలమందిని చంపివేసింది. ఇశ్రాయేలు సైన్యంలోని మనుష్యులు సుశిక్షితులైన సైనికులు.

26 తర్వాత ఇశ్రాయేలు మనుష్యులందరు బేతేలు నగరం దాకా వెళ్లారు. ఆ చోట వారు కూర్చుని యెహోవాను పిలిచారు. సాయంకాలంవరకు ఆ రోజు వారేమీ తినలేదు. వారు దహన బలులు సమాధాన బలులను అర్పించారు. 27 ఇశ్రాయేలు మనుష్యులు యెహోవాను ఒక ప్రశ్న అడిగారు. (ఆ రోజుల్లో దేవుని ఒడంబడిక పెట్టె బేతేలులో ఉంది. 28 ఫినెహాసు యాజకునిగా వుండి దేవుణ్ణి సేవిస్తూ వున్నాడు. ఫినెహాసు ఎలీయాజరు కుమారుడు ఎలీయాజరు అహరోను కుమారుడు) ఇశ్రాయేలు ప్రజలు ఇలా అడిగారు: “బెన్యామీను ప్రజలు మా బంధువులు. మళ్లీ మేము వారిని ప్రతిఘటించడానికి వెళ్లవలెనా? లేకపోతే మేము యుద్ధం ఆపివేయవలెనా?”

యెహోవా, “వెళ్లండి, రేపు వారిని ఓడించేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు.

29 తర్వాత ఇశ్రాయేలు సైన్యం గిబియా నగరం పరిసరాలలో కొందరు మనుష్యులను దాచి ఉంచింది. 30 మూడో రోజున ఇశ్రాయేలు సైన్యం గిబియా నగరంతో యుద్ధానికి తలపడింది. అంతకు మునుపు చేసినట్లుగా, వారు యుద్ధ సన్నద్ధులయ్యారు. 31 బెన్యామీను సైన్యం గిబియా నగరం వెలుపలికి వచ్చింది, ఇశ్రాయేలు సైనికుల్ని ఎదుర్కొనడానికి. ఇశ్రాయేలు సైన్యం వెనుకకు మరలింది. బెన్యామీను సైన్యం తమను తరుముకు రావాలని అలా చేసింది. ఈ విధంగా బెన్యామీను సైన్యం నగరానికి చాలా దూరంలో ఉండాలని మాయోపాయం పన్నబడింది.

బెన్యామీను సైన్యం, తాము పూర్వం చేసినట్లుగా, ఇశ్రాయేలు సైనికుల్ని చంపడం మొదలు పెట్టింది. ఇశ్రాయేలుకి చెందిన సుమారు ముఫ్పై మందిని చంపివేయడం జరిగింది. పొలాలలో ఉండేవారిని కొందరిని చంపివేశారు. రాజమార్గం మీద ఉన్న వారిని కొందరిని చంపివేశారు. ఒక రాజమార్గం బేతేలు నగరానికి వెళుతుంది. మరొక రాజమార్గం గిబియా నగరానికి వెళుతుంది. 32 “పూర్వంలా మనం జయిస్తున్నాము” అని బెన్యామీను మనుష్యులు అనుకున్నారు.

ఇశ్రాయేలు మనుష్యులు పరుగు పెట్టుచున్నారు. కాని అదొక యుక్తి, బెన్యామీను మనుష్యులు తమ నగరమునుండి రాజమార్గం మీదికి రావాలని వారు అభిలాషించారు. 33 అందువల్ల అందరు మగవాళ్లూ పరుగెత్తారు. వారు బయల్తామారు అనే చోట ఆగారు. ఇశ్రాయేలుకి చెందిన కొందరు మనుష్యులు గిబియాకి పడమరగా దాగుకొని ఉన్నారు. వారు తాము దాగిన స్థలములనుండి పరుగెత్తి గిబియాను ఎదుర్కొన్నారు. 34 ఇశ్రాయేలుకి చెందిన సుశిక్షితులైన పదివేల మంది సైనికులు గిబియా నగరాన్ని ఎదుర్కొన్నారు. యుద్ధం చాలా ఘోరంగా ఉంది. కాని బెన్యామీను సైన్యానికి ఏమి భయంకరమైన సంఘటన జరుగుతుందో తెలియదు.

35 ఇశ్రాయేలు సైన్యాన్ని ఉపయోగించి యెహోవా బెన్యామీను సైన్యాన్ని ఓడించాడు. ఆనాడు ఇశ్రాయేలు సైన్యం ఇరవై అయిదువేల వంద మంది బెన్యామీను సైనికులను చంపివేసింది. ఆ సైనికులందరూ యుద్ధానికి తర్ఫీదు పొందినవారే. 36 అందువల్ల బెన్యామీను ప్రజలు తాము ఓడిపోయినట్లుగా గ్రహించారు.

ఇశ్రాయేలు సైన్యం వెనుదిరిగింది. వారు ఎందుకు వెనుదిరిగారనగా, అశ్చర్యకరమైన దాడిమీద వారు ఆధారపడి ఉన్నారు. గిబియా వద్ద వారి మనుష్యులు కొందరు దాగి ఉన్నారు. 37 దాగివున్న మనుష్యులు గిబియా నగరం వైపు హడావిడిగా పోయారు. వారు అటూ ఇటూ వెళ్లి నగరంలో వున్న ప్రతివాడినీ కత్తులతో చంపివేశారు. ఇప్పుడు 38 ఇశ్రాయేలు మనుష్యులు దాగివున్న మనుష్యుల ద్వారా ఒక యుక్తిపన్నారు. దాగివున్న మనుష్యులు ఒక ప్రత్యేక సూచన పంపాలి. ఒక పెద్ద పొగమేఘం వారు కల్పించాలి.

39-41 బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైనికుల్ని సుమారు ముఫ్పై మందిని చంపారు. అందువల్ల, బెన్యామీను మనుష్యులు ఇలా అన్నారు; “మునుపటివలె మేము జయిస్తున్నాము” కాని అప్పుడు ఒక పెద్ద పొగ మేఘం నగరంనుండి వెలువడింది. బెన్యామీను మనుష్యులు చుట్టూ తిరిగి పొగచూశారు. నగరమంతా దగ్ధమవుతోంది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం పరుగిడిపోవడం ఆపివేశారు. వారు చుట్టు తిరిగి యుద్ధం చేయసాగారు. బెన్యామీను ప్రజలు భయపడ్డారు. అప్పుడు తమకు భయంకరమైన విషయం జరిగినట్లుగా వారు తెలుసుకున్నారు.

42 అందువల్ల బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైన్యంనుంచి పారిపోయింది. వారు ఎడారివైపు పారిపోయారు. కాని వారు యుద్ధం నుంచి తప్పించుకొనలేకపోయారు. ఇశ్రాయేలు మనుష్యులు తమ నగరాలనుండి వెలుపలికి వచ్చి వారిని చంపారు. 43 ఇశ్రాయేలు మనుష్యులు బెన్యామీను మనుష్యుల్ని చుట్టు ముట్టారు. వారిని వెంటాడసాగారు. వారిని ఆగనీయకుండా తరిమి, గిబియా తూర్పు ప్రదేశాన వారిని వారు ఓడించారు. 44 అందువల్ల బెన్యామీను సైన్యానికి చెందిన పద్దెనిమిది వేలమంది బలవంతులైన వీరయోధులు చంపబడ్డారు.

45 బెన్యామీను సైన్యం ఎడారి వైపుకి పరుగెత్త సాగింది. రిమ్మోనుబండ వద్దకు వారు పరుగెత్తారు. కాని ఇశ్రాయేలు సైన్యం బెన్యామీను తాలూకు ఐదువేల మంది వీరుల్ని, రాజమార్గం పక్కనున్న వారిని చంపింది. బెన్యామీను మనుష్యుల్ని వారు వెంటాడసాగారు. గిదోము అనే పేరుగల ప్రదేశం దాకా వారిని వెంటాడారు. అక్కడ ఇశ్రాయేలు సైన్యం బెన్యామీనుకు చెందిన రెండువేల మందిని చంపివేసింది.

46 ఆనాడు, బెన్యామీను సైన్యంలోని ఇరవై ఐదువేల మంది మనుష్యులు చంపబడ్డారు. వారందరూ తమ ఖడ్గాలతో వీరోచితంగా పోరాడారు. 47 కాని బెన్యామీను తాలూకు ఆరువందల మంది ఎడారికి పారిపోయారు. వారు రిమ్మోను బండ అనే ప్రదేశంవరకు వెళ్లి, అక్కడ నాలుగు నెలల పాటు ఉన్నారు. 48 ఇశ్రాయేలు మనుష్యులు బెన్యామీను దేశానికి తిరిగి వెళ్లారు. ఎదురైన భూమిలోని ప్రతి మనిషిని వారు చంపారు. వారు జంతువులనన్నిటినీ చంపారు. తమకు కనిపించిన వాటిని అన్నిటినీ వారు నాశనం చేశారు. వారు వచ్చిన ప్రతి నగరాన్నీ దగ్ధం చేశారు.

బెన్యామీను మనుష్యులు భార్యలను పొందటం

21 మిస్పా వద్ద ఇశ్రాయేలు మనుష్యులు ఒక ప్రతిజ్ఞ చేశారు. అది ఏదనగా, “బెన్యామీను కుటుంబ వంశంవారికి చెందిన ఏ ఒక్కడూ కూడా ఇశ్రాయేలు వాళ్ల కుమార్తెలను వివాహము చేసుకోనియ్యము.”

ఇశ్రాయేలు మనుష్యులు బేతేలు నగరానికి వెళ్లారు. అక్కడ సాయంకాలంవరకు వారు దేవుని ముందు కూర్చొని పెద్దగా ఏడ్చారు. వారు దేవునితో, “యెహోవా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడవు. ఈ భయంకరమైన విషయం మాకెందుకు సంభవించింది? ఎందుకుగాను ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశపు వారు తీసుకు వెళ్లబడ్డారు” అని అడిగారు.

ఆ మరుసటి రోజు ఉదయం ఇశ్రాయేలు ప్రజలు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం మీద వారు దహన బలులు, సమాధాన బలులు దేవునికి సమర్పించారు. “యెహోవా సమక్షంలో మమ్మల్ని కలుసుకోవడానికి రాని ఇశ్రాయేలు వంశాలవారెవరైనా ఉన్నారా?” అని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ చేశారు కనుక, వారీ ప్రశ్న అడిగారు. ఇతర ఇశ్రాయేలీయుల వంశముల నుండి మిస్పా నగరం రాకుంటే వారిని హతమార్చుతామని వారు ప్రతిజ్ఞ చేశారు.

అప్పుడు బెన్యామీను ప్రజలైన తమ బంధువుల నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలు విచారించారు. వారు ఇలా అన్నారు: “నేడు ఇశ్రాయేలు నుండి ఒక వంశం వేరు చేయబడింది. మేము యెహోవా సమక్షాన ఒక ప్రతిజ్ఞ చేశాము. బెన్యామీను మనుష్యులలో ఎవ్వరినీ మా కుమార్తెలలో ఎవ్వరూ వివాహము చేసుకోరాదని ప్రతిజ్ఞ చేశాము. అందువల్ల బెన్యామీను మనుష్యులకు భార్యలు ఎలా కలుగుతారో మేము నిస్సందేహంగా ఎలా చెప్పగలము?” అని అన్నారు.

అప్పుడు ఇశ్రాయేలు మనుష్యులు, “ఇశ్రాయేలుకి చెందిన ఏ వంశం వారు మిస్పాకి రాలేదు? మేము దేవుని సమక్షమున ఏకమైనాము. ఒక వంశం ఇక్కడికి రాలేదని మేము అనుకొంటున్నాము” అని అడిగారు. ఆ తర్వాత యాబేష్గీలాదు నగరం నుండి ఎవ్వరూ వచ్చి ఇశ్రాయేలుకి చెందిన ఇతరుల్ని కలుసుకోలేదని వారు కనుగొన్నారు. ఎవరున్నారో, ఎవరు లేరో అని తెలుసుకునేందుకు ఇశ్రాయేలు మనుష్యులు అందరినీ లెక్క పెట్టారు. యాబేష్గీలాదు నుండి ఎవ్వరూ అక్కడ లేరని వారు కనుగొన్నారు. 10 అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు పన్నెండువేల మంది సైనికులను యాబేష్గిలాదు నగరానికి పంపించారు. ఆ సైనికులతో వారు, “యాబేష్గిలాదుకు వెళ్లండి. అక్కడున్న ప్రతి వ్యక్తినీ స్త్రీలను పిల్లలను మీ ఖడ్గాలతో సంహరించండి. 11 మీరు ఇది చెయ్యాలి. యాబేష్గిలాదులో ఉన్న ప్రతి వ్యక్తినీ మీరు చంపాలి. పైగా పురుషునితో సంభోగించిన ప్రతి స్త్రీని కూడా మీరు చంపాలి. కాని పురుషునితో సంభోగము ఎరగని ఏ స్త్రీనీ మీరు చంపకూడదు.” అని చెప్పారు. 12 ఆ పన్నెండువేల మంది సైనికులు యాబేష్గిలాదులో నాలుగువందల మంది యువతులు ఏ పురుషునితోను సంభోగించలేదని తెలుసుకున్నారు. ఆ సైనికులు ఆ యువతులను షిలోహు ప్రాంతానికి తీసుకు వచ్చారు. షిలోహు కనాను ప్రదేశంలో ఉన్నది.

13 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీను వారికి ఒక సందేశం పంపించారు. బెన్యామీను మనుష్యులతో సంధి చేసుకుంటామన్నారు. బెన్యామీను మనుష్యులు రిమ్మోను బండ అనేచోట ఉన్నారు. 14 అందువల్ల బెన్యామీను మనుష్యులు ఇశ్రాయేలుకి తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు యాబేష్గిలాదులో తాము చంపని స్త్రీలను వారికి ఇచ్చారు. కాని బెన్యామీను పురుషులకందరికీ సరిపడ్డ స్త్రీలు లేరు.

15 బెన్యామీను పురుషుల్ని తలచుకుని ఇశ్రాయేలు ప్రజలు విచారించారు. ఇశ్రాయేలుకి చెందిన ఇతర వంశాల నుండి వాళ్లను యెహోవా వేరు చేసినందుకు వారు విచారించారు. 16 ఇశ్రాయేలు ప్రజల నాయకులు ఇలా అన్నారు; “బెన్యామీను వంశానికి చెందిన స్త్రీలు చంపబడ్డారు. ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు మేము భార్యల్ని ఎలా తేగలము? 17 ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు వారి వంశాలు కొనసాగేందుకుగాను పిల్లలు ఉండాలి. ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశం మరణించకుండా ఉండడానికి ఇది చేయబడాలి. 18 కాని మేము మా కుమార్తెలు బెన్యామీను పురుషుల్ని వివాహము చేసుకోనియ్యము. మేము ఈ ప్రతిజ్ఞ చేశాము, ‘ఎవరైనా సరే బెన్యామీను పురుషునికి భార్యనిస్తే, అతనికి చెరుపు కలుగుతుంది.’ 19 మాకో ఆలోచన ఉంది. షిలోహు నగరంలో ఇప్పుడు యెహోవాకు ఉత్సవం జరిగే కాలం. అక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవం జరుగుతుంది.” (షిలోహు నగరం బేతేలు నగరానికి ఉత్తరాన ఉంది, బేతేలునుంచి షెకెముకు పోయే బాటకి తూర్పున వుంది. అది లెబోనా నగరానికి దక్షిణాన ఉంది.)

20 అందువల్ల బెన్యామీను మనుష్యులకి పెద్దలు (నాయకులు) తమ ఆలోచన తెలియజేశారు. “వెళ్లండి ద్రాక్షతోటల్లో దాగుకొనండి. 21 ఉత్సవంలో షిలోహునుండి యువతులు వచ్చి నాట్యంలో పాల్గొంటారు. వేచివుండండి. మీరే ద్రాక్షాతోటల్లో దాగి ఉన్నారో, అక్కడినుండి మీరు పారిపోండి. మీలో, ప్రతి ఒక్కడూ షిలోహు నగరానికి చెందిన ఒక యువతిని తీసుకునివెళ్లాలి. ఆ యువతుల్ని బెన్యామీను నగరానికి తీసుకుని వెళ్లండి, వివాహము చేసుకోండి. 22 ఆ యువతుల తండ్రులుగాని సోదరులుగాని వెలుపలికి వచ్చి, మాకు ఇది ఫిర్యాదు చేస్తారు. అప్పుడు, ‘బెన్యామీను పురుషుల ఎడల దయకలిగి ఉండండి. వారు ఆ యువతుల్ని వివాహము చేసుకోనివ్వండి. వారు ఈ స్త్రీలను తీసుకున్నారు. కాని మీతో యుద్ధం చెయ్యలేదు. వారు స్త్రీలను తీసుకువెళ్లారు. అందువల్ల దేవునివద్ద చేసిన ప్రతిజ్ఞ మీరు ఉల్లంఘించలేదు. వారికి ఆ యువతులను ఇచ్చి వివాహము చెయ్యమని మీరు ప్రతిజ్ఞ పట్టారు. బెన్యామీను పురుషులకు మీరా యువతులను యివ్వలేదు. వారు మీ వద్దనుంచే ఆ యువతుల్ని తీసుకువెళ్లారు. అందువల్ల మీరు మీ ప్రతిజ్ఞ తప్పలేదు.’” అన్నారు.

23 అందువల్ల బెన్యామీను వంశపు మనుష్యులు చేసినది అదే. ఆ యువతులు నాట్యం చేసేటప్పుడు, ప్రతి పురుషుడూ వారిలో ఒక్కొక్కరిని పట్టుకున్నాడు. ఆ యువతులను వారు తీసుకుపోయి, వివాహము చేసుకున్నారు. వారు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆ దేశంలో బెన్యామీను మనుష్యులు మళ్లీ నగర నిర్మాణం చేసుకున్నారు, వారా భూమిలోనే నివసించారు. 24 తర్వాత ఇశ్రాయేలు మనుష్యులు ఇళ్లకు వెళ్లిపోయారు. వారు తమ దేశానికి, తమ వంశం వద్దకు వెళ్లారు.

25 ఆ రోజుల్లో ఇశ్రాయేలు మనుష్యులకు రాజు లేడు. అందువల్ల ప్రతి ఒక్కడూ తనకు ఏది సరి అని తోచిందో, అదే చేశాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International