Chronological
ఇశ్రాయేలీయులు దావీదును రాజు చేయటం
5 అప్పుడు ఇశ్రాయేలు వంశాల వారందరూ హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నారు: “చూడండి; మనమంతా ఒకే కుటుంబం![a] 2 గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యుద్ధాలలో నీవు మమ్ములను నడిపించావు. మరియు ఇశ్రాయేలును యుద్ధము నుంచి ఇంటికి తిరిగి రప్పించావు. ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు కాపరివవుతావు. ఇశ్రాయేలుకు పాలకుడవవుతావు’ అని యెహోవా నీకు చెప్పాడు.”
3 ఇశ్రాయేలు నాయకులంతా హెబ్రోనులో ఉన్న దావీదు రాజు వద్దకు వచ్చారు. దావీదు రాజు హెబ్రోనులో ఆ వచ్చిన నాయకులతో యెహోవా సమక్షంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడా నాయకులంతా దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించారు.
4 పరిపాలన చేపట్టే నాటికి దావీదు ముప్పది సంవత్సరాల వాడు. అతడు నలుబది సంవత్సరాలు పాలించాడు. 5 హెబ్రోనులో వుండి యూదా రాజ్యాన్ని ఏడు సంవత్సరాల, ఆరు నెలలు పాలించాడు. పిమ్మట యెరూషలేము నుంచి ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను ముప్పదిమూడు సంవత్సరాలు పాలించాడు.
దావీదు యెరూషలేమును జయించుట
6 రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులుదేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు). యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు.[b] ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు”[c] అని అన్నారు. 7 కాని దావీదు సీయోను కోటను[d] వశపర్చుకున్నాడు. తరువాత దానినే దావీదు నగరం అని పిలవటం మొదలు పెట్టారు.
8 ఆ రోజు దావీదు తన మనుష్యులతో, “మీరు యెబూసీయులను ఓడించాలంటే నీటి సొరంగం[e] ద్వారా ఆ ‘కుంటి మరియు గ్రుడ్డి’ శత్రువుల వద్దకు వెళ్లండి” అని అన్నాడు. అందువల్లనే, “కుంటి, గ్రుడ్డివారు ఇంట్లోకి[f] రాలేరని” అంటారు.
9 దావీదు కోటలో నివసించి, దానిని “దావీదు నగరం” అని పిలిచాడు. మిల్లో[g] నుండి చుట్టు పక్కల అనేక భవనాలను దావీదు కట్టించాడు. సీయోను నగరంలో కూడా అనేక కట్టడాలను చేపట్టి లోపల బాగా అభివృద్ధి చేశాడు. 10 సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడైయున్నందున, దావీదు క్రమంగా బలపడి వర్థిల్లాడు.
ఇశ్రాయేలుకు దావీదు రాజవటం
11 ఇశ్రాయేలు ప్రజానీకం హెబ్రోను పట్టణంలో దావీదు వద్దకు వెళ్లారు. వారు దావీదుతో ఇలా అన్నారు: “మేము నీ రక్త మాంసాలను పంచుకు పుట్టిన వాళ్లం (బంధువులం). 2 గతంలో మమ్మల్ని నీవు యుద్ధంలో నడిపించావు. సౌలు రాజుగా వున్నప్పటికీ మమ్మల్ని నడిపిన వాడవు నీవే! యెహోవా నీతో, ‘దావీదూ, ఇశ్రాయేలీయులైన నా ప్రజల కాపరివి నీవే. నా ప్రజలకు నీవు నాయకుడివవుతావు’ అని అన్నాడు.”
3 ఇశ్రాయేలు పెద్దలంతా హెబ్రోను పట్టణంలో దావీదు రాజువద్దకు వచ్చారు. యెహోవా సన్నిధిలో ఆ పెద్దలతో దావీదు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. పెద్దలు దావీదు తలమీద నూనె పోసి అభిషిక్తుని చేశారు. ఆ పని దావీదు ఇశ్రాయేలు రాజు అయినట్లు తెలుపుతుంది. ఇది జరుగుతుందని యెహోవా మాటయిచ్చాడు. ఈ వాగ్దానం యెహోవా సమూయేలు ద్వారా చేశాడు.
దావీదు యెరూషలేమును జయించటం
4 దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యెరూషలేముకు వెళ్లారు. ఆ కాలంలో యెరూషలేము “యెబూసు” అని పిలువబడేది. ఆ నగరంలో నివసించే ప్రజలంతా యెబూసీయులనబడేవారు. ఆ నగరవాసులు 5 దావీదుతో, “నీవు మా నగర ప్రవేశం చేయకూడదు” అని అన్నారు. అయినప్పటికి దావీదు ఆ ప్రజలను ఓడించాడు. సీయోను కొండ[a] మీది కోటను దావీదు వశం చేసుకొన్నాడు. ఈ ప్రదేశమే దావీదు నగరమని పిలువబడింది.
6 “మీలో ఎవరు సైన్యాన్ని యెబూసీయుల మీదికి విజయవంతంగా నడిపిస్తారో అతడు నా సైన్యానికంతటికి ముఖ్య అధిపతి అవుతాడు” అని దావీదు ప్రకటించాడు. అది విని యోవాబు దండయాత్రకు నాయకత్వం వహించి నిర్వహించాడు. యోవాబు తండ్రిపేరు సెరూయా. యోవాబు సైన్యాధిపతయ్యాడు.
7 దావీదు తన నివాసం కోటలో ఏర్పరచుకొన్నాడు. అందువల్ల దానికి దావీదు నగరం అని పేరు వచ్చింది. 8 కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లో[b] నుండి బయటి ప్రాకారం వరకు అతడు నగరాన్ని నిర్మించాడు. యోవాబు ఆ నగరంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయించాడు. 9 రోజురోజుకు దావీదు గొప్పతనం పెరుగుతూ వచ్చింది. సైన్యాలకు అధిపతియైన యెహోవా దావీదుకు తోడైయున్నాడు.
దావీదు యొక్క ముగ్గురు వీర నాయకులు
10 దావీదు సైన్యంలో మహావీరులున్నారు. దావీదులాగానే వీరుకూడా శక్తిమంతులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలంతా దావీదు రాజ్యానికి మంచి మద్దతు ఇచ్చారు. ఈ మహావీరులూ, ఇశ్రాయేలు ప్రజానీకం కలసి దావీదును రాజుగా చేశారు. దేవుడు ఇది జరుగుతుందని వాగ్దానం చేశాడు.
11 దావీదు సైన్యంలో మహాయోధులు ఎవరనగా:
హక్మనీయులకు చెందిన యాషాబాము ఒకడు. యాషాబాము అధికారులకు పై అధికారి.[c] అతడు తన ఈటెనుపయోగించి మూడు వందల మందిని ఎదిరించాడు. ఆ మూడువందల మందిని ఒక్క వేటుతో చంపివేశాడు.
12 దావీదు యోధులలో ఎలియాజరు మరొకడు. ఎలియాజరు తండ్రి పేరు దోదో. దోదో అహోహీయుల వంశంవాడు. ముగ్గురు మహా యోధుల్లో ఎలియాజరు ఒకడు. 13 పస్దమ్మీములో ఎలియాజరు దావీదుతో వున్నాడు. ఫిలిష్తీయులు ఆ ప్రదేశానికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఆ ప్రాంతంలో విరగపండిన యవల చేనువుంది. ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశానికి పారిపోయి వచ్చారు. 14 కాని వారా చేను మధ్యలో నిలబడి పంటను కాపాడుతూ ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని చంపివేశారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు ఘనవిజయం చేకూర్చాడు.
15 ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు.
16 అప్పుడు దావీదు కోటలో వున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం బేత్లెహేములో దిగివుంది. 17 దావీదుకు అప్పుడు దాహం వేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు నాకెవరైనా బేత్లెహేము[d] నగర ద్వారం వద్దగల బావి నీరు తాగటానికి తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను!” (దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు. 18 అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని యెహోవాకి అర్పణగా పారపోశాడు. 19 దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మనుష్యులు ఈ నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు.
దావీదు యొక్క ముగ్గురు వీరులు
20 ముగ్గురు యోధుల దళానికి యోవాబు సోదరుడు అబీషై నాయకుడు. అతడు మూడు వందల మందిని తన ఈటెతో ఎదిరించి చంపాడు. ఆ ముగ్గురు యోధుల్లాగా అబీషై కీర్తి గడించాడు. 21 కాని అతనికి మిగిలిన వారికంటె ఎక్కువ గౌరవం దక్కింది. ముగ్గురిలో ఒకడు కాకపోయినా అతడు అధిపతి అయ్యాడు.
22 యోహోయాదా కుమారుడు బెనాయా ఒక పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్సెయేలు వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెరవేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది బాగా మంచుపడే రోజున జరిగింది. 23 ఈజిప్టుకు చెందిన బలవంతుడైన సైనికుని కూడ బెనాయా చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల వాడు. ఆ ఈజిప్టు వాని వద్ద అతి పెద్దదయిన, బరువైన ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవలె వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని వద్ద నుండి ఈటెను లాక్కున్నాడు. దానితోనే వానిని చంపివేశాడు. 24 ఇవన్నీ యోహోయాదా కుమారుడు బెనాయా చేసిన పనులు. ముగ్గురు యోధుల్లాగా బెనాయా పేరు పొందిన వ్యక్తి అయ్యాడు. 25 ఆ ముగ్గురి యోధుల కంటె బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది. కాని అతడు ఆ ముగ్గురిలో చేర్చబడలేదు. దావీదు తన అంగరక్షకులకు అధిపతిగా బెనాయాను నియమించాడు.
ముఫ్పై మంది వీరులు
26 ముఫ్పై మంది వీరులైన సైనికులెవరనగా:
యోవాబు సోదరుడైన ఆశాహేలు.
దోదో కుమారుడైన ఎల్హానాను. ఎల్హానాను బేత్లెహేము నివాసి.
27 హరోరీయుడైన షమ్మోతు.
పెలోనీయుడైన హేలెస్సు.
28 ఇక్కీషు కుమారుడైన ఈరా. ఈరా తెకోవ పట్టణానికి చెందినవాడు.
అనాతోతీయుడైన అబీయెజెరు.
29 హుషాతీయుడైన సిబ్బెకై.
అహోహీయుడైన ఈలై.
30 నెటోపాతీయుడగు మహరై, బయనా కుమారుడగు హేలెదు.
హేలెదు కూడ నెటోపాతీయుడు.
31 రీబయి కుమారుడైన ఈతయి. ఈతయి అనేవాడు బెన్యామీను దేశంలోని గిబియా పట్టణవాసి.
పిరాతోనీయుడైన బెనాయా,
32 గాయషులోయవాడైన హురై,
అర్బాతీయుడైన అబీయేలు,
33 బహరూమీయుడైన అజ్మావెతు.
షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా
34 హాషేము కుమారులు గిజోనీయుడుగు షాగే కుమారుడు యోనాతాను. యోనాతాను హరారీయుడు.
35 శాకారు కుమారుడు అహీయాము. అహీయాము హరారీయుడు.
ఊరు కుమారుడు ఎలీపాలు.
36 మెకేరాతీయుడైన హెపెరు.
పెలోనీయుడగు అహీయా.
37 కర్మెలీయుడైన హెజ్రో.
ఎజ్బయి కుమారుడైన నయరై.
38 నాతాను సోదరుడైన యోవేలు.
హగ్రీ కుమారుడగు మిబ్హారు.
39 అమ్మోనీయుడగు జెలెకు.
బెరోతీయుడగు నహరై. యోవాబు ఆయుధాలు మోసేవాడు. యోవాబు తండ్రి పేరు సెరూయా.
40 ఇత్రీయుడైన ఈరా.
ఇత్రీయుడగు గారేబు.
41 హిత్తీయుడైన ఊరియా.
అహ్లయి కుమారుడు జాబాదు.
42 షీజా కుమారుడు అదీనా. షీజా అనేవాడు రూబేనీయుడు. అదీనా రూబేను వంశంలో పెద్ద. అతను తనతోవున్న ముగ్గురు యోధులకు నాయకుడు.
43 మయకా కుమారుడు హానాను.
మిత్నీయుడైన యెహోషాపాతు.
44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా.
హోతాము కుమారులు షామా, యెహీయేలు. హోతాము అరోయేరీయుడు.
45 షిమ్రీ కుమారుడు యెదీయవేలు.
తిజీయుడగు యోహా. యెదీయవేలు సోదరుడు యోహా.
46 మహవీయుడగు ఎలీయేలు.
ఎల్నయము కుమారులైన యెరీబై, యోషవ్యా. మోయాబీయుడైన ఇత్మా.
47 ఎలీయేలు, ఓబేదు, మరియు మెజోబాయా వాడైన యహశీయేలు.
దావీదుతో కలిసిన శూరులు
12 దావీదు సిక్లగు పట్టణంలో ఉన్నాడు. ఆ సమయంలో కొందరు మనుష్యులు దావీదును కలుసుకొన్నారు. దావీదు పారిపోయి సౌలుకు కనపడకుండా దాగివున్న రోజులవి. కీషు కుమారుడు సౌలు. ఈ వచ్చిన మనుష్యులు దావీదుకు యుద్ధంలో సహాయపడ్డారు. 2 ఈ మనుష్యులు కుడి చేతితోను, ఎడమ చేతితోను బాణాలు ఒడుపుగా వేయగల నేర్పరులు. వడిసెలకూడ వారు కుడి ఎడమల తేడా లేకుండా తిప్పి రాళ్లు విసరగల సమర్థులు. వారంతా సౌలు బంధువులైన బెన్యామీనీయులు. 3 వారెవరనగా:
అహీయెజెరు వారి నాయకుడు. వారిలో యోవాషు కూడ వున్నాడు. అహీయెజెరు, యోవాషులిద్దరూ షెమయా కుమారులు. షెమయా అనేవాడు గిబియావాడు. వారిలో ఇంకా యెజీయేలు, పెలెటు వున్నారు. యెజీయేలు, పెలెటులిరువురూ అజ్మావెతు కుమారులు. బెరాకా, అనాతోతీయుడైన యెహూ అనేవారు కూడ వారితో వున్నారు. 4 గిబియోనీయుడైన ఇష్మయా బలపరాక్రమ సంపన్నుడు. ముప్పై మంది యోధుల్లో ఒకడు మరియు వారి నాయకుడు. యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు కూడ వున్నారు. 5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా మరియు షెమర్యా. హరీపీయుడైన షెఫట్యా. 6 ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజేరు, యాషాబాము అనే వారు కోరహు వంశీయులు. 7 యెరోహాము కుమారులైన యోహేలా మరియు జెబద్యా. వారు గెదోరు గ్రామానికి చెందిన వారు.
గాదీయులు
8 గాదీయులలో కొంతమంది ఎడారి ప్రాంతంలో కోటలో దాగివున్న దావీదును కలిశారు. వారు బాగా యుద్ధ శిక్షణ పొందిన సైనికులు. వారు డాలు పట్టి ఈటెను ఉపయోగించటంలో ఆరితేరినవారు. వారు సింహం లాంటి ముఖాలతో భయంకరంగా వుంటారు. వారు కొండల్లో జింకల్లా పరుగెత్తగలరు.
9 ఏజెరు గాదు సైన్యానికి అధిపతి. ఓబద్యా రెండవ ముఖ్యాధికారి. ఏలీయాబు మూడవ స్థానంలో వున్నాడు. 10 మిష్మన్నా నాల్గవ స్థానంలోను, యిర్మీయా ఐదవ స్థానంలోను వున్నారు. 11 అత్తయి ఆరవ స్థానంలోను, ఏలీయేలు ఏడవ స్థానంలోను వున్నారు. 12 యోహానాను ఎనిమిదవ స్థానంలోను, ఎల్జాబాదు తొమ్మిదవ స్థానంలోను వున్నారు. 13 యిర్మీయా పదవ స్థానంలోను, మక్బన్నయి పదకొండవ వాడుగాను వున్నారు.
14 వారు గాదీయుల సైన్యంలో అధికారులు. వారిలో అతి బలహీనుడైనవాడు కూడ కనీసం వంద మందితో పోరాడగలడు. వారిలో మిక్కిలి బలవంతుడు వేయి మంది శత్రు సైనికులను ఎదుర్కొనగలడు. 15 ఈ గాదు వంశీయులే మొదటి నెలలో యొర్దాను నదికి వరదలు వచ్చే సమయంలో లోయల్లో వుండే వారందరినీ తరిమికొట్టారు. వారా ప్రజలను తూర్పునకు, పడమరకు తరిమివేశారు.
ఇతర సైనికులు దావీదుతో చేరటం
16 బెన్యామీను, యూదా వంశాలకు చెందిన ఇతర ప్రజలు కూడ కోటలో వున్న దావీదు వద్దకు వచ్చారు. 17 దావీదు వారిని కలిసేందుకు ఎదురు వెళ్లి, వారితో ఇలా అన్నాడు: “మీరు శాంతి భావంతో నాకు సహాయం చేయగోరి వస్తే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను! నాతో కలిసి ఉండండి. ఒకవేళ నేను ఏమీ తప్పు చేయకపోయినా మీరు నా మీద నిఘావేసి నన్ను శత్రువులకు అప్పజెప్పటానికి కనుక వస్తే, మన పూర్వీకుల దేవుడు మీరు చేసేది చూచి మిమ్మల్ని శిక్షించుగాక!”
18 అప్పుడు దేవుని ఆత్మ అమాశై మీదికి వచ్చింది. అమాశై ముప్పదిమంది వీరుల నాయకుడు. అమాశై అప్పుడు ఇలా అన్నాడు:
“ఓ దావీదూ, మేము నీవారం!
ఓ యెష్షయి కుమారుడా, మేము నీతో వున్నాము.
శాంతి! నీకు శాంతి కలుగుగాక!
నీకు సహాయపడే ప్రజలకు కూడ శాంతి. ఎందువల్లననగా నీ దైవం నీకు సహాయపడుతున్నాడు!”
అప్పుడు దావీదు వారికి స్వాగతం పలికి వారిని చేరదీశాడు. తన పక్షాన వారిని దళాధిపతులుగా నియమించాడు.
19 కొందరు మనష్షే వంశంలోని వారు కూడ వచ్చి దావీదు పక్షం వహించారు. అతడు ఫిలిష్తీయులతో కలిసి సౌలుపై యుద్ధానికి వెళ్లినప్పుడు వారు వచ్చి దావీదు పక్షం వహించారు. కాని దావీదు, అతని మనుష్యులు నిజానికి ఫిలిష్తీయులకు సహాయపడలేదు. దావీదు తమకు సహాయం చేసే విషయం ఫిలిష్తీయుల అధికారులు చర్చించి, పిమ్మట అతనిని పంపివేయటానికి నిశ్చయించారు. ఫిలిష్తీయుల పాలకులు ఇలా అన్నారు: “ఒకవేళ దావీదు మధ్యలో తన యజమాని సౌలు వద్దకు వెళ్లిపోతే మన తలలు తెగిపోతాయి!” 20 దావీదు సిక్లగు పట్టణానికి వెళ్లినప్పుడు అతనితో కలిసిన మనష్షీయులు ఎవరనగా: అద్నా, యోజాబాదు, మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు మరియు జిల్లెతై. వీరిలో ప్రతి ఒక్కడూ మనష్షే వంశీయులలో వెయ్యి మందికి నాయకుడు. 21 దుష్టశక్తులను ఎదుర్కొనటంలో వారు దావీదుకు తోడ్పడ్డారు. ఈ దుష్టులు దేశం మీద పడి ప్రజలను దోచుకోసాగారు. దావీదును చేరిన మనష్షీయులంతా ధైర్యంగల సేనానులు. వారు దావీదు సైన్యంలో అధిపతులయ్యారు.
22 రోజురోజుకూ దావీదు వద్దకు వచ్చి సహాయపడేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానితో దావీదుకు శక్తివంతమైన ఒక మహా సైన్యం ఏర్పడింది.
హెబ్రోనులో మరికొందరు దావీదును చేరటం
23 దావీదును హెబ్రోను పట్టణంలో కలిసిన వారి వివరాలు, సంఖ్యాబలం ఈ విధంగా వున్నాయి: వారు యుద్ధ వీరులు. సౌలు సామ్రాజ్యాన్ని దావీదుకు అప్పజెప్పటానికి వచ్చారు. ఇది ఇలా జరుగుతుందని యెహోవా చెప్పియున్నాడు. వారి బలగం ఏదనగా:
24 యుద్ధానికి అర్హతగల యూదా వంశీయులు ఆరువేల ఎనిమిది వందల మంది వున్నారు. వారు డాళ్లను, ఈటెలను పట్టగల సమర్థులు.
25 షిమ్యోనీయులు ఏడువేల వందమంది వున్నారు. వారంతా ధైర్య సాహసాలుగల సైనికులు.
26 లేవీయులు నాలుగువేల ఆరువందల మంది వున్నారు. 27 యెహోయాదా ఆ వర్గంలో వాడు. అతడు అహరోను కుటుంబ పెద్ద. యెహోయాదాతో మూడువేల ఏడువందల మంది మనుష్యులున్నారు. 28 ఆ వర్గంలో సాదోకు కూడా వున్నాడు. అతడు మంచి ధైర్యంగల యువ సైనికుడు. అతడు తన కుటుంబీకులలో ఇరవై ఇద్దరు అధికారులతో వచ్చాడు.
29 బెన్యామీను వంశం వారు మూడువేలమంది వున్నారు. వారంతా సౌలుకు బంధువులు. అప్పటి వరకు వారిలో అధిక సంఖ్యాకులు సౌలు కుటుంబం పట్ల విశ్వాసంగా వున్నారు.
30 ఎఫ్రాయిము వంశంవారు ఇరవైవేల ఎనిమిది వందలమంది వున్నారు. వారు ధైర్యంగల సేనానులు. వారి వారి కుటుంబాలలో వారు ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు.
31 మనష్షే వంశీయులలో సగంమంది నుండి వచ్చిన వారు పద్దెనిమిదివేల మంది. వారు పేరు పేరున దావీదును రాజుగా చేయటానికి ఎంపిక చేయబడినవారు.
32 ఇశ్శాఖారు వంశీయులలో తెలివైన పెద్దలు రెండు వందల మంది. ఇశ్రాయేలుకు చేయదగిన మంచి యేదో వారు సరియైన సమయంలో గుర్తించారు. వారి బంధువులంతా వారి మాటకు కట్టుబడి వున్నారు.
33 జెబూలూనీయులు ఏబదివేల మంది వున్నారు. వారంతా అనుభవజ్ఞులైన సైనికులు. వారు రకరకాల ఆయుధాలు చేపట్టి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు దావీదుకు మిక్కిలి నమ్మకస్తులై వున్నారు.
34 నఫ్తాలీయుల నుండి ఒక వెయ్యిమంది అధిపతులు వచ్చారు. వారికి ముప్పది ఏడువేల మంది అనుచరులు వున్నారు. వారు ఈటెలు, డాళ్లు పట్టి వున్నారు.
35 దాను వంశం నుండి యుద్ధానికి సిద్ధంగా వున్న వారు ఇరవై ఎనిమిదివేల ఆరువందల మంది.
36 ఆషేరు వంశం నుండి కాకలు తీరిన సైనికులు యుద్ధానికి సిద్ధమై నలభై వేలమంది వచ్చారు.
37 యొర్దాను నదికి ఆవలివైపు (నదికి తూర్పు) నుండి రూబేను, గాదు, సగం మనష్షే వంశీయుల నుండి ఒక లక్షా ఇరవై వేల మంది వచ్చారు. వారంతా రకరకాల ఆయుధాలు ధరించియున్నారు.
38 ఆ వచ్చిన మనుష్యులంతా పోరాట యోధులు. దావీదును ఇశ్రాయేలుకంతటికి రాజుగా చేయాలనే కృతనిశ్చయంతో ఆ వీరులందరూ హెబ్రోను పట్టణానికి వచ్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు కూడ దావీదును రాజుగా చేయటానికి ఒప్పుకున్నారు. 39 ఆ మనుష్యులంతా దావీదుతో మూడు రోజులు హెబ్రోనులో గడిపారు. వారి బంధువులంతా తగినన్ని ఆహార పదార్థాలను తయారు చేయటంతో వారు బాగా అన్నపానాదులు సేవించి కాలం గడిపారు. 40 ఇశ్శాఖారు, జెబూలూను మరియు నఫ్తాలి వంశాల వారి ఇరుగు పొరుగు వారు కూడ గాడిదలమీద, ఒంటెలమీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహార పదార్థాలు వేసుకొని వచ్చారు. వారు కావలసినంత పిండిని, అంజూర పండ్ల భక్ష్యాలను, ఎండుద్రాక్షను, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులను, గొర్రెలను తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలంతటా సంతోషం వెల్లివిరిసింది.
© 1997 Bible League International