Chronological
8 ఎఫ్రాయిము వారికి గిద్యోను మీద కోపం వచ్చింది. ఎఫ్రాయిము వారికి గిద్యోను కనబడినప్పుడు, “ఎందుకు నీవు మాపట్ల ఇలా వ్యవహరించావు. నీవు మిద్యాను ప్రజలమీద యుద్ధానికి వెళ్లినప్పుడు నీవు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని వారు గిద్యోనును అడిగారు.
2 ఎఫ్రాయిము మనుష్యులకు గిద్యోను ఇలా జవాబు ఇచ్చాడు: “మీరు చేసినట్టు నేనేమీ చేయలేదు. మా అబీయెజెరు వంశస్థులకంటె, మీ ఎఫ్రాయిము వారికి ఎక్కువ పంట వచ్చింది. కోతకాలంలో మా వారు కూర్చే ద్రాక్షపళ్లకంటె, మీరు పొలంలో పరిగె విడిచిపెట్టే ద్రాక్షపళ్లు ఎక్కువ ఉంటాయి. అది నిజం కాదా? 3 (అలాగే, ఇప్పుడు కూడా మీకు ఎక్కువ పంట వచ్చింది) మిద్యాను నాయకులు ఓరేబు, జెయేబలను పట్టుకొనేందుకు దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు. మీరు చేసినదానితో నా విజయాన్ని నేను ఎలా పోల్చుకోగలను?” గిద్యోను మాటలు ఎఫ్రాయిము వారు విన్నప్పుడు, వారు ముందు కోపపడినంత కోపపడలేదు.
మిద్యాను రాజులు ఇద్దరిని గిద్యోను పట్టుకున్నాడు
4 అప్పుడు గిద్యోను, అతని మూడు వందల మంది మనుష్యులు యోర్దాను నది దగ్గరకు వచ్చి దానిని దాటి అవతలికి వెళ్లారు. కానీ వారు అలసిపోయి ఆకలితో[a] ఉన్నారు, 5 “నా సైనుకులు భోజనం చేసేందుకు ఏమైనా పెట్టండి. నా సైనికులు చాలా అలసిపోయారు. మిద్యాను రాజులు జెబహు, సల్మున్నాలను మేము ఇంకా తరుముతున్నాము” అని గిద్యోను సుక్కోతు పట్టణం వారితో చెప్పాడు.
6 కానీ సుక్కోతు పట్టణ నాయకులు, “నీ సైనికులు భోజనం చేసేందుకు ఏదైనా మేము ఎందుకు పెట్టాలి? జెబహు, సల్మున్నాలను మీరు ఇంకా పట్టుకోలేదు గదా?” అని గిద్యోనుతో చెప్పారు.
7 అప్పుడు గిద్యోను, “మీరు మాకు భోజనం పెట్టరు. జెబహు, సల్మున్నాలను పట్టుకొనేందుకు యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత నేను తిరిగి ఇక్కడికి వస్తాను. అడవి ముళ్లకంపతోను, నూర్చుకొయ్యతోను మిమ్మల్ని కొడతాను” అని చెప్పాడు.
8 గిద్యోను సుక్కోతు పట్టణం విడిచి, పెనూయేలు పట్టణం వెళ్లాడు. సుక్కోతు వారిని అడిగినట్టే, గిద్యోను భోజనం కోసం పెనూయేలు వారిని అడిగాడు. కాని సుక్కోతు వారు ఇచ్చిన జవాబే పెనూయేలు వారు గిద్యోనుకు ఇచ్చారు. 9 కనుక గిద్యోను, “నేను విజయం సాధించిన తర్వాత, నేను ఇక్కడకు తిరిగి వచ్చి ఈ గోపురాన్ని కూలగొట్టేస్తాను” అని పెనూయేలు వారితో చెప్పాడు.
10 జెబహు, సల్మున్నా, వారి సైన్యం కర్కోరు పట్టణంలో ఉన్నారు. వారి సైన్యంలో పదిహేను వేలమంది సైనికులు ఉన్నారు. తూర్పు ప్రాంతపు ప్రజలందరి సైన్యంలో మిగిలిన సైనికులు వీరు. ఆ సైన్యంలో లక్షా ఇరవై వేల మంది బలమైన సైనికులు అప్పటికే చంపివేయబడ్డారు. 11 గిద్యోను, అతని మనుష్యులు గుడారవాసుల మార్గం ఉపయోగించారు. ఆ మార్గం నోబహు, యొగ్భెహ పట్టణాలకు తూర్పున ఉంది. గిద్యోను కర్కోరు పట్టణం వచ్చి శత్రువుమీద దాడి చేశాడు. ఈ దాడిని శత్రుసైన్యం ఊహించలేదు. 12 మిద్యాను ప్రజల రాజులు జెబహు, సల్మున్నాలు పారిపోయారు. కానీ గిద్యోను ఆ రాజులను తరిమి పట్టుకొన్నాడు. గిద్యోను, అతని మనుష్యులు శత్రు సైన్యాన్ని ఓడించారు.
13 అప్పుడు యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి తిరిగి వచ్చాడు. గిద్యోను, అతని మనుష్యులు హెరెసు కనుమ అనబడిన పర్వత మార్గం గుండా ప్రయాణం చేసి తిరిగి వచ్చారు. 14 గిద్యోను సుక్కోతు పట్టణం నుండి ఒక యువకుని పట్టుకొన్నాడు. గిద్యోను ఆ యువకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ యువకుడు గిద్యోనుకు కొన్ని పేర్లు వ్రాసి ఇచ్చాడు. సుక్కోతు పట్టణపు నాయకులు, పెద్ద మనుష్యుల పేర్లు ఆ యువకుడు వ్రాసిపెట్టాడు. డెభ్భై ఏడు మంది పేర్లు అతడు ఇచ్చాడు.
15 అప్పుడు గిద్యోను సుక్కోతు పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంవారితో “ఇదిగో, జెబహు, సల్మున్నాలు. ‘అలసిపోయిన నీ సైనికులకు మేము భోజనం ఎందుకు పెట్టాలి? మీరు జెబహు, సల్మున్నాలను పట్టుకోలేదుగా?’ అంటూ మీరు నన్ను హేళన చేసారు” అని అతడు చెప్పాడు. 16 గిద్యోను సుక్కోతు పట్టణపు పెద్ద మనుష్యులను పట్టుకొని, వారిని శిక్షించేందుకు అడవినుండి తెచ్చిన ముళ్లకంపతో, నూర్చేడి కొయ్యతో వారిని కొట్టాడు. 17 పెనూయేలు పట్టణంలో ఉన్న గోపురాన్ని కూడా గిద్యోను కూలగొట్టివేశాడు. తరువాత అతడు ఆ పట్టణంలో నివసించేవారిని చంపివేశాడు.
18 అప్పుడు గిద్యోను, “తాబోరు కొండ మీద మీరు కొందరిని చంపేశారు. ఆ మనుష్యులు ఎలా ఉంటారు?” అని జెబహు, సల్మున్నాలను అడిగాడు.
“ఆ మనుష్యులు నీలాంటి వారే, వారిలో ప్రతి ఒక్కడూ యువరాజులా కనిపించాడు” అని జెబహు, సల్మున్నాలు జవాబు ఇచ్చారు.
19 “ఆ మనుష్యులు నా సోదరులు! నా తల్లి కుమారులు! యెహోవా తోడు, మీరు గనుక వారిని చంపి ఉండకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని చంపను” అన్నాడు.
20 అప్పుడు గిద్యోను యెతెరువైపు తిరిగాడు. గిద్యోను పెద్ద కుమారుడు యెతెరు. “ఈ రాజులను చంపు” అని గిద్యోను అతనితో చెప్పాడు. కాని యేతెరు చిన్న పిల్లవాడు గనుక అతడు భయపడ్డాడు. కనుక అతడు తన ఖడ్గం బయటకు తీయలేదు.
21 అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే మమ్మల్ని చంపు. నీవు మగవాడివి, ఈ పని చేయటానికి తగిన బలం ఉన్నవాడివి” అని గిద్యోనుతో చెప్పారు. కావున గిద్యోను లేచి జెబహు, సల్మున్నాలను చంపివేశాడు. అప్పుడు గిద్యోను వారి ఒంటెల మెడల మీద చంద్రాకారంలో ఉన్న నగలను తీసుకున్నాడు.
గిద్యోను ఏఫోదును తయారు చేయుట
22 ఇశ్రాయేలు ప్రజలు, “మిద్యాను ప్రజల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. కనుక ఇప్పుడు నీవే మమ్మల్ని పాలించు. నీవూ, నీ కుమారుడు, నీ మనుమళ్లు మా మీద అధికారులుగా ఉండాలని మేము కోరుతున్నాము” అని గిద్యోనుతో చెప్పారు.
23 అయితే గిద్యోను, “యెహోవాయే మిమ్మల్ని పాలించేవాడు. నేను మీ మీద అధికారిగా ఉండను. నా కుమారుడు మీ మీద ఏలుబడి చేయడు” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
24 ఇశ్రాయేలు వారు ఓడించిన మనుష్యులలో కొందరు ఇష్మాయేలీయులుండిరి. ఇష్మాయేలు మనుష్యులు బంగారు పోగులు ధరించారు. కనుక గిద్యోను: “మీరు నా కోసం ఈ ఒక్క పనిచేయండి. యుద్ధంలో మీరు తీసుకున్న బంగారు పోగులు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాకు ఇవ్వండి” అని ఇష్మాయేలు ప్రజలతో చెప్పాడు.
25 కనుక ఇష్మాయేలు ప్రజలు, “నీకు కావలసినది మేము సంతోషంగా ఇస్తాము” అని గిద్యోనుతో చెప్పారు. కనుక వారు ఒక అంగీ నేలమీద పరిచారు. 26 ఆ బంగారు పోగులు ప్రోగు చేయబడినప్పుడు వాటి బరువు నలభై మూడు పౌనులు (1,700 తులములు) అయినది. ఇష్మాయేలు ప్రజలు గిద్యోనుకు ఇచ్చిన ఇతర కానుకలు ఈ బరువులో లేవు. చంద్రాకారములో ఉన్న నగలు, వంకాయరంగు వస్త్రాలు వారు అతనికి ఇచ్చారు. ఈ వస్తువులు మిద్యాను ప్రజల రాజులు ధరించినవి. మిద్యాను రాజుల ఒంటెల మీది గొలుసులను కూడ వారు అతనికి ఇచ్చారు.
27 ఒక ఏఫోదు చేసేందుకు గిద్యోను ఆ బంగారాన్ని ఉపయోగించాడు. అతడు తన స్వంత ఊరు ఒఫ్రాలో ఆ ఏఫోదును ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఏఫోదును పూజించారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక, ఏఫోదును పూజించారు. గిద్యోను మరియు అతని కుటుంబము పాపం చేసేందుకు ఆ ఏఫోదు ఒక ఉచ్చులా తయారైంది.
గిద్యోను మరణం
28 మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజల పాలన క్రింద ఉండేందుకు బలవంతం చేయబడ్డారు. మిద్యాను ప్రజలు ఇంకెంత మాత్రం చిక్కు కలిగించలేదు. గిద్యోను జీవించినంత కాలం, నలభై సంవత్సరాలు దేశంలో శాంతి ఉంది.
29 యోవాషు కుమారుడైన యెరుబ్బయలు (గిద్యోను) ఇంటికి వెళ్లాడు. 30 గిద్యోనుకు డెబ్బై మంది సొంత కుమారులు ఉన్నారు. అతనికి చాలా మంది భార్యలు ఉన్నారు గనుక అంతమంది కుమారులు ఉన్నారు. 31 గిద్యోను దాసి ఒకతె షెకెము పట్టణంలో నివసించినది. ఆ దాసి ద్వారా అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి అబీమెలెకు అని అతడు పేరు పెట్టాడు.
32 యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. గిద్యోను అతని తండ్రి యోవాషుకు స్వంతంగా ఉన్న సమాధిలో పాతిపెట్టబడ్డాడు. ఆ సమాధి అబీయెజ్రీ వంశం వారు నివసించే ఒఫ్రా పట్టణంలో ఉంది. 33 గిద్యోను చనిపోగానే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మరలా నమ్మకంగా ఉండక, వారు బయలును వెంబడించారు. బయలు బెరీతును వారు వారి దేతవగా చేసుకున్నారు. 34 ఇశ్రాయేలు ప్రజలు చుట్టూరా నివసిస్తున్న వారి శత్రువులందరి బారి నుండి యెహోవా వారిని రక్షించినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు. 35 యెరుబ్బయలు (గిద్యోను), ఇశ్రాయేలు ప్రజల కోసం ఎన్నో మంచిపనులు చేసినప్పటికీ వారు అతని కుటుంబానికి నమ్మకంగా ఉండలేదు.
అబీమెలెకు రాజు అవటం
9 అబీమెలెకు యెరుబ్బయలు (గిద్యోను) కుమారుడు. అబీమెలెకు షెకెము పట్టణంలో నివసిస్తున్న తన మామల దగ్గరకు వెళ్లాడు. అతడు తన మామలతోను, తన తల్లి వంశస్థులందరితోను ఇలా చెప్పాడు: 2 “షెకెము పట్టణపు నాయకులను ఈ ప్రశ్న అడగండి: ‘యెరుబ్బయలు యొక్క డెబ్బై మంది కుమారులచేత పాలించబడటం మీకు మంచిదా లేక ఒకే మనిషిచేత పాలింపబడుట మంచిదా? నేను మీ బంధువునని జ్ఞాపకం ఉంచుకోండి.’”
3 అబీమెలెకు మామలు షెకెము నాయకులతో మాట్లాడి, వారిని ఆ ప్రశ్న అడిగారు. షెకెము నాయకులు అబీమెలెకు అనుచరులుగా ఉండాలని నిర్ణయం చేసారు. “అతడు మా సోదరుడు గదా” అని ఆ నాయకులు చెప్పారు. 4 కనుక షెకెము నాయకులు డెభ్భై వెండి నాణెములు అబీమెలెకుకు ఇచ్చారు. ఆ వెండి బయలు బెరీతు[b] దేవతా మందిరానికి చెందినది. అబీమెలెకు కొంతమంది కిరాయి మనుష్యులను తెచ్చేందుకు ఆ వెండిని ఉపయోగించాడు. ఈ మనుష్యులు పనికిమాలిన వాళ్లు, నిర్లక్ష్యపు మనుష్యులు. అబీమెలెకు ఎక్కడికి వెళ్లినా వారు అతనిని వెంబడించారు.
5 అబీమెలెకు ఒఫ్రాలోని తన తండ్రి ఇంటికి వెళ్లాడు. అబీమెలెకు తన సోదరులను చంపివేసాడు. అబీమెలెకు తన తండ్రియైన యెరుబ్బయలు (గిద్యోను) కుమారులు డెభ్భై మందిని చంపివేశాడు. అతడు వారందరినీ ఒకే సమయంలో[c] చంపివేశాడు. అయితే యెరుబ్బయలు చిన్న కుమారుడు అబీమెలెకునకు కనబడకుండా దాగుకొని తప్పించుకొన్నాడు. ఆ చిన్న కుమారుని పేరు యోతాము.
6 అప్పుడు షెకెము నాయకులందరూ, మిల్లో ఇంటి వారూ సమావేశం అయ్యారు. షెకెములో స్తంభపు మహావృక్షము (మస్తకి) పక్క ఆ ప్రజలంతా సమావేశమై అబీమెలెకును వారి రాజుగా చేసుకున్నారు.
యోతాము కథ
7 షెకెము పట్టణ నాయకులు అబీమెలెకును రాజుగా చేసారని యోతాము విన్నాడు. అతడు ఇది విన్నప్పుడు వెళ్లి గెరిజీము కొండ శిఖరం మీద నిలబడ్డాడు. యోతాము ఈ కథను గట్టిగా అరచి, ప్రజలకు ఇలా చెప్పాడు:
“షెకెము పట్టణ నాయకులారా, నా మాట వినండి. తర్వాత దేవుడు మీ మాట వినును.
8 “ఒకనాడు వృక్షాలన్నీ వాటిని ఏలేందుకు ఒక రాజును ఏర్పాటు చేసుకోవాలని అనుకొన్నాయి. ఆ చెట్లు, ‘నీవే మా రాజుగా ఉండు’ అని ఒలీవ చెట్టుతో అన్నాయి.
9 “కాని ఒలీవ చెట్టు అంది: ‘నా తైలం కోసం మనుష్యులు, దేవుళ్లు నన్ను పొగడుతారు. కేవలం నేను వెళ్లి ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగేందుకోసం నా తైలాన్ని తయారు చేయడం నేను మానివేయాలా?’
10 “అప్పుడు ఆ చెట్లు అంజూరపు చెట్టుతో, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని అడిగాయి.
11 “కాని, ‘కేవలం ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం మధురమైన నా మంచి ఫలం ఫలించటం మానివేయాలా?’ అన్నది ఆ అంజూరపు చెట్టు.
12 “అప్పుడు ఆ చెట్లు, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ద్రాక్షావల్లితో, అన్నాయి.
13 “కాని ద్రాక్షావల్లి, ‘నా ద్రాక్షారసం మనుష్యులను, రాజులను సంతోష పెడుతుంది. కేవలం నేను వెళ్లి ఆ చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం నా ద్రాక్షరసం తయారు చేయటం నేను మానివేయాలా?’ అన్నది.
14 “చివరికి చెట్లన్నీ కలసి, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ముళ్లకంపతో అన్నాయి.
15 “కాని ఆ ముళ్లకంప, ‘మీరు నన్ను నిజంగా మీ మీద రాజుగా చేయాలని కోరితే మీరు వచ్చి నా నీడలో ఆశ్రయం తీసుకోండి. కాని అలా చేయటం ఇష్టం లేకపోతే అప్పుడు ముళ్ల కంపలో నుండి అగ్ని వచ్చునుగాక. ఆ అగ్ని లెబానోను దేవదారు వృక్షాలను కూడా కాల్చి వేయును గాక’ అని ఆ చెట్లతో చెప్పినది.
16 “అబీమెలెకును మీరు రాజుగా చేసినప్పుడు మీరు పూర్తి నిజాయితీగా ఉన్నట్లయితే, మీరు అతనితో సంతోషించి ఉండేవారు. మరియు మీరు గనుక యెరుబ్బయలు, అతని కుటుంబముతో న్యాయంగా ఉండి ఉంటే మంచిదే. మరియు యెరుబ్బయలును పరామర్శించాల్సినట్టు, పరామర్శించియుంటే మంచిదే. 17 కానీ నా తండ్రి మీ కోసం ఏమి చేశాడో ఆలోచించండి. నా తండ్రి మీ కోసం పోరాడాడు. మిద్యాను ప్రజలనుండి అతడు మిమ్మల్ని రక్షించినప్పుడు తన ప్రాణాన్ని అపాయానికి గురిచేసుకున్నాడు. 18 కానీ ఇప్పుడు మీరు నా తండ్రి వంశానికి విరోధంగా తిరిగారు. నా తండ్రి కుమారులు డెభ్భై మందిని ఒకేసారి మీరు చంపివేసారు. అబీమెలెకును షెకెము పట్టణము మీద రాజుగా మీరు చేశారు. అతడు మీకు బంధువు గనుక మీరు అతనిని రాజుగా చేశారు. కానీ అతడు కేవలం నా తండ్రి యొక్క దాసీ కుమారుడు మాత్రమే! 19 కనుక ఈనాడు యెరుబ్బయలుకు, అతని కుటుంబానికి మీరు సంపూర్ణంగా న్యాయంగా ఉంటే, అబీమెలెకు మీకు రాజుగా ఉన్నందుకు మీరు సంతోషంగా ఉండవచ్చు. మరియు అతడు మీతో సంతోషంగా ఉండవచ్చు. 20 కాని మీరు సరిగ్గా ప్రవర్తించి ఉండకపోతే, షెకెము నాయకులైన మిమ్మల్ని మిల్లో ఇంటివారిని అబీమెలెకు నాశనం చేయును గాక. మరియు అబీమెలెకు కూడా నాశనం చేయబడును గాక.”
21 యోతాము ఇదంతా చెప్పగానే అతడు పారిపోయాడు. అతడు బెయేరు అనే పట్టణానికి తప్పించుకొని పోయాడు. యోతాము అతని సోదరుడైన అబీమెలెకు విషయంలో భయపడినందున ఆ పట్టణంలోనే ఉండిపోయాడు.
షెకెముతో అబీమెలెకు యుద్ధం
22 అబీమెలెకు ఇశ్రాయేలు ప్రజలను మూడు సంవత్సరాలు పాలించాడు. 23-24 అబీమెలెకు చంపిన డెభ్భై మంది యెరుబ్బయలు కుమారులు అబీమెలెకునకు స్వంత సోదరులే. ఈ చెడు కార్యాలు చేయటంలో షెకెము నాయకులు అతనిని బలపర్చారు. కనుక అబీమెలెకునకు షెకెము నాయకులకు మధ్య దేవుడు చిక్కు కలిగించాడు. మరియు అబీమెలెకును బాధించుటకు షెకెము నాయకులు అన్వేషించుట మొదలుపెట్టారు. 25 షెకెము పట్టణ నాయకులకు అబీమెలెకు అంటే ఇంకెంత మాత్రం ఇష్టం లేదు. మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరినీ దాడి చేసి దోచుకొనేందుకు వారు కొండల శిఖరాలన్నిటి మీద మనుష్యులను ఉంచారు. ఆ దాడుల విషయం అబీమెలెకునకు తెలిసిపోయింది.
26 ఎబెదు కుమారుడు గాలు అను పేరుగల మనిషి, అతని సోదరులు షెకెము పట్టణానికి తరలి వచ్చారు. షెకెము పట్టణానికి నాయకులు గాలును నమ్మేందుకు, వెంబడించేందుకు తీర్మానించారు.
27 ఒకరోజు ద్రాక్ష పండ్లు ఏరుకొనేందుకు షెకెము ప్రజలు పొలాలకు వెళ్లారు. ప్రజలు ద్రాక్షరసం చేసేందుకు ద్రాక్షాపండ్లను పిండారు. తరువాత వాళ్లు తమ దేవుని ఆలయంలో ఉత్సవాన్ని జరుపుకున్నారు. ప్రజలు తిని, త్రాగి అబీమెలెకుపై చెడుగా మాటలాడుకున్నారు.
28 అప్పుడు ఎబెదు కొడుకైన గాలు, “మనము షెకెము ప్రజలమా? మనమెందుకు అతనికి విధేయులవ్వాలి? అబీమెలెకు తనను ఏమనుకొంటున్నాడు? అబీమెలెకు యెరుబ్బయలు కుమారులలో ఒకడు కాడా? అబీమెలెకు జెబూలూను తన అధికారిగా నియమించలేదా? మనము అబీమెలెకునకు విధేయులం కాకూడదు. మనము మన స్వంత ప్రజలనే అంటే హామోరు ప్రజలనే[d] అనుసరించాలి. అని వారితో అన్నాడు. (హామోరు షెకెముకు తండ్రి) 29 నీవు నన్ను ఈ ప్రజలకు ముఖ్యాధికారిగా చేస్తే, నేను అబీమెలెకును నాశనం చేస్తాను. నేను అతనికి ‘నీ సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి రా’” అని చెప్తాను.
30 జెబులు షెకెము పట్టణానికి అధిపతియై ఉండెను. ఎబెదు కుమారుడైన గాలు ఈ మాటలను మాట్లాడినప్పుడు జెబలుకు చాలా కోపం వచ్చింది. 31 అప్పుడతడు అరుమ పట్టణంలో ఉన్న అబీమెలెకు దగ్గరకు జెబులు వార్తాహరులను పంపించాడు. ఆ సందేశం యిది:
“ఎబెదు కుమారుడు గాలు, మరియు గాలు సోదరులు షెకెము పట్టణం వచ్చారు. వారు మీకు చిక్కులు కలిగిస్తున్నారు. మొత్తం పట్టణాన్ని గాలు మీకు విరోధంగా తిప్పుతున్నాడు. 32 కనుక మీరు, మీ మనుష్యులు ఈ రాత్రికి వచ్చి పట్టణం బయట పొలాల్లో దాగుకోవాలి. 33 తరువాత సూర్యోదయం కాగానే పట్టణం మీద దాడి చేయండి. మీతో యుద్ధం చేయటానికి గాలు, అతని మనుష్యులు బయటకు వస్తారు. ఆ మనుష్యులు పోరాడేందుకు బయటకు రాగానే వారికి మీరు చేయగలిగింది చేయండి.”
34 కనుక ఆ రాత్రివేళ అబీమెలెకు, అతని సైనికులు లేచి పట్టణానికి వెళ్లారు, ఆ సైనికులు నాలుగు గుంపులుగా విడిపోయారు. వారు షెకెము పట్టణానికి దగ్గరలో దాగుకొన్నారు. 35 ఎబెదు కుమారుడు గాలు బయటకు వెళ్లి షెకెము పట్టణ ద్వార ప్రవేశం దగ్గర నిలబడ్డాడు. గాలు అక్కడ నిలబడి ఉండగా అబీమెలెకు, అతని సైనికులు వారి రహస్య స్థలాల నుండి బయటకు వచ్చారు.
36 గాలు ఆ సైనికులను చూశాడు. గాలు, “అదిగో చూడు. ఆ కొండల మీద నుండి మనుష్యులు దిగి వస్తున్నారు” అని అన్నాడు.
కాని జెబలు, “నీకు కనబడుతోంది కొండల నీడలు మాత్రమే. ఆ నీడలు సరిగ్గా మనుష్యుల్లాగే కనబడతాయి” అన్నాడు.
37 కాని, “అదిగో చూడు అక్కడ. ఆ చోట నుండి కొందరు మనుష్యుల దండు దిగివస్తోంది. ఆ శకునగాండ్ర వృక్షం పక్కగా ఎవరిదో తల నాకు కనబడుతోంది” అని గాలు మరల చెప్పాడు. 38 నీవు ఇప్పుడు ఎందుకు అతిశయించుట లేదు? “‘అబీమెలెకు ఎవడు? మేము ఎందుకు అతనికి విధేయులము కావాలి?’ అని నీవు అడిగావు. ఈ మనుష్యులను గూర్చి నీవు హేళన చేశావు. ఇప్పుడు వెళ్లి వారితో యుద్ధం చేయి” అని జెబులు గాలుతో చెప్పాడు.
39 కనుక షెకెము నాయకులను అబీమెలెకుతో పోరాడుటకు గాలు తీసుకొని వెళ్లాడు. 40 అబీమెలెకు, అతని మనుష్యులు, గాలును, అతని మనుష్యులను వెంటాడారు. గాలు మనుష్యులు షెకెము పట్టణ ద్వారం వైపు వెనుకకు పరుగెత్తారు. ఆ ద్వారం చేరక ముందే గాలు మనుష్యులు చాలామంది చంపివేయబడ్డారు.
41 అప్పుడు అబీమెలెకు అరుమ పట్టణానికి తిరిగి వచ్చాడు. గాలును, అతని సోదరులను షెకెము పట్టణం నుండి జెబులు బలవంతంగా వెళ్లగొట్టాడు.
42 మరునాడు షెకెము ప్రజలు పొలాల్లో పని చేయటానికి వెళ్లారు. అది అబీమెలెకు తెలుసుకున్నాడు. 43 కనుక అబీమెలెకు తన మనుష్యులను మూడు గుంపులుగా విభజించాడు. షెకెము ప్రజలపై ఆశ్చర్య రీతిగా దాడి చేయాలని అతడు అనుకొన్నాడు. కనుక అతడు తన మనుష్యులను పొలాల్లో దాచి ఉంచాడు. ప్రజలు పట్టణంలో నుండి బయటకు రావటం అతడు చూడగానే అతడు దూకి వారిపై దాడిచేశాడు. 44 అబీమెలెకు, అతని గుంపువారు షెకెము ద్వారం దగ్గర ఒక చోటికి పరుగెత్తారు. మిగిలిన రెండు గుంపుల వారు పొలాల్లో ఉన్న ప్రజల దగ్గరకు పరుగెత్తి వారిని చంపివేశారు. 45 ఆ రోజంతా అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణం మీద యుద్ధం చేశారు. అబీమెలెకు, అతని మనుష్యులు షెకెము పట్టణాన్ని పట్టుకొని ఆ పట్టణ ప్రజలను చంపివేశారు. అప్పుడు అబీమెలెకు ఆ పట్టణాన్ని కూలగొట్టి దాని శిథిలాల మీద ఉప్పు చల్లాడు.
46 షెకెము గోపురం దగ్గర కొంతమంది ప్రజలు నివసించేవారు. షెకెమునకు సంభవించిన దాన్ని గూర్చి అక్కడి ప్రజలు విన్నప్పుడు వారు ఏల్బెరీతు[e] దేవతా మందిరంలో ఎంతో క్షేమంగా ఉండే గదిలో సమావేశమయ్యారు.
47 షెకెము గోపురపు నాయకులందరూ సమావేశమయ్యారని అబీమెలెకు విన్నాడు. 48 కనుక అబీమెలెకు, అతని మనుష్యులందరు సల్మోను కొండ మీదికి వెళ్లారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలు నరికాడు. ఆ కొమ్మలను అతడు తన భుజాల మీద మోసుకుని వెళ్లాడు. అప్పుడు అబీమెలెకు తనతో ఉన్న మనుష్యులతో, “త్వరపడండి, నేను చేసిన పని చేయండి” అని చెప్పాడు. 49 కనుక వారందరు కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. ఏల్బెరీతు దేవతా మందిరపు భద్రతాగదికి అడ్డంగా కుప్ప వేసారు. అప్పుడు వారు ఆ కొమ్మలకు నిప్పు అంటించి ఆ గదిలో ఉన్న మనుష్యులను కాల్చివేసారు. కనుక షెకెము గోపురం దగ్గర నివసించే స్త్రీ పురుషులు వెయ్యిమంది చనిపోయారు.
అబీమెలెకు మరణం
50 అప్పుడు అబీమెలెకు, అతని మనుష్యులు తేబేసు పట్టణం వెళ్లారు. అబీమెలెకు, అతని మనుష్యులు ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. 51 కాని ఆ పట్టణం లోపల ఒక బలమైన గోపురం ఉంది. నాయకులు ఇతర స్త్రీ పురుషులు ఆ గోపురమునకు పారిపోయారు. ప్రజలు ఆ గోపురం లోపల ఉండగా వారు లోపల నుండి తాళం వేసారు. తరువాత వారు ఆ గోపురపు కప్పు మీదికి ఎక్కారు. 52 ఆ గోపురం మీద దాడి చేయుటకు అబీమెలెకు, అతని మనుష్యులు దాని దగ్గరకు వచ్చారు. అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ గోపురాన్ని తగులబెట్టాలి అనుకున్నాడు. 53 కాని అబీమెలెకు ఆ గోపుర ద్వారం దగ్గర నిలబడి ఉండగా పై కప్పు మీద ఉన్న ఒక స్త్రీ తిరుగటి రాయి ఒకటి అతని తలమీద వేసింది. ఆ తిరుగటి రాయి అబీమెలెకు తలను చితకగొట్టింది. 54 వెంటనే అబీమెలెకు తన ఆయుధాలు మోసే సేవకునితో, “నీ ఖడ్గం తీసుకుని నన్ను చంపివేయి. ‘అబీమెలెకును ఒక స్త్రీ చంపేసింది’ అని ప్రజలు చెప్పకుండా ఉండేందుకు నీవే నన్ను చంపివేయాలి” అని చెప్పాడు. కనుక ఆ సేవకుడు తన కత్తితో అబీమెలెకును పొడిచివేయగా అబీమెలెకు చనిపోయాడు. 55 అబీమెలెకు చనిపోయినట్టు ఇశ్రాయేలు ప్రజలు చూశారు. కనుక వారంతా తిరిగి ఇంటికి వెళ్లారు.
56 ఆ విధంగా అబీమెలెకు చేసిన చెడు విషయాలు అన్నింటికోసం దేవుడు అతణ్ణి శిక్షించాడు. అబీమెలెకు తన డెభ్భై మంది సోదరులను చంపి తన స్వంత తండ్రికి విరోధంగా పాపం చేసాడు. 57 షెకెము పట్టణ ప్రజలు చేసిన చెడుపనుల కోసం దేవుడు వారిని కూడా శిక్షించాడు. కనుక యోతాము చెప్పిన విషయాలు నిజం అయ్యాయి. (యెరుబ్బయలు చిన్న కుమారుడు యోతాము. యెరుబ్బయలు అనగా గిద్యోను).
© 1997 Bible League International