Chronological
యూదాలో
1 పూర్వం న్యాయాధిపతులు ఏలిన కాలంలో, తినటానికి చాలినంత ఆహారం దొరకని కరువు రోజులు వచ్చాయి. ఎలీమెలెకు అనే ఒకతను యూదాలోని బేత్లెహేము వదలిపెట్టి, అతను, అతని భార్య, అతని యిద్దరు కుమారులు మోయాబు కొండ ప్రదేశంలో బ్రతకడానికి వెళ్లారు. 2 అతని భార్య పేరు నయోమి, అతని యిద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వాళ్లు యూదాలోని బేత్లెహేములో ఎఫ్రాతా వంశానికి చెందినవాళ్లు. ఈ కుటుంబం మోయాబులోని కొండ ప్రదేశానికి ప్రయాణము కట్టి అక్కడే ఉండిపోయారు.
3 ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. అందుచేత నయోమి, ఆమె యిద్దరు కుమారులు మాత్రమే మిగిలారు. 4 మోయాబు దేశపు స్త్రీలను ఆమె కుమారులు పెళ్లాడారు. ఒకని భార్య పేరు ఓర్పా, ఇంకొకని భార్య పేరు రూతు. మోయాబులో సుమారు పది సంవత్సరాలు వాళ్లు నిపసించారు. 5 అంతలో మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. అందుచేత నయోమి ఇటు భర్తగాని, అటు కుమారులుగాని లేని ఒంటరిదయిపోయింది
నయోమి ఇంటికి వెళ్లిపోతుంది
6 దేవుడు తన ప్రజలకు సహాయం చేసినట్టు, ఆయన తన ప్రజలకు (యూదాలో) ఆహారం దయచేసినట్టు మోయాబు కొండదేశంలో నయోమి విన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ దేశము విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్లి పోవాలని తీర్మానించుకుంది. ఆమె కోడళ్లు కూడా ఆమెతోనే వెళ్లిపోయేందుకు తీర్మానించుకున్నారు. 7 అంతవరకు బ్రతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్లీ యూదా దేశము పోయేదారి పట్టి ప్రయాణము మొదలు పెట్టారు.
8 అప్పుడు నయోమి తన కోడళ్లు యిద్దరితో ఇలా అన్నది: “మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్లండి. మీరు చనిపోయిన నా ఇద్దరు కుమారులపైన, నాపైన ఎంతో దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీపైన దయ చూపెట్టాలని కోరుకుంటున్నాను. 9 మీరు ఇద్దరూ మళ్లీ పెళ్లాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే మీకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన.” నయోమి తన యిద్దరు కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో అందరూ ఏడ్వటం మోదలు పెట్టారు.
10 ఆ కోడళ్లు, “మేమూ నీతోనే వచ్చేస్తాము. నీ కుటుంబంలోనే ఉంటాము” అన్నారు.
11 కాని నయోమి ఇలా అన్నది: “నా కుమార్తెలారా! మీ పుట్టిళ్లకు వెళ్లిపొండి. మీరు నాతో రావడం దేనికి? మిమ్మల్ని పెళ్లిచేసుకునేందుకు నా దగ్గర ఇంకెవరూ కుమారులు లేరు. 12 ఇంటికి వెళ్లిపోండి. ఇంకో భర్తను కట్టుకునేందుకు నేను మరీ ముసలిదానను, ఒకవేళ నాకు మళ్లీ పెళ్లవుతుందని నేను అనుకున్నా లాభం లేదు. ఎందుచేతనంటే ఒకవేళ నేను ఈ రాత్రికి రాత్రే గర్భవతినై నాకు ఇద్దరు కుమారులు పుట్టినా 13 మీరు వారిని పెండ్లాడాలంటే వాళ్లు పెద్ద వాళ్లయ్యేంతవరకు మీరు వాళ్లకోసం వేచి ఉండాలి. అన్నాళ్లూ మీరు పెళ్లి చేసుకోకుండా ఆపుజేయడం నాకు మరీ విచారం. ఎందుకంటే, యెహోవా హస్తము నాకు విరోధముగా ఎన్నో పనులు చేసింది.”
14 అప్పుడు ఆ స్త్రీలు మరింతగా ఏడ్చేశారు. ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. కాని రూతు ఆమెను హత్తుకుని ఉండిపోయింది.
15 నయోమి అన్నది: “చూడమ్మా! నీ తోడికోడలు తన సొంతవారి దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి వెళ్లిపోయినది. నీవు కూడా అలానే చేయి.”
16 కానీ రూతు, “నిన్ను విడిచి నా స్వంతవాళ్ల దగ్గరకు వెళ్లి పొమ్మని నన్ను బలవంతం చేయవద్దు. నేను నీతోనే వస్తాను. నీవు ఎక్కడికి వెళ్తే, నేనూ అక్కడికి వెళ్తాను. నీవు ఎక్కడవుంటే, నేనూ అక్కడే ఉంటాను. నీవారే నావారు, నీ దేవుడే నా దేవుడు. 17 నీవు ఎక్కడ చస్తే నేనూ అక్కడే చస్తాను. అక్కడే సమాధి చేయబడతాను. నేను ఈ మాట నిలబెట్టు కోలేకపోతే, దేవుడే నన్ను శిక్షిస్తాడు. చావుతప్ప ఇంకేది మనలను విడదీయ లేదు.”
స్వంత ఇంటికి రావటం
18 రూతు తనతోనే రావాలనే పట్టుదలతో ఉన్నట్టు గ్రహించి, నయోమి ఆమెతో వాదించడం మానివేసింది. 19 నయోమి, రూతు కలసి బేత్లెహేము పురము వరకు ప్రయాణము చేశారు. వారిద్దరూ బేత్లెహేము చేరగానే ఆ ఊరివారంతా సంబరపడిపోయి. “ఈమె నయోమి కదూ?” అని చెప్పుకున్నారు.
20 “నన్ను (మధురము) నయోమి[a] అని పిలవకండి. నన్ను మారా[b] అని పిలవండి. ఎందుచేతనంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు నా బ్రతుకును చాలా దుఃఖమయం చేశాడు. 21 నేను వెళ్లినప్పుడు నాకు కావాల్సింది అంతా ఉండేది. కాని, దేవుడు ఇప్పుడు నన్నుఏమీ లేనిదానిగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన నన్ను దుఃఖమయినిగా చేస్తే, మీరు నన్ను సంతోషం[c] అని పిలవడం దేనికి? సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను చాలా బాధపెట్టాడు” అని నయోమి వారితో అన్నది.
22 అలా నయోమి, ఆమె కోడలు రూతు (మోయాబు స్త్రీ) మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేశారు. యవల పంటకోత మొదలవుతున్న రోజుల్లో వీరిద్దరూ యూదాలోని బేత్లెహేము పురము చేరుకున్నారు.
రూతు బోయజును కలుసుకొనుట
2 బేత్లెహేములో నయోమి భర్త ఎలీమెలెకు వంశపు వాడైన బోయజు అనే దగ్గర బంధువు ఒకతను ఉండేవాడు. అతడు గొప్ప శక్తిసంపన్నుడు.
2 ఒక రోజు రూతు నయోమితో, “నేను పొలాల్లోకి వెళితే బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా నామీద జాలిపడి తన పొలంలో తన వెనుక పరిగె ఏరుకోనిస్తారేమో.” అన్నది.
“సరే మంచిది బిడ్డా, అలాగే వెళ్లిరా” అన్నది నయోమి.
3 రూతు పొలం వెళ్లి, పంట కోస్తున్న పనివాళ్ల వెనకాల తిరుగుతూ, వాళ్లు విడిచిపెట్టే పరిగె ఏరు కుంటుంది. ఆ పొలము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుకు చెందినది.
4 బోయజు బేత్లెహేమునుండి అప్పుడే పొలముకు వచ్చాడు. “దేవుడే మీకు తోడుగా వుండును గాక!” అంటూ తన పనివాళ్లను అభినందించాడు.
పనివాళ్లు “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అంటూ జవాబిచ్చారు.
5 అప్పుడు ఆయన రూతును చూసి పనివాళ్లపైన నియమించబడ్డ పెద్ద సేవకునితో, “ఎవరి అమ్మాయి ఈమె?” అని అడిగాడు బోయజు.
6 “ఆమె మోయాబు కొండదేశము నుండి నయోమితో పాటు వచ్చిన మోయాబు స్త్రీ. 7 పనివాళ్ల వెనక తిరుగుతూ అక్కడక్కడ మిగిలిపోయిన కంకులను (పరిగె) ఏరుకోనిమ్మని ప్రొద్దున్నే వచ్చి నన్ను ఆడిగింది. అప్పట్నిండి ఆమె ఎడతెరిపి లేకుండా పని చేస్తూనే వుంది. అదిగో ఆ కనబడేదే ఆమె ఇల్లు. కాసేపు మాత్రము అక్కడ విశ్రాంతి తీసుకుంది” అన్నాడు ఆ పెద్ద సేవకుడు.
8 అప్పుడు బోయజు రూతుతో ఇలా అన్నాడు: “నా కుమారీ వినుము. నీవు ఇక్కడే నా పొలంలోనే వుండి పరిగె ఏరుకో. ఇంకెవ్వరి పొలానికీ వెళ్లాల్సిన పనిలేదు. నా ఆడ కూలీలవెనకే పోతూవుండు. 9 మగ వాళ్లు ఏ పొలములో కోత కోస్తుంటారో గమనిస్తూ ఆక్కడ ఆడకూలీల వెనకే ఉండు. నిన్నేమి గొడవ పెట్టొద్దని కుర్రాళ్లతో చెబుతాలే. దాహమైతే నా మనుషులు త్రాగే పాత్రలోని నీళ్లే త్రాగు.”
10 రూతు తల వంచుకొని, నేలవరకు వంగి బోయజుతో ఇలా అన్నది. “పరాయిదాననయిన నేను నీ దృష్ఠిలో పడటం, నీ దయకు పాత్రురాలను కావడం ఆశ్చర్యంగావుంది.”
11 బోయజు ఇలా జవాబిచ్చాడు: “నీ ఆత్తగారు నయోమికి నీవు చేసిన సహాయాన్ని గూర్చి నాకంతా తెలుసు. నీ భర్త చనిపోయిన తర్వాత కూడ నీవు ఆమెకు సహాయము చేశావని నాకు తెలుసు. అంతేకాదు, నీవు నీ తల్లిదండ్రులను నీ స్వదేశాన్ని కూడా విడిచిపెట్టేసి, ఈ దేశము వచ్చేశావు. ఇక్కడి వారెవ్వరూ నీకు తెలియదు. అయినా నయోమితో వచ్చేశావు. 12 నీవు చేసిన ఈ మంచి పనులన్నిటికీ యెహోవా నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏ ఇశ్రాయేలు వారి దేవుని దగ్గర ఆశ్రయము కోరి వచ్చావో ఆ యెహోవా దేవుడు నీకు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునుగాక! మరియు ఆయన నిన్ను కాపాడునుగాక.”
13 “అయ్యా! నేను కేవలం ఒక పనిమనిషిని, మీ పని మనుషుల్లో కనీసం ఒకదానితో సమానము కాను నేను. అయినా నన్ను గూర్చి ఎంతో దయగా మాట్లాడి, నన్ను ఆదరించారు. మీ దయ నాకు ఉంటే చాలు” ఆన్నది రూతు.
14 మధ్యాహ్న భోజనము వేళ బోయజు, “ఇక్కడికి రా! మా భోజనము తిను. రొట్టెను ద్రాక్షారసములో ముంచుకో” అన్నాడు రూతుతో.
కనుక రూతు పనివాళ్లతో కలిసి కూర్చుంది. బోయజు ఆమెకు కోన్ని పేలాలు పెట్టాడు. రూతు తృప్తిగా భోజనము చేసిన తర్వాత ఇంకా కొంచెము మిగిలాయి. 15 తరువాత రూతు లేచి మళ్లీ పనికి వెళ్లింది.
బోయజు తన పనివారితో, “పనల మధ్యకూడ ఆమెను ఏరుకోనివ్వండి. ఆమెను అభ్యంతర పెట్టకండి. 16 ఆమె కోసం కొన్ని కంకులు పనల్లోనుంచి జారవిడుస్తూ, ఆమె ఏరుకొనేందుకు వాటిని విడిచిపెట్టండి, అలా ఆమె పనిని సులభం చేయండి.” అని చెప్పాడు.
నయోమి బోయజును గురించి వినుట
17 సాయంత్రంవరకు రూతు పొలాల్లో పని చేసింది. తర్వాత ఆమె ఆ కంకులను దుళ్లగొట్టింది. అవి సుమారు ఒక తూమెడు యవలయ్యాయి. 18 రూతు తాను ఏరుకొన్న గింజలను తన అత్తకు చూపెట్టేందుకని ఊరిలోనికి మోసుకొనిపోయింది. ఆ మధ్యాహ్న భోజనములో మిగిలినదానిని కూడ ఆమెకు ఇచ్చింది.
19 ఆమె అత్త ఇలా అన్నది: “ఈ గింజలన్నీ ఎక్కడ ఏరుకున్నావు? నీవు ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించినవాడిని దేవుడు దీవించునుగాక.”
రూతు తన అత్తతో, “ఈ వేళ బోయజు అనే ఆయన దగ్గర నేను పని చేశాను” అని చెప్పింది.
“యెహోవా అతనిని ఆశీర్వదించునుగాక! బ్రతికిన వాళ్లకు, చచ్చినవాళ్లకు అందరికి దేవుడు దయ చూపెడుతూనేవుంటాడు.” అని తన కోడలితో చెప్పింది నయోమి.
20 “బోయజు మన బంధువే, మనలను కాపాడేవాళ్లలో బోయజు ఒకడు” అని తన కోడలితో చెప్పింది నయోమి.
21 అప్పుడు, “మళ్లీ వచ్చి పని చేసుకోమని, కోత పూర్తి అయ్యేవరకు తన పనివాళ్లతో కలిసే పని చేసుకోమన్నాడు బోయజు” అని చెప్పింది రూతు.
22 దానికి నయోమి తన కోడలు రూతుతో ఇలా చెప్పింది: “అతని ఆడ కూలీలతోనే కలిసి పని చేసుకోవటం మంచిది నీకు. ఇంకేదైనా పొలంలో పనిచేస్తే మరే మగాడైనా నిన్ను బాధించవచ్చు.” 23 అందుచేత రూతు బోయజురి ఆడ కూలీలనే సన్నిహితంగా వెంబడిస్తూ, పనిచేసుకొంటూ పోయింది. యవలకోత పూర్తయ్యేవరకు ఆమె పరిగె ఏరుకొంది. గోధుమ కోత అయ్యేంతవరకు కూడ ఆమె అక్కడే పనిచేసింది. రూతు తన అత్తగారు నయోమితో బాటే కలిసి వుంటోంది.
కళ్లము దగ్గర రూతు, బోయజు
3 రూతు అత్త నయోమి, “చూడు బిడ్డా, ఒకవేళ నీ కోసం నేనొక మంచి భర్తను చూస్తే బాగుంటుందేమో, అది నీకు క్షేమం. 2 (ఒక వేళ బోయజే తగినవాడేమో) బోయజు మనకు చాలా దగ్గర బంధువు. అతని దగ్గర పనిచేసే స్త్రీలతో నీవూ పని చేసావు. ఈ రోజు రాత్రి అతడు కళ్లము దగ్గర పని చేస్తాడు. 3 నీవు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకో, మంచి బట్టలు కట్టుకొని కళ్లము దగ్గరకు వెళ్లు, అయితే, బోయజు భోజనము చెయ్యటము అయ్యేంత వరకు అతనికి కనబడకు. 4 అతడు భోజనము చేసిన తర్వాత పండుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అతను ఎక్కడ పండుకుంటాడో గమనిస్తూ ఉండు. అక్కడికి వెళ్లి, అతని కాళ్లమీదున్న దుప్పటి తొలగించి, అక్కడే అతని దగ్గరే పండుకో. అప్పుడు నీవేమి చేయాలో (పెళ్లి గూర్చి) అతనే నీకు చెప్తాడు.”
5 “నీవు చెప్పినట్టే చేస్తా” అని జవాబిచ్చింది రూతు.
6 రూతు కళ్లము దగ్గరకు వెళ్లింది. ఏమి చేయుమని అత్త చెప్పిందో అదంతా చేసింది రూతు. 7 తిని తాగడం అయినతర్వాత బోయజు బాగా తృప్తిగా ఉన్నాడు. ధాన్యంకుప్ప దగ్గర పండుకునేందుకు వెళ్లాడు బోయజు. అప్పుడు రూతు మెల్లమెల్లగా వెళ్లి అతని కాళ్లమీద దుప్పటి తొలగించింది. అతని పాదాల దగ్గరే ఆమె పండుకొంది.
8 సుమారు మధ్యరాత్రి బోయజు ప్రక్కకు దొర్లాడు (నిద్రలోనుంచి మేల్కొన్నాడు) అతను చాలా ఆశ్చర్య పోయాడు. తన పాదాల దగ్గర ఒక స్త్రీ పండుకొనివుంది. 9 “ఎవరు నీవు” అన్నాడు బోయజు.
“నీ సేవకురాలనైన రూతును. నన్ను కాపాడాల్సింది నీవే. నీ దుప్పటి నా మీద కప్పు” అన్నది రూతు.
10 అందుకు బోయజు, “నా కుమారీ! యెహోవా నిన్ను దీవించునుగాక! నాపై నీవు చాలా దయ చూపెట్టావు. మొదట్లో నీవు నయోమి మీద చూపెట్టిన దయకంటె, ఇప్పుడు నామీద చూపెట్టిన దయ చాలా ఎక్కువ. నీవు పెళ్లి చేసుకొనేందుకు ధనవంతుడో, పేదవాడో మరో యువకుడిని చూసుకుని ఉండాల్సింది, కాని నీవు అలా చేయలేదు. 11 కనుక చూడు బిడ్డా! నీవేమి భయపడకు. నీవు అడిగింది నేను చేస్తా. నీవు చాలా మంచిదానివని మన ఊళ్లో అందరికీ తెలుసు. 12 నేను నీకు చాలా దగ్గర బంధువును అవడం కూడ సత్యమే. అయితే, నాకంటే నీకు మరింత దగ్గర బంధువు ఒకాయన ఉన్నాడు. 13 ఈ రాత్రికి నీవు ఇక్కడ ఉండు. అతను నీకేమైనా సహాయము చేస్తాడేమో ఉదయాన్నే తెలుసు కుందాము. నీకు సహాయము చేయటానికి అతను నిర్ణయం తీసుకొంటే మంచిదే. సహాయం చేయటానికి అతను నిరాకరిస్తే మాత్రం దేవుడు సజీవుడు గనుక నేనే నిన్ను పెళ్లాడి ఎలీమెలెకు భూమిని నీ కోసము మళ్లీ కొని యిస్తాను. ఇది నా వాగ్దానం. కనుక తెల్లారే వరకు ఇక్కడే పడుకో.”
14 అందుచేత తెల్లారేవరకు రూతు అతని కాళ్ల దగ్గరే పడుకొంది. తెల్లవారుఝామునే ఒకరినొకరు గుర్తించే పాటి వెలగు రాకముందే ఆమె లేచివెళ్లి పోయింది.
“రాత్రి నీవు నా దగ్గరకు ఇక్కడికి వచ్చిన సంగతి రహస్యముగానే ఉంచుదాము” అన్నాడు బోయజు ఆమెతో. 15 “నీ దుప్పటి నా దగ్గరకు తీసుకురా, దాన్ని తెరచి పట్టుకో” అన్నాడు బోయజు.
అందుచేత రూతు తన దుప్పటి తెరచి పట్టుకుంది. ఆమె అత్తగారైన నయోమికి కానుకగా ఒక తూమెడు యవలు కోలిచి ఇచ్చాడు బోయజు. ఆ దుప్పటిని మూట కట్టి ఆమె భుజంమీద పెట్టి, బోయజు ఊళ్లోకి వెళ్లిపోయాడు.
16 రూతు తన ఆత్త నయోమి ఇంటికి వెళ్లిపోయింది. నయోమి (గుమ్మం దగ్గరకు వెళ్లి) “ఎవరది” అని అడిగింది.
(రూతు ఇంట్లోకి వెళ్లి) తనకోసము బోయజు చేసిందంతా చెప్పింది. 17 “నీకు కానుకగా ఇమ్మని బోయజు ఈ యవలు నాకు ఇచ్చాడు. నీ కోసము కానుక తీసుకుపోకుండా నేను ఇంటికి వెళ్లకూడదన్నాడు బోయజు” అని చెప్పింది రూతు.
18 “నా కుమారీ, ఏమి జరుగుతుందో తెలిసేంతవరకు నెమ్మదిగా ఉండు. బోయజు మాత్రం ఏమిచేయాలో అది చేసేంతవరకు ఊరుకోడు. ఏమి జరిగేదీ ఈరోజు గడవక ముందే మనము వింటాము.” అన్నది నయోమి.
బోయజు మరియు మరో బంధువు
4 పట్టణ ద్వారము దగ్గర ప్రజలు సమావేశమయ్యే చోటికి బోయజు వెళ్లాడు. బోయజు చెప్పిన దగ్గర బంధువు అటుపైపు వచ్చేంతవరకు బోయజు అక్కడే కూర్చున్నాడు. “మిత్రమా, ఇలా రా! ఇక్కడ కూర్చో” అని బోయజు అతడిని పిల్చాడు.
2 తర్వాత బోయజు కొందరు సాక్షులను పదిమంది పెద్దలను సమావేశ పర్చాడు. వాళ్లను, “అక్కడ కూర్చో” మని చెప్పినప్పుడు వాళ్లు కూర్చున్నారు.
3 అప్పుడు నయోమి దగ్గరి బంధువుతో బోయజు మాట్లాడాడు. “నయోమి మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేసింది. మన బంధువు ఎలీమెలెకు భూమిని ఆమె అమ్మేస్తుంది. 4 ఈ ఊరి ప్రజలయెదుట, నా వాళ్ల పెద్దలయెదుట ఈ విషయం నీతో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ భూమిని నీవు విడిపించాలనుకుంటే నీవు కొనుక్కో. ఆ భూమిని విడిపించడం నీకు ఇష్టము లేకపోతే నాకు చెప్పు, ఆ భూమిని విడిపించాల్సిన బాధ్యత నీ తర్వాత నాదే అని నాకు తెలుసు. ఆ భూమిని నీవు తిరిగి కొనకపోతే, నేను కోంటాను” అంటూ బోయజు ఆ దగ్గరి బంధువుతో చెప్పాడు.
5 “నయోమి దగ్గరనుండి నీవు ఆ భూమిని కొంటే, చనిపోయినవాని భార్య మోయాబు స్త్రీ నీదే అవుతుంది (రూతుకు సంతానం కలిగినప్పుడు ఆ సంతానానికి ఆ భూమి చెందుతుంది) ఆ విధంగా ఆ భూమి చనిపోయినవాని కుటుంబానికే చెంది ఉంటుంది” అన్నాడు.
6 ఆ దగ్గరి బంధువు జవాబుగా అన్నాడు: “నేను ఆ భూమిని కొనలేను. ఆ భూమి నాకు చెందాల్సిందే, కాని నేను దాన్ని కొనలేను. ఒకవేళ నేను దాన్ని కొనాల్సివస్తే, నా సొంత భూమిని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. అందుచేత నీవు ఆ భూమిని కొనవచ్చు.” 7 (పూర్వము ఇశ్రాయేలులో ప్రజలు ఆస్తి కొన్నా, విడిపించినా ఒకడు తన చెప్పు తీసి అవతల వ్యక్తికి ఇచ్చేవాడు. క్రయ విక్రయాలకు అది వారి రుజువు). 8 “కనుక ఆ భూమిని నీవే కొనుక్కో” అన్నాడు ఆ దగ్గరి బంధువు. తర్వాత ఆ దగ్గరి బంధువు తన చెప్పుతీసి దానిని బోయజుకు ఇచ్చాడు.
9 అప్పుడు బోయజు పెద్దలతోను, ప్రజలందరితోను చెప్పాడు. “ఎలీమెలెకు, కిలియోను, మహ్లూనులకు చెందిన దానినంతటినీ నయోమి దగ్గరనుండి నేను కొంటున్నాను. దానికి నేడు మీరే సాక్షులు. 10 నా భార్యగా ఉండేందుకు రూతును కూడా నేను తీసుకొంటున్నాను. చనిపోయినవాని ఆస్తి అతని కుటుంబానికే ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. ఈ విధంగా చేయటంవల్ల చనిపోయిన వాని పేరు అతని దేశానికి, కుటుంబానికి దూరముకాకుండా ఉంటుంది. ఈ వేళ మీరంతా దీనికి సాక్షులు.”
11 పట్టణద్వారము దగ్గర ఉన్న పెద్దలు, ప్రజలు దీనికి సాక్షులు.
“ఈ స్త్రీ నీ ఇంటికి వచ్చేస్తుంది యెహోవా
ఈమెను రాహేలు,
లేయా వలె చేయునుగాక!
రాహేలు, లేయాలు ఇశ్రాయేలు వంశ పుత్రదాతలు. ఎఫ్రాతాలో
నీవు శక్తిమంతుడవు అవుదువు గాక.
బెత్లెహేములో నీవు ప్రఖ్యాత పురుషుడవవుదువు గాక!
12 తామారు యూదా కుమారుడు పెరెసును కన్నది
అతని కుటుంబం చాలా గొప్పది
అలాగే రూతు ద్వారా అనేక మంది పిల్లలను యెహోవా నీకు ప్రసాదించును గాక!
నీ కుటుంబము కూడ అతని కుటుంబంలాగే గౌరవప్రదమవును గాక!”
13 బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. యెహోవా ఆమెను గర్భవతిని కానిచ్చినప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది. 14 ఆ ఊరిలో స్త్రీలు నయోమితో,
“నిన్ను ఆదుకొనేందుకు ఇతడిని (బోయజును) ఇచ్చిన యెహోవాని స్తుతించు.
అతడు ఇశ్రాయేలులో ప్రఖ్యాతి నొందును గాక! అనిరి. మరియు వారు,
15 అతడే నీకు బలాన్ని యిచ్చి,
నీ వృద్ధాప్యంలో నిన్ను కాపాడును గాక!
నీ కోడలు వల్ల ఇదంతా జరిగింది.
ఆమె నీ కోసం ఈ పిల్లవానిని కన్నది.
ఆమెకు నీవంటే చాలా ప్రేమ.
ఈమె ఏడుగురు కుమారులను కంటే నీకు మేలు.”
అని అనిరి.
16 నయోమి పిల్లవాడ్ని తీసుకొని, చేతుల్లో ఎత్తుకొని ఆడించింది. 17 ఆ స్త్రీలు, “ఈ పిల్లవాడు నయోమి కోసమే పుట్టాడు” అన్నారు. ఇరుగు పొరుగువారు ఆతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఓబేదు యెష్షయికి తండ్రి. యెష్షయి రాజైన దావీదుకు తండ్రి.
రూతు, బోయజు కుటుంబము
18 పెరెసు కుటుంబ చరిత్ర ఇది.
పెరెసు హెస్రోనుకు తండ్రి.
19 హెస్రోను రాముకు తండ్రి.
రాము అమ్మి నాదాబుకు తండ్రి.
20 అమ్మినాదాబు నయసోనుకు తండ్రి.
నయసోను శల్మానుకు తండ్రి.
21 శల్మాను బోయజుకు తండ్రి.
బోయజు ఓబేదుకు తండ్రి.
22 ఓబేదు యెష్షయికి తండ్రి.
యెష్షయి దావీదుకు తండ్రి.
© 1997 Bible League International