Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 16-18

సమ్సోను గాజా నగరానికి వెళ్లటం

16 ఒకనాడు సమ్సోను గాజా నగరానికి వెళ్లాడు. అక్కడ అతనొక వ్యభిచారిణిని చూశాడు. ఆ రాత్రి ఆమెతో గడిపేందుకు అతను అక్కడికి వెళ్లాడు. ఎవరో ఒకతను గాజా పౌరులతో ఇలా చెప్పాడు: “సమ్సోను ఇక్కడికి వచ్చాడు.” సమ్సోనును చంపాలని వారనుకున్నారు. అందువల్ల వారు నగరాన్ని చుట్టు ముట్టారు. వారు నగర ద్వారం వద్ద దాగివున్నారు. ఆ రాత్రి అంతా సమ్సోను కోసం చాలా వేచివున్నారు. నిశ్శబ్దంగా వారు ఒకరితో ఒకరు, “ప్రొద్దు పొడవగానే, మనం సమ్సోనును చంపుదాము” అని చెప్పుకున్నారు.

కాని సమ్సోను ఆ వ్యభిచారిణితో అర్థరాత్రి వరకే ఉన్నాడు. అర్థరాత్రి వేళ సమ్సోను లేచాడు. నగర ద్వారం తలుపుల్ని అతను లాగివేశాడు. గోడనుండి వాటిని సడలింపజేశాడు. సమ్సోను తలుపులను క్రిందికి లాగివేశాడు. రెండు స్తంభాలను, తలుపుల్ని మూసివేసి ఉంచిన అడ్డగడియలను లాగివేశాడు. సమ్సోను, వాటిని తన భుజాల మీద వేసుకుని, హెబ్రోను నగరానికి సమీపాన ఉన్న కొండ మీదికి మోసుకుని పోయాడు.

సమ్సోను మరియు దెలీలా

తర్వాత సమ్సోను దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. ఆమె శోరేకు అనే లోయకు చెందింది.

ఫిలిష్తీయుల పరిపాలకులు దెలీలా వద్దకు వెళ్లారు. వారు అన్నారు; “సమ్సోను అంత బలవంతుడు కావడానికి గల కారణమేమిటో తెలుసుకోదలచాము. ఏదో ఒక ఉపాయం పన్ని ఆ రహస్యాన్ని అతని నుంచి రప్పించు. అప్పుడు అతనిని ఎలా పట్టుకొని బంధించాలో తెలుసుకుంటాము. ఆ తర్వాత అతన్ని అదుపులో ఉంచగలము. నీవు కనుక ఇది చేయగలిగితే, నీకు మాలో ఒక్కొక్కరు ఇరవై ఎనిమిది పౌండ్లు వెండి యిస్తాము.”

అప్పుడు దెలీలా సమ్సోనుతో, “నీవెందుకు అంత బలవంతుడవైయున్నావో చెప్పు. ఎవరైనా నిన్ను బంధించి నిస్సహాయుణ్ణి చేయగలుగుతారా, చెప్పు?” అని అడిగింది.

సమ్సోను బదులు చెప్పాడు, “ఎవరైనా నన్ను ఇంకా తడి ఆరని కొత్త వింటినారులు ఏడింటితో బంధించాలి. అలా ఎవరైనా చేయగలిగితే, అప్పుడు ఇతర మనిషిలాగ బలహీనుణ్ణి అవుతాను.”

అప్పుడు ఫిలిష్తీయుల పాలకులు కొత్త వింటి నారులు ఏడు దెలీలా వద్దకు తీసుకువచ్చారు. అవి ఇంకా తడియారలేదు. ఆ వింటి నారులతో దెలీలా సమ్సోనును బంధించింది. కొంతమంది మగవాళ్లు పక్క గదిలో దాగి ఉన్నారు. దెలీలా సమ్సోనుతో ఇలా చెప్పింది; “సమ్సోనూ! ఫిలిష్తీయులు నిన్ను ఇప్పుడు పట్టుకోనున్నారు” అంది. కాని సమ్సోను సులభంగా ఆ వింటినారులు తెంచుకున్నాడు. అగ్నిలో మండిపోయిన దారంలా, బూడిదలా అవి తెగిపోయాయి. అందువల్ల ఫిలిష్తీయులు సమ్సోను బలానికిగల రహస్యాన్ని కనుగొనలేక పోయారు.

10 అప్పుడు దెలీలా సమ్సోనుతో అన్నది: “నీవు నాతో అబద్ధం చెప్పావు. దయచేసి నాకు నిజం చెప్పండి. నిన్ను ఎవరైనా ఎలా బంధించగలరు?”

11 సమ్సోను ఇలా అన్నాడు; “ఎవరైనా నన్ను కొత్త తాళ్లతో కట్టివేయాలి. అంతకు పూర్వం వాడనటువంటి కొత్త తాళ్లతో నన్ను కట్టివేయాలి. ఎవరైనా అలా చేయగలిగితే, నేను ఇతరులవలె బలహీనుణ్ణి అవుతాను.”

12 అందువల్ల దెలీలా కొత్త తాళ్లు తీసుకుంది. వాటితో సమ్సోనును కట్టివేసింది. పక్క గదిలో కొందరు మనుష్యులు దాగి ఉన్నారు. తర్వాత దెలీలా “సమ్సోనూ, ఫిలిష్తీయులు ఇప్పుడు నిన్ను పట్టుకుంటారు.” అన్నది. కాని అతను ఆ తాళ్లు సునాయాసంగా తెంచుకున్నాడు. దారాలను తెంపినంత సులభంగా వాటిని తెంచివేశాడు.

13 తర్వాత దెలీలా, “మళ్లీ నువ్వు అబద్ధం చెప్పావు. నన్ను అవివేకిగా చేశావు. ఇప్పుడైనా చెప్పు, ఎవరైనా నిన్ను ఎలా బంధించగలరో.” అని సమ్సోనుతో చెప్పింది.

“నా తలమీది వెంట్రుకలతో ఏడుజడలను అల్లగలిగి, వాటిని ఒక మేకుతో బిగించినట్లయితే అప్పుడు ఇతర మనుష్యుల్లా నేను బలహీనుణ్ణి అవుతాను” అని సమ్సోను చెప్పాడు. తర్వాత సమ్సోను నిద్రపోయాడు. అప్పుడు అతని తలమీది వెంట్రుకలను అల్లింది.

14 తర్వాత దెలీలా గుడారం మేకుతో మగ్గాన్ని నేలకు బిగించింది, అతనిని చూసి ఇలా అన్నది. “సమ్సోనూ, ఫిలిష్తీయులిప్పుడు నిన్ను పట్టుకుంటారు.” సమ్సోను ఆ గుడారం మేకుని, మగ్గాన్ని లాగివేశాడు.

15 అప్పుడు దెలీలా సమ్సోనుతో అన్నది: “‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.’ అని నీవు ఎలా చెప్పగలవు? నా మీద నీకు నమ్మకం కూడా లేదు. నీవు మూడవ సారిగా నన్ను అవివేకిని చేశావు. నీ మహా బలానికిగల రహస్యాన్ని చెప్పనే లేదు.” 16 ఇలా ప్రతిరోజూ ఆమె సమ్సోనును వేధించుకు తినసాగింది. ఆమె అలా వేధించుకు తినడం చూసి అతను విసిగిపోయాడు. మరణం సంభవించేలా అనిపించింది. 17 చివరికి సమ్సోను దెలీలాతో అన్నీ చెప్పాడు. అతను ఇలా అన్నాడు: “నేను నా జుట్టుని గొరిగించుకొనలేదు. నేను పుట్టుటకు మునుపే, నన్ను దేవునికి అర్పించారు. ఎవరైనా నా తలను గొరిగినట్లయితే, అప్పుడు నా బలాన్ని కోల్పోతాను. ఇతర మనుష్యుల్లా నేనప్పుడు బలహీనుణ్ణి అవుతాను.”

18 సమ్సోను తన రహస్యాన్ని చెప్పినట్లుగా దెలీలా గ్రహించింది. ఫిలిష్తీయుల పరిపాలకులకు ఒక సందేశం పంపింది. ఆమె ఇలా చెప్పింది: “మళ్లీ రండి. సమ్సోను నాతో అన్నీ చెప్పాడు.” అందువల్ల ఫిలిష్తీయుల పరిపాలకులు దెలీలా వద్దకు మళ్లీ వచ్చారు. తమతో పాటు వాళ్లు మాట యిచ్చిన ప్రకారం డబ్బు కూడా తీసుకు వచ్చారు.

19 సమ్సోను తన తొడమీద పడుకుని వున్నప్పుడు దెలీలా అతనిని నిద్ర పుచ్చింది. అప్పుడొక వ్యక్తిని లోనికి పిలిచి, సమ్సోను తల వెంట్రుకలను గొరిగి వేయమనింది. ఈ విధంగా సమ్సోనుని ఆమె బలహీనపరిచింది. సమ్సోను బలహీనుడయ్యాడు. 20 అప్పుడు అతణ్ణి లేవమని చెప్పి, “సమ్సోనూ, ఫిలిష్తీయులిప్పుడు నిన్ను పట్టుకోనున్నారు” అని ఆమె చెప్పింది. అతను మేల్కొన్నాడు. ఆలోచన చేశాడు, “నేను పూర్వం చేసినట్లుగా చేసి తప్పించుకుంటాను. స్వతంత్రుణ్ణి అవుతాను.” కాని యెహోవా అతనిని విడనాడి వెళ్లినట్లు సమ్సోను గ్రహించలేదు.

21 ఫిలిష్తీయులు సమ్సోనును పట్టుకున్నారు. వారతని కళ్లు పెరికి వేశారు. గాజా నగరానికి తీసుకుని వెళ్లారు. అతను పారిపోకుండా ఉండేందుకుగాను, సంకెళ్లతో బంధించారు. వారు సమ్సోనును చెరసాలలో ఉంచారు. అతని చేత ధాన్యం విసిరించారు. 22 కాని సమ్సోను వెంట్రుకలు మళ్లీ మొలవసాగాయి.

23 ఫిలిష్తీయుల పాలకులు ఒకటిగా చేరి పండగ చేసుకోవాలనుకున్నారు. తమ దేవుడైన దాగోనుకు[a] పెద్ద బలి కూడా ఇవ్వాలనుకున్నారు. “మన శత్రువైన సమ్సోనును ఓడించేందుకు మన దేవుడు మనకు సహాయం చేశాడు.” అని అనుకున్నారు. 24 సమ్సోనుని చూడగానే వారు తమ దేవుణ్ణి ప్రశంసించారు. వారు ఇలా అన్నారు:

“ఈ మనిషి మనవారిని నాశనం చేశాడు.
    ఈ మనిషి మనవారిలో పలువురిని చంపాడు,
కాని మన దేవుడు మన శత్రువుని వశం చేసుకునేందుకు సహాయం చేశాడు!”

25 ఉత్సవ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు వారిలా అన్నారు: “సమ్సోనును వెలికి తీసుకురండి. అతనిని చూసి మేము పరిహాసం చెయ్యాలి.” కనుక చెరసాల నుంచి సమ్సోనును బయటికి తీసుకువచ్చారు. అతనిని పరిహసించారు. దేవుడైన దాగోను గుడిలో స్తంభాల మధ్య సమ్సోనును నిలబెట్టారు. 26 ఒక సేవకుడు సమ్సోను చెయ్యి పట్టుకున్నాడు. అతనితో సమ్సోను, “ఈ ఆలయానికి ఆధారంగా వున్న స్తంభాల మధ్య నన్ను ఉంచు. వాటిని ఆనుకుని వుంటాను” అన్నాడు.

27 ఆ ఆలయం స్త్రీ పురుషులతో కిటకిటలాడుతున్నది. ఫిలిష్తీయుల పాలకులందరూ అక్కడికి చేరారు. ఆలయ కప్పుమీద సుమారు మూడువేల మంది స్త్రీ పురుషులు ఉన్నారు. వారందరూ సమ్సోనును చూసి ఎగతాళి చేస్తున్నారు. 28 అప్పుడు యెహోవాను సమ్సోను స్తుతించాడు. “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నన్ను మరచిపోవద్దు. దేవుడా, మరొకసారి నాకు బలం ప్రసాదించు. నా రెండు కళ్లనీ చీల్చివేసిన ఈ ఫిలిష్తీయులను శిక్షించేందుకు నాకు శక్తి ఇయ్యి.” అని ప్రార్థించాడు. 29 అప్పుడు ఆలయం మధ్య వున్న రెండు స్తంభాలను సమ్సోను పట్టుకున్నాడు. ఆ రెండు స్తంభాలు ఆలయాన్ని భరిస్తున్నవి. ఆ రెండు స్తంభాలను అతను కౌగిలించుకున్నాడు. ఒక స్తంభం అతని కుడిచేయి వైపున వున్నది. మరొకటి ఎడమ చేతివైపున వున్నది. 30 సమ్సోను ఇలా అన్నాడు; “ఈ ఫిలిష్తీయులతో పాటు నేను మరణిస్తాను” అని, తర్వాత తన శక్తికొద్దీ వాటిని తోశాడు. ఆలయంలోపల వున్న పరిపాలకులు మరియు మనుష్యుల మీద ఆలయం పడిపోయింది. ఈ విధంగా సమ్సోను ఇంకా మరికొందరు ఫిలిష్తీయులను చంపివేశాడు. అతను జీవించిన నాటికంటె మరణ సమయంలోనే, చాలా మందిని చంపి వేశాడు.

31 సమ్సోను యొక్క సోదరులు, అతని కుటుంబంలోని వారందరూ అతని దేహం తీసుకురావడానికి వెళ్లారు. అతనిని తీసుకు వచ్చి, తండ్రి సమాధిలో పాతి పెట్టారు. ఆ సమాధి జోర్యా, ఏష్తాయోలు నగరాల మధ్య ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను ఇరవై సంవత్సరాలపాటు న్యాయాధిపతిగా వ్యవహరించాడు.

మీకా విగ్రహాలు

17 పర్వత దేశమైన ఎఫ్రాయిములో మీకా అనే ఒక వ్యక్తి వుండేవాడు. మీకా తన తల్లితో, “నీ వద్దనున్న ఇరవై ఎనిమిది పౌండ్ల వెండి దొంగిలించిన వ్యక్తి ఎవరో నీకు తెలియునా! ఆ విషయమై ఒక శాపం ఉన్నట్లు నీవు చెప్పగా విన్నాను. సరే, వెండి నా వద్ద ఉన్నది. అది నేను తీసుకున్నాను” అన్నాడు.

“కుమారుడా, నిన్ను యెహోవా ఆశీర్వదించు గాక” అన్నది.

మీకా తన తల్లికి ఇరవై ఎనిమిది పౌండ్ల వెండిని తిరిగి ఇచ్చివేశాడు. అప్పుడామె అంది, “నేనీ వెండిని యెహోవాకు విశేష కానుకగా సమర్పిస్తాను. నేను దీనిని నా కుమారునికి ఇస్తాను. అతను ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాలి. అందువల్ల, నా కుమారుడా, ఈ వెండిని తిరిగి నీకే ఇస్తాను.”

కాని మీకా ఆ వెండిని తిరిగి తల్లికే ఇచ్చివేశాడు. ఆమె దాదాపు అయిదు పౌండ్ల వెండిని మాత్రమే తీసుకుని, ఆ వెండిని కంసాలి వానికి ఇచ్చింది. వెండి పనిముట్లు తయారు చేసే వ్యక్తి ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాడు. ఆ విగ్రహం మీకా ఇంట్లో ఉంచబడింది. మీకాకు విగ్రహాలు ఆరాధించే ఒక ఆలయం వుండేది. అతను ఒక ఏఫోదు, కొన్ని విగ్రహాలు తయారు చేశాడు. తర్వాత తన కుమారులలో ఒకనిని యాజకునిగా ఎంపిక చేశాడు. (ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. అందువల్ల ప్రతి వ్యక్తీ తనకేది సరి అని అనిపిస్తే, దానినే చేస్తుండేవాడు).

లేవీ వంశానికి చెందిన ఒక యువకుడు ఉన్నాడు. అతను యూదాలోని బేత్లేహేముకు చెందిన వాడు. యూదా వంశస్తులతో అతను నివసిస్తూండేవాడు. మరొక నివాసం కోసం అతను అన్వేషిస్తూ, ప్రయాణం చేస్తూవుండగా, అతను మీకా ఇంటికి వచ్చాడు. ఎఫ్రాయిము పర్వత దేశంలో మీకా ఇల్లు ఉంది. “నీవు ఎక్కడినుంచి వచ్చావు?” అని మీకా అతనిని అడిగాడు.

ఆ యువకుడు ఇలా సమాధానం ఇచ్చాడు: “నేను లేవీ వంశానికి చెందినవాణ్ణి. యూదాలోని బేత్లెహేమునుంచి వస్తున్నాను. నివసించేందుకు గాను నేనొక చోటు చూస్తున్నాను.”

10 అప్పుడు మీకా అతనితో అన్నాడు: “నీవు నాతో పాటు వుండు. నీవు నాకు తండ్రిగా, నా యాజకునిగా ఉండు. ప్రతి సంవత్సరం నీకు 4 ఔన్సుల వెండి ఇస్తాను. నీకు అన్నవస్త్రాలు కూడా ఇస్తాను.”

మీకా చెప్పినట్లుగా లేవీ వంశపు వాడు చేసాడు. 11 మీకాతో పాటు ఉండేందుకు యువకుడైన లేవీ వంశపువాడు సమ్మతించాడు. ఆ యువకుడు మీకా యొక్క సొంత కొడుకులలో ఒకనిలాగ అయ్యాడు. 12 మీకా అతనిని తన యాజకునిగా ఎంపికచేశాడు. అందువల్ల ఆ యువకుడు యాజకుడయ్యాడు. మీకా ఇంట్లో నివసించ సాగాడు. 13 మీకా ఇలా అన్నాడు, “లేవీ వంశపువాడొకడు నా యాజకునిగా వున్నాడు కనుక యెహోవా ఇప్పుడు నాకు ఆశీర్వాదంగా ఉండునని నేను భావిస్తున్నాను.”

దాను లాయిషు నగరాన్ని పట్టుకొనుట

18 ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. పైగా ఆ సమయంలో దాను వంశీయులు ఉండడానికిగాను ఒక చోటుకోసం అన్వేషిస్తున్నారు. తమకు సొంతమనదగిన ప్రదేశం వారికి లేదు. ఇశ్రాయేలుకి చెందిన ఇతర వంశాలవారికి స్వస్థలం ఉంది. కాని దాను వంశీయులకు సొంత ప్రదేశం లేదు.

అందువల్ల దాను వంశంవారు ఐదుగురు సైనికులను ఏదైనా ఒక ప్రదేశం అన్వేషించమని చెప్పి పంపించారు. వారు ఒక మంచి ప్రదేశం వెదికేందుకు గాను వెళ్లారు. ఆ ఐదుగురు జోర్యా, ఎష్తాయేలు నగరాల నుండి వచ్చారు. దాను వంశమునకు చెందిన అన్ని కుటుంబాల నుండి వచ్చినవారు. అందువల్లనే వారిని ఎంపిక చేయడం జరిగింది. “వెళ్లి ఏదైనా ఒక చోటు చూడండి” అని వారికి చెప్పబడింది.

ఆ ఐదుగురూ కొండ దేశమైన ఎఫ్రాయిముకు వచ్చారు. వారు మీకా ఇంటికి వచ్చారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. వారు మీకా ఇంటికి అతి సమీపంగా వచ్చేసరికి, ఆ లేవీ యువకుడి కంఠస్వరం విన్నారు. ఆ గొంతుని వారు గుర్తుపట్టారు. అందువల్ల వారు మీకా ఇంటి దగ్గర ఆగిపోయారు. ఆ యువకుణ్ణి “ఎవరు నిన్నీ స్థలానికి తీసుకువచ్చారు? ఇక్కడ నీవేమి చేస్తున్నావు? ఇక్కడ నీ పనేమిటి?” అని వారు అడిగిరి.

ఆ యువకుడు మీకా తనకోసం చేసిన పనులను తెలియజేశాడు. “మీకా నన్ను జీతానికి ఉంచుకున్నాడు. నేనతని యాజకుడిని” అని అతను చెప్పాడు.

అప్పుడు వారతనితో ఇలా అన్నారు; “దయచేసి మాకోసంకూడా దేవుణ్ణి ఏదో ఒకటి అడుగు. ఏదైనా మేము తెలుసుకోదలచాము. ఉండడానికి చోటుకోసం వెతుకుతున్న మా అన్వేషణ విజయవంతమవుతుందా?”

యాజకుడు ఆ ఐదుగురితో ఇలా అన్నాడు, “అవుతుంది. నిశ్చింతంగా వెళ్లండి. మీ త్రోవలో, యెహోవా మిమ్మల్ని నడుపుతాడు.”

అందువల్ల ఐదుగురు వెళ్లిపోయారు. లాయిషు నగరానికి వారు వచ్చారు. ఆ నగరంలోని ప్రజలు భద్రత కలిగి ఉండడం వారు చూశారు. వారిని సీదోను ప్రజలు పరిపాలించారు. ప్రతిదీ ప్రశాంతంగా శాంతియుతంగా ఉండి, ప్రజలకు అంతా సమృద్ధిగా ఉండినది. తమకు హాని కలిగించే విరోధులు దగ్గరలో వారికి లేరు. పైగా సీదోను నగరానికి దూరంగా వారు నివసిస్తున్నారు. ప్రజలతో ఎలాంటి ఒడంబడికలూ చేసుకోలేదు.

ఆ ఐదుగురూ జోర్యా, ఎష్తాయేలు నగరాలకు తిరిగి వెళ్లారు. “సంప్రదింపులు చేశారా?” అని వారి బంధువులు అడిగారు.

ఆ ఐదుగురూ ఇలా బదులు చెప్పారు, “మేము ఒక ప్రదేశం చూశాము. అది చాలా బాగున్నది. వారిని మనం ప్రతిఘటించాలి. వేచి ఉండవద్దు! మనం వెళదాము, ఆ ప్రదేశాన్ని తీసుకుందాము. 10 మీరు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, అక్కడ చాలా ప్రదేశం ఉన్నదని మీరే తెలుసుకుంటారు. అక్కడ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ప్రజలు ఏ ప్రతిఘటనను ఎదుర్కొంటారని అనుకోవడంలేదని మీరు తెలుసుకుంటారు. దేవుడే మనకు ఆ ప్రదేశం ఇచ్చాడు.”

11 అందువల్ల దాను వంశానికి చెందిన ఆరువందల మంది మనుష్యులు జోర్యా, ఎష్తాయేలు నగరాలకు బయలుదేరారు. యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు. 12 లాయిషు నగరానికి వెళ్లే దారిలో, యూదాలోని కిర్యత్యారీము అనే నగరం వద్ద వారు ఆగారు. అక్కడ ఒక గుడారం వేసుకున్నారు. అందువల్లనే కిర్యత్యారీముకి పడమరగా వున్న ప్రదేశానికి మహనెదాను అని పేరు వచ్చింది. నేటికీ అదే పేరు. 13 ఆ ప్రదేశంనుండి, ఆ ఆరువందల మంది మనుష్యులూ కొండ దేశమైన ఎఫ్రాయిముకి ప్రయాణమయ్యారు. ఆ తర్వాత వారు మీకా ఇంటికి వచ్చారు.

14 లాయిషు చుట్టు ప్రక్కల ప్రాంతంలో సంచరించటానికి వెళ్లిన ఆ ఐదుగురూ వాళ్ల బంధువులతో అన్నారు: “ఒక ఇంట్లో ఏఫోదు ఉన్నది. పైగా గృహదేవతలు, చెక్కిన విగ్రహం మరియు వెండి విగ్రహం ఉన్నాయి. మీకేమి చేయాలో తెలుసు వాటిని తీసుకురావాలి.” 15 అందువల్ల వారు మీకా ఇంటి వద్ద నిలిచారు. అక్కడే యువకుడైన లేవీ మనిషి ఉన్నాడు. నీవెలా వున్నావని ఆ యువకున్ని వారడిగారు. 16 దాను వంశీయులైన ఆ ఆరువందల మంది మనుష్యులు వెలుపల ద్వారం వద్ద నిలిచారు. వారి వద్ద ఆయుధాలు ఉన్నాయి. యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు. 17-18 ఐదుగురు గూఢచారులు ఇంట్లోకి వెళ్లారు. వెలుపల ద్వారం పక్కగా యుద్ధ సన్నద్ధులైన ఆ ఆరువందల మంది మనుష్యులతో యాజకుడు నిలబడివున్నాడు. ఆ మనుష్యులు మలిచిన విగ్రహం, ఏఫోదు, గృహదేవతలు మరియు వెండి విగ్రహం తీసుకున్నారు. యువకుడైన లేవీ యాజకుడు, “మీరేమి చేస్తున్నారు?” అని అడిగాడు.

19 ఆ ఐదుగురు ఇలా బదులు చెప్పారు: “ఊరక వుండు! ఒక్కమాట కూడా మాట్లాడ వద్దు. మాతో పాటు రా. మా తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీవు ఎన్నుకుని తీరాలి. కేవలం ఒక్క వ్యక్తికి తండ్రిగా, యాజకుడుగా ఉండటం మంచిదా? లేక ఇశ్రాయేలు ప్రజలలో ఒక వంశం వారికి యాజకుడుగా ఉండడం మంచిదా?”

20 లేవీ వ్యక్తికిది సంతోషదాయకమయింది. అందువల్ల అతను ఏఫోదు, గృహదేవతలు మరియు విగ్రహం తీసుకొని, దాను వంశం వారివద్ద నుంచి వచ్చిన మనుష్యులతో వెళ్లిపోయాడు.

21 తర్వాత దాను వంశానికి చెందిన ఆ ఆరువందల మంది మనుష్యులు లేవీ యాజకునితో కలిసి వెనుదిరిగి మీకా ఇల్లు విడిచి వెళ్లారు. వారు తమ చిన్న పిల్లలను, తమ జంతువులను తమ అన్ని వస్తువులను వారి ముందు విడిచిపెట్టి వెళ్లారు.

22 దాను వంశమునకు చెందిన ఆ మనుష్యులు ఆ చోటునుండి చాలా దూరం వెళ్లారు. మీకాదగ్గర నివసించే వారు ఒకటిగా కలుసుకున్నారు. తర్వాత దాను మనుష్యుల్ని వెంబడించారు. వారిని పట్టుకున్నారు. 23 దాను మనుష్యుల్ని మీకా మనుష్యులు కేకలు వేయసాగారు. దాను మనుష్యులు నిలబడ్డారు. “సమస్య ఏమిటి? ఎందుకు కేకలు వేస్తున్నారు?” అని మీకాని అడిగారు.

24 మీకా బదులు చెప్పెను: “దాను మనుష్యులైన మీరు నా విగ్రహాలు తీసుకుపోతున్నారు. వాటిని నా కోసం తయారు చేసుకున్నాను. మీరు నా యాజకుని కూడా తీసుకువెళ్తున్నారు. ఇక నాకు ఏమి మిగిలింది? ‘సమస్య ఏమిటి?’ అని మీరెలా అడుగుతారు?”

25 దాను వంశీయులు అందుకు ఇలా అన్నారు: “మాతో నీవు వివాదానికి పాల్పడడం మంచిది కాదు. మాలో కొందరు కోపిష్ఠులు. మమ్మల్ని నీవు కేకలు వేస్తే, వారు నిన్ను ప్రతిఘటించవచ్చు. నీవు, మీ కుటుంబాలవారూ చంపబడవచ్చు.”

26 తర్వాత దాను వంశానికి చెందిన మనుష్యులు వెనుదిరిగి తమ తోవను వెళ్లారు. ఆ మనుష్యులు తనకంటె బలాఢ్యులని మీకా గ్రహించాడు. అందువల్ల అతను ఇంటికి వెళ్లిపోయాడు.

27 కాగా మీకా చేసిన విగ్రహాలను దాను వంశీయులు తీసుకొనిపోయారు. మీకాతో ఉండిన యాజకుని కూడా తమతో పాటు తీసుకొనిపోయారు. తర్వాత వారు లాయిషుకి వచ్చారు. లాయిషులో నివసిస్తున్న వారి మీద దాడిచేశారు. ఆ మనుష్యులు శాంతముగా ఉన్నారు. వారు దాడిని ఎదురుచూడలేదు. దానుకు చెందిన మనుష్యులు వారిని తమ కత్తులతో చంపివేశారు. తర్వాత నగరాన్ని కాల్చివేశారు. 28 లాయిషులో నివసించేవారికి తమను కాపాడేవారు లేరు. వారు సీదోను నగరానికి చాలా దూరాన నివసించుటచే, ఆ నగర ప్రజలు సహాయం చేయలేకపోయారు. మరియు లాయిషు ప్రజలు అరాము ప్రజలతో ఒడంబడికయేమీ చేసుకొని ఉండలేదు. అందువల్ల వారు సహాయం చెయ్యలేదు. లాయిషు నగరం ఒక లోయలో ఉంది. అది బెత్రెహోబు పట్టణానికి చెందింది. దాను ప్రజలు ఆ ప్రదేశంలో ఒక కొత్త నగరం నిర్మించుకున్నారు. ఆ నగరం వారి నివాసమయింది. 29 దాను ప్రజలు ఆ నగరానికి కొత్త పేరు పెట్టారు. దానిని లాయిషు అన్నారు. కాని దానిని దాను అని మార్చివేశారు. ఆ నగరానికి ఇశ్రాయేలు కుమారులలో ఒకడైన దాను అను పూర్వీకుని పేరు పెట్టారు.

30 దాను వంశానికి చెందిన ప్రజలు దాను నగరంలో విగ్రహాలు ప్రతిష్ఠించారు. వారు గెర్షోము కుమారుడైన యోనాతానును తమ యాజకునిగా నియమించుకున్నారు. గెర్షోము మోషే[b] కుమారుడు. యోనాతాను మరియు అతని కుమారులు ఇశ్రాయేలు ప్రజల్ని బందీలుగా చేసి బబులోనుకు తీసుకు వెళ్లేంతవరకు దాను వంశం వారికి యాజకులుగా ఉన్నారు. 31 దాను ప్రజలు మీకా చేసిన విగ్రహాలను పూజిస్తూండేవారు. దేవాలయము షిలోహులో ఉన్నంత కాలము వారు ఆ విగ్రహాలను పూజించుచుండిరి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International