Chronological
దావీదు-యోనాతానుల స్నేహం
18 దావీదు సౌలుతో మాట్లాడటం ముగించాక, యోనాతాను దావీదుకు చాలా సన్నిహితుడయ్యాడు. తనను తాను ప్రేమించుకున్నంతగా యోనాతాను దావీదును ప్రేమించాడు. 2 సౌలు ఆ రోజు నుంచీ దావీదును తన వద్దనే ఉంచుకొన్నాడు. దావీదును ఊరిలోవున్న తన తండ్రి వద్దకు సౌలు పోనీయలేదు. 3 యోనాతాను దావీదుతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఎందువల్లనంటే, దావీదు అంటే యోనాతానుకు ఎనలేని ప్రేమ. 4 యోనాతాను తన అంగీ తీసి దావీదుకు తొడిగాడు. యోనాతాను తన సైనిక దుస్తులు కూడా దావీదుకు ఇచ్చాడు. అంతేగాదు; యోనాతాను తన ఖడ్గం, విల్లంబులు, పటకా అన్నీ దావీదుకు ఇచ్చాడు.
దావీదు విజయాన్ని సౌలు గుర్తించుట
5 సౌలు దావీదును అనేక యుద్ధాలకు పంపాడు అన్నింటిలో అతడు విజయం సాధిస్తూ వచ్చాడు. కాబట్టి అతనిని సైన్యాధికారిగా సౌలు నియమించాడు. దీనికి ప్రజలంతా చాలా సంతోషించారు. సౌలు అధికారులు కూడ సంతోషించారు. 6 దావీదు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలోని వివిధ పట్టణాల స్త్రీలు అందరూ దావీదును కలుసుకొనేందుకు బయటకు వచ్చారు. వారు వీణారాగాలతోను, మృదంగతాళ ధ్వనులతోను దావీదు ఎదుట చిరునవ్వులతో నాట్యం చేసారు. ఇదంతా వారు సౌలు యెదుటనే చేసారు.
7 “సౌలు వేల కొలదిగాను హతము చేసెననియు
దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు”
స్త్రీలంతా జయగీతిక పాడారు.
8 స్త్రీల పాట సౌలును కలవర పెట్టింది. అతనికి చాలా కోపం వచ్చింది. “తాను వేలమందిని మాత్రమే చంపానని దావీదు పదివేల మందిని చంపాడని స్త్రీలు చెబుతున్నారే” అని సౌలు పరి పరి విధాల ఆలోచనచేశాడు. 9 అప్పటినుండి సౌలు దావీదును ఒక కంట కనిపెడుతూ వచ్చాడు.
సౌలు దావీదును గూర్చి భయపడుట
10 ఆ మరుసటి రోజు దేవుని యొద్ద నుండి ఒక దుష్ట ఆత్మ సౌలును బలీయంగా ఆవరించింది. తన ఇంటిలో సౌలు చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. ఎప్పటిలాగే దావీదు తన వీణ వాయించాడు. కానీ సౌలు చేతిలో ఒక బల్లెం ఉంది. 11 “దావీదును గోడకు గుచ్చి వేయాలని సౌలు” తలంచాడు. రెండుసార్లు సౌలు బల్లెం విసరినాడు. కానీ దావీదు తప్పించుకున్నాడు.
12 యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. యెహోవా సౌలును వదిలివేశాడు. అందువల్ల దావీదు అంటే సౌలుకు భయంవేసింది. 13 సౌలు తన దగ్గరనుండి దావీదును పంపివేసాడు. సౌలు దావీదును వెయ్యిమంది సైనికులకు అధిపతిగా చేసాడు. ఆ సైనికులను దావీదు యుద్ధానికి నడిపించాడు. 14 యెహోవా దావీదుతో ఉన్నాడు గనుక, దావీదు ఏది చేసినా విజయాన్నే సాధిస్తూవచ్చాడు. 15 దావీదు చాలా విజయం సాధిస్తున్నట్టు సౌలు గమనించాడు. దానితో సౌలుకు దావీదు అంటే భయం ఇంకా ఎక్కువయ్యింది. 16 కానీ ఇశ్రాయేలు, యూదా ప్రజలు అందరూ దావీదును ఎక్కువగా ప్రేమించారు. కారణం వారిని యుద్ధంలో దావీదు అతిచాకచక్యంగా నడిపించుటచేత.
దావీదు తన కుమార్తెను వివాహం చేసుకోవాలని సౌలు కోరుట
17 (కానీ సౌలు దావీదును చంపాలని కోరాడు. దావీదును మోసం చేయటానికి ఒక పథకం వేసాడు). సౌలు, “ఇదిగో నా పెద్ద కుమార్తె మేరబు. నీవు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత నీవు మంచి శక్తిగల సైనికుడివి కావచ్చు. నీవు నాకు ఒక కొడుకులా ఉంటావు. అప్పుడు నీవు వెళ్లి, యెహోవా పక్షంగా యుద్ధాలు చేయి” అని దావీదుతో చెప్పాడు. (ఇది ఒక పన్నాగము). వాస్తవానికి సౌలు, “ఇప్పుడు దావీదును నేనేమీ చంపక్కర్లేదు. నా కోసం ఫిలిష్తీయులే అతనిని చంపుతారులే” అని తలంచాడు.
18 అందుకు దావీదు, “మాది గొప్ప కుటుంబంకాదు, నేను గొప్ప వ్యక్తినీ కాను. కనుక నేను రాజుగారి అమ్మాయిని పెళ్లాడలేను” అని అన్నాడు.
19 అందుచేత మేరబు దావీదును పెళ్లి చేసుకొనే సమయం వచ్చేసరికి, సౌలు ఆమెను మెహోలతీవాడైన అద్రియేలు అనేవానికిచ్చి వివాహము చేసాడు.
20 సౌలు యొక్క మరో కుమార్తె మీకాలు దావీదును ప్రేమించింది. మీకాలు దావీదును ప్రేమించినట్టు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని సౌలు సంతోషించాడు. 21 “మీకాలు దావీదును వివాహ మాడటానికి నేను అంగీకరిస్తాను. దావీదును ఉచ్చులో పెట్టేందుకు నేను మీకాలును వినియోగించుకుంటాను. అప్పుడు దావీదును ఫిలిష్తీయుల చేతనే చంపిస్తాను” అనుకొన్నాడు సౌలు. కనుక సౌలు రెండవ సారిగా దావీదుతో, “ఈ వేళ నీవు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు” అని చెప్పాడు.
22 సౌలు తన అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు. “దావీదుతో ఆంతరంగికంగా, ‘రాజుకు నీవంటే చాలా ఇష్టం. అతని అధికారులకు కూడా నీవంటే ఇష్టం. నీవు అతని కుమార్తెను పెళ్లి చేసుకో’ అని చాటుగా దావీదుకు చెప్పండి” అని సౌలు వారితో అన్నాడు.
23 సౌలు అధికారులు అలాగే దావీదుతో చెప్పారు. అది విన్న దావీదు, “రాజుగారి అల్లుడు కావటమంటే అంత తేలికైన పని అనుకుొటున్నారా? (రాజుగారి కుమార్తెకు కట్నం ఇచ్చేందుకు నా దగ్గర డబ్బులేదు.) నేను సామాన్య నిరుపేదను” అని దావీదు జవాబిచ్చాడు.
24 తిరిగి సౌలు అధికారులు దావీదు చెప్పినదంతా సౌలుకు వివరించారు. 25 మళ్లీ సౌలు వారితో, “దావీదు కట్నం చెల్లించనక్కరలేదనీ, కేవలం ఒక వందమంది ఫిలిష్తీయుల సున్నతి చర్మాలను తెస్తే చాలనీ చెప్పండి. దానితో సౌలు తన శత్రువుల మీద పగ తీర్చుకున్నట్లవుతుందని చెప్పండి” అన్నాడు. ఈ పని చేస్తే ఫిలిష్తీయులు దావీదును చంపుతారని సౌలు రహస్య పథకం.
26 సౌలు అధికార్లు మళ్లీ దావీదుకు ఈ విషయం చెప్పారు. దావీదు సౌలు అల్లుడు కావటానికి ఇష్టపడ్డాడు. కనుక అతడు వెంటనే పనికి పూనుకున్నాడు. 27 దావీదు తన సైనికులతో బయలుదేరి వెళ్లి రెండువందల మంది ఫిలిష్తీయులను చంపి, వారి సున్నతి చర్మాలను తీసుకొని వచ్చి సౌలుకు ఇచ్చాడు. రాజుగారి అల్లుడు కావాలని కోరి దావీదు ఇలా చేసాడు.
అప్పుడు సౌలు దావీదును తన కుమార్తె మీకాలును పెండ్లి చేసుకోనిచ్చాడు. 28 అప్పుడు కూడా యెహోవా దావీదుతో ఉన్నాడని సౌలు అవగాహన చేసుకున్నాడు. పైగా తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమస్తూ ఉందని తెలుసుకున్నాడు. 29 దానితో సౌలుకు దావీదు అంటే భయం ఎక్కువయ్యింది. ఆ విధంగా సౌలు దావీదుకు ఎల్లప్పుడూ విరోధంగా ఉండిపోయాడు.
30 ఫిలిష్తీయుల సేనాధిపతులు మాత్రం ఇశ్రాయేలీయులపై తమ దండయాత్రలు సాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రతిసారీ దావీదు వారిని ఓడిస్తూనే ఉన్నాడు సౌలు క్రిందవున్న అధికారులందరిలో దావీదు చాలా ఉత్తమ అధికారి. అందువల్ల దావీదు చాలా ప్రసిద్ధిలోకి వచ్చాడు.
యోనాతాను దావీదుకు సహాయం చేసాడు
19 దావీదును చంపి వేయుమని సౌలు తన కుమారుడైన యోనాతానుకు, మిగిలిన అధికారులకు చెప్పాడు. కానీ యోనాతాను దావీదును చాలా ప్రేమించాడు. 2 యోనాతాను దావీదును హెచ్చరించాడు. “జాగ్రత్తగా ఉండు. సౌలు నిన్ను చంపాలని అవకాశం కోసం చూస్తున్నాడు. ఉదయం పొలానికి వెళ్లి అక్కడ దాగి వుండు. 3 నేను నా తండ్రితో ఆ పొలానికి వస్తాను. నీవు దాగియున్న పొలాల వద్ద మేము నిలబడతాము. నీ విషయంలో నా తండ్రితో నేను మాట్లాడతాను. తరువాత నేను తెలుసుకున్నదంతా నీకు చెబ తాను” అని యోనాతాను దావీదుతో చెప్పాడు.
4 యోనాతాను తన తండ్రి సౌలుతో మాట్లాడుతూ దావీదు గుణగణాలను కొనియాడాడు. “నీవు రాజువు. దావీదు నీ సేవకుడు. దావీదు నీకు ఏమీ కీడు చేయలేదు. కనుక అతనికి ఏమీ కీడు చేయకు. దావీదు ఎల్లప్పుడూ నీ ఎడల మేలునే చేసాడు. 5 దావీదు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపాడు. దాని ద్వారా యెహోవా ఇశ్రాయేలు అంతటికీ ఘనవిజయం సమకూర్చి పెట్టాడు. అదంతా నీవు చూశావు, ఆనందించావు. పైగా అటువంటి దావీదుకు నీవు ఎందుకు కీడు తలస్తున్నావు? అతడు అమాయకుడు. అతనిని చంపటానికి తగిన కారణమే లేదు” అని అన్నాడు.
6 యోనాతాను చెప్పినదంతా విని సౌలు ఒక ప్రమాణం చేసాడు. “యెహోవా సజీవంగా ఉన్నాడు అన్నంత నిజంగా, దావీదు చంపబడడు” అని చెప్పాడు సౌలు.
7 కనుక యోనాతాను దావీదును పిలిచి జరిగినదంతా అతనితో చెప్పాడు. అప్పుడు యోనాతాను దావీదును తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్లాడు. అప్పటి నుండి దావీదు మొదట్లోలాగే సౌలు దగ్గర ఉన్నాడు.
సౌలు మరల దావీదును చంపాలని చూచుట
8 మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఫిలిష్తీయులను ఎదుర్కోవటానికి వెళ్లాడు. దావీదు వారిని తరిమికొట్టాడు, వారు అతని దగ్గరనుండి పారిపోయారు. 9 కానీ ఒక దుష్ట ఆత్మ యెహోవా వద్దనుండి వచ్చి సౌలును ఆవరించింది. సౌలు తన ఇంట్లోనే కూర్చునివున్నాడు. సౌలు చేతిలో అతని ఈటెవుంది. దావీదు సితార వాయిస్తూ ఉన్నాడు. 10 సౌలు తన ఈటెను దావీదు మీదికి విసరి అతనిని వెనుక ఉన్న గోడకు గుచ్చివేయాలని ప్రయత్నించాడు. కాని ఈటెను దావీదు తప్పుకోవటంతో ఈటె గురి తప్పిగోడలోకి దిగిపోయింది. ఆ రాత్రి దావీదు పారిపోయాడు.
11 సౌలు తన మనుష్యులను దావీదు ఇంటికి పంపాడు. వారు దావీదు ఇంటిపై నిఘా వేసి రాత్రి అంతా అక్కడే ఉండి, ఉదయమే అతనిని చంపే ప్రయత్నంలో కనిపెట్టుకొని ఉన్నారు. కానీ దావీదు భార్య మీకాలు అతనిని హెచ్చరించింది. “ఈ రాత్రి నీవు పారిపోయి నీ ప్రాణాలను రక్షించుకో. లేనిచో ఉదయమే నీవు చంపబడతావు” అని ఆమె చెప్పింది. 12 అలా చెప్పి, దావీదును ఒక కిటికిగుండా బయటకుదింపింది. దావీదు తప్పించుకొని పారిపోయాడు. 13 మీకాలు గృహ దేవత విగ్రహాన్ని తెచ్చి పక్కమీద ఉంచి దుప్పట్లు కప్పింది. ఆ విగ్రహం తల మీద కొన్ని మేక వెంట్రుకలు కూడ ఆమె అమర్చింది.
14 దావీదును బంధించమని సౌలు తన సైనికులను పంపాడు. కానీ “దావీదుకు అనారోగ్యంగా వుందని” మీకాలు చెప్పింది.
15 ఈ విషయం తన మనుష్యులు చెప్పేసరికి, “అవసరమైతే దావీదును మంచంతో సహా ఎత్తుకు రండి. నేను అతనిని అవసరమైతే చంపేస్తాను” అని ఆ మనుష్యులతో సౌలు చెప్పాడు.
16 సౌలు మనుష్యులు దావీదు కోసం మళ్లీ దావీదు ఇంటికి వెళ్లి చూడగా పక్కమీద ఉన్నది ఒక దేవతా విగ్రహం మాత్రమేనని, దాని తలమీద ఉన్నవి కేవలం మేక వెంట్రుకలు మాత్రమేననీ వారు తెలుసుకున్నారు.
17 “ఇలా నన్నెందుకు మోసగించావు, నా శత్రువును వదిలిపెట్టావు, వాడు పారిపోయాడు” అని సౌలు మీకాలును అడిగాడు.
“తనకు సహాయం చేయకపోతే నన్ను చంపుతానని అతడు బెదిరించాడు. అందుకే నేను అలా చేశానని” మీకాలు జవాబు ఇచ్చింది.
దావీదు రామాలోని గుడారాలకు వెళ్లుట
18 దావీదు సౌలు బారి నుండి తప్పించుకుని రామాలోవున్న సమూయేలు వద్దకు వెళ్లాడు. సౌలు తన పట్ల చేసినదంతటినీ దావీదు సమూయేలుకు చెప్పాడు. తరువాత దావీదు, సమూయేలు కలిసి ప్రవక్తల గుడారాలకు వెళ్లారు. దావీదు అక్కడే ఉండి పోయాడు.
19 రామాలో వున్న గుడారాలలో దావీదు ఉంటున్నట్లు సౌలు విన్నాడు. 20 దావీదును బంధించి తీసుకుని రావలసిందిగా సౌలు మనుష్యులను పంపాడు. కానీ వారు ఆ గుడారాలకు వచ్చేసరికి అక్కడ ప్రవక్తల గుంపు ఒకటి ప్రవచిస్తూ ఉండటం కనబడింది. సమూయేలు ఆ ప్రవక్తలకు నాయకత్వం వహించి ఉన్నాడు. దేవుని ఆత్మ సౌలు పంపిన మనుష్యుల మీదికి రాగా వారు కూడ దేవుని విషయాలు చెప్పనారంభించారు.
21 ఈ వార్త సౌలు వరకూ పోయింది. అతను మరి కొంతమంది మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. కనుక మూడవసారి మళ్లీ సౌలు మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. 22 చివరికి సౌలు స్వయంగా బయలుదేరి రామా చేరుకున్నాడు. సేఖూలో ఒక నూర్పిడి కళ్లము దగ్గరవున్న పెద్ద బావి వద్దకు సౌలు వచ్చాడు. “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారని” సౌలు అక్కడున్న వారిని అడిగాడు.
“రామాదగ్గర ఉన్న నాయోతులో ఉన్నారని” వాళ్లు జవాబు చెప్పారు.
23 అప్పుడు సౌలు రామా దగ్గర్లో వున్న నాయోతుకు వెళ్లాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి కూడ రావటంతో అతను దేవుని విషయాలు చెబుతూ ముందుకు నడిచాడు. రామాలో వున్న నాయోతుకు వెళ్లేవరకు సౌలు మరింత ఎక్కువగా దేవుని విషయాలు చెబుతూనే ఉన్నాడు. 24 అప్పుడు సౌలు తన బట్టలు విడిచి, సమూయేలు ఎదుట అతడు దేవుని విషయాలు పలికాడు. ఆ పగలూ, ఆ రాత్రి శరీరంమీద బట్టలు లేకుండానే సౌలు గడిపాడు.
ఆ కారణం చేతనే, “సౌలుకూడ ప్రవక్తల్లో ఒకడు అయ్యాడా?” అని ప్రజలు అనుకోవటం మొదలయ్యింది.
దావీదు, యోనాతానుల ఒడంబడిక
20 దావీదు రామాలో వున్న నాయోతునుంచి పారిపోయాడు. తిన్నగా యోనాతాను వద్దకు వెళ్లి, “నేనేమి తప్పు చేశాను? నా నేరం ఏమిటి? నీ తండ్రి ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు?” అని అడిగాడు.
2 అది విన్న యోనాతాను ఇలా అన్నాడు, “నా తండ్రి నిన్ను చంపటానికి ప్రయత్నం చేయటం లేదు. నా తండ్రి ముందుగా నాకు చెప్పకుండా ఏ పనీచేయడు. అది అతి ముఖ్యమైన పనిగాని, లేక అతి స్వల్పమైన విషయంగాని మా తండ్రి ఎప్పుడూ నాకు చెబుతాడు. ఆయన నిన్ను చంపాలనే తన ఆలోచనను నాకెందుకు చెప్పకుండా ఉంటాడు? లేదు. అది నిజం కాదు!”
3 కానీ దావీదు, “నేను నీ స్నేహితుడనని నీ తండ్రికి బాగా తెలుసు. యోనాతానుకు ఈ విషయం తెలియకూడదు అతనికి తెలిస్తే దావీదుకు చెప్పేస్తాడు అని నీ తండ్రి అనుకుని ఉంటాడు. దేవుడు జీవిస్తున్నాడు అన్నంత నిజంగా, నీవు జీవుస్తున్నావన్నంత నిజంగా నేను మృత్యువుకు చాలా చేరువలో ఉన్నాను.” అని జవాబిచ్చాడు.
4 యోనాతాను, “సరే, ఇప్పుడు నీవు ఏమి చేయమంటే అది నేను చేస్తాను” అని దావీదుతో అన్నాడు.
5 అప్పుడు దావీదు, “అయితే చూడు. రేపు అమావాస్య విందు. నేను రాజుతో కలిసి విందారగించవలసివుంది. కాని రేపు సాయంత్రం వరకు నన్ను పొలాల్లో దాగివుండనీ. 6 నేను రాలేదని నీ తండ్రి గమనించినపుడు ‘దావీదు తన స్వగ్రామమైన బేత్లెహేముకు వెళ్లాలని కోరాడు. ఈ నెలసరి బలి అర్పణకు అతని కుటుంబంవారు స్వంతంగా విందు చేసుకోవాలని కోరారు. కనుక దావీదు తన కుటుంబంతో కలసి ఉండేందుకు తనను వెళ్లనివ్వాల్సిందిగా నన్ను అడిగాడు’ అని నీ తండ్రికి చెప్పు అన్నాడు. 7 ‘సరే మంచిది’ అని మీ తండ్రి అంటే నేను హాయిగా ఉన్నట్లే. కానీ ఆయనకు కోపం వస్తే మాత్రం నాకు కీడు చేస్తాడని నీవు నమ్మవచ్చు. 8 యోనాతానూ! నేను నీ సేవకుడను. నన్ను కనికరించు. యెహోవా ఎదుట నీవు నాతో ఒక ఒడంబడిక చేసావు. నేను దోషినయితే నీకై నీవే నన్ను చంపవచ్చు! కానీ నన్ను మాత్రం నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్లకు” అన్నాడు.
9 యోనాతాను, “లేదు ఎప్పటికీ అలా జరగదు! నా తండ్రి నీకు కీడు తలపెడితే నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు.
10 దావీదు, “నీ తండ్రి నిన్ను తిడితే అది నాకెవరు తెలియజేస్తారు?” అన్నాడు.
11 అప్పుడు యోనాతాను, “అయితే, రా! మనం పొలంలోకి వెళదాము” అని అనగా యోనాతాను, దావీదు కలిసి పొలంలోకి వెళ్లారు.
12 యెనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సమక్షంలో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా తండ్రి నీ విషయంలో ఏ తలంపుతో ఉన్నాడో తెలుసుకుంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ పట్ల ఆయన వైఖరి బాగుందో లేదో తెలుసుకుంటాను. ఆ విషయం మూడురోజుల్లో నీకు పొలానికి కబురు చేస్తాను. 13 నా తండ్రి గనుక నీకు కీడు తలపెడితే, అది నీకు తెలియపర్చి, నిన్ను క్షేమంగా వెళ్లిపోనిస్తాను. ఇది నేను చేయకపోతే యెహోవా నన్ను శిక్షించునుగాక! యెహోవా నా తండ్రికి తోడై యున్నట్లు, నీకు కూడ తోడైవుండునుగాక! 14 నేను జీవించినంత కాలం, నా మీద దయచూపించు. నేను మరణించాక 15 నా కుటుంబంపట్ల నీ దయాదాక్షిణ్యాలు చూపించటం ఎన్నడూ మానవద్దు. ఈ భూమి మీద నీ శత్రువుల నందరినీ యెహోవా నాశనం చేయునుగాక! 16 ఆ సమయంలో యోనాతాను కుటుంబం దావీదునుండి వేరు చేయబడాల్సి వస్తే, అలాగే జరుగనివ్వు. దావీదు శత్రువులను యెహోవా శిక్షించునుగాక!”
17 అప్పుడు యోనాతాను తన మీద దావీదుకు ఉన్న ప్రేమ వాగ్దానాన్ని మరల చూపించమన్నాడు. ఎందువల్ల నంటే యోనాతాను తనను తాను ప్రేమించుకున్నంతగా దావీదును ప్రేమించాడు గనుక అలా చేశాడు.
18 “రేపు అమావాస్య విందుగదా! అక్కడ నీ స్థానం ఖాళీగా వుంటుంది. కనుక నా తండ్రి నీవు రాలేదని గమనిస్తాడు. 19 ఈ కష్టాలన్నీ ప్రారంభమైనప్పుడు నీవు ముందుగా ఎక్కడ దాగివున్నావో అక్కడికే మూడవ రోజున కూడ నీవు వెళ్లు. అక్కడ కొండ పక్కన వేచివుండు. 20 మూడవ రోజున కొండ పక్కగా నేనొక గురిని బాణంతో కొడుతున్నట్టు నేను నటిస్తాను. నేను కొన్ని బాణాలు వదులుతాను. 21 అప్పుడు ఆ వదిలిన బాణాన్ని వెదికేందుకుగాను ఒక కుర్రవానిని పంపుతాను. వానితో నేను ‘మరీ దూరం వెళ్లిపోయావు. బాణాలు అక్కడ నాకు దగ్గర్లోనే ఉన్నాయి గదా, వెనక్కు వచ్చేసి వాటిని తీసుకొనిరా’ అని చెబుతాను. నేను గనుక అలా చెబితే అప్పుడు నీవు బయటకి రావచ్చు. యెహెవా జీవిస్తున్నంత వాస్తవంగా నీకు క్షేమం కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాను. ప్రమాదం ఏమీ లేదు. 22 కానీ ఒకవేళ ఏదైనా తొందర ఉంటే, ‘బాణాలు చాలా దూరంగా ఉన్నాయి. వెళ్లి వాటిని తీసుకురా’ అని ఆ కుర్రవానితో నేను అంటాను. నేను గనుక అలా చెబితే నీవు తప్పక పారిపోవల్సిందే. అంటే యెహోవా నిన్ను దూరంగా పంపుతున్నాడన్న మాట. 23 మనిద్దరి మధ్యవున్న ఈ ఒడంబడిక జ్ఞాపకం ఉంచుకో. యెహోవా మనకు శాశ్వతంగా సాక్షి” అని యోనాతాను దావీదుకు చెప్పాడు.
24 అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు.
విందులో సౌలు వైఖరి
అమావాస్య విందు సమయం వచ్చింది. రాజు భోజనం చేయటానికి కూర్చున్నాడు. 25 మామూలుగా కూర్చునే చోటులో గోడ దగ్గరగా రాజు కూర్చున్నాడు. సౌలుకు ఎదురుగా యోనాతాను కూర్చున్నాడు. సౌలుకు పక్కగా అబ్నేరు కూర్చున్నాడు. కానీ దావీదు స్థానం ఖాళీగా ఉంది. 26 ఆరోజు సౌలు ఏమీ అనలేదు. “దావీదుకు ఏమైనా జరిగివుండవచ్చు; లేదా మైలపడి[a] ఉండవచ్చు” అనుకున్నాడు.
27 కానీ మరునాడు, అంటే ఆ నెల రెండో రోజున కూడా దావీదు స్థానం ఖాళీగావుంది. “యెష్షయి కుమారుడు నిన్న, ఈ రోజు కూడా అమావాస్యవిందుకు ఎందుకు రాలేదని సౌలు యోనాతానును” అడిగాడు.
28 “బేత్లెహేము వెళ్లనిమ్మని దావీదు నన్ను అడిగాడు. 29 అతని కుటుంబం వాళ్లున్న బేత్లెహేములో ఒక బలి అర్పణ ఇస్తున్నారని, అతడు చెప్పాడు. అతని సోదరుడు అతనిని రమ్మని పిలిచాడనీ, కాబట్టి తన సోదరులను చూడటానికి అనుమతి ఇమ్మని స్నేహితునిగా అడుగుతున్నాననీ దావీదు చెప్పాడు. అందుచేత దావీదు రాజు విందుకు రాలేక పోయాడు,” అని యోనాతాను చెప్పాడు.
30 సౌలుకు యోనాతాను మీద చాల కోపం వచ్చింది, “మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడివి నీవు! నీవు ఆ స్త్రీలాగే ప్రవర్తిస్తున్నావు. నాకు తెలుసు నీవు దావీదు పక్షాన ఉన్నావని. నీకూ, నిన్ను కన్నతల్లికి తలవంపులు తెస్తున్నావు. 31 యెష్షయి కుమారుడు బ్రతికి ఉన్నంత వరకూ నీవు రాజు కావటంగాని, రాజ్యాన్ని చేపట్టటం గాని జరుగదు. ఇప్పుడే దావీదును నా దగ్గరకు తీసుకునిరా! వాడు చచ్చిన వారితో సమానము!” అన్నాడు సౌలు.
32 “దావీదును ఎందుకు చంపాలి? దావీదు చేసిన నేరం ఏమిటి?” అని యోనాతాను తన తండ్రిని అడిగాడు.
33 సౌలు తన ఈటెను యోనాతాను మీదికి విసరి, అతనిని చంపటానికి ప్రయత్నం చేసాడు. దానితో తన తండ్రి నిజంగానే దావీదును చంపాలని తల పెట్టాడని యోనాతానుకు అర్థమయ్యింది. 34 యోనాతానుకు విపరీతంగా కోపం వచ్చింది. భోజనాల బల్ల వదిలి వెళ్లిపోయాడు. యోనాతాను తన తండ్రి మీద చాల కోపంతో ఆ విందు రెండో రోజు కూడ ఏమీ భోజనం చేయటానికి ఒప్పుకోలేదు. సౌలు తనను పరాభవించినందుకు, దావీదును చంపాలని చూస్తున్నందుకు యోనాతాను కోపగించాడు.
యోనాతాను, దావీదు వీడ్కోలు చెప్పుకోవడం
35 ఆ మరునాటి ఉదయం యోనాతాను పొలానికి వెళ్లాడు. వాళ్లనుకున్నట్లుగా దావీదును కలవటానికి అతడు వెళ్లాడు. యోనాతాను తన వెంట ఒక చిన్న పిల్లవానిని కూడ తీసుకొని వెళ్లాడు. 36 “నేను వేసే బాణాన్ని పరుగున పోయి వెదికి తీసుకొనిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. ఆ పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని తల మీదగా అవతలికి బాణాలు వేశాడు. 37 బాణాలు పడిన చోటుకి బాలుడు పరుగెత్తాడు. కానీ యోనాతాను “బాణాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి” అని అరిచాడు. 38 “వెళ్లు! త్వరగా వెళ్లు! ఆ బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను కేకలు వేశాడు. ఆ బాలుడు బాణాలు తీసుకొని తన యజమాని వద్దకు తెచ్చాడు. 39 ఈ సందర్భంలో ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో ఆ బాలునికి ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే అది తెలుసు. 40 యోనాతాను తన విల్లు, అంబులను ఆ బాలునికి ఇచ్చి, “పట్టణానికి వెళ్లి పో” అని చెప్పాడు.
41 ఆ కుర్రవాడు వెళ్లిపోయాక, కొండ ఆవలి ప్రక్క తాను దాగివున్న చోటనుండి దావీదు బయటకి వచ్చాడు. దావీదు యోనాతాను ముందు ప్రణమిల్లాడు. అలా మూడుసార్లు దావీదు చేశాడు. తరువాత దావీదు, యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. వారు ఇద్దరూ బాగా ఏడ్చారు. దావీదు యోనాతాను కంటె ఎక్కువగా ఏడ్చాడు.
42 “శాంతితో వెళ్లు. మనము స్నేహితులుగా కొనసాగుతామని యెహోవా నామంలో వాగ్దానం చేసుకున్నాము. మనమధ్య, మన తరువాత మన తరాల వారి మధ్య యెహోవా శాశ్వతంగా సాక్షిగా ఉంటాడని మనము చెప్పుకున్నాము” అని యోనాతాను దావీదుతో అన్నాడు.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
11 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు?
“పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!
2 వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు.
వారి బాణాలను వారు గురి చూస్తారు.
మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
3 నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది?
అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?
4 యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు.
యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు.
మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు.
మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశితంగా చూస్తాయి.
5 యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు.
కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
6 వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు.
ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
7 అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు.
మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. దావీదును చంపేందుకు అతని యింటిని చూచి రమ్మని సౌలు తన మనుష్యులను పంపిన సందర్భం.
59 దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము
నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము.
2 కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము.
3 చూడు, బలాఢ్యులు నా కోసం కనిపెట్టి ఉన్నారు.
నన్ను చంపేందుకు వారు కనిపెట్టుకున్నారు.
నేను పాపం చేసినందువలన లేక ఏదో నేరం చేసినందువలన కాదు.
4 వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు.
యెహోవా, వచ్చి నీ మట్టుకు నీవే చూడు!
5 నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు.
లేచి జనాంగములన్నిటినీ శిక్షించుము.
ఆ దుర్మార్గపు ద్రోహులకు ఎలాంటి దయా చూపించకుము.
6 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు.
వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగుతారు.
7 వారి బెదరింపులు, అవమానపు మాటలు వినుము.
వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబుతారు.
వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం.
8 యెహోవా, వారిని చూసి నవ్వుము.
ఆ జనాలను గూర్చి ఎగతాళి చేయుము.
9 దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను.
దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం.
10 దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
నా శత్రువులను జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
11 దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును.
నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము.
12 ఆ దుర్మార్గులు శపించి అబద్ధాలు చెబుతారు.
వారు చెప్పిన విషయాలను బట్టి వారిని శిక్షించుము.
వారి గర్వం వారిని పట్టుకొనేలా చేయుము.
13 నీ కోపంతో వారిని నాశనం చేయుము.
వారిని పూర్తిగా నాశనం చేయుము.
అప్పుడు యాకోబు ప్రజలనూ, సర్వప్రపంచాన్నీ
దేవుడు పాలిస్తున్నాడని మనుష్యులు తెలుసుకొంటారు.
14 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వచ్చి
మొరుగుతూ పట్టణం అంతా తిరుగే కుక్కల్లాంటివారు.
15 వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు.
వారికి ఆహారం దొరకదు. నిద్రించుటకంత స్థలం దొరకదు.
16 మరి నేనైతే,,,,,,,,,, నీకు స్తుతి గీతాలు పాడుతాను.
ఉదయాలలో నీ ప్రేమయందు ఆనందిస్తాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమ స్థానం,
కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తగలను.
17 నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం.
నీవు నన్ను ప్రేమించే దేవుడవు.
© 1997 Bible League International