Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 26

దావీదు కీర్తన.

26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
    యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
    నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
    నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
పనికిమాలిన ఆ మనుష్యుల్లో
    నేను ఒకడ్ని కాను.
ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
    ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.

యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
    నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
    నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
    మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.

యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
    ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
    చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
    కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
    యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.

కీర్తనలు. 28

దావీదు కీర్తన.

28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
    నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
    అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
    నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
    ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
    కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
    ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
    ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
    వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.

యెహోవాను స్తుతించండి.
    కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
    నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
    మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
    ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.

దేవా, నీ ప్రజలను రక్షించుము.
    నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
    కాపరిలా వారిని నిత్యం నడిపించుము.

కీర్తనలు. 36

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.

36 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
    అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
    ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
    కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
    అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
    అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
    ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.

యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
    నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
    నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
    కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
    అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
    నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
    నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
    దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.

12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
    “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
    వారు చితుకగొట్టబడ్డారు.
    వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”

కీర్తనలు. 39

సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.

39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
    నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
    నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]

మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
    నేనేమి చెప్పలేదు.
    కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
నాకు కోపం వచ్చింది.
    దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
    కనుక నేను ఏదో అన్నాను.

యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
    నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
    నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
    నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.

మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
    మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
    కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
    నీవే నా ఆశ.
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
    దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
నేను నా నోరు తెరవను.
    నేను ఏమీ చెప్పను.
    యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
    నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
    వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
    మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
    నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
    నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
    నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.

యెహోషువ 2:15-24

15 ఆ స్త్రీ ఇల్లు పట్టణం ప్రహారీ గోడమీద కట్టబడింది. అది గోడలో ఒక భాగంగా ఉంది. కనుక ఆమె ఒక తాడు ప్రయోగించి కిటికీలోనుంచి వాళ్లిద్దర్నీ క్రిందికి దించింది. 16 అప్పుడు ఆమె వాళ్లతో ఇలా అంది: “పొరబాటున కూడా మీరు రాజుగారి మనుష్యులకు కనపడకుండా పడమటి కొండల్లోకి వెళ్లిపోండి. మూడు రోజులు అక్కడ దాక్కోండి. రాజుగారి మనుష్యులు తిరిగి వచ్చాక, మీ దారిన మీరు వెళ్లవచ్చు.”

17 ఆ మనుష్యులు ఇద్దరూ ఆమెతో ఇలా అన్నారు: “మేము నీకు వాగ్దానం చేసాము. అయితే నీవు ఒక పని చేయాలి. లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యులం కాదు. 18 మేము తప్పించుకోనేందుకు నీవు ఈ ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము ఈ దేశానికి తిరిగి వస్తాము. ఆ సమయంలో ఈ ఎర్రటి తాడును నీవు నీ కిటికీలో కట్టాలి. నీ తండ్రిని, తల్లిని, నీ సోదరులను, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంట్లో చేర్చాలి. 19 ఈ ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరినీ మేము క్షేమంగా కాపాడుతాము. నీ ఇంట్లో ఉన్న వాళ్లెవరైనా దెబ్బతింటే దానికి మేము బాధ్యులము. నీ ఇంట్లోనుంచి ఎవరైనా బయటకు వెళ్లి, చంపబడితే దానికి మేము బాధ్యులము కాము. అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది. 20 ఈ ఒడంబడిక మేము నీతో చేస్తున్నాము. మేము చేస్తోన్న పనిగూర్చి నీవు గనుక ఎవరితోనైనా చెప్పావంటే మేము ఈ ఒడంబడికకు కట్టుబడి ఉండనక్కర్లేదు.”

21 “ఇది నాకు సమ్మతమే” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది, వాళ్లు ఆమె ఇల్లు విడిచి బయల్దేరారు. అప్పుడు ఆమె ఆ ఎర్రటి తాడును కిటికీకి కట్టింది.

22 ఆ మనుష్యులు ఆమె ఇల్లు విడిచి, కొండల్లోకి వెళ్లిపోయారు. మూడు రోజులు వాళ్లు అక్కడే ఉన్నారు. రాజు మనుష్యులు మార్గం అంతా వెదికారు. మూడు రోజుల తర్వాత రాజు మనుష్యులు వెదకటం మానివేసి పట్టణానికి తిరిగి వెళ్లిపోయారు. 23 అప్పుడు ఆ మనుష్యులు ఇద్దరూ యెహోషువ దగ్గరకు ప్రయాణం మొదలుబెట్టారు. వాళ్లు కొండలు విడిచి, నది దాటారు. నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వారు వెళ్లారు. వారు తెలుసుకొన్న సమాచారం అంతా వాళ్లు యెహోషువకు చెప్పారు. 24 వారు యెహోషువతో, “నిజంగా ఆ దేశం అంతా యెహోవా మనకు ఇచ్చాడు. ఆ దేశ ప్రజలందరికీ మనమంటే భయంగా ఉంది” అని చెప్పారు.

రోమీయులకు 11:13-24

13 యూదులుకాని ప్రజలారా! ఇప్పుడిక నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీ కోసం క్రీస్తు అపొస్తలునిగా పని చేస్తున్నాను కనుక, నేను చేస్తున్న పనిపట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. 14 ఈ విధంగానైనా నా వాళ్ళలో ఈర్ష్య కలుగచేసి, వాళ్ళలో కొందర్నైనా రక్షించ కలుగుతానని ఆశిస్తున్నాను. 15 వాళ్ళు నిరాకరించటం వల్ల ప్రపంచానికి దేవునితో స్నేహం కలిగింది. అలాంటప్పుడు వాళ్ళు అంగీకరించియుంటే మరణంనుండి జీవానికి వచ్చినట్లే. 16 పిండిముద్దలో ఒక భాగం ప్రథమ ఫలంగా దేవునికి సమర్పిస్తే, అది పవిత్రమైతే, ముద్ద అంతా పవిత్రమైనట్లే కదా! వేర్లు పవిత్రమైతే కొమ్మలు పవిత్రమైనట్లే కదా!

17 చెట్టు కొమ్మల్ని కొన్నిటిని కొట్టివేసి, అడవి ఒలీవ చెట్ల కొమ్మలవలెనున్న మిమ్మల్ని దేవుడు అంటుకట్టాడు. తద్వారా వేరులోనున్న బలాన్ని మీరు పంచుకొంటున్నారు. 18 కాని ఆ కొమ్మలపైగా గర్వించకండి. మీ వల్ల వేరు పోషింపబడుటలేదు. వేరు వల్ల మీరు పోషింపబడుతున్నారు. 19 మమ్మల్ని అంటు కట్టాలని కొమ్మలు కొట్టివేయబడ్డాయి అని మీరనవచ్చు. 20 నిజమే! విశ్వాసం లేనందువల్ల అవి కొట్టి వేయబడ్డాయి. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీరా చెట్టునంటుకొని ఉన్నారు. అలా అని గర్వించకండి. భయంతో ఉండండి. 21 ఎందుకంటే, సహజంగా పెరిగిన కొమ్మల్ని దేవుడు లెక్క చేయలేదంటే మిమ్మల్ని కూడా లెక్క చేయడు.

22 అందువల్ల దేవుని కరుణను, కోపాన్ని అర్థం చేసుకొనండి. విశ్వసించని కొమ్మల్ని నరికి వేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మీరు ఆయన కరుణను అంటి పెట్టుకొని జీవిస్తుంటే కరుణను చూపుతూ ఉంటాడు. లేని పక్షాన మిమ్మల్ని కూడా కొట్టివేస్తాడు. 23 వాళ్ళు, మేము విశ్వాసహీనంగా ఉంటామని మొండి పట్టు పట్టకుండా ఉంటే, దేవుడు మళ్ళీ వాళ్ళను అంటు కడతాడు. వాళ్ళను తిరిగి అంటుకట్టే శక్తి దేవునికి ఉంది. 24 స్వాభావికంగా అడవి జాతికి చెందిన ఒలీవల చెట్లనుండి కొట్టిన కొమ్మలవలెనున్న మిమ్మల్ని మేలురకపు చెట్టుకు అంటు వేయగలిగితే, మేలు రకపు ఒలీవల చెట్ల కొమ్మల్ని స్వజాతికి చెందిన చెట్టుకు అంటు వేయటం ఇంకెంత సులభమో ఆలోచించండి.

మత్తయి 25:14-30

ముగ్గురు సేవకుల ఉపమానం

(లూకా 19:11-27)

14 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తన ఆస్తిని వాళ్ళకు అప్పగించాడు. 15 ఒకనికి ఐదు తలాంతుల[a] ధనం ఇచ్చాడు. రెండవ వానికి రెండు తలాంతులు, మూడవ వానికి ఒక తలాంతు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రయాణమై వెళ్ళాడు. 16 ఐదు తలాంతులు పొందిన వాడు వెంటనే వెళ్ళి ఆ ధనాన్ని ఉపయోగించి మరో ఐదు తలాంతులు సంపాదించాడు. 17 అదేవిధంగా రెండు తలాంతులు పొందినవాడు వెళ్ళి మరో రెండు తలాంతులు సంపాదించాడు. 18 కాని ఒక తలాంతు పొందిన వాడు వెళ్ళి ఒక గొయ్యి త్రవ్వి యజమాని యిచ్చిన ధనాన్ని అందులో దాచాడు.

19 “చాలాకాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూసాడు. 20 ఐదు తలాంతులు పొందినవాడు మరో ఐదు తలాంతులు తెచ్చి, ‘అయ్యా! మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు. నేను మరో ఐదు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు.

21 “ఆ యజమాని ‘మంచి పని చేసావు! నీలో మంచితనం, విశ్వాసం ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు! కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలసి ఆనందించు!’ అని సమాధానం చెప్పాడు.

22 “రెండు తలాంతులు పొందిన వాడు కూడా వచ్చి, ‘అయ్యా! నాకు రెండు తలాంతులు యిచ్చారు. నేను మరో రెండు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు.

23 “ఆ యజమాని, ‘మంచి పని చేసావు! నీలో మంచితనము, విశ్వాసము ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు కనుక నిన్ను యింకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను, నీ యజమానితో కలసి ఆనందించు!’ అని అన్నాడు.

24 “తదుపరి ఒక తలాంతు పొందినవాడు వచ్చి ‘అయ్యా! మీరు కృరమైన వారని నాకు తెలుసు. విత్తనం నాటని చోట మీరు పంటను కోస్తారు. విత్తనం వేయని పొలాలనుండి ధాన్యం ప్రోగు చేస్తారు. 25 అందువల్ల నేను భయపడి మీ తలాంతు తీసుకు వెళ్ళి భూమిలో దాచి ఉంచాను. ఇదిగో! మీది మీరు తీసుకోండి!’ అని అన్నాడు.

26 “ఆ యజమాని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు: ‘నీవు దుర్మార్గుడివి! సోమరివి! నేను విత్తనం నాటని పొలం నుండి పంటను కోస్తానని, విత్తనం వెయ్యని చోట ధాన్యం ప్రోగు చేస్తానని నీకు తెలుసునన్న మాట. అలా అనుకొన్నవాడివి నా డబ్బు వడ్డీ వ్యాపారుల దగ్గర దాచి ఉంచ వలసింది. 27 అలా చేసుంటే నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది.’

28 “అతని దగ్గరున్న తలాంతు తీసుకొని పది తలాంతులున్న వానికివ్వండి. 29 ఎందుకంటే ఉన్న వాళ్ళకు దేవుడు యింకా ఎక్కువ యిస్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది. లేని వాళ్ళనుండి వాళ్ళ దగ్గరున్నది కూడా తీసి వేయబడుతుంది. 30 ఆ పనికిరాని వాణ్ణి బయట చీకట్లో పడవేయండి. అక్కడతడు ఏడుస్తూ బాధననుభవిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International