Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 106

106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
    దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
    ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.

యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
    నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
    నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.

మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
    మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
    నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
    విరోధంగా ఎదురు తిరిగారు.

అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
    ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
    దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
    వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
    వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!

12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
    వారు ఆయనకు స్తుతులు పాడారు.
13 కాని దేవుడు చేసిన వాటిని మన పూర్వీకులు వెంటనే మరచిపోయారు.
    వారు దేవుని సలహా వినలేదు.
14 మన పూర్వీకులు ఎడారిలో ఆకలిగొన్నారు.
    అరణ్యంలో వారు దేవుణ్ణి పరీక్షించారు.
15 కాని మన పూర్వీకులు అడిగిన వాటిని దేవుడు వారికి ఇచ్చాడు.
    అయితే దేవుడు వారికి ఒక భయంకర రోగాన్ని కూడా ఇచ్చాడు.
16 ప్రజలు మోషే మీద అసూయ పడ్డారు.
    యెహోవా పవిత్ర యాజకుడు అహరోను మీద వారు అసూయపడ్డారు.
17 కనుక ఆ అసూయపరులను దేవుడు శిక్షించాడు. భూమి తెరచుకొని దాతానును మింగివేసింది.
    తరువాత భూమి మూసుకొంటూ అబీరాము సహచరులను కప్పేసింది.
18 అప్పుడు ఒక అగ్ని ఆ ప్రజాసమూహాన్ని కాల్చివేసింది.
    ఆ అగ్ని ఆ దుర్మార్గులను కాల్చివేసింది.
19 హోరేబు కొండవద్ద ప్రజలు ఒక బంగారు దూడను చేశారు.
    వారు ఆ విగ్రహాన్ని ఆరాధించారు.
20 ఆ ప్రజలు గడ్డి తినే ఒక ఎద్దు విగ్రహాన్ని
    వారి మహిమ గల దేవునిగా మార్చేశారు.
21 మన పూర్వీకులు వారిని రక్షించిన దేవుణ్ణి గూర్చి మర్చిపోయారు.
    ఈజిప్టులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి గూర్చి వారు మర్చిపోయారు.
22 హాము దేశంలొ[a] దేవుడు అద్భుత కార్యాలు చేశాడు.
    దేవుడు ఎర్ర సముద్రం దగ్గర భీకర కార్యాలు చేశాడు.

23 దేవుడు ఆ ప్రజలను నాశనం చేయాలని కోరాడు.
    కాని దేవుడు ఏర్పరచుకొన్న సేవకుడు మోషే ఆయనను నివారించాడు.
దేవునికి చాలా కోపం వచ్చింది.
    కాని దేవుడు ఆ ప్రజలను నాశనం చేయకుండా మోషే అడ్డుపడ్డాడు.

24 అంతట ఆ ప్రజలు ఆనందకరమైన కనాను దేశంలోనికి వెళ్లేందుకు నిరాకరించారు.
    ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలను ఓడించుటకు దేవుడు వారికి సహాయం చేస్తాడని ఆ ప్రజలు నమ్మలేదు.
25 మన పూర్వీకులు దేవునికి విధేయులవుటకు నిరాకరించారు.
26 అందుచేత వారు అరణ్యంలోనే మరణిస్తారని దేవుడు ప్రమాణం చేసాడు.
27 వారి సంతతివారిని ఇతర ప్రజలు ఓడించేలా చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.
    మన పూర్వీకులను రాజ్యాలలో చెదరగొడతానని దేవుడు ప్రమాణం చేసాడు.

28 దేవుని ప్రజలు బయల్పెయోరు అనే బయలు దేవత పూజలో పాల్గొన్నారు.
    చచ్చినవారికి, విగ్రహానికి బలియిచ్చిన మాంసాన్ని దేవుని ప్రజలు తిన్నారు.
29 దేవుడు తన ప్రజల మీద చాలా కోపగించాడు. మరియు దేవుడు వారిని రోగులనుగా చేసాడు.
30 కాని ఫీనెహాసు దేవుని ప్రార్థించాడు.
    దేవుడు రోగాన్ని ఆపుచేసాడు.
31 ఫీనెహాసు చాలా మంచి పని చేసాడు అని దేవునికి తెలుసు.
    మరియు శాశ్వతంగా ఎప్పటికి దేవుడు దీనిని జ్ఞాపకం చేసుకొంటాడు.

32 మెరీబా వద్ద ప్రజలకు కోపం వచ్చింది.
    మోషేతో ఏదో చెడు కార్యము వారు చేయించారు.
33 ఆ ప్రజలు మోషేను చాలా కలవర పెట్టారు.
    అందుచేత మోషే అనాలోచితంగా మాటలు అనేశాడు.

34 కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలను నాశనం చేయమని యెహోవా ప్రజలకు చెప్పాడు.
    కాని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు.
35 ఇశ్రాయేలు ప్రజలు ఇతర ప్రజలతో కలిసి పోయారు.
    ఇతర ప్రజలు చేస్తున్న వాటినే వీరు కూడా చేశారు.
36 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలకు ఉచ్చుగా తయారయ్యారు.
    ఆ ఇతర ప్రజలు పూజిస్తున్న దేవుళ్లను దేవుని ప్రజలు పూజించటం మొదలు పెట్టారు.
37 దేవుని ప్రజలు తమ స్వంత బిడ్డలను సహితం చంపి
    ఆ బిడ్డలను ఆ దయ్యాలకు బలియిచ్చారు.
38 దేవుని ప్రజలు నిర్దోషులను చంపివేసారు.
    వారు తమ స్వంత బిడ్డలనే చంపి ఆ బూటకపు దేవుళ్లకు అర్పించారు.
39 కనుక ఆ ఇతర ప్రజల పాపాలతో దేవుని ప్రజలు మైలపడ్డారు.
    దేవుని ప్రజలు తమ దేవునికి అపనమ్మకస్తులై ఆ ఇతర ప్రజలు చేసిన పనులనే చేసారు.
40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది.
    దేవుడు వారితో విసిగిపోయాడు!
41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు.
    వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు.
42 దేవుని ప్రజలను శత్రువులు తమ అదుపులో పెట్టుకొని
    వారికి జీవితాన్నే కష్టతరం చేసారు.
43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు.
    కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే చేశారు.
    దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు.
44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు.
    ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు.
45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు.
    దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు.
46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు.
    అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
    నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
    అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
    దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.

సంఖ్యాకాండము 22:1-21

బిలాము—మోయాబు రాజు

22 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోయాబు మైదానాలకు ప్రయాణం చేసారు. యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర వారు నివాసాలు కట్టుకొనిరి.

2-3 ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలకు చేసిన వాటన్నిటినీ సిప్పోరు కుమారుడైన బాలాకు చూసాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలమంది ఉండటం చూచి, మోయాబు రాజు భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలంటే మోయాబువాళ్లు భయపడ్డారు.

మోయాబు రాజు “ఆవు పొలంలో గడ్డి అంతా తినివేసినట్టు ఈ గొప్ప ప్రజా సమూహం మన చుట్టూ ఉన్న మొత్తం నాశనం చేసేస్తుంది” అని మిద్యాను నాయకులతో చెప్పాడు.

అప్పట్లో సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు. బెయోరు కుమారుడు బిలామును పిలువమని అతడు మనుష్యులను పంపించాడు. బిలాము యూఫ్రటీసు నది దగ్గర పెతోరు అనే చోట ఉన్నాడు. బాలాకు ఈ విధంగా సందేశం పంపాడు:

“ఈజిప్టునుండి ఒక కొత్త జాతి ప్రజలు వచ్చారు. దేశం అంతా కమ్మేసేటంతమంది ఉన్నారు వారు. వాళ్లు నా ప్రక్కనే గుడారాలు వేసుకొన్నారు. వీళ్లను ఎదుర్కోటానికి నీవు వచ్చి నాకు సహాయం చేయి. అప్పుడు ఒకవేళ వారిని ఓడించగలనేమో వారి ముందు నా బలం చాలదు. అప్పుడు వారిని నా దేశంనుండి తరిమివేయగలను. నీకు గొప్పశక్తి ఉందని నాకు తెలుసు. నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే, వారికి మేలు జరుగుతుంది. నీవు ఎవరినైనా శపిస్తే వారికి కీడు జరుగుతుంది. అందుచేత వచ్చి ఈ ప్రజలను శపించు. అప్పుడు, నేను వారిని ఈ దేశం నుండి తోలి వేయగలను.”

మోయాబు, మిద్యాను నాయకులు వెళ్లిపోయారు. బిలాముతో మాట్లాడటానికి వారు వెళ్లారు. అతని సేవకోసం అతనికి చెల్లించేందుకు వారు డబ్బు తీసుకుని వెళ్లారు. బాలాకు చెప్పిన విషయం వారు అతనికి చెప్పారు.

బిలాము, “ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండండి. నేను యెహోవాతో మాట్లాడి, ఆయన నాకు ఇచ్చే జవాబు మీకు చెబుతాను” అని వారితో చెప్పాడు. అందుచేత మోయాబు ప్రజా నాయకులు ఆ రాత్రి వారితో ఉండిపోయారు.

దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, “నీతో ఉన్న ఈ మనుష్యులు ఎవరు?” అని అడిగాడు.

10 బిలాము దేవునితో చెప్పాడు: “మోయాబు రాజును, సిప్పోరు కుమారుడునైన బాలాకు నాకు ఒక కబురు చెప్పమని వారిని పంపాడు. 11 ఆ సందేశం ఇది: ఈజిప్టునుండి ఒక కొత్త దేశపు జనాంగం వచ్చింది. వారు భూమి అంతా నిండిపొయ్యేంత మంది ఉన్నారు. కనుక వచ్చి వీళ్లను శపించు, అప్పుడు ఒకవేళ నేను వాళ్లతో యుద్ధం చేసి నా దేశంనుండి వెళ్లగొట్ట గలుగుతానేమో.”

12 అయితే దేవుడు, “వాళ్లతో వెళ్లవద్దు. ఈ ప్రజలను నీవు శపించకూడదు. వీరు నా ప్రజలు” అని బిలాముతో చెప్పాడు.

13 మరునాటి ఉదయం బిలాము లేచి, “మీ స్వదేశానికి తిరిగి వెళ్లిపొండి. యెహోవా నన్ను మీతో వెళ్ల నివ్వడు” అన్నాడు.

14 కనుక మోయాబు నాయకులు తిరిగి బాలాకు దగ్గరకు వెళ్లిపోయి అతనితో, “మాతో రావటానికి బిలాము నిరాకరించాడు” అని చెప్పారు.

15 కనుక బాలాకు మరికొందరు నాయకులను బిలాము దగ్గరకు పంపించాడు. మొదటి సారికంటే ఈ సారి చాల ఎక్కువ మందిని అతడు పంపించాడు. మొదటిసారి అతడు పంపిన వారికంటె వీరు ప్రముఖ నాయకులు. 16 వారు బిలాము దగ్గరకు వెళ్లి చెప్పారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు నీతోఇలా చెప్పమన్నాడు. దయచేసి నీవు రాకుండా ఏదీ నిన్ను అడ్డుపెట్టనియ్యకు. 17 నేను అడిగిన దాన్ని నీవు చేస్తే, నేను నీకు విస్తారంగా డబ్బు ఇస్తాను. నీవు వచ్చి, నా పక్షంగా ఈ ప్రజలను శపించు.”

18 కానీ బిలాము ఆ మనుష్యులకు తన జవాబిచ్చాడు. అతడు ఇలా చెప్పాడు: “నా దేవుడైన యెహోవాకు నేను విధేయుడ్ని కావాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయలేను. నేను చెయ్యొచ్చు అని నా ప్రభువు చెబితేనే తప్ప లేకపోతే సామాన్యమైనదైనా గొప్పదైనా నేనేమి చేయలేను. బాలాకు రాజు అందమైన తన భవనమంతా వెండి బంగారాలతో నింపి నాకు ఇచ్చినా సరే, నా ప్రభువు ఆజ్ఞకు వ్యతిరేకంగా నేనేమి చేయను. 19 అయితే ఇదివరకు వచ్చిన వారిలాగే మీరు ఈ రాత్రి ఇక్కడ వుండవచ్చు. ఈ రాత్రి యెహోవా నాతో ఏమి చెబుతాడో నేను తెలుసుకొంటాను.”

20 ఆ రాత్రి యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, “ఈ మనుష్యులు వారితో కూడ నిన్ను రమ్మని అడగటానికి మళ్లీ వచ్చారు. కనుక నీవు వారితో వెళ్లవచ్చు. అయితే నేను నీతో ఏమి చెబుతానో అలా మాత్రమే చేయాలి” అని చెప్పాడు.

బిలాము, అతని గాడిద

21 మరునాడు ఉదయాన్నే బిలాము లేచి తన గాడిదకు గంత కట్టాడు. అప్పుడు అతడు మోయాబు నాయకులతో వెళ్లాడు.

రోమీయులకు 6:12-23

12 నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించకుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి. 13 మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి. 14 మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు.

నీతికి బానిసలు

15 అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము. 16 సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు. 17 ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. 18 మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు. 19 మీకు వీటిని అర్థం చేసుకొనే శక్తి లేదు కనుక నేను మాములు ఉదాహరణలు ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాను. ఇదివరలో మీరు మీ అవయవాల్ని అపవిత్రతకు, దుర్మార్గపు పనులు చెయ్యటానికి బానిసలుగా అర్పించుకొన్నారు. అదే విధంగా ఇప్పుడు మీ అవయవాల్ని నీతికి, పవిత్రతకు నడిపించే బానిసలుగా అర్పించుకోండి.

20 మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చెయ్యలేదు. 21 ఆ పనుల వల్ల మీరు ఏమి ఫలం పొందారు? వాటివల్ల మరణమే కలుగుతుంది. 22 ఇక ఇప్పుడు మీరు పాపంనుండి విముక్తులై దేవునికి బానిసలయ్యారు. కనుక మీరు పొందుతున్న ఫలం పవిత్రతకు దారి తీస్తుంది. చివరకు అనంత జీవితం లభిస్తుంది. 23 పాపం మరణాన్ని ప్రతి ఫలంగా ఇస్తుంది. కాని దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనంత జీవితాన్ని బహుమానంగా ఇస్తాడు.

మత్తయి 21:12-22

యేసు ఆలయంలోనికి వెళ్ళటం

(మార్కు 11:15-19; లూకా 19:45-48; యోహాను 2:13-22)

12 యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు. 13 ఆయన వాళ్ళతో, “‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’(A) అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు.

14 గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు. 15 ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా!” అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది.

16 “చిన్న పిల్లలేమంటున్నారో నీవు విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు.

యేసు, “విన్నాను. ‘చిన్న పిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేసావు!’(B) అని వ్రాసారు. ఇది మీరు ఎన్నడూ చదువలేదా?” అని అన్నాడు.

17 ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు.

యేసు విశ్వాస శక్తిని చూపటం

(మార్కు 11:12-14, 20-24)

18 ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 19 యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.

20 శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు.

21 యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది. 22 దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International