Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 25

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
    ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.

11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను.
    కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.

12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే
    అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు.
    అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు.
    ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు.
15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి.
    ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.

16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను.
    నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము.
    నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము.
    నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము,
    నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
21 దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను.
    కనుక నన్ను కాపాడుము.
22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

కీర్తనలు. 9

సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.

పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
    యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
    మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
    కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.

నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
    యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
    యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
    బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
శత్రువు పని అంతం అయిపోయింది.
    యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
    ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
    ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.

అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
    యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
    యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
    గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
    యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.

10 నీ నామం తెలిసిన ప్రజలు
    నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
    సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.

11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
    యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
    ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
    మరి యెహోవా వారిని మరచిపోలేదు.

13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
    నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
    ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
    నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”

15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
    కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
    ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
    కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
    యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]

17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
    ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
    కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
    వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
    వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.

కీర్తనలు. 15

దావీదు కీర్తన.

15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
    నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
    అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
    ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
    ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
    అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
    అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
    అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
    ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.

యెహోషువ 2:1-14

యెరికో పట్టణంలో గూఢచారులు

నూను కుమారుడైన యెహోషువ, ప్రజలంతా ఆకాషియా దగ్గర గుడారాలు వేసుకున్నారు. యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని పంపించాడు. వీళ్లను యెహోషువ పంపినట్టు మరెవ్వరికీ తెలియదు. “మీరు వెళ్లి ఆ దేశాన్ని చూడండి. ముఖ్యంగా యెరికో పట్టణాన్ని దగ్గరగా చూడండి” అని యెహోషువ ఆ మనుష్యులతో చెప్పాడు.

కనుక ఆ మనుష్యులు యెరికో పట్టణం వెళ్లారు. వాళ్లు ఒక వేశ్య ఇంటికి వెళ్లి, అక్కడ వుండిరి. ఆ స్త్రీ పేరు రాహాబు.

“మన ప్రజల బలహీనత తెలుసుకొనేందుకు కొందరు ఇశ్రాయేలు మనుష్యులు వచ్చారు” అని యెరికో రాజుతో ఎవరో చెప్పారు.

కనుక యెరికో రాజు రాహాబుకు ఇలా కబురంపాడు: “నీ ఇంటికి వచ్చిదాక్కొన్న ఆ మనుష్యుల్ని దాచిపెట్టకు. వాళ్లను బయటకు తీసుకొనిరా. వాళ్లు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు.”

ఆ స్త్రీ వాళ్లిద్దర్నీ దాచిపెట్టేసింది. అయితే ఆమె అంది: “ఆ ఇద్దరూ ఇక్కడికి వచ్చిన మాట నిజమే. అయితే వాళ్లు ఎక్కడ్నుండి వచ్చిందీ నాకు తెలియదు. సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను పట్టుకోవచ్చేమో.” అయితే నిజానికి వాళ్లను అటక[a] మీద జనుపకట్టెలో దాచిపెట్టింది.

కనుక రాజుగారి మనుష్యులు ఇశ్రాయేలు వాళ్లిద్దరి కోసం వెదుక్కుంటూ వెళ్లిపోయారు. యొర్దాను నది రేవుల దగ్గరకు వారు వెళ్లారు. రాజుగారి మనుష్యులు పట్టణం నుండి బయటకు వెళ్లిన ఆ సమయంలోనే పట్టణ ద్వారాలు మూసివేయబడ్డాయి.

ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పైకి వెళ్లి వాళ్లతో మాట్లాడింది. రాహాబు ఇలా అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే. 10 యెహోవా మీకు సహాయం చేసిన విధానాల్ని గూర్చి విన్నాము గనుక మాకు భయం. మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేసాడని మేము విన్నాము. అమోరీ రాజులైన సీహోను, ఓగులకు మీరు చేసినదాన్ని గూర్చి కూడ మేము విన్నాము. యొర్దాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు నాశనం చేసిన సంగతి మేము విన్నాము. 11 ఆ సంగతులు మేము విని చాల భయపడిపోయాము ఇప్పుడు మా వాళ్లెవరికీ మీతో పోరాడే ధైర్యంలేదు. ఎందుచేతనంటే పైన ఆకాశాన్ని క్రింద భూమిని మీ యెహోవా దేవుడే పాలిస్తున్నాడు గనుక. 12 ఇప్పుడు మీరు నాతో ఒడంబడిక చేస్తామని మాట ఇవ్వండి. నేను మీకు సహాయం చేసాను, దయ చూపించాను. కనుక మీరు నా కుటుంబానికి దయ చూపిస్తామని యెహోవా ఎదుట ప్రమాణం చేయండి. ఇలా మీరు చేస్తామని దయచేసి నాకు చెప్పండి. 13 నా తండ్రి, తల్లి, సోదరులు, సోదరీలు, వాళ్లందరి కుటుంబాల్ని, నా కుటుంబాన్ని మీరు బ్రతుకనిస్తామని నాకు మాట ఇవ్వండి. చావునుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని ప్రమాణం చేయండి.”

14 ఆ మనుష్యలు ఒప్పుకున్నారు. “మీ ప్రాణాల కోసం మా ప్రాణాలు ఇస్తాము. మేము చేస్తున్న పని గూర్చి ఎవ్వరితో చెప్పకు. తర్వాత మీ దేశాన్ని యెహోవా మాకు ఇచ్చినప్పుడు మేము నీకు దయ చూపిస్తాము. నీవు మా మాట నమ్ము” అని వాళ్లు చెప్పారు.

రోమీయులకు 11:1-12

దేవుని దయ

11 “మరి దేవుడు తన ప్రజల్ని నిరాకరించాడా?” అని నేను అడుగుతున్నాను. లేదు, నేను స్వయంగా ఇశ్రాయేలు వంశీయుణ్ణి. బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. అబ్రాహాము మా మూలపురుషుడు. తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాకరించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని వ్రాసారో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీయులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా విన్నవించుకొన్నాడు: “ప్రభూ! వాళ్ళు నీ ప్రవక్తల్ని చంపివేసారు. నీ బలిపీఠాన్ని నేలమట్టం చేసారు. మిగిలినవాణ్ణి నేనొక్కణ్ణే. నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు.”(A) అప్పుడు దేవుని స్వరం ఈ విధంగా అన్నది: “బయలు ముందు మోకరించని ఏడువేల మందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకొన్నాను.”(B)

అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపొయ్యారు. ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.[a]

7-8 అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు మనసారా కోరుకొన్నది లభించలేదు. కాని దేవుడు ఎన్నుకొన్నవాళ్ళకు అది లభించింది. ఇశ్రాయేలు దేశంలోని మిగతా ప్రజలు సువార్తను నిరాకరించారన్న విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“దేవుడు వాళ్ళకు మత్తుగల ఆత్మను.”(C)

“చూడలేని కళ్ళను,
    వినలేని చెవుల్ని ఇచ్చాడు.
ఈనాడు కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు.”(D)

ఈ సందర్భాన్ని గురించి దావీదు ఈ విధంగా అంటున్నాడు:

“వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు వేసుకొన్న బల్లలు బోనులవలె, వలలవలె మారుగాక!
    వాళ్ళు క్రిందపడి శిక్షను అనుభవించుదురు గాక!
10 వాళ్ళ కన్నులు చీకటితో నిండిపోయి, వాళ్ళ దృష్టి నశించుగాక!
    వాళ్ళ నడుములు కష్టాలతో వంగిపోయివాళ్ళు ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవుదురు గాక!”(E)

11 నేను ఇంకొక ప్రశ్న వేస్తాను: యూదులు లేవలేనంత క్రిందపడి పొయ్యారా? లేదు. వాళ్ళు పాపాలు చేయటం వల్ల యూదులు కానివాళ్ళకు రక్షణ లభించింది. యూదుల్లో ఈర్ష్య కలగాలని ఇలా జరిగింది. 12 వాళ్ళు పాపాలు చెయ్యటం వల్ల ప్రపంచానికి ఐశ్వర్యం కలిగింది. వాళ్ళకు నష్టం కలగటం వల్ల యూదులు కానివాళ్ళు భాగ్యవంతులయ్యారు. అలాగైతే వాళ్ళు సంపూర్ణంగా క్రీస్తును అంగీకరించియుంటే ఇంకెంత లాభం కలుగుతుందో గ్రహించండి.

మత్తయి 25:1-13

పది మంది కన్యకల ఉపమానం

25 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు. వాళ్ళలో ఐదుగురు తెలివిలేని వాళ్ళు; ఐదుగురు తెలివిగల వాళ్ళు. తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకు వెళ్ళారు. పెళ్ళి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు.

“అర్థరాత్రి వేళ, ‘అదిగో పెళ్ళి కుమారుడు! వచ్చి చూడండీ!’ అని ఎవరో బిగ్గరగా కేక వేసారు.

“వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు. తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు.

“తెలివి గల కన్యలు, ‘ఈ నూనె మనకందరికి సరిపోదేమో! దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి’ అని సమాధానం చెప్పారు.

10 “కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది.

11 “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు.

12 “కాని అతడు, ‘నేను నిజం చెబుతున్నాను; మీరెవరో నాకు తెలియదు’ అని సమాధానం చెప్పాడు.

13 “మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International