Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 16-17

దావీదుకు అభిమాన కావ్యము.

16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
“యెహోవా, నీవు నా యజమానివి
    నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
    అని నేను యెహోవాతో చెప్పాను.
మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
    “వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”

కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
    ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
    ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
    యెహోవా, నీవే నన్ను బలపరచావు.
    యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
నా వంతు చాలా అద్భుతమయింది.
    నా స్వాస్థ్యము చాలా అందమయింది.
యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
    రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.

నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
    ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
    నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
    నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
    నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
    యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
    నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.

దావీదు ప్రార్థన.

17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
    నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
    నీవు సత్యాన్ని చూడగలవు.
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
    దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
    నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
    నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
నేను నీ మార్గాలు అనుసరించాను.
    నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
    కనుక ఇప్పుడు నా మాట వినుము.
ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
    నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
    నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
    మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
    ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
    వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.

13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
    నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14     యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
    ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.

15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
    మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.

కీర్తనలు. 22

సంగీత నాయకునికి: అయ్యలెత్ షహరు రాగం. దావీదు కీర్తన.

22 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
    నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
    సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను.
    కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు.
మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.

దేవా, నీవు పవిత్రుడవు.
    నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం.
మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు.
    అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు.
    వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
కాని, నేను మనిషిని కానా, పురుగునా?
    మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు.
    నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి.
    ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో!
    నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”

దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే.
    నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు.
    నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.

11 కనుక దేవా, నన్ను విడువకు.
    కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు.
    వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు.
    (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్ధికెక్కిన ప్రాంతం.)
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు.
    వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి.

14 నేలమీద పోయబడ్డ నీళ్లలా
    నా బలం పోయినది.
నా ఎముకలు విడిపోయాయి.
    నా ధైర్యం పోయినది.
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది.
    నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది.
    “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.
16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి.
    ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది.
    సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు.
17 నేను నా ఎముకల్ని చూడగలను.
    ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు.
    వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు!
18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు.
    నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.

19 యెహోవా, నన్ను విడువకుము!
    నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
    ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
    ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము.

22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
    ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
    ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
    ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
    యెహోవా వారిని ద్వేషించడు.
    ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.

25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
    నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
    యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
    మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
    ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
    ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
    సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు.
మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు.
    చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
    యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు.
    దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.

ద్వితీయోపదేశకాండము 31:7-13

అప్పుడు మోషే యెహోషువాను పిలిచాడు. మోషే యెహోషువతో చెబుతుంటే ఇశ్రాయేలు ప్రజలంతా విన్నారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, వారి పూర్వీకులకు యిస్తానని యెహోవా వాగ్దానం చేసిన దేశంలోనికి ఈ ప్రజలను నీవు నడిపించాలి. ఈ దేశాన్ని తమ స్వంతంగా తీసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలకు నీవు సహాయం చేయాలి. యెహోవా నీకు ముందు వెళ్తాడు. సాక్షాత్తూ ఆయనే నీతో ఉంటాడు. ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడు నిన్ను విడువడు, భయపడవద్దు, దిగులుపడవద్దు.”

ప్రబోధాల పుస్తకాన్ని మోషే వ్రాయటం

అప్పుడు మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి, లేవీ సంతానపు యాజకులకు ఇచ్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టె మోసే పని వాళ్లదే. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు నాయకులందరికి కూడా మోషే యిచ్చాడు. 10 తర్వాత మోషే నాయకులకు ఆజ్ఞాపించాడు. అతను ఇలా చెప్పాడు: “ప్రతి ఏడు సంవత్సరాల ఆఖరిలో, స్వాతంత్ర్యపు సంవత్సరంలో, పర్ణశాలల పండుగ సమయములో ఈ ధర్మశాస్త్రం చదవండి. 11 ఆ సమయంలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలంతా వస్తారు. అప్పుడు ప్రజలు వినగలిగేటట్టు నీవు వారికి ఈ ధర్మశాస్త్రం చదివి వినిపించాలి. 12 పురుషులు, స్త్రీలు చిన్నపిల్లలు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు అందరిని సమావేశ పర్చాలి. వాళ్లు ధర్మశాస్త్రాన్ని విని, మీ దేవుడైన యెహోవాను గౌరవించంటం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు వారు జాగ్రత్తగా విధేయులవుతారు. 13 ధర్మశాస్త్రం ఎరుగనివారి సంతానంవాళ్లంతా దానిని వింటారు. వాళ్లు మీ దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకుంటారు. యొర్దాను నది ఆవలి ప్రక్క మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో మీరు జీవించినంత కాలం వారు ఆయనను గౌరవిస్తారు.”

ద్వితీయోపదేశకాండము 31:24-32:4

ఇశ్రాయేలు ప్రజలను మోషే హెచ్చరించటం

24 ఈ ఉపదేశాలు అన్నింటినీ మోషే జాగ్రత్తగా ఒక గ్రంథంలో వ్రాసాడు. అతడు ముంగించినప్పుడు 25 లేవీయులకు అతడు ఒక ఆజ్ఞ యిచ్చాడు. (వీళ్లు యెహోవా ఒడంబడిక పెట్టె విషయలో జాగ్రత్త తీసుకుంటారు.) అని మోషే చెప్పాడు, 26 “ఈ ధర్మశాస్త్రపు గ్రంథం తీసుకొని. మీ దేవుడైన యెహోవా ఒడంబడిక పెట్టె పక్కగా పెట్టండి. అప్పుడు అది మీ మీద సాక్ష్యంగా అక్కడ ఉంటుంది. 27 మీరు చాలా మొండి వాళ్లని నాకు తెలుసు. మీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్లాలని మీకు ఉంటుందని నాకు తెలుసు. చూడండి, నేను యింకా మీతో ఉన్న ఈనాడే మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. నేను చనిపోయిన తర్వాత మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు ఇంకా ఎక్కువ నిరాకరిస్తారు. 28 మీ వంశాల నాయకుల్ని, మీ అధికారుల్ని అందరిని సమావేశపర్చండి. వారికి నేను ఈ విషయాలు చెబుతాను. భూమిని, ఆకాశాన్ని నేను వారికి విరుద్ధంగా సాక్ష్యం పలికేందుకు పిలుస్తాను. 29 నా మరణం తర్వాత మీరు చెడ్డ వాళ్లవుతారని నాకు తెలసు, మీరు వెంబడించాలని నేను మీకు ఆదేశించిన మార్గంనుండి మీరు తిరిగి పోతారు. అప్పుడు భవిష్యత్తులో చెడ్డ సంగతులు మీకు జరుగుతాయి. ఎందుకంటే, ఏవి చెడ్డవని యెహోవా చెబుతాడో అవే మీరు చేయాలనుకుంటారు గనుక. మీరు చేసే పనుల మూలంగా మీరు ఆయనకు కోపం పుట్టిస్తారు.”

మోషే కీర్తన

30 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ పాట చెప్పాడు. మొత్తం పాట అంతా ముగించేంత వరకు అతడు ఆపుజేయలేదు.

32 “ఆకాశములారా ఆలకించండి, నేను మాట్లాడుతాను.
    భూమి నానోటి మాటలు వినునుగాక!
నా ప్రబోధం వర్షంలా పడుతుంది,
    నా ఉపన్యాసం మంచులా ప్రవహిస్తుంది,
    మెత్తటి గడ్డిమీద పడే జల్లులా ఉంటుంది.
    కూరమొక్కల మీద వర్షంలా ఉంటుంది.
యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి!

“ఆయన ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు
    ఆయన పని పరిపూర్ణం!
    ఎందుకంటే ఆయన మార్గాలన్నీ సరైనవిగనుక.
ఆయన సత్యవంతుడు
    నమ్ముకోదగ్గ దేవుడు.

రోమీయులకు 10:1-13

10 సోదరులారా! దేవుడు ఇశ్రాయేలు వంశీయుల్ని రక్షించాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు. దేవుడు నీతిమంతులుగా చేసే విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని స్థాపించాలనుకొన్నారు. కనుక వాళ్ళు దేవుడు చెప్పిన విధానాన్ని అంగీకరించలేదు. నమ్మిన ప్రతి ఒక్కడూ నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం అంతమైపోయింది.

ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు”(A) కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలోకానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు రాగలరు? “అగాధంలోకి ఎవరు దిగుతారు?”(B) అని అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావునుండి పిలుచుకు రాగలరు?

మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.”(C) ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము. యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయినవారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. 10 ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము.

11 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.”(D) 12 యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. 13 దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు”(E) అని వ్రాయబడి ఉంది.

మత్తయి 24:15-31

15 “అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠకుడు దీని అర్థం గ్రహించాలి. 16 అప్పుడు యూదయ ప్రాంతలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం మంచిది. 17 మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి వెళ్ళి ఏదీ తీసుకోరాదు. 18 పొలంలో వున్నవాడు తన వస్త్రాన్ని తీసుకు రావటానికి వెనక్కు మళ్ళరాదు.

19 “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా! 20 ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ కూడదని ప్రార్థించండి. 21 ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు.

22 “దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక పోయినట్లయితే, ఎవ్వరూ బ్రతికి ఉండే వాళ్ళు కాదు. కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల సంఖ్య తగ్గించాడు.

23 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి. 24 ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. 25 చూడండి! ముందే మీకు చెబుతున్నాను.

26 “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి. 27 తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు. 28 శవమున్న చోటే రాబందులు ప్రోగౌతాయి.

29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే,

‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు.
    చంద్రుడు వెలుగునివ్వడు
నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి
    ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’[a]

30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International