Book of Common Prayer
యాత్ర కీర్తన.
131 యెహోవా, నేను గర్విష్ఠిని కాను.
నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను.
నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను.
నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
2 నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది.
తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా
నా ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది.
3 ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో.
ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.
యాత్ర కీర్తన.
132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
2 కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
3 దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
నేను నా పడక మీద పండుకొనను,
4 నేను నిద్రపోను,
నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
5 యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”
6 ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
7 మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
8 యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
9 యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.
13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”
దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.
133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
2 అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
3 అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.
యాత్ర కీర్తన.
134 యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి!
రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.
2 సేవకులారా, మీ చేతులు ఎత్తి
యెహోవాను స్తుతించండి.
3 యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!
యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.
135 యెహోవాను స్తుతించండి.
యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
2 యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
3 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.
4 యెహోవా యాకోబును కోరుతున్నాడు.
యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
5 యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
6 ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
7 భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
8 ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
9 దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.
13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.
19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
యెహోవా స్తుతించబడును గాక!
యెహోవాను స్తుతించండి!
11 బాలాకు బిలాముతో, “ఏమిటి నీవు నాకు చేసింది? నా శత్రువుల్ని శపించమని నేను నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నీవు మాత్రం వాళ్లను ఆశీర్వదించావు” అన్నాడు.
12 కానీ బిలాము, “నేను చెప్పాల్సింది దేవుడు నాకు చెప్పిన విషయాలు మాత్రమే” అని జవాబిచ్చాడు.
13 అప్పుడు, “అలాగైతే, నాతో మరో చోటికి రా. అక్కడకూడ నీవు మనుష్యుల్ని చూడగలవు. అయితే అందర్నీ కాదుగాని కొందర్ని మాత్రం చూడగలవు. అక్కడనుండి నీవు నా కోసం వాళ్లను శపించవచ్చు” అని అతనితో చెప్పాడు బాలాకు. 14 కనుక బాలాకు యోఫీం పొలంలోకి బిలామును తీసుకుని వెళ్లాడు. ఇది పిస్గా కొండ శిఖరం మీద ఉంది. ఆ స్థలంలో బాలాకు ఏడు బలిపీఠాలు కట్టించాడు. అప్పుడు బాలాకు ఒక్కో బలిపీఠం మీద ఒక్కో ఎద్దును, ఒక్కో పొట్టేలును బలిగా వధించాడు.
15 కనుక బిలాము, “ఈ బలిపీఠం దగ్గర ఉండు. నేను వెళ్లి అక్కడ దేవుడ్ని కలుసుకొంటాను” అని బాలాకుతో చెప్పాడు.
16 కనుక యెహోవా బిలాము దగ్గరకు వచ్చి, అతడు ఏమి చెప్పాల్సిందీ అతనికి తెలియజేసాడు. అప్పుడు యెహోవా, బిలామును వెళ్లి ఆ సంగతులు బాలాకుతో చెప్పమన్నాడు. 17 కనుక బిలాము బాలాకు దగ్గరకు వెళ్లాడు. బాలాకు ఇంకా బలిపీఠం దగ్గరే నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు వారితోబాటు ఉన్నారు. అతడు రావటం చూచి, “ఏమి చెప్పాడు యెహోవా?” అన్నాడు బాలాకు.
బిలాము రెండో సందేశం
18 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:
“బాలాకూ లేచి నా మాట విను.
సిప్పోరు కుమారుడా, బాలాకూ, నా మాట విను.
19 దేవుడు మనిషికాడు,
ఆయన అబద్ధం చెప్పడు.
దేవుడు మానవ కుమారుడు కాడు,
ఆయన నిర్ణయాలు మారవు.
ఏదైనా చేస్తానని యెహోవా చెబితే
ఆయన అలానే చేస్తాడు.
యెహోవా ఒక వాగ్దానం చేస్తే,
ఆయన తన వాగ్దానం ప్రకారం చేస్తాడు.
20 ఆ ప్రజలను ఆశీర్వదించమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు.
యెహోవా వారిని ఆశీర్వదించాడు కనుక నేను దాన్ని మార్చలేను.
21 దేవునికి యాకోబు ప్రజల్లో తప్పేమీ కనబడలేదు.
ఇశ్రాయేలు ప్రజల్లో ఏ పాపమూ దేవునికి కనబడలేదు.
యెహోవా వారి దేవుడు,
ఆయన వారితో ఉన్నాడు.
మహారాజు వారితో ఉన్నాడు.
22 దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకొచ్చాడు.
అడవి ఎద్దుల్లా వారు బలంగా ఉన్నారు.
23 యాకోబు ప్రజలను ఓడించగల శక్తి ఏదీ లేదు.
ఇశ్రాయేలు ప్రజలకు ఎదురు వెళ్లగల మంత్రమూ ఏదీ లేదు.
‘దేవుడు చేసిన మహా కార్యాలను చూడండి’ అని యాకోబును గూర్చి,
ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మనుష్యులు అంటారు.
24 ఆ ప్రజలు బలమైన సింహంలా ఉంటారు.
సింహంలా వారు పోరాడతారు.
ఆ సింహం తన శత్రువును తినివేసేంత వరకు విశ్రాంతి తీసుకోదు.
తనకు వ్యతిరేకంగా ఉండేవారి రక్తం తాగేంతవరకు ఆ సింహం ఊరుకోదు.”
25 అప్పుడు బాలాకు, “ఆ ప్రజలకు మేలు జరగాలని నీవు అడుగలేదు గాని కీడు జరగాలని కూడ నీవు అడుగలేదు” అన్నాడు బిలాముతో.
26 బిలాము, “యెహోవా నాకు చెప్పిన విషయాలు మాత్రమే చెబుతానని నేను నీకు ముందే చెప్పాను” అని జవాబిచ్చాడు.
ఆత్మ ద్వారా జీవము
8 అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు. 2 దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. 3 ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాపస్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. 4 ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాపస్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము.
5 ప్రాపంచికంగా జీవించేవాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. 6 ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి. 7 ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు. 8 ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు.
9 దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. 10 ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. 11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు.
పెళ్ళి విందు ఉపమానం
(లూకా 14:15-24)
22 యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: 2 “దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు. 3 ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు.
4 “ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ ఆహ్వానింపబడిన వాళ్ళతో ‘భోజనం సిద్దంగా ఉందని చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మనండి’ అని అన్నాడు.
5 “కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపొయ్యారు. 6 మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకొని అవమానించి చంపేశారు. 7 ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు.
8 “ఆ తర్వాత తన సేవకులతో, ‘పెళ్ళి విందు సిద్దంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులుకారు. 9 వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు. 10 ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందర్ని అంటే మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందర్ని పిలుచుకు వచ్చారు. అతిథులతో పెళ్ళి యిల్లంతా నిండిపోయింది.
11 “రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వెసుకోలేదని గమనించాడు. 12 ‘మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు?’ అని రాజు అత న్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు. 13 వెంటనే ఆ రాజు తన సేవకులతో, ‘అతని కాళ్ళు, చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు’ అని అన్నాడు.
14 “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు.
© 1997 Bible League International