Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
దావీదు రామాలోని గుడారాలకు వెళ్లుట
18 దావీదు సౌలు బారి నుండి తప్పించుకుని రామాలోవున్న సమూయేలు వద్దకు వెళ్లాడు. సౌలు తన పట్ల చేసినదంతటినీ దావీదు సమూయేలుకు చెప్పాడు. తరువాత దావీదు, సమూయేలు కలిసి ప్రవక్తల గుడారాలకు వెళ్లారు. దావీదు అక్కడే ఉండి పోయాడు.
19 రామాలో వున్న గుడారాలలో దావీదు ఉంటున్నట్లు సౌలు విన్నాడు. 20 దావీదును బంధించి తీసుకుని రావలసిందిగా సౌలు మనుష్యులను పంపాడు. కానీ వారు ఆ గుడారాలకు వచ్చేసరికి అక్కడ ప్రవక్తల గుంపు ఒకటి ప్రవచిస్తూ ఉండటం కనబడింది. సమూయేలు ఆ ప్రవక్తలకు నాయకత్వం వహించి ఉన్నాడు. దేవుని ఆత్మ సౌలు పంపిన మనుష్యుల మీదికి రాగా వారు కూడ దేవుని విషయాలు చెప్పనారంభించారు.
21 ఈ వార్త సౌలు వరకూ పోయింది. అతను మరి కొంతమంది మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. కనుక మూడవసారి మళ్లీ సౌలు మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. 22 చివరికి సౌలు స్వయంగా బయలుదేరి రామా చేరుకున్నాడు. సేఖూలో ఒక నూర్పిడి కళ్లము దగ్గరవున్న పెద్ద బావి వద్దకు సౌలు వచ్చాడు. “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారని” సౌలు అక్కడున్న వారిని అడిగాడు.
“రామాదగ్గర ఉన్న నాయోతులో ఉన్నారని” వాళ్లు జవాబు చెప్పారు.
23 అప్పుడు సౌలు రామా దగ్గర్లో వున్న నాయోతుకు వెళ్లాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి కూడ రావటంతో అతను దేవుని విషయాలు చెబుతూ ముందుకు నడిచాడు. రామాలో వున్న నాయోతుకు వెళ్లేవరకు సౌలు మరింత ఎక్కువగా దేవుని విషయాలు చెబుతూనే ఉన్నాడు. 24 అప్పుడు సౌలు తన బట్టలు విడిచి, సమూయేలు ఎదుట అతడు దేవుని విషయాలు పలికాడు. ఆ పగలూ, ఆ రాత్రి శరీరంమీద బట్టలు లేకుండానే సౌలు గడిపాడు.
ఆ కారణం చేతనే, “సౌలుకూడ ప్రవక్తల్లో ఒకడు అయ్యాడా?” అని ప్రజలు అనుకోవటం మొదలయ్యింది.
పౌలు యొక్క సంతోషం
2 మీ హృదయాల్లో మాకు స్థానం ఇవ్వండి. మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. ఎవ్వరినీ తప్పుదారి పట్టించలేదు. మా స్వలాభానికి ఎవ్వరినీ దోచుకోలేదు. 3 మిమ్మల్ని నిందించాలని ఇలా అనటం లేదు. మా హృదయాల్లో మీకు ఎలాంటి స్థానం ఉందో మీకు ముందే చెప్పాను. మేము మీతో కలిసి జీవించటానికి, మరణించటానికి కూడా సిద్ధంగా ఉన్నాము. 4 మీ పట్ల నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. మీ విషయంలో నేను గర్విస్తూంటాను. మీ ప్రోత్సాహం వల్ల మేము మా కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది.
5 మేము మాసిదోనియ దేశానికి వచ్చినప్పటినుండి మా ఈ దేహాలకు విశ్రాంతి లేదు. ప్రతిచోటా మమ్మల్ని కష్టపెట్టారు. బయట ఆందోళనలు, లోపల భయాలు. 6 కాని క్రుంగిన మనస్సులకు శాంతిని కలిగించే దేవుడు తీతును పంపి మాకు సహాయం చేసాడు. 7 అతడు రావటం వల్ల మాత్రమే కాకుండా మీరతనికి చేసిన సహాయాన్ని గురించి, ఆదరణను గురించి, అతడు చెప్పటం వల్ల మాకు ఆనందం కలిగింది. అతడు మీ కోరికను గురించి, మీ దుఃఖాన్ని గురించి, మీరు నా పట్ల చూపిన అభిమానాన్ని గురించి చెప్పాడు. దానివల్ల ఇంకా ఎక్కువ ఆనందపడ్డాను.
8 నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది వ్రాసినందుకు నేను బాధ చెందటం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా కొంత దుఃఖం కలిగించింది. అయినా అది కొంచెం సేపు మాత్రమే. 9 కాని యిప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీకు దుఃఖం కలిగించానని కాదు, మీ దుఃఖం మారుమనస్సుకు నడిపింది. దేవుని చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారు. గాని మేము మీకు ఏ హానీ కలిగించలేదు. 10 దేవుడు కలిగించిన దుఃఖం, మారుమనస్సు పొందేటట్లు చేసి రక్షణకు దారితీస్తుంది. దాని వల్ల నష్టం కలుగదు. కాని ఈ ప్రపంచం కలిగించే దుఃఖం మరణానికి దారితీస్తుంది. 11 దేవుడు కలిగించిన దుఃఖం వల్ల మీలో కలిగిన మార్పుల్ని గమనించండి. మీలో ఎంత నిజాయితీ కలిగిందో చూడండి. నిర్దోషులని నిరూపించుకోవటానికి మీరు ఎంత ఉత్సాహంతో ఉన్నారో గమనించండి. ఎంత ఆందోళన కలిగిందో గమనించండి. మీ అభిమానం ఎంతగా అభివృద్ధి చెందిందో గమనించండి. మీ విశ్వాసం ఎంతగా పెరిగిందో, న్యాయం చేకూర్చాలనే ఆత్రుత ఎంతగా కలిగిందో గమనించండి. మీరు ఈ సమస్యవల్ల కలిగిన ప్రతీ నిందనుండి తప్పించుకొన్నారు. 12 కనుక నేనా ఉత్తరం మీలో అన్యాయం చేసినవానికొరకు గాని, ఆ అన్యాయానికి గురి అయినవానికొరకు గాని, వ్రాయలేదు. దేవుని సాక్షిగా చెపుతున్నాను, మీరు కనబరుస్తున్న అభిమానాన్ని, మీరు చూడగలగాలని వ్రాసాను. 13 అది మాకు ప్రోత్సాహం కలిగించింది.
మా ప్రోత్సాహంతో పాటు, తీతు యొక్క ఆనందాన్ని చూసి మాకు ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది. మీరు అతని మనస్సుకు శాంతి చేకూర్చారు. 14 నేను మిమ్మల్ని అతని ముందు పొగిడాను. మీరు నా మాట నిలబెట్టారు. మేము మీతో ఎప్పుడూ సత్యం మాట్లాడాము. మిమ్మల్ని పొగుడుతూ తీతునకు చెప్పినవి కూడా సత్యమని మీరు రుజువు చేసారు. 15 మీరు అతణ్ణి విధేయతతో, భయంతో, వణుకుతూ ఆహ్వానించారు. ఆ విషయం అతడు జ్ఞాపకం చేసుకొని మీ పట్ల ఉన్న వాత్సల్యాన్ని పెంచుకొన్నాడు. 16 నేను మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించగలను. అందుకు నాకు ఆనందంగా ఉంది.
© 1997 Bible League International