Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 80

సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
    యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
    వచ్చి మమ్మల్ని రక్షించుము.
దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
    మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
    మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
    నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
    మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
    నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
    ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
    నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
“ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
    దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
    దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11     దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
    ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
    అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
    పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
    నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
    నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
    నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
    అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
    నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

యెషయా 65:17-25

ఒక క్రొత్త సమయం వస్తుంది

17 “చూడు, నేను ఒక క్రొత్త ఆకాశాన్ని ఒక క్రొత్త భూమిని చేస్తాను.
గత విషయాలను ప్రజలు జ్ఞాపకం చేసుకోరు.
    ఆ విషయాలు ఏవీ నా ప్రజల జ్ఞాపకాల్లో ఉండవు.
18 నా ప్రజలు విచారంగా ఉండరు. లేదు, వారు సంతోషంగా ఉండి, శాశ్వతంగా దేవుని స్తుతిస్తారు.
    నేను చేసే సంగతుల మూలంగా వారు సంతోషంగా ఉంటారు.
సంపూర్ణ ఆనందంతో నిండిన ఒక యెరూషలేమును నేను చేస్తాను.
    మరియు వారిని సంతోషించే ప్రజగా నేను చేస్తాను.

19 “అప్పుడు యెరూషలేము గూర్చి నేను సంతోషిస్తాను.
    నా ప్రజలను గూర్చి నేను సంతోషిస్తాను.
ఆ పట్టణంలో మరల ఎన్నడూ
    ఏడుపు, దుఃఖం ఉండవు.
20 జన్మించి, కొన్నాళ్లు మాత్రమే జీవించే శిశువు అంటూ ఎవ్వరు ఆ పట్టణంలో ఉండరు.
    కొన్నాళ్లకే ఆయుష్షు తీరిపోయే వ్యక్తులు ఎవ్వరూ ఆ పట్టణంలో ఉండరు.
జన్మించే ప్రతి శిశువు దీర్ఘకాలం జీవిస్తుంది.
    వృద్ధులు ప్రతి ఒక్కరూ చాలాకాలం జీవిస్తూనే ఉంటారు.
వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి యువకుడు అని పిలువబడతాడు.
    (అయితే పాపం చేసినవాడు వంద సంవత్సరాలు బ్రతికినా అన్నీ కష్టాలే.)

21 “ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఇల్లు కడితే ఆ వ్యక్తి అక్కడ నివసిస్తాడు.
    ఒక వ్యక్తి గనుక ద్రాక్షతోట నాటితే ఆ వ్యక్తి ఆ తోటలోని ద్రాక్ష పండ్లు తింటాడు.
22 ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఆ ఇంటిలో
    నివసించటం అనేది జరుగదు.
ఒకడు ఒక తోటను నాటగా మరొకడు
    ఆ తోట ఫలాలు తినటం అనేది జరుగదు.
వృక్షాలు బ్రతికినంత కాలం నా ప్రజలు బ్రతుకుతారు.
    నేను ఏర్పరచుకొనే ప్రజలు, వారు తయారుచేసే వాటిని అనుభవిస్తారు.
23 ప్రతిఫలం ఏమి లేకుండా ప్రజలు మరల ఎన్నడూ పనిచేయరు.
    చిన్నతనంలోనే మరణించే పిల్లల్ని ప్రజలు మరల ఎన్నడు కనరు.
నా ప్రజలంతా యెహోవాచేత ఆశీర్వదించబడతారు. నా ప్రజలు, వారి పిల్లలు ఆశీర్వదించబడుతారు.
24 వారికి అవసరమైనవి, వారు అడగకముందే నేను తెలుసుకొంటాను.
    సహాయంకోసం వారు నన్ను అడుగుట ముగించక ముందే నేను వారికి సహాయం చేస్తాను.
25 తోడేళ్లు, గొర్రెపిల్లలు కలిసి మేతమేస్తాయి.
    సింహాలు పశువులతో కలిసి మేస్తాయి.
నా పవిత్ర పర్వతం మీద నేలపై పాము ఎవరినీ భయపెట్టదు, బాధించదు.”
ఇవన్నీ యెహోవా చెప్పాడు.

యోహాను 14:18-31

18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను. 19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు. 20 ఆ రోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు. 21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”

22 అప్పుడు యూదా (యూదా ఇస్కరియోతు కాదు), “కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై, ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటున్నారు?” అని అన్నాడు.

23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. 24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.

25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.

27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి. 28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.

30 “ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు. 31 కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను.

“రండి, యిక్కడి నుండి వెళ్దాం!”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International