Revised Common Lectionary (Semicontinuous)
దేవుడందర్ని అంగీకరిస్తాడని చూపించాడు
44 పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడివాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. 45 పేతురుతో వచ్చిన వాళ్ళందరు యూదులు. 46 యేసునందు విశ్వసించినవారు. వీళ్ళు యూదులు కానివాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కానివాళ్ళకు కూడా యిచ్చాడని గ్రహించి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు యిలా అన్నాడు: 47 “వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.” 48 యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును తమతో కొద్దిరోజులు ఉండమని అడిగారు.
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
దేవుని కుమారునిలో విశ్వాసము
5 యేసే క్రీస్తు అని నమ్మినవాణ్ణి దేవుడు తన సంతానంగా పరిగణిస్తాడు. తండ్రిని ప్రేమించిన ప్రతీ ఒక్కడు కుమారుణ్ణి ప్రేమించినట్లుగా పరిగణింపబడతాడు. 2 దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించటం వల్ల ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనము తెలుసుకోగలము. 3 ఆయన ఆజ్ఞల్ని పాటించి మనము మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు. 4 దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము. 5 యేసు దేవుని కుమారుడని విశ్వసించే వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తారు.
దేవుడు తన కుమారుణ్ణిగూర్చి మనకు చెప్పాడు
6 యేసు క్రీస్తు నీళ్ళద్వారా, రక్తంద్వారా వచ్చాడు. ఆయన నీళ్ళద్వారా మాత్రమే రాలేదు. నీళ్ళద్వారా, రక్తంద్వారా కూడా వచ్చాడు. ఆత్మ సత్యవంతుడు. అందుకే ఆ ఆత్మ సాక్ష్యం చెపుతున్నాడు.
9 “నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులైఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో నిలిచియున్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు లోబడినట్లైతే నా ప్రేమలో నిలిచియుంటారు. 11 నా ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూర్ణంగా ఆనందించాలని మీకీ విషయాలన్నీ చెప్పాను. 12 నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి. 13 స్నేహితుల కోసం ప్రాణాలివ్వటం కన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను ఆజ్ఞాపించినట్లు చేస్తే మీరు నా స్నేహితులు. 15 నేను యిక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవకునికి తన యజమాని చేస్తున్నదేమిటో తెలియదు. కాని నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటిని మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని అన్నాను.
16 “మీరు నన్ను ఎన్నుకో లేదు. నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండే ఫలమివ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకిస్తాడు. 17 ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నా ఆజ్ఞ.
© 1997 Bible League International